శతమానం భవతి…(సీరియల్) (PART-1)
వంటింట్లో కూరగాయలు తరుగుతున్నది మానస.
'అలూ...బైంగల్...సబ్జీ'- ప్రతి రోజూ సరిగ్గా ఉదయం పదకొండు గంటలకు ఖంగుమని వినిపిస్తుంది కూరగాయలమ్ముకునే తాత గొంతు.
ఆ రోజు ఆ గొంతు వినబడ్డ వెంటనే నవ్వుకుంది మానస.
పెళ్ళి చేసుకుని మహారాష్ట్రం వచ్చిన కొత్తలో హిందీ భాష ఒక ముక్క కూడా అర్ధమయ్యేది కాదు.
"నీకు హిందీ భాష వచ్చా?" గోరింటాకు పెట్టుకున్న భార్య చేతి వేళ్ళను మృధువుగా నొక్కుతూ ఫస్ట్ నైట్ రోజు అడిగాడు భర్త కైలాష్.
“వచ్చు” అన్నట్లు తల ఉపుతూ "హిందీలో మధ్యమ వరకు చదువుకున్నాను" చెప్పింది మానస.
"అయితే...కొంచం తెలుసని చెప్పు"
"హూ" అంటూ తల ఊపింది మానస.
కానీ
మొదటిసారి కాపురానికి డిల్లీ వెళ్ళే రైలు ఎక్కి కూర్చున్నప్పుడు, చెన్నై నుండి మాహారాష్ట్రం వెడుతున్న ఒక గుంపు వాళ్ళకు ఎదురుగా కూర్చుని మాట్లాడిన హిందీ భాషను విని కొంచం భయపడింది మానస. వాళ్ళు భర్త కైలాష్ తో మాట్లాడిన హిందీ, కైలాష్ వాళ్ళకు హిందీలో ఇచ్చిన సమాధానం విన్న మానసకు తల తిరిగినంత పనైంది.
"ఏం మాట్లాడుతున్నారు...నా గురించి ఏదో చెబుతున్నారు?"
భర్త చెవిలో గుశగుశలాడింది మానస.
"నీకు హిందీ బాగా వచ్చు కదా"
భర్త సమాధానంతో పరువు పోయినట్లు ఫీలయ్యింది మానస.
'ఏక్ గావోమే ఏక్ కిశాన్’ కంఠస్తం పట్టిన తన హింది పనికిరాదని తెలుసుకుంది.
ఇదిగో ఈ కూరగాయలు అమ్ముకునే తాత గొంతును మొదటిసారి విన్నప్పుడు, అతను అమ్ముతున్న కూరగాయలు ఏమిటో వాటిని చూసిన తరువాత మానసకు అర్ధమయ్యింది.
ఆ రోజు భర్త కైలాష్ ఇంటికి వచ్చిన వెంటనే కూరగాయలు అమ్ముకునే తాత గురించి, అతని దగ్గర కూరగాయలు ఎలా కొన్నది వివరించి చెప్పింది. పగలబడి నవ్వాడు భర్త కైలాష్.
“నాకు హిందీ బాగా వచ్చు...ఫస్ట్ నైట్ రోజు గొప్పగా చెప్పావు? మొదటి పనిగా హిందీ నేర్చుకో. ఇరుగు పొరుగు వారితో స్నేహం చేసుకో. హిందీ తానుగా వస్తుంది...కానీ అంతవరకు హిందిలో మాట్లాడ కూడదు" అంటూ మళ్ళీ పగలబడి నవ్వాడు. భర్త నవ్వుతుంటే సిగ్గుగా అనిపించింది మానసకు.
అది తలచుకునే ఇప్పుడు నవ్వుకుంటోంది. అలా కూరగాయలు అమ్ముకునే తాత దగ్గర, ఇరుగు పొరుగు వారితో తెలిసీ తెలియని హిందీలో మాట్లాడుతూ, వారి దగ్గర నుండి చాలా వరకు హిందీ నేర్చుకుంది.
మహారాష్ట్రం వచ్చి రెండేళ్ళు అవుతోంది. ఇప్పుడు మానసకు హిందీ భాష మాట్లాడడం, అర్ధం చేసుకోవడం బాగా అలవాటయ్యింది.
కైలాష్ కి అక్కడున్న సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం. మంచి జీతం, కావలసిన వసతులతో కంపనీ క్వార్టర్స్, హాయిగా గడిచిపోయే జీవితం.
వంట పూర్తి అయ్యే సమయంలో ఎవరొ తలుపు తడుతున్న శబ్ధం. పక్కింటి “మెహతా బాబీ” అయ్యుంటుంది అనుకుని, గ్యాస్ స్టవ్ ను తగ్గించి, వంటింట్లో నుండి వచ్చి తలుపు తెరిచింది.
ఎదురుగా భర్త కైలాష్.
చేతిలోని మోటర్ సైకిల్ తాళం ను గిరగిరా తిప్పుతూ "ఒక ముఖ్యమైన ఫైలు మర్చిపోయి వెళ్ళిపోయాను. అందుకే తీసుకు వెళ్ళటానికి వచ్చాను" అంటూ కొంటె చూపుతో భార్యను చూశాడు.
“ఫైలు మర్చిపోయి వెళ్ళిపోయారా? ఇది నేను నమ్మాలా? ఇలాగే ఇంతకు ముందు మీరు ఫైలు మర్చిపోయి, తిరిగి ఇంటికి వచ్చినప్పుడల్లా ఏం జరిగిందో నాకు బాగా గుర్తుంది. ఫైలూ లేదు, గీలూ లేదు...మీరు దయచేయండి" అంటూ ఆఫీసుకు తిరిగి వెళ్ళమని గుమ్మం వైపు చేయి చూపించింది.
"ఏయ్...ఏమిటి నువ్వు? ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరుగుతోంది. ప్రతి ఒక్కరూ కాళ్ళ మీద వేడినీళ్ళు పడినట్లు కంగారుగా తిరుగుతున్నారు. తెలుసా? నేనేమో ఒక ముఖ్యమైన ఫైలును ఇంట్లో మర్చిపోయి వెళ్ళాను. ఇది తెలిస్తే జీ.ఎం గంతులేస్తాడు. పది నిమిషాలలో ఆ ఫైలు తీసుకుని ఆయన ముందుకు వెళ్ళకపోతే మనం మూటా ముల్లె సర్దుకొని ఊరికి వెళ్ళి అడుక్కోవాలి"
భార్యను తోసుకుంటూ లోపలకు వెళ్ళాడు.
కంగారు కంగారుగా తన గది లోకి దూరాడు. అక్కడున్న టేబుల్ సొరుగులో నుండి మూడు ఫైళ్ళను తీసి, అందులో ఒక ఫైలును తీసుకుని బయటకు వచ్చాడు.
వంట గదిలో, పూర్తైన వంట గిన్నెలపై మూతపెడుతున్న భార్య వెనుక నిలబడి "మానసా" అని పిలిచాడు కైలాష్.
"ఊ" అన్నది మానస.
"బాగా టయర్డ్ గా ఉంది...కొంచం కాఫీ ఇస్తావా"
"ఇప్పుడు ఏం చేసొచ్చారని...టయర్డ్ అవటానికి"
"ఫైలు వెతికి తీసుకున్నాను కదా...అదే టయర్డ్ అయ్యాను"
"అదేదో చాల కష్టమైన పని లాగా..."
"సరే, సరే. తొందరగా ఇవ్వు. పది నిమిషాల్లో ఆఫీసులో ఉండాలి"
"మీరు వెళ్ళి హాలులో కూర్చోండి...తెస్తాను"
కైలాష్ వెనక్కు తిరిగి హాలులోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు.
కొద్ది నిమిషాల తరువాత అక్కడికి కాఫీ తీసుకు వచ్చిన మానస "ఇదుగోండి" అంటూ కాఫీ కప్పు అందించింది.
భార్య అందించిన కాఫీ కప్పు తీసుకుని, టీపా మీద పెట్టి, గబుక్కున లేచి నిలబడి మానసను గట్టిగా కౌగలించుకున్నాడు.
"అయ్యో...వదలండి"
"ఊహు"...అంటూ అమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు.
ముఖాన్ని పక్కకు తిప్పుకున్న మానస "వదలండి...నాకు తెలుసు మీరు ఎందుకు వచ్చారో"
"తెలుసు కదా...మరెందుకు ఈ అబ్జెక్షన్"
“దేనికైనా ఒక టైమంటూ ఉంది...అయినా, బాగా టయర్డ్ గా ఉన్నది, అది ఇది అని కథలు చెప్పారు"
"నిన్ను చూడగానే పూర్తి ఎనర్జీ వచ్చేసింది"
"వస్తుంది...వస్తుంది!” రెండు చేతులతోనూ భర్తను వెనక్కి తోస్తూ “మర్యాదగా ఆఫీసుకు బయలుదేరండి. లేకపోతే మీ జి.ఎం కు ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్న విషయం చెప్పేస్తాను"
"నువ్వు చెప్పినా చెబుతావు! నిన్ను....రాత్రికి చూసుకుంటా" అంటూ అమెను విడిచిపెట్టి ఫైలు తీసుకుని బయలుదేరాడు.
"కాఫీ"
"నువ్వు తాగేయ్"
భర్త హడావిడి చూసి నవ్వుకుంది మానస.
మైన్ డోర్ తలుపుకు గడియ వేసి, మిగిలిన పని చేసుకోవడానికి వంటింట్లోకి వెళ్ళింది మానస.
ఇంతలో హాలులో ఉన్న టెలిఫోన్ మోగింది.
గబగబ హాలులోకి వచ్చిన మానస, రీసీవర్ తీసి "హలో" అన్నది.
"నేనమ్మా...నాన్నను మాట్లాడుతున్నాను"
ఆ గొంతు శబ్ధం విన్న వింటనే మానస మనసులో కాకరపువొత్తులు వెలిగించినంత వెలుగుతో కూడిన ఆనందం వెళ్ళివిరిసింది.
Continued:.....PART-2
ఇవి కూడా చదవండి:
అంతరిక్షంలోనూ కాలుష్యం(ఆసక్తి)
************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి