శతమానం భవతి…(సీరియల్) (PART-8)
రోడ్డు మీద తోటి విధ్యార్ధినిని ఒకబ్బాయి అల్లరి పెడుతుంటే...ఓర్చుకోలేక ఫడేల్ మని అతని చెంప మీద ఒక దెబ్బ వేసింది. అలా చేసినప్పుడు అమెకు ఎక్కడ్నుంచి అంత ధైర్యం వచ్చిందో ఆమెకే తెలియదు. అప్పుడు అటుగా వచ్చిన పోలీసి జీపు, అక్కడ ఆగి విషయం తెలుసుకుని మరునాడు ప్రొద్దున్న వచ్చి కంప్లైంట్ రాసివ్వమన్నారు. అది ఇంతపెద్ద గొడవగా మారుతుంది అనుకోలేదు.
ఇంత జరిగినా గదిలో నుండి మానస బయటకు రాలేదు….లోలోపల భయం. తల్లీ,తండ్రి ఏమంటారోనన్న భయం.
“ఏమిటో, వాళ్ళింటి అబ్బాయిని కొట్టడమేమిటో, పోలీసు కంప్లైంట్ ఇవ్వటమేమిటో…ఏంజరిగిందో ఎవరైనా చెబుతారా?” అరిచాడు జగపతి.
భయపడుతూ తండ్రి దగ్గరకు వచ్చి నిలబడ్డ మానస చెల్లెలు సుజాత, తండ్రికి అక్క మానస చేసిన పని గురించి వివరించింది.
విషయం తెలుసుకున్న మానస తల్లితండ్రులు ఏమీ మాట్లాడక మౌనంగా కూర్చున్నారు...ఇళ్ళంతా నిశ్శబ్ధ వాతావరణం. ఎవరూ ఎవరితోనూ మాట్లాడలేదు. తల్లి మాత్రం రెండుసార్లు లేచి బాత్ రూముకు వెళ్ళొచ్చింది.
నిశ్శబ్ధ వాతావరణాన్ని చేదిస్తూ "జగపతి గారూ " అన్న పిలుపు వినబడింది.
వీధిలోని పెద్ద మనుష్యులు.
అందరినీ ఆహ్వానించి లోపలకు తీసుకు వచ్చి వాళ్ళంతా కూర్చున్న తరువాత తానూ కూర్చున్నాడు జగపతి.
"చెప్పండి...మీరు ఎలా చెబితే మేము అలా చేస్తాము. మమ్మల్ని ఈ గొడవలో నుండి బయటపడేయండి?"
చేతులు జోడించి బ్రతిమిలాడాడు జగపతి.
"కంగారు పడకండి జగపతి గారు. మేమున్నాము కదా. రేపు మనమందరమూ కలిసి రుద్రయ్య గారిని కలుద్దాము. క్షమించమని అడుగుదాము. అలాగే 'పోలీసు కంప్లైంటు కూడా ఇవ్వము. ఇక్కడితో ఈ విషయాన్ని మర్చిపోదాము' అని రుద్రయ్య గారి దగ్గర చెబుదాము. తప్పకుండా రుద్రయ్య గారు మన మాటకి 'సరే' అంటారు".
"ఏమంటారు జగపతి గారు"
"అలగే చేద్దాం...మా పరువు, ఇళ్లు, పిల్లలూ, జీవితము అల్లరిపాలు కాకుండా ఉంటే చాలు"
"సరే...రేపు ప్రొద్దున వస్తాము" అని చెప్పి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు.
తిరిగి ఆ ఇంట్లో అదే నిశ్శబ్ధ వాతావరణం.
మానస తండ్రి మౌనంగా పడుకున్నాడు.
మానస గది నుండి బయటకు రాలేదు. భయమో, ఆందోళనో, దిగులో...ఏదో తెలియని ఒక ఒత్తిడి ఆమెను కుంగదీస్తోంది.
“నమ్మలేక పోతున్నాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు. తల్లితండ్రులు ఇంత అవమాన పడతారాని అనుకోలేదు. జరిగిన సంఘటనకు అందరూ గర్వడతారని ధైర్యంగా ఉన్నాను. ఒక్కరైనా తనని సమర్దిస్తూ తనకు తోడుగా ఉంటారనుకుంది. కానీ ఇక్కడ వాతావరణం తారుమారుగా ఉన్నదే?” కుమిలిపోయింది మానస.
తల్లితండ్రులను చూసే ధైర్యం లేక ఆ గదిలోనే ఉండిపోయింది మానస.
మానస ఒక సరాసరి అమ్మాయి. ఇళ్ళు-స్కూలు తప్ప వేరే లోకం లేదు. ఒకరో ఇద్దరో తప్ప పెద్దగా స్నేహితులు కూడా లేరు. ఆ స్నేహితులు కూడా స్కూల్ వరకే. స్వతహ భయస్తురాలు.
“ఎన్ని బూతులు తిట్టేరు. వీధి మొత్తం వినబడేటట్టు ఎలా అరిచారో....ఏ తల్లీ-తండ్రీ ఆ బూతులు వినలేరు. ఈ రోజు నా వలన అమ్మా, నాన్నకూ ఎంత బాధ. మనసులో ఎంత కుమిలిపోతున్నారో...నన్ను పిలిచి ఒక్క ముక్క కూడా అడగలేదు....నేనుగా వెళ్ళి చెబుతామంటే నాకు ధైర్యం చాలట్లేదు...క్షమించమని తల్లితండ్రుల కాళ్ల మీద పడదామని ఉన్నది...కానీ ఎలా?” ఆలొచనలు మానసను వేధిస్తున్నాయి.
చాలా సమయం అలా గడిచిపోయింది.
అమ్మా-నాన్న ల గది లైట్లు ఆఫ్ చేయబడ్డాయి.
"దేవుడా... వాళ్ళను కొంతసేపైనా నిద్ర పోయేలా చేశావే! నాకు అదే పదివేలు" అంత బాధలోనూ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది మానస.
కానీ, మానసకు మాత్రం నిద్ర పట్టలేదు.
పెద్దగా ఏడవాలనిపించింది. ఏడిస్తే తల్లితండ్రులకు తెలిసిపోతుంది. అందుకని తనను తాను కట్టిపడేసుకుంది.
ఎక్కువసేపు అలా ఉండలేకపోయింది. పెద్దగా ఏడవకపోతే తలపగిలిపోయేటట్లు అనిపించింది. దొడ్డి వైపుకు వెళ్ళటానికి వంటింట్లో నుండే వెళ్ళాలి. వంటింటి తలుపుపై చేయివేసింది. మెల్లగా తలుపులు తెరుచుకున్నాయి.
లోపల
చీకట్లో ఎవరో వెక్కి,వెక్కి ఏడుస్తున్న శబ్ధం వినబడింది.
అమ్మ
సామాన్లకు మధ్య మొకాళ్ళపై చేతులు పెట్టుకుని, చేతులపై తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది.
తెల్లవారింది.
రాత్రి చీకటి…తన రంగులాగానే ఏ సమస్యకైనా ఆందోళనను, భయాన్ని ఇస్తుంది.
పగటి వెలుతురు...ఎంత పెద్ద సమస్యకైనా స్పష్టత, ఆలొచన ఇస్తుంది.
సూర్యకిరణాలకు అంత శక్తి ఉంది. రాత్రి భయాందోళనలు కలిగించిన విషయం పగలు తలచుకున్నప్పుడు 'ఛ... ఈ విషయానికా రాత్రంతా బుర్ర పగిలేలా ఆలొచించాము’ అనిపిస్తుంది.
మానసకు అలాంటి స్పష్టత, ధైర్యం, ఆలొచన ఏర్పడింది.
రాత్రంతా ఏడుపుతో గడిపిన అమ్మ వంటింట్లో ముడుచుకుని పడుకుంది. ఆమెకు తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోయింది.
వాకిలి చిమ్మి ముగ్గు వేద్దామని, నీళ్ళు, ముగ్గు పిండి తీసుకుని ఇంటి ముందుకు వచ్చింది మానస. అప్పటికే వాకిళ్ళలో ముగ్గులు వేయడానికి బయటకు వచ్చిన చుట్టు పక్క ఇళ్ల వాళ్ళు మానసను చూసిన వెంటనే గుసగుస లాడుకొవటం మొదలుపెట్టారు. అది చూసిన మానసకు కాళ్ళలో వణుకు మొదలయ్యింది.
చెల్లెలు సుజాత బయటకు వచ్చింది.
"అక్కా...నువ్వు లోపలకు వెళ్ళు. వాకిలి నేను చిమ్ముతాను" అంటూ మానస చేతిలోని ముగ్గు పిండిని, నీళ్ళ బకెట్ ను తీసుకుంది.
లోపలకు వచ్చిన మానసను అవమానం కుంగదీసింది.
రాత్రి రుద్రయ్య మనుషులు వాడిన బూతు మాటలు గుర్తుకు వచ్చినై.
"ఏం మనుషులు వీళ్లంతా?
సమస్య గురించి మాట్లడటానికి వచ్చిన వాళ్ళు, న్యాయమైన పద్దతిలో సాధారణ భాషలో అడిగి ఉండొచ్చు. కోపాన్ని కక్కటానికి మాటలా లేవు? బూతు మాటలు వాడితేనే కోపం కక్కినట్లా?
నాగరీకమే లేకుండా ఒక ఆడపిల్లను అంత అసహ్యంగా మాట్లాడొచ్చా?
అలా ఎలా మాట్లాడొచ్చు? ఆడవాళ్ళంటే చులకనగా చూస్తారా? ఆడపిల్లలు వీళ్ళకు ఆటబొమ్మలా? మొన్న ఆ అమ్మాయిని శారీరకంగా ఏడిపించారు...నిన్న నన్ను మాటలతో అవమానించారు? ఎవరిచ్చారు వీళ్ళకు ఈ ఆధికారం? ......వీళ్ళను ఊరికే వదిలిపెట్ట కూడదు. మహిళలకోసం పోరాడే మహిళా సంఘాలు...మహిళల హక్కులను కాపాడే చట్టాలు ఉన్నప్పుడు ఒక ఆడపిల్లను ఇంత చులకన చేసి మాట్లాడటాన్ని ఎలా అనుమతించగలం? ......నేనేమీ తప్పు చేయలేదే.తప్పు చేసిన ఒక మగవాడిని నిలదీసేను. అది తప్పా? దానికొసం నన్ను అంత అసహ్యంగా మాట్లాడాలా?" ......పటపట పళ్ళు కొరుక్కుంది మానస.
తండ్రి నిద్ర లేచాడు.
కానీ ముఖమంతా పీక్కుపోయి వారం రోజులు లంకనాలు చేసిన మనిషిలాగా ఉన్నాడు. జరగకూడనిది ఏదో జరిగినట్లు పూర్తి మౌనంతో ఈజీ చైర్లో కూర్చున్నాడు.
అమ్మ, ముఖం కూడా కడుక్కోకుండా నాన్న కాళ్ళ దగ్గర కూర్చుంది. ఆమె ముఖం కూడా వాడిపోయి ఉన్నది.
తండ్రి ఎదురుగా వెళ్ళి నిలబడి "నాన్నా" అంటూ పిలిచింది మానస.
ఈజీ చైర్లో కళ్ళు మూసుకుని పడుకోనున్న మానస తండ్రి మెల్లగా కళ్ళు తెరిచి, మానసను చూడటం ఇష్టం లేక తల పక్కకు తిప్పుకున్నాడు.
"నాన్నా...వాళ్ళు ఎలా అంత నీచంగా మాట్లాడగలిగారు? వాళ్ళకెందుకు అంత పొగరు? నలుగురైదుగురు తాగేసి గుంపుగా వచ్చి అసహ్యంగా మాట్లాడి వెళ్లారు...మార్కెట్లో వాళ్ళ మనిషి ఒక ఆడపిల్లపై ఎంత అమానుషంగా ప్రవర్తించాడో తెలుసా? తప్పు వాళ్ళ మీద పెట్టుకుని, ఆ తప్పేదో నేను చేసినట్లు మనింటికి వచ్చి గొడవ చేసి వెళ్ళేరే?”
"ఏం చేయను?"
"పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి..."
"పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి నువ్వు కూడా పోలీస్ స్టేషన్లోకెళ్ళి నిలబడు. ఇప్పుడు మన వీధిలో వాళ్ళు మాత్రమే మనల్ని చూసి నవ్వు కున్నారు. తరువాత ఈ ఊరే నవ్వుతుంది"
తండ్రి మాటలతో మానస ముఖం వాడిపోయింది.
మానస తల్లి స్విచ్ వేసిన బొమ్మలా లేచి నిలబడి "నిన్నటి వరకు ఈ కుటుంబం ఎలా ఉండేది? ఈ రోజు వీధంతా నవ్వుకుంటోంది. పెళ్ళీడుకు వచ్చిన ఆడపిల్లవు నువ్వు . నిన్ను ఎంత అసహ్యంగా తిట్టేరొ...గుండె పగిలిపోతుందేమో అనిపించింది. వాళ్ళు మాట్లాడిన మాటలకు ఉరి వేసుకుని చ్చచ్చిపోదామనిపించింది"
"అమ్మా... ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు ఎందుకమ్మా?"
"చిన్న విషయమా? నీకూ, వాళ్ళకా గొడవ? నిన్నెవరే అక్కడి గొడవల్లో తలదూర్చ మన్నది. నువొక్కదానివే అక్కడున్నావా? నీతోటి ఆడపిల్లలు ఇంకెవరూ లేరా? వాళ్లలాగా నువ్వెందుకు ఉండలేకపోయావు? ఇంటిదాకా గొడవను ఎందుకు తీసుకు వచ్చావు?".....నిన్నటి వరకు మానసను పొగడిన తల్లి, ఈ రోజు కోపంగా మాట్లాడుతోంది.
“అమ్మా...వాళ్ళు అలా మాట్లాడి వెళ్ళినందుకు నేనేం చేయగలను"
"చేసిందంతా చేశేసి ఇప్పుడు నేనేం చేయను అని అడుగుతున్నావా? మనమెవరం, మన తాహతు ఏమిటి, పోట్లాట పెట్టుకుని మనం నెగ్గుకు రాగలమా అని ఆలొచించక్కర్లా? నువ్వొక ఆడపిల్లవు. నువ్వూ, నీ చెల్లి బయటకు వెడితే, మీరు ఇంటికి తిరిగి వచ్చేంతవరకు మేము మంటల్లో నిలబడాలి...మామూలు రోజుల్లోనే మీరు బయటకు వెళ్ళి తిరిగి వచ్చేదాకా మాకు టెన్షన్ గా ఉంటుంది. ఇక ఇప్పుడు మిమ్మల్ని ఎలా బయటకు పంపేది...బయటకు పంపి నేను టెన్షన్ తో బ్రతకగలనా?"
"అమ్మా...ఎందుకమ్మా అలా మాట్లాడతావు"
"పోవే....వెళ్ళు. నా ఎదురుగా నిలబడకు"
Continued.....PART-9
ఇవి కూడా చదవండి:
కరోనా వైరస్ కు కారణం వుహాన్ వైరాలజీ ల్యాబే: నమ్మడానికి కారణాలు(ఆసక్తి)
********************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి