శతమానం భవతి…(సీరియల్) (PART-2)
"నాన్నా....ఎలా ఉన్నావు?"
"బాగున్నానమ్మా"
"అమ్మ, చెల్లి ఎలా ఉన్నారు?"
"చాలా బాగున్నారమ్మా. నువ్వు, అల్లుడుగారు ఎలా ఉన్నారు?”
"బాగున్నాము నాన్నా…..మిమ్మల్నందరినీ చూడాలాని చాలా ఆశగా ఉన్నది"
"ఒకసారి వచ్చి వెళ్ళొచ్చు కదా"
"ఎక్కడ నాన్నా...ఆయనకు సెలవు దొరకాలి కదా"
"దూరంగా ఉంటే ఇదేనమ్మా ప్రాబ్లం...లాంగ్ లీవ్ పెట్టాలి. ఒక్కసారిగా లాంగ్ లీవ్ కంపనీ వాళ్ళు ఇవ్వరు. అల్లుడు గారిని హైదరాబాదుకు మార్చుకుని వచ్చేయమని చెప్పు"
"అది అంత సులభం కాదు నాన్నా”
"సరేనమ్మా! నీతో ఒక ముఖ్యమైన విషయం చెబుతామని ఫోన్ చేశాను"
"చెప్పు నాన్నా"
"పెళ్ళి చూపులకని సుజాతని చూడటానికి రాజమండ్రి నుంచి వచ్చారమ్మా"
"అలాగా? పెళ్ళి కొడుకు ఏం చేస్తున్నాడు?"
"పెళ్ళి కొడుకు బ్యాంకులో మేనేజర్. మంచి సంబంధం...బాగా ఉన్నవాళ్ళమ్మా. ...చూడటానికి కూడా బాగా హుందాగా, అందంగా ఉన్నాడమ్మా"
"అలాగైతే పెళ్ళి కుదుర్చుకుని ఉండొచ్చు కదా”
"ఈ సంబంధం ఓకే చేసుకుందామనే అనుకుంటున్నాము...జాతకం కూడా బాగా కలిసింది"
"చాలా ఆనందంగా ఉంది నాన్నా. త్వరగా ముహూర్తాలు పెట్టుకోండి"
"కానీ ఒక ప్రాబ్లం నన్ను వేదిస్తోందమ్మా"
"ఏమిటి నాన్నా అది?"
"డబ్బు ఎలా సర్ధుబాటు చేసుకోవాలో తెలియటం లేదమ్మా. నీ పెళ్ళి జరిగి రెండు సంవత్సరాలు అవుతోంది. నీ పెళ్ళికి చేసిన అప్పులు చాలా వరకు తీర్చాను. కొద్దిగా ఉంది...సుజాతకి రెండేళ్ళ తరువాత పెళ్ళి పెట్టుకుందాములే అనుకున్నాను. కానీ దానికి ఇలా సడన్ గా మంచి సంబంధం వస్తుందని అనుకోలేదు. ‘మంచి సంబంధం. వదులుకోకూడదండి. ఎలాగైనా డబ్బు సర్దుబాటు చెయ్యండి’ అంటోంది మీ అమ్మ. అందుకే ఏం చేయాలో తెలియటం లేదు"
"నేను కావాలంటే ఆయన దగ్గర అడిగి కొంత డబ్బు సర్ధుబాటు చేస్తాను"
“వద్దమ్మా... డబ్బు వద్దు. అమ్మ నిన్ను ఒకటి అడగమంది"
"చెప్పు నాన్నా"
"పెళ్ళి వారు యాబై కాసుల బంగారం అడుగుతున్నారు. నువ్వు నీ నగలలో ఏదైనా రెండు నగలు ఇస్తే...వాటిని కూడా ఇచ్చి తాంబూలాలు పుచ్చుకుందామని చెప్పింది"
"దానికేముంది నాన్నా....ఏం నగలు కావాలో అడగండి. ఇస్తాను. సుజాత పెళ్ళి బాగా గ్రాండు గా జరగాలి. దానికోసం ఇదికూడా చెయ్యకపోతే ఎలా నాన్నా? ఎన్ని నగలైనా నేను ఇస్తాను.”
"నువ్వలా చెబుతూంటే ఆనందంగా ఉందమ్మా. కానీ, అల్లుడుగారు ఏమంటారో? ఆయన్ని అడగ కుండా నువ్వే సమాధనం చెబుతున్నావు...ఎలాగమ్మా?"
“నాన్నా...ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన ఇమ్మనే చెబుతారు"
"అల్లుడు గారి మీద నీకున్న నమ్మకం చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. కానీ, ఆయన్ని అడగ కుండా నా దగ్గర ఇస్తానని చెప్పినట్లు ఆయనకు చెప్పకమ్మా. ‘నన్ను అడగ కుండా నగలు ఇస్తానని నువ్వెందుకు మాటిచ్చావు’ అంటూ నీతో గొడవకు దిగుతారేమో"
"నాన్నా...మీ అల్లుడు అలాంటి మనిషి కాదు. చాలా మంచి వారు. ఆయన తన స్నేహితుడి పెళ్ళికే డబ్బు సహాయం చేశారు. అలాంటిది, నా చెల్లి పెళ్ళికి సహాయం చేయరా?"
"ఏంటోనమ్మా...ఇంత మంచి అల్లుడు దొరికినందుకు నేనెంతో పుణ్యం చేసుకోనుండాలి. సుజాత కి కాబోయే అల్లుడు కూడా మంచి వాడుగా ఉంటే, నేనెంతో అద్రుష్ట వంతుడవుతాను. ఇద్దరి కూతుర్లనూ మంచి వారి చేతుల్లో పెట్టానని సంతోషంగా, త్రుప్తిగా మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడిపేస్తాను"
"నాన్నా...నీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది...నువ్వు అనవసరంగా భయపడకు"
"సరేనమ్మా....అల్లుడు గారిని అడిగానని చెప్పు. ఆయన్ని అడిగి నాకు ఫోన్ చెయ్యి”
“సరే నాన్నా...అమ్మ దగ్గర చెప్పు, దేనికీ కంగారు పడవద్దని. సుజాత పెళ్ళి గొప్పగా జరుపుదాం"
"సరేనమ్మా"
నాన్న టెలిఫోన్ పెట్టాశారు.
మానసకు మహా ఆనందంగా ఉంది. వెంటనే చెల్లి సుజాతను చూడాలని, పెళ్ళి గురించి ఎన్నో విషయాలు మాట్లాడి, పెళ్ళి చేసుకోబోయే పెళ్ళికొడుకు గురించి ఆటపట్టించి, ఆమె ముఖంలో సిగ్గు తెప్పించి, అది చూసి ఆనందపడాలని ఉన్నది.
"వెంటనే వెళ్ళలేను...తాంబూలాలకు వెళ్ళినప్పుడు ఒక పది రోజులు,పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక నెల రోజులు అమ్మా, నాన్నల దగ్గర ఉండాలి. ఊర్లో అందరినీ పలకరించాలి" ఖచ్చితంగా మనసులో ప్లాను వేసుకుంది.
పెళ్ళి తరువాత రెండు సార్లు మానస మహారాష్ట్రం వదిలి ఊరికి వెళ్ళీనా, తన సొంత ఊరు వెళ్ళలేదు. పిన్ని కూతురు పెళ్ళికి, ఏలూరు వెళ్ళింది.నేరుగా కల్యాణ మంటపానికి వెళ్ళి, మరునాడు అక్కడి నుండి తిన్నగా రైల్వే స్టేషన్ కు వచ్చి, తిరుగు రైలు ఎక్కింది. రెండో సారి అత్తయ్యకు సీరియస్ గా ఉన్నదని చెబితే తిన్నగా హాస్పిటల్ కు వెళ్ళి, అక్కడే రెండు, మూడు రోజులు ఉండి, అక్కడే అమ్మా, నాన్న, చెల్లి ని చూసి హాస్పిటల్ నుండి వెళ్ళిపోయింది.
మధ్యాహ్నం భర్త లంచ్ కు వచ్చినప్పుడు మానస అతన్ని కౌగలించుకుంది.
ఆశ్చర్యపోయిన కైలాష్ "ప్రొద్దున ఫైలు కొసం వచ్చినప్పుడు నన్ను దూరంగా తొసేశావు. ఇప్పుడు కూడా దీనికి ఇది టైము కాదు. మరి ఇప్పటి నీ సంతోషానికి కారణమేమిటో"
"సంతోషమైన విషయం ఒకటుంది"
"వావ్...చెప్పు...చెప్పు"
"కనుక్కోండి చూద్దాం"
"చిన్ని మానస?"
"దానికి ఇంకా టైముంది. మీరే కదా దానికి టైము పెట్టారు"
"మరైతే ఇంకేమిటో చెప్పు"
"సుజాతను చూడటానికి పెళ్ళి వారు వచ్చారట"
"అలాగా....సుజాత వాళ్ళకు బాగా నచ్చుంటుందే...ఓకే చెప్పుంటారే"
"అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారు"
"సుజాత అందం అలాంటిది...ఎవరైనా ఆమె అందానికి బానిస అవాల్సిందే"
“మీరు కూడానా"
"అందులో సందేహం లేదు. నిజం చెప్పలంటే సుజాతనే పెళ్ళి చేసుకుందామనుకున్నాను. మా అమ్మే అడ్డుపడింది. అక్కయ్య ను చూడటానికి వచ్చి చెల్లెల్ను ఒకే చేస్తే, మనల్ని తన్ని తరుముతారు అని చెప్పింది. మొదటికే మోసం వస్తుందని నేనే నిన్ను చేసుకోవడానికి సరే అని చెప్పాను"
మానస మొహం ఎర్ర బడింది. వేడి వేడి ముక్కల పులుసును భర్త చేతి మీద పోసింది.
"ఆ... ….ఆ…… రాక్షసీ...మొగుడి మీద వేడి పులుసును పోసే నువ్వూ ఒక భార్యవేనా"
“అదే నేనూ అడుగుతున్నా... మీరూ ఒక మొగుడేనా? …నా మెడలో తాలి కట్టి, ఇంకొక అమ్మయి అందం గురించి పొగడుతున్నారే..."
“ఇంకొక అమ్మాయా....నీ చెల్లెలు అందం గురించే కదా గొప్పగా చెప్పాను"
"సరే...మాట్లాడుతూనే ఉండండి"
"కోపమా? సరదాగా అన్నాను...సరే చెప్పు"
"పెళ్ళికొడుకు బ్యాంకులో మేనేజర్ గా చేస్తున్నాడట. బాగా ఉన్నవాల్లట"
"అలాగా! అయితే ఇంకేం...పెళ్ళి ఖాయం చేసుకోవచ్చుగా?"
"డబ్బు కోసం ఆలొచిస్తున్నారట. నా పెళ్ళికోసం చేసిన అప్పు ఇంకా కొంచం తీర్చాలట...ఈ లోపే మళ్ళీ పెళ్ళి, అప్పు అంటే భయపడుతున్నారు...కానీ మంచి సంబంధం, వదులుకోలేక పోతున్నానని చెప్పారు"
“ఎందుకు వదులుకోవాలి? ఖర్చుకోసం భయపడి వదులుకోకూడదు. కావలసిన డబ్బు నేను ఏర్పాటు చేసిస్తానని చెప్పకపోయావా? నగలు, బంగారం కావాలంటే నీ దగ్గరున్నవి ఇవ్వు"
అంతే, మానస కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. అమాంతం లేచి భర్తను కౌగలించుకుని గట్టిగా ఏడుస్తూ "మీకు చాలా పెద్ద మనసండి" అన్నది.
Continued.......PART-3
ఇవి కూడా చదవండి:
అంతరిక్షంలొ బెర్మూడా ట్రయాంగిల్?(ఆసక్తి)
********************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి