21, నవంబర్ 2020, శనివారం

శతమానం భవతి…(సీరియల్)...PART-5

 

                                                                         శతమానం భవతి…(సీరియల్)                                                                                                                                                                 (PART-5)

పెళ్ళిరోజు దగ్గర పడింది.

మానస, భర్తకు దగ్గరగా జరిగింది. అతను చదువుతున్న పుస్తకాన్ని లాగి దూరంగా పెట్టి, అతని గుండెల మీద వాలింది.

"ఒకటే కన్ ఫ్యూషన్ గా ఉందండి"

"ఎందుకు కన్ ఫ్యూషన్" అమె కురులను సద్దుతూ అడిగాడు.

"ఊరు వెళ్ళటం గురించే"

"అనుకున్నా. పెళ్ళికి ముందు రోజు ఏం చీర కట్టుకోవాలి? ప్రొద్దున ముహూర్తానికి ఏం చీర కట్టుకోవాలి?  సాయంత్రం రిసెప్షన్ కు ఎటువంటి అలంకారం చేసుకోవాలి...ఇదే కదా నీ కన్ ఫ్యూషన్? అన్ని చీరలూ తీసి నా ముందు పడేయ్. నేను సెలెక్ట్ చేసి ఇస్తాను. ఏదీ నచ్చలేదంటే చెప్పు, కొత్తగా కొనుక్కుందాము"

"మీరు ఊరుకోండి. నేను చీరల గురించి మాట్లాడటం లేదు..." అతని చొక్కా బొత్తాని తిప్పుతూ చెప్పింది.

"మరిక దేని గురించి మాట్లాడుతున్నావు?" 

"అదే...ఊరికి ఎలా వెళ్ళటం అని?"

"ఇదేం ప్రశ్న....రైలు లోనే వెల్తాము"

"అదికాదండి... నెల రెగులర్ డేట్ దాటి నాలుగు రోజులయ్యింది. అందుకని".... మాట విన్న వెంటనే, కైలాష్ ఒక్కసారిగా భార్య భుజం గట్టిగా పట్టుకుని........

"నిజంగానా?” 

"అవును! ఇప్పటికే ఐదు రోజులయ్యింది. మనం ప్రయాణం చేసేటప్పుడు పది రోజులవుతుంది. టైములో ప్రయాణం మంచిది కాదు. అది బిడ్డగా ఉండి, రైలు ప్రయాణం, ఒత్తిడ్లు పడక ఏదైనా జరిగితే? అందుకని పెళ్ళికి వెళ్లక్కర్లేదని ఒక నిర్ణయానికి వచ్చాను" 

"ఏయ్..నువ్వేంటి! సొంత చెల్లెలు పెళ్ళికి వెళ్ళకుండా?"

"అందుకని మన బిడ్డకు ఏది జరిగినా పరవాలేదు. చెల్లి పెళ్ళే ముఖ్యం అనుకుని ప్రయాణానికి సిద్దమవ మంటారా?  నా వల్ల కాదు. నా బిడ్డకు ఎలాంటి అసౌకర్యమూ కలగకూడదు"

"బిడ్డ అని కన్ ఫర్మ్ చేస్తున్నావా?"

"మరి...డేట్ దాటి వారం రోజులవుతోందంటే దానికి అర్ధం"

"సరె...డాక్టర్ దగ్గరకు వెడదాము. పరీక్ష చేయించుకుని కన్ ఫర్మ్ చేసుకుందాం"

ఇప్పుడు పరీక్ష చేసినా ఏమీ తెలియదు. పదిహేను రోజులైనా అవ్వాలి. అప్పుడే ఖచ్చితమైన రిజల్ట్స్ తెలుస్తుంది"

"అయితే పెళ్ళికి వెళ్ళటం లేదా?"

"అవును"

"మీ అమ్మా, నాన్నా ఏదైనా అంటే?"

విషయం చెబితే, వాళ్ళే పెళ్ళికి రావద్దు అని చెబుతారు. మనం వెళ్ళక పోయినా పెళ్ళి జరుగుతుంది. బిడ్డని సంరక్షించుకోవడమే మన మొదటి కర్తవ్యం!"

"పెళ్ళికి వెళ్ళలేదే నన్న బాధ నీకు ఉండదా?" 

"ఉంటుంది...అందుకని....? కడుపులో బిడ్డే కదా మనకు ముఖ్యం"   

నిజానికి మానసకు నెలవారి డేట్ దాటలేదు. పెళ్ళికి వెళ్ళకుండా ఉండటానికి అబద్దం ఆడింది.

కానీ కైలాష్... తరువాత, ప్రతి రోజూ "డాక్టర్ దగ్గరకు వెడదాం...పరీక్ష చేయించుకుందాం" అని మానసను ఒత్తిడి చేయటం, మానస ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవటం జరుగుతోంది.

పెళ్ళికి మానస వెళ్ళకపోతే, ఆమె తల్లితండ్రులు బాధ పడతారేమోనని, విషయాన్ని నిదానంగా చెప్పి వాళ్ళను కన్విన్స్ చేయాలని మామగారింటికి ఫోన్ చేశాడు కైలాష్.

"మామయ్యా....మానసకు నెల తప్పిందేమొ అన్న అనుమానం. నెలవారి డేట్ దాటి వారం రోజులైయ్యిందట. ఇప్పుడు ప్రయాణం పెట్టుకుంటే అలసట, ఒత్తిడి వలన ఏదైనా జరుగుతుందేమో నని మానస భయపడుతోంది. నాకూ ఏంచేయాలో తోచటం లేదు. చాలా కన్ ఫ్యూషన్ గా ఉంది"

మానస తండ్రికి అర్ధమయ్యింది. పెళ్ళికి రాకుండా ఉండేదుకు కూతురు ఏదో నాటకం ఆడుతోంది అని!

"వీలు కుదిరితే నేను మాత్రం వస్తాను మామయ్య"

"దానికేం బాబూ. మీకు ఎలా తోస్తే అలా చేయండి. ఆరొగ్యం బాగా చూసుకోమని మానసకు చెప్పండి

ఫోను పెట్టేస్తూ "అమ్మయ్య" అనుకుని, మానస దగ్గరకు వెళ్ళాడు కైలాష్.

నువ్వేమీ బాధ పడకు మానసా. పెళ్ళికి నేను మాత్రం వెళ్ళొస్తాను" అన్నాడు.

"వద్దు...నన్ను ఒంటరిగా వదిలిపెట్టి మీరు వెళ్లద్దు"

"ఏమిటి నువ్వు?  దేనికి నీకు భయం?"......

"నేను ఇంతవరకు ఒంటరిగా ఉన్నదే లేదు. ఒక్కత్తిగా ఉంటే నాకు నిద్ర పట్టదు. భయం వలన ఏదైనా జరగ కూడనిది జరిగితే? భాష తెలియని ఊర్లో నేను ఎక్కడికి వెళ్ళగలను? అందుకని నన్ను వదిలిపెట్టి మీరు ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళకూడదు"

" ! ఏం పిల్లవి నువ్వు...? చిన్న పిల్లలాగా...ఒంటరిగా ఉండటానికి భయం, భయం అంటున్నావు?"

"నేను అంతే"

"నేనూ పెళ్ళికి వెళ్ళకపోతే.....మామయ్యా, అత్తయ్య ఏమనుకుంటారు?"

"వాళ్ళేమీ అనుకోరు. భాష తెలియని ఊర్లో నన్ను ఒంటరిగా వదిలేసి వెడితేనే భాధపడతారు" అంటూ ఏదేదో చెప్పి భర్తను కూడా పెళ్ళికి వెళ్ళకుండా ఆపగలిగింది మానస.

పాపం

చెల్లెలు పెళ్ళి రోజు దగ్గర పడుతున్నకొద్దీ అమె పరిస్థితి ఇంచు మించు పిచ్చిదే. ప్రతి క్షణమూ ఇంటి గురించే ఆలొచన.

'ఈపాటికి ఒక్కొక్కరే వచ్చుంటారు. ఇళ్ళంతా చుట్టాలతో నిండిపోయుంటుంది. అత్తయ్య, మామయ్యా, పిన్నీ, బాబాయి, పెద్దమ్మా, పెద్దనాన్న అంటూ ఒకటే మాటలు...నవ్వులతో ఇల్లు కళ కళలాడుతూ ఉంటుంది. నేను మాత్రం ఒక్క దానినే ఇక్కడ....ఛి, ఛి 

తలచుకుంటుంటే ఏడుపు, కోపం పొంగుకు వస్తోంది మానసకు. 

కైలాష్ ఆఫీసుకు వెళ్ళిన సమయంలో ఎక్కువగా ఏడ్చేది. అతను ఇంటికి వచ్చే సమయం ముఖం కడుక్కుని, బొట్టు పెట్టుకుని, దొంగ నవ్వు పులుముకుని అతని కొరకు ఎదురు చూసేది.

                                                                      **********************

మంచి నిద్రలో, నిద్ర మత్తులో పక్కకు తిరిగి పడుకున్న కైలాష్ కు పక్కన భార్య లేకపోవటంతో నిద్ర మత్తు చెదిరిపోయింది. గది చూట్టూ ఒకసారి చూసాడు. పక్క గదిలో లైటు వేసిన కాంతి కనబడుతోంది. మెల్లగా ముఖాన్ని పక్కకు తిప్పి తలెత్తి గొడ గడియారం వైపు చూసాడు. టైము మధ్య రాత్రి రెండు.

" టైములో లైటు వేసుకుని గదిలో ఏం చేస్తోంది మానస? నిద్ర పట్టలేదా? చెల్లి పెళ్ళికి వెళ్ళలేక పోయామే నన్న బాధ అమెను దహిస్తొందా?"

బెడ్ మీద నుండి లేచాడు. మానస ఉన్న గది దగ్గరకు వెళ్లాడు. లోపల మానస చేస్తున్న పని చూసి బెదిరిపోయాడు. 

కుర్చీలో కూర్చుని, టేబులుపై పెట్టుకున్న రెండు చేతులపై తల ఉంచి వెక్కి, వెక్కి ఏడుస్తోంది మానస. 

ఆమె దగ్గరకు వెళ్ళి, ఆమె భుజంపై చెయ్యి వేసి "మానసా.." అని పిలిచాడు.

బెదురుతోనూ, భయంతోనూ పైకిలేచిన మానస భర్త వంక చూసింది .

మానస కళ్ళు ఎర్ర కణాలు లాగా ఉన్నాయి.

ఇంత బాధపడుతున్నావే? ఇంత మధ్య రాత్రి లేచి కూర్చుని వెకి వెక్కి ఏడుస్తున్నావే? దీనికంటే నువ్వు ఊరికి వెళ్ళుండచ్చే? తెల్లారితే పెళ్ళి. వెళ్ళలేకపోయేనే అన్న బాధ...పెళ్ళికి వెళ్ళద్దు అని నిన్ను ఎవరూ అడ్డుకోలేదే? నువ్వే కదా పెళ్ళికి వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకున్నావు!

నెలవారి డేట్ దాటింది, గర్భంతో ఉన్నావని నీకు నువ్వే చెప్పుకుని పెళ్ళికి వెళ్ళకుండా మానేసావు....డాక్టర్ దగ్గరకు వెళ్ళి, బిడ్డే నని నిర్ధారణ చేసుకుని, తరువాత వెళ్దామా, వద్దా అని నిర్ణయం తీసుకుని ఉండవచ్చు.  డాక్టర్ సలహా కూడా నీ నిర్ణయానికి సహకరించేది. ఇవేవీ చేయకుండా, పెళ్ళికి వెళ్ళొద్దని నీకు నువ్వే  నిర్ణయం తీసుకున్న తరువాత...దానికి తగినట్లు నీ మనసును బలపరుచుకోనుండాలి. అది వదిలేసి ఇలా నిద్ర మానేసి మధ్య రాత్రి పూట ఏడుస్తూ కూర్చొవటం సరికాదు.

ఇలా ఏడుస్తూ కూర్చున్న నిన్ను చూస్తే నాకు ఎంత బాధగా ఉందో తెలుసా? నీ పరిస్థితిని నీ తల్లి తండ్రులు చూస్తే ఎంత మనోవేధనకు గురి అయ్యేవారో? ...సరే రా...వచ్చి పడుకో"

మానస చెయ్యి పుచ్చుకుని, గుండెలకు హత్తుకుని, మెల్లగా బెడ్ రూముకు వచ్చి పడుకున్నాడు. భర్త చేస్తున్న ఓదార్పు చర్యలకు మానస ఒక్క క్షణంలో నిద్ర పోయింది.

మరుసటి రోజు ప్రొద్దున.

పెళ్ళి!

ఇంట్లో ఒంటరిగా ఉంటే మరింత బాధ పడి నీరసించి పోతుందేమోనని ఆఫీసుకు సెలవు చెప్పి మానసను బయటకు తీసుకు వెళ్ళాడు కైలాష్. 

గుడి, హోటల్, సినిమా, పార్కు, షాపింగ్, డిన్నర్...అన్నీ పుర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి  రాత్రి పది గంటలు అయ్యింది.

 బెడ్ మీద వాలిపోతూ "మానసా...రేపు సాయంత్రం మనం డాక్టర్ దగ్గరుకు వెడదాం..." అంటూ నిద్రలోకి జారుకున్నాడు కైలాష్.

కానీ

మరుసటి రోజు ప్రొద్దున తలకు స్నానం చేసి, తలకు గుడ్డ చుట్టుకుని వచ్చిన భార్యను ఆశ్చర్యంగా చూసాడు కైలాష్.

"డేట్ ఆలస్యం అయ్యింది" చెప్పింది మానస.

కైలాష్ మనసు మనసుగా లేదు.

                                                                                                           Continued.....PART-6

ఇవికూడా చదవండి:

ప్రకృతి(కథ)

చంద్రుని మీద అన్యులున్నారా?(మిస్టరీ)

*******************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి