17, నవంబర్ 2020, మంగళవారం

శతమానం భవతి…(సీరియల్)...PART-3


                                                                        శతమానం భవతి…(సీరియల్)                                                                                                                                                                 (PART-3) 

సుజాత నిశ్చయతాంబూల మూహూర్తం ఏర్పాటు చేయబడింది....పెళ్ళి తెనాలి లో కాబట్టి నిశ్చయతాంబూలాలు రాజమండ్రిలొ పెళ్ళికొడుకు ఇంటి దగ్గర అని ఒప్పుకున్నారు.

తాంబూలాలు పుచ్చుకునే తారీఖును మానసకు ఫోన్ మూలం తెలిపాడు తండ్రి.

"మానసా...నిశ్చయతాంబూలాలకు నువ్వు, అల్లుడు గారూ వచ్చేయండి. నీ దగ్గర నుండి ఇరవై కాసుల బంగారు నగలు కావాలని అమ్మ అడిగింది. నువ్వు ఇవ్వగలవా?"

"తప్పకుండా ఇస్తాను నాన్నా"

"చాలా ధ్యాంక్స్ అమ్మా"......తండ్రి గొంతు బొంగురు పోయింది.

"ఏంటి నాన్నా ఇది? కన్న కూతురు దగ్గర ధ్యాంక్స్ చెప్పటం"

"అంత బంగారం ఇచ్చి సహాయపడుతున్నావే..."

"నాన్నా...ఇవన్నీ మీరు నాకు ఇచ్చిన నగలేగా? నువ్వు కష్టపడి సంపాదించినదేగా?"

"అయితే మాత్రంఇప్పుడు అవన్నీ మీకు సొంతమైనవి కదా. అల్లుడు గారికి పెద్ద మనసమ్మా...ఎంత త్వరగా తిరిగి ఇవ్వగలనో అంత త్వరగా తిరిగి ఇచ్చేస్తానని అల్లుడు గారి దగ్గర చెప్పు"

"తిరిగివ్వటానికని నువ్వు హైరానా పడకు....మెల్ల మెల్లగా ఇద్దువుగాని"

అలాకాదమ్మా...నువ్వూ ఫంక్షన్లకూ, పార్టీలకు వెడతావు కదా"

"నాన్నా...ఇక్కడ మన ఊర్లలో లాగా  కాదు. ఇక్కడ ఆడవాళ్ళు చాలా తక్కువ నగలు వేసుకుంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఎంత తక్కువ నగలు వేసుకుంటే ఇక్కడ అంత గౌరవం "

సరేనమ్మా.... నువ్వూ, అల్లుడుగారూ తాంబూలాలకు వచ్చేయండి"

"సరే నాన్నా" ఫోన్ పెట్టేసింది మానస.

మానస మనసు ఆనందంతో నిండిపోయింది. తాంబూలాలకు ఒక వారం రోజుల ముందే వెళ్ళాలని ప్లాన్ వేసుకుంది. కానీ కైలాష్ కు లీవు దొరకలేదు. చివరకి నేరుగా తాంబూలాలకు రాజమండ్రి వెళ్ళి, తిరిగి వచ్చే విధంగా సెలవు దొరికింది.

వారం రోజులకు ముందే తెనాలి వెళ్ళి తల్లి, తండ్రి, చెల్లితో వారం రోజులు ఆనందగా గడిపి, వాళ్ళతో కలిసి రాజమండ్రి వెళ్ళి, తాంబూలాలు పూర్తి చేసుకుని, తిరిగి తెనాలికి వచ్చి వెడదామని ప్లాను వేసుకున్న మానసకు ఆటంకం వస్తోందని తెలుసుకున్న రోజు నుండి మానస డల్ గా కనబడింది.  

"సారీ మానసా...అర్జెంటుగా ఇక్కడి లెక్కలు హెడ్ ఆఫీసుకు పంపవలసి వచ్చింది...అందుకని..." అంటూ కైలాష్ ఏదో చెప్పబోతూంటే.

"మీరేగా, ఇంతవరకు లీవు పెట్టలేదు. అందుకని నాకు లాంగ్ లీవ్ ఖచ్చితంగా గ్రాంట్ చేస్తారని నన్ను ఊరించారు. ఆశతోనే తాంబూలాలకు పది రోజులు ముందు వెళ్ళాలని ఆశ పడ్డాను"

"లాంగ్ లీవ్ ఇవ్వరని నేనూ అనుకోలేదు మానసా...ఇప్పుడేమయ్యింది చెప్పు. తాంబూలాల తరువాత ఆ రాత్రికి నేను బయలుదేరి వచ్చేస్తాను. నువ్వు అక్కడుండి పది, పదిహేను రోజులు మీ వాళ్ళతో గడిపిరా"

"అదంతా కుదరదు పెళ్లి వరకు అక్కడే ఉంటాను. పెళ్లి అయిన తరువాతే వస్తాను

అలాగే ఉండు...ఎవరు వద్దన్నారు"

మానస సంతోషంలో మునిగిపోయింది.

తాంబూలాల ఫంక్షన్ ముగిసింది. తల్లి-తండ్రులతో  కలిసి వాళ్ళ ఊరు వెళ్లి, అక్కడ ఉండాలని నిశ్చయించుకుంది. తాంబూలాల ఫంక్షన్ గ్రాండు గా జరిగింది.పెళ్లి కొడుకు అందంగానూ, హుందాగానూ ఉన్నాడు. సుజాతకి ఈడు జోడు లక్షణం గా ఉంది. సుజాత కూడా పెళ్లి కూతురు కళతో చాలా అందంగా ఉన్నది. టైము ఎలా గడిచిందో మానసకు తెలియ లేదు. బంధువులందరిని ఒకే చోటు చూడటం, వారితో సరదాగా మాటలాడటం మానసకు ఎంతో హాయిని ఇచ్చింది. రెండు సంవత్సరాలు ఎవరిని చూడక పోవటంతో, బంధువులందరూ మానసతో బోలెడు కబుర్లు చెప్పారు. 

తాంబూలాలు పుచ్చుకున్న తరువాత "అమ్మా...నేను కూడా మీతో పాటూ మన ఊరు వస్తాను. పెళ్లి వరకు మీతో ఉంటాను. మా ఆయన పర్మీషన్ ఇచ్చారు"  సంతోషంగా తల్లితో చెప్పింది మానస. 

మానస తల్లి మానస చెయ్యి పుచ్చుకుని ఎవరూ లేని చోటుకు మానసను తీసుకు వెళ్లి  "ఇప్పుడు ఊరికి  వచ్చి ఎం చేస్తావే? పెళ్ళికి ఇంకా రెండు నెలలు ఉంది. అన్ని రోజులు ఆయన్ని వదిలేసి ఉంటావా?  పాపం అల్లుడు భోజనానికి ఎం చేస్తాడు?"

అమ్మా...అదేమీ అంత పెద్ద ప్రాబ్లమ్ కాదు....ఆఫీసు దగ్గర ఒక మెస్ ఉన్నది"

ఎన్ని రోజులు మెస్ లో తింటారు. ఏదైనా కడుపులో ప్రాబ్లమ్ వస్తే? తరువాత కష్టపడేది ఎవరునువ్వూ ఆయనతోనే బయలుదేరి వేళ్ళు"

"అమ్మా...ఏంటమ్మా నువ్వు? నాకు మన ఊరు రావాలనుందిమీతో పాటూ కొన్ని రోజులు గడపాలని ఆశగా ఉంది"

రెండు రోజుల్లో నువ్వు అందరినీ చూశావు కదా? మన ఊర్లో ఎవరున్నారు. నీ స్నేహితులు కూడా లేరు. పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయారు. ఇక ఊరంటావా? తెనాలిలో ఏమీ మార్పు లేదు. అక్కడ కొత్తగా చూడటానికి ఏమీ లేదు"

"అదికాదమ్మా..."

"ఇంకా ఏమిటి చిన్న పిల్లలా మారం చేస్తున్నావు. అల్లుడు గారిని భోజనానికి కష్టపెట్టద్దు. నువ్వు ఆయనతోపాటు బయలుదేరు"

మానస ఎంత చెప్పినా వాళ్ళ అమ్మ వినలేదు. మానస నాన్న, అమ్మకు వంతు పాడాడు. మానస రోజే భర్తతో కలిసి వెళ్ళిపోయింది.

"చూశావా...అత్త, మామలకు అల్లుడు మీద ఎంత శ్రద్దో" అన్న భర్తను కోపంగా చూసి బెర్త్ లో పక్కకు తిరిగి పడుకుంది మానస.  

                                                                            *********************

చెల్లి పెళ్ళి రోజు దగ్గరపడుతున్న సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది మానస. అమె శరీరం మాత్రమే ఇక్కడుంది. ఆమె ఆలోచనలు ఊరికి వెళ్ళిపోయినై. నాన్న-అమ్మ ఫోన్ చేసినప్పుడల్లా రోజు పెళ్ళి పని ముగించేరో చెబుతూ ఉండటంతో వెంటనే, రోజే ఊరికి వెళ్ళిపోవాలని కూతూహల పడేది. భర్త ఆఫీసు నుండి రాగానే రోజు నాన్న, అమ్మ చెప్పిన విషయాలు ఆయనకు చెప్పటం, అయ్యో, అక్కడ లేకపొయేనే నని బాధపడటం చూసి రోజూ "మానసా, నువ్వు కావాలంటే రేపు బయలుదేరి మీ ఊరు వెళ్ళు...వస్తున్నానని మీ అమ్మకు ఫోన్ చేసి చెప్పు, ఆనందపడతారు" చెప్పాడు కైలాష్

"అలాగే...నాన్నకు ఫోన్ చేసి చెప్తా" అన్నది.

ఫోన్ చేసింది....తల్లి ఫోన్ ఎత్తింది. 

"చూడు...ఇక్కడ ముంచుకుపోయే పనులేమీ లేవు...నువ్వు వారం రోజులు ముందు వస్తే చాలు" మానస తల్లి ఖచ్చితంగా చెప్పింది.

మానసకు కోపం, ఏడుపు రెండూ వచ్చినై. ఫోన్ రిసీవర్ ను విసురుగా పెట్టి "ఛీ..ఛీ...ఏం తల్లి-తండ్రులు వీళ్ళు? పెళ్ళి చేసి కాపురానికి వెళ్ళిన కూతురు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తారు తల్లి-తండ్రులు. వీళ్ళేమిటి వద్దు మొర్రొ అంటున్నారు. పది రోజులు అల్లుడు బయట తింటే ఏమౌతుందట? డబ్బులు, నగలు సహాయంగా ఇచ్చినంత మాత్రానా అల్లుడి గురించి ఇంతగా కరిగిపోవాలా? తలచుకొంటేనే సిగ్గుగా ఉన్నది". తనలో తనే మాట్లాడుకుంటున్నా, మాటలు పైకే వినబడ్డాయి.

"మీ తల్లి-తండ్రులను నువ్వే తిట్టచ్చా?"

లేకపోతే ఏమిటండి. నా ఆశను ఎందుకు అర్ధం చేసుకోరు. ఎప్పుడు చూడు అల్లుడు గారేనా? నాకు వొల్లు మండిపోతోంది"

"నాకు మాత్రం సందేహంగా ఉంది"

"ఏమిటి మీ సందేహం?"

నేను భోజనానికి కష్టపడతానని నిజంగానే ఫీలౌతున్నారా? లేక నామీద అనుమాన పడుతున్నారా?”

"మీ మీద అనుమానమా?"

అల్లుడు ఎక్కడో దూరంగా ఉన్న రాష్ట్రంలో ఉంటున్నాడు. కూతురు అతన్ని వదిలి వచ్చేస్తే ఏదైనా తప్పుడు పనులు చేస్తానేమోనని భయపడుతున్నారో ఏమో?”

చాలు ఆపండి! మా తల్లి-తండ్రులను చీప్ గా లెక్కకడుతున్నారా? మీ మీద అంత శ్రద్దగా ఉన్నారే...వాళ్ళను మీరు అంత అసహ్యంగా తీసేస్తున్నారే? ఛి, ఛి" ....మానస మొహం చిన్నబోయింది.

"చూడరా! ఇప్పుడే తల్లి-తండ్రులను తిట్టింది. నేనేదైనా అంటే కోపం ముంచుకొస్తోంది"

"లేకపోతే?  మా తల్లి-తండ్రుల గురించి మీరు తప్పుగా మాట్లాడుతుంటే నాకు కోపం రాదా?"

"సరే తల్లీ! చెంపలేసుకుంటాను" అంటూ మానసను గుండెలకు హత్తుకునిఉండు...మీ నాన్నతో నేను మాట్లాడతాను" అంటూ ఫోన్ తీసి మామగారికి ఫోన్  చేశాడు.

"మమయ్యగారూ! ఇక్కడుండటానికి మానసకు మనసే లేదు. మానస శరీరం మాత్రమే ఇక్కడుంది. మనసంతా అక్కడే ఉంది. ఎపుడు చూడూ చెల్లి పెళ్ళి...నేను వెళ్ళాలి అని గొణుగుతూ ఉంటోంది. నేను మానసను నెల రోజులు ముందు తీసుకు వచ్చి దింపి, వెడాతా" 

సరే అల్లుడూ గారూ. అలాగే చెయ్యండి!" 

                                                                                                            Continued......PART-4

ఇవి కూడా చదవండి:

కన్న రుణం(కథ)

దేవుని హస్తం?(మిస్టరీ)

******************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి