19, నవంబర్ 2020, గురువారం

శతమానం భవతి…(సీరియల్)...PART-4

 

                                                                          శతమానం భవతి…(సీరియల్)                                                                                                                                                                   (PART-4)

అంతే, మానస సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. తండ్రి ఒకే చెప్పిన వెంటనే బీరువా తెరిచి, చీరలు తీసుకుని సూట్ కేసు సర్ధటం మొదలుపెట్టింది. సంతోషం పట్టలేక ఊరు వెడుతున్న విషయాన్ని పక్కింటి మెహతా బిబీ దగర చెప్పటానికి వెళ్ళినప్పుడు ఆమె సంతోషాన్ని పాడు చేసే న్యూస్ వచ్చింది.

మానస ఇంట్లో ఫోన్ మోగింది.

రిసీవర్ తీసి "హలో " అన్నది.

"మానసా"

తల్లి గొంతే! ఉత్సాహంగా "అమ్మా ...ఏదీ మర్చిపోకుండా అన్నీ సర్ధుకున్నాను. టికెట్లు అందితే రేపు, లేకపోతే ఎల్లుండి బయలుదేరుతాము "

"అది..." 

"చెప్పమ్మా...ఏదో చెప్పాలనుకుంటున్నావు"

"పెళ్ళికి నువ్వు రావద్దు"

"అమ్మా" షాక్ తో అరిచినంత పనిచేసింది మానస.

"మానసా...నువ్వు తెనాలికి రాకూడదనే తాంబూలాలప్పుడు రాజమండ్రి నుంచి, అట్నుంచి అటే నిన్ను పంపించాను. నాతో నువ్వు మన ఊరికి రాకూడదనే రోజు అలా చేశాను"

"ఎందుకమ్మా…”

"ఇక్కడ నువ్వు చేసి వెళ్ళిన ఘనకార్యం ఇంకా నాలో భయాన్ని రేపుతోంది. సుజాత పెళ్ళి ఆటంకమూ లేకుండా జరిగిపోవాలి. అందుకే నిన్ను రావద్దు అంటున్నాను. అల్లుడు గారితో నువ్వే ఏదో ఒకటి చెప్పి అక్కడే ఉండిపో"

తల్లి రిసీవర్ పెట్టేసిన శబ్ధం.

మానస గుండెలో కత్తి పెట్టి గుచ్చినంత నొప్పి. రీసీవర్ పెట్టకుండా గోడనానుకుని వొరిగిపోయింది మానస. 

                                                                 *************************

దయ్యం పట్టినట్లు సోఫాలో పడిపోయి ఉన్నది మానస.

ఎవరో తనను తీసుకుపోయి అడవిలో...మండుతున్న మంటల్లో పడేసినట్లు ఉన్నది.

ఏదేదో ఆలొచనలు ఆమెను చుట్టుముట్టాయి. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. ఆమె చుట్టూ ఏం జరుగుతోందో ఆమెకు అర్ధం కావటం లేదు!

పాత జ్ఞాపకాలు ఆమె మదిలో జేరి ఆమెను చితక్కొట్టి, ధ్వంశం చేసినై. ఆలొచనల ఒత్తిడి పెరిగి మెదడు నరాలు పేలిపోయి ముక్కు, కళ్ళు, చెవి నుండి రక్తం  ధారగా కారుతున్నట్టు భ్రమలో పడింది మానస.

తల్లి మాటలే మళ్ళీ, మళ్ళీ వినబడుతున్నాయి.

"పెళ్ళికి రావద్దు...నువ్వే ఏదైన సాకు చెప్పి అక్కడే ఉండిపో"

అమ్మ ఏం చెప్పింది? పెళ్ళికి రాకూడదనా? కన్న కూతుర్నా? సొంత చెల్లెలు పెళ్ళికి అక్క వెళ్ళకుండా ఉండటమా? అమ్మ ఇలా ఎలా చెప్పిందిఎందుకు చెప్పింది?"

"సుజాత పెళ్ళి ఆటంకమూ లేకుండా జరగాలి...అందుకే రావద్దంటున్నాను"

"నేను వస్తే పెళ్ళి ఆగిపోతుందా? ఎందుకు?"

కళ్ళలో నుండి కారుతున్న నీరు ఆగట్లేదు. ఎవరి భుజం మీదైనా తల పెట్టి ఏడవాలనిపిస్తోంది. ఒత్తిడి మనసులో నుండి మెదడుకు ఏదో చెబుతోంది.

"వద్దు. ఏడవద్దు...కైలాష్ వచ్చే సమయం దగ్గరపడుతోంది. కన్నీళ్ళు, ఎరుపెక్కిన మొహం నువ్వు పడుతున్న బాధను బయటకు చూపిస్తుంది. అతని మనసులో అనుమానం పుట్టిస్తుంది"

పెళ్ళైన కొత్తల్లోనే కైలాష్ కి అనుమానం వచ్చింది. "ఏమిటి మానసా...నువ్వు ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న దానికి మల్లె ఉంటావు? నీకు ఏమిటి ప్రాబ్లం?" అని మాటి, మాటికీ అడిగేవాడు.

"అదంతా ఏమీ లేదే? ...ఇంటి జ్ఞాపకం...అంతే" అని చెప్పి తప్పించుకున్నావు.

"మళ్ళీ ఇంకోసారి నీ భర్త మనసులో అనుమానానికి చోటివ్వకూడదు మధ్యే అన్ని మరిచిపోయి సంతోషంగా ఉంటున్నావు...దీన్ని చెడుపుకోవాలా" మానస మనసు మానసను హెచ్చరించింది. 

అన్నిటినీ మరిచిపోయి...సంతోషంగా ఉంటోంది కాబట్టే ఊరికి వెళ్ళాలని ఆశ పడ్డది మానస.

పెళ్ళైన కొత్తల్లో ఊరి వైపే వెళ్ళ లేదు. మనసును చాలా నిలకడగా ఉంచుకుంది. భర్త వేసవి సెలవుల్లో వెడదామన్నప్పుడుమా ఊర్లో ఏముంది, వద్దు కోడై కానలో, ఊటినొ వెడదామని చెప్పేది.

మానసను ఊరి మనుష్యులకు దూరంగా ఉంచాలనే,  ఎక్కడో దూరంగా ఉన్న రాష్ట్రంలో ఉంటున్న కైలాష్ ని అల్లుడుగా వెతికి పట్టుకున్నారు. వేరే భాష మాట్లాడే మనుష్యులు,  వేరే వాతావరణం, పూర్తిగా బిన్నమైన జీవిత విధానం గల ప్రదేశం....మనసుకు ఊరట, ప్రశాంతత ఇస్తుందనే అంత దూరమైనా ఇచ్చారు.

"ఇప్పుడెందుకు వచ్చింది ఊరికి వెళ్ళాలనే ఆశ, తపన" అని మానస మనసు మానసను ప్రశ్నిస్తున్న సమయంలో ఎవరో మైన్ డోర్ కొడుతున్న శబ్ధం వినబడింది.

చీర చెంగుతో ముఖం తుడుచుకుని, రాని నవ్వును తెప్పించుకుని డోర్ తీసింది. ఎదురుగా భర్త కైలాష్.

లోపలకు వస్తూనే "రేపటికి టికెట్టు దొరికింది. జీ.టీ ఎక్స్ ప్రెస్...కావలసినవన్ని పెట్టుకో....ఏమిటి సంతోషమే కదా?" అంటూ మానసను దగ్గరకు లాకున్నాడు.

ఆమెలో ఏడుపు ముంచుకువస్తోంది. ఆపుకోవటానికి కొసం మొహం కిందకు దింపుకుంది. 

కైలాష్ మానసను మరింత దగ్గరకు లాక్కునిపెళ్ళైన కొత్తల్లో ఊరికి వెళ్ళిరమ్మన్నా 'వెళ్ళను...మిమ్మల్ని వదిలి నేను ఒక్క రోజు కూడా ఉండలేనుఅంటూ ప్రేమ కబుర్లు చెప్పేదానివి! ఇప్పుడేంటి ఊరికి వెళ్ళటానికి ఎగిరి గంతులు వేస్తున్నావు...ప్రేమ కబుర్లు కూడా మాయమైనాయి"

వస్తున్న ఏడుపును ఆపుకోలేక భర్త గుండెల మీద వాలిపోయి వెక్కి, వెక్కి ఏడ్చింది మానస.

తను అన్న మాటలకు ఏడుస్తున్నదేమో అనుకుని గాబరా పడ్డ కైలాష్ "సారీ మానసా...నేను ఎదో సరదాగా మాట్లాడాను"

"టికెట్టు క్యాన్సల్ చేసేయండి"

గాబరా కాస్తా షాక్ గా మారింది కైలాష్ కి.

"ఏయ్ మానసా...ఏమైంది నీకు?"

"పెళ్ళికి ఇంకా ఇరవై రోజులు ఉన్నది. ఇప్పుడే ఎందుకెళ్ళాలి"

"ఏందుకీ సడన్ యూ టర్న్! నేనూ పెళ్ళి పనులలో నా వంతు సహాయం చేయాలి అంటూ ఎన్నో కబుర్లు చెప్పావు...ఇప్పుడేమిటి ఇలా మాట్లాడుతున్నావు"

వెల్తాను, వెల్తాను అన్నప్పుడల్ల ఏమీ తెలియలేదు. వెళ్ళే సమయం దగ్గరపడుతున్న కొద్ది అదొలా ఉన్నది. మీరు ఒంటరిగా ఉంటారు అని ఆలొచించినప్పుడు కష్టంగా ఉన్నది. అక్కడ పెళ్ళి పనులు చూడటానికి చాలా మంది ఉన్నారు. కానీ, ఇక్కడ మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరూ లేరే...నేను తప్ప"

కరిగిపోయాడు కైలాష్.

"టికెట్టు క్యాన్సల్ చేశేయండి"

"నిజంగానే చెబుతున్నావా?"

అవును! పెళ్ళికి రెండు రోజులు ఉందనగా వెడదాం. మిమ్మల్ని ఇప్పుడే వదిలి వెళ్ళటానికి, నాకు ఏదోలాగా ఉన్నది" కన్నీళ్ళు కారుస్తూ మానస చెబుతూంటే, ఆమె ముఖాన్ని దగ్గరకు తీసుకుని, కన్నీళ్ళు తుడుస్తూ బుగ్గలపై ముద్దు పెట్టుకున్నాడు కైలాష.

మానస కన్నీళ్ళు పెట్టుకోవటానికి కారణం, తనపై మానసకు ఉన్న ప్రేమేనని కైలాష్ అనుకున్నాడు.

నిజమైన కారణం మానసకు మాత్రమే తెలుసు కదా!  

భయంకరమైన నిశ్శబ్ధంతో కూడిన ప్రశాంత వాతావరణంలో వంట చేస్తోంది మానస. కైలాష్ బయటకు వెళ్ళాడు.

ఫోన్ మోగింది.

ఫోను ఎత్తటానికే ఇష్టంలేదు. అమ్మగానీ, నాన్నగాని చేసుంటారు. వాళ్లతో మాట్లాడటానికే ఇష్టంలేదు.

ఫోన్ వదలకుండా మోగుతూనే ఉండటంతో రిసీవర్ ఎత్తింది.

"హలో..."

నాన్న మాట్లాడుతున్నానమ్మా!"

"చెప్పండి"

"ఏమ్మా గొంతు అదోలా ఉన్నది. ఒంట్లో బాగోలేదా?”

"అదంతా ఏమీ లేదు నాన్నా...నేను బాగానే ఉన్నాను"

"పెళ్ళికి రావద్దని అమ్మ చెప్పిన దాని గురించే ఆలొచిస్తూ బాధ పడుతున్నావా?"

తండ్రి అలా అడిగేసరికి ఏడుపు పొంగుకు వచ్చింది, గొంతుక అడ్డుపడింది.... సమాధానం చెప్పనివ్వకుండా గొంతును ఎవరో నొక్కి పట్టినట్టుంది.

"ఏమ్మా...మౌనంగా ఉన్నావు"

"మరి..బాధపడకుండా ఎలా ఉండగలను?" గొంతు బొంగురు పోయింది.

"ఏం చేయగలం చెప్పమ్మా? జరిగిందంతా నువ్వు మర్చిపోయుండచ్చు. కొత్త ప్రదేశం, కొత్త ప్రజలు నిన్ను అన్నీ మరిచిపోయేటట్టు చేసుంటుంది. కానీ ఇది గ్రామం అమ్మా. ఎవరూ దేనినీ మరిచిపోలేదు. ఇప్పుడు కూడా నీ గురించి మాట్లాడుతున్నారు. నువ్వు పెళ్ళికి వస్తే ఇంకొచం ఎక్కువగా మాట్లాడతారు. విషయాలు ఏమైనా కొత్త పెళ్ళి కొడుకు వాళ్ళ చెవికి వెళ్ళి, వాళ్ళు తప్పుగా అర్ధం చేసుకుంటే, సుజాత పెళ్ళిలో ఏదైనా గొడవలు జరిగితే ఏం చేయగలం? 

ఆడపిల్లను కనేసేము...రోజూ మేము భయపడుతూ ఉండాల్సిందే కదా. నిన్ను రావద్దు అని చెప్పటానికి మాకేమన్నా ఆశా? నువ్వు పెళ్ళికి రావని గుర్తుకు వచ్చినప్పుడల్లా మేమేంత బాధ పడుతున్నామో తెలుసా? కానీ ఏం చేయగలం చెప్పు? తప్పులన్నీ నువ్వే కదా చేశావు! దానికి తగిన ఫలితం అనుభవించే తీరాలి కదా?"

మనసులో ఏదో విరిగిన శబ్ధం.

దెబ్బ పై దెబ్బ తింటున్న ఫీలింగ్.

కూతురు మనసు విరిగిపోయిందని తెలియకనో లేక తెలిసి కూడా దాని గురించి పట్టించుకోకుండా మాట్లాడుతూనే ఉన్నారు మానస తండ్రి.

"మానసా...నీలాంటి మంచి మనసు ఎవరికీ ఉండదు. చెల్లి పెళ్ళికి కావలసినంత బంగారం ఇచ్చి సహాయ పడ్డావు! నువ్వు దేవత లాంటి దానివి. నిన్ను పెళ్ళికి రావద్దని చెప్పటానికి చాలా కష్టంగా ఉన్నది. కానీ ఏం చేయను? అల్లుడు గారితో ఏదో ఒకటి చెప్పి, ఆయన్ను నమ్మించి అక్కడే ఉండు"

నాన్న ఫోన్ పెట్టేసిన శబ్ధం.

మానస తట్టుకోలేక పోయింది!

వంటింట్లోకి వెళ్ళి గ్యాసు పొయ్యి ఆపి బెడ్ రూముకు వచ్చి మంచం మీద పడుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. 

                                                                                                                   Continued.....PART-5 

ఇవికూడా చదవండి: 

నవ్విన వారే అనుసరణ: కరోనా తెచ్చిన మార్పు(ఆసక్తి)

శాశ్వత మెరుపులు(ఆసక్తి & మిస్టరీ)

********************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి