15, మార్చి 2021, సోమవారం

ఆడువారి నిర్ణయాలకు అర్ధాలే వేరు…(కథ)

 

                                                                   ఆడువారి నిర్ణయాలకు అర్ధాలే వేరు                                                                                                                                                    (కథ)

అజయ్ -- అనిత ప్రేమికులు.

వారి ప్రేమ ప్రయాణం గత ఆరు సంవత్సరాల నుండి కొనసాగుతోంది. ఇరు కుటుంబాల పెద్దలూ వాళ్ళ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మూడేళ్ళ క్రితమే ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో మూడేళ్ళ పై చదువుకు అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయంలో అజయ్ కి స్కాలర్ షిప్ సీటు దొరకడంతో, చదువు ముఖ్యం కాబట్టి పెళ్ళి వాయిదా వేసుకున్నారు.

అజయ్ చదువుకోసం అమెరికా వెళ్ళాడు.

మూడేళ్ళ విదేశీ చదువు ముగించుకుని మాతృదేశానికి తిరిగి వచ్చిన మరునాడే అజయ్ అనితను పార్కులో కలుసుకున్నాడు.

చెప్పు అనితా... నేను తిరిగి వచ్చిన వెంటనే నన్ను కలవాలని, నాతో చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలని ఫోన్లో మాట్లాడిన ప్రతిసారి పదేపదే అన్నావే...ఏమిటా విషయం" ఆతృతతో అనితను అడిగాడు అజయ్.

"ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని నువ్వు ఎలా తీసుకుంటావో తెలియదుఅందుకని విషయాన్ని చెప్పకుండా దాచనూలేను" అన్నది అనిత.

ఫోన్లో చెప్పమంటే...కాదు నేరుగానే చెప్పాలి అన్నావు. ఇప్పుడు నేరుగా ఉన్నా విషయం చెప్పకుండా మాట పొడిగిస్తున్నావు. ఎక్కువ టెన్షన్ పెట్టకుండా సూటిగా చెప్పు...ఏమిటా విషయం?"

"అదొచ్చి...రెండు సంవత్సారాల క్రితం నేను నా కిడ్నీలలో ఒక కిడ్నీని దానంగా ఇచ్చాను"

అదిరిపడ్డాడు అజయ్.

"ఏం చెబుతున్నావ్ అనితా!" కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగాడు అజయ్.

నిజం. నేను చెప్పేది నిజం. పెళ్ళికి ముందే విషయం నీకు తెలియాలి. అందుకే నువ్వు ఇండియా వచ్చిన వెంటనే నన్ను కలవాలని చెప్పాను

"ఎంత పనిచేశావు అనితా! నాతో చెప్పకుండా ఎందుకు అలా ఛేశావు? పెళ్ళిచేసుకోబోతున్న నన్ను అడగాలని నీకు అనిపించలేదా? ఎన్ని సార్లు నాతో ఫోన్లో మాట్లాడావు. ఇంత పెద్ద పని చేస్తున్నప్పుడు నా పర్మిషన్ తీసుకోవాలని నీకు తెలియదా?" అజయ్ మాటల్లో కొంచం కోపం కనబడింది.

"నీతో మాట్లాడేంత సమయం కూడా నాకు లేకపోయింది అజయ్. అవతల మనిషి రెండు కిడ్నీలు పనిచేయక సీరియస్ కండిషన్లో ఉన్నది. కిడ్నీ దానం చేసే వాళ్ళు దొరకలేదట. ఆలశ్యం అవుతున్నకొద్దీ పేషంట్ మరణానికి మరింత చేరువ అవుతోందని డాక్టర్లు చెప్పారు. వెంటనే నిర్ణయం తీసుకున్నాను. నా కిడ్నీ ఇస్తానన్నాను. వెంటనే టెస్టులు, హోస్పిటల్లో అడ్మిషన్, ఆపరేషన్...అన్నీ వెంట వెంటనే జరిగిపోయినై"

"ఆపు నీ ఉపొద్ఘాతం....నా దగ్గర ఎందుకు చెప్పలేదు? నా అనుమతి ఎందుకు తీసుకోలేదు? అని అడిగేతే దానికి కారణం చెప్పకుండా ఏదేదో వాగుతున్నావు....ఒక కిడ్నీ లేని నిన్ను నేనేందుకు పెళ్ళిచేసుకోవలి? …..అని నేనడిగితే నీకెలా ఉంటుంది"

"అజయ్...అది" అంటూ ఏదో చెప్పబోతున్న అనితతో "వద్దు...ఇంకేమీ మాట్లాడకు" అని చెప్పి అమె ముఖం వైపు కూడా చూడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు అజయ్.

"అజయ్...అజయ్" అంటూ పిలుస్తున్నా వెనక్కు తిరిగి చూడని అజయ్ ని చూసి విస్తు పోయిన అనిత, తాను కూడా పార్కు నుండి బయలుదేరింది.

                                                               ****************************************

"ఏమిట్రా...అజయ్. వచ్చిన దగ్గర నుండి అదొలా ఉన్నావు" తల్లి సరోజ అడిగింది.

"అదంతా ఏమీ లేదమ్మా..." ఒక్క ముక్కలో సమాధానం చెప్పాడు అజయ్.

కానీ అతని మనసు అగ్నిపర్వతంలా నిప్పులు కక్కుతోంది.

'అమెరికాలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు నాతో ఫోన్లో మాట్లాడింది అనిత...ఒక్కసారి కూడా విషయం గురించి ఎత్తనే లేదు. ఇంత పెద్ద విషయాన్ని పెళ్ళి చేసుకోబోతున్న నాతో చెప్పద్దూ. నాకిష్టమో కాదో తెలుసుకోవద్దూ. నా పర్మిషన్ తీసుకోవద్దూ. ఒక ఆడది ఎందుకు ఇలాంటి ముఖ్యమైన విషయంలో ధైర్యంగా, స్వయంగా నిర్ణయం తీసుకోవాలి. మొగాడైనా తాను పెళ్ళి చేసుకోబోతున్న అమ్మాయి, తనకి తెలియకుండా, తనతో చెప్పకుండా కిడ్నీ దానం చేసిందంటే వూరుకుంటాడా? అమ్మాయిని పెళ్ళిచేసుకుంటాడా?...అనితకు చదువుకున్నాననే అహంకారం చాలా ఉంది. ఇప్పుడు నేను పెళ్ళికి నో అంటే ఏం చేస్తుంది? పెళ్ళికి ముందే స్వయంగా నిర్ణయాలు తీసుకునే అనిత పెళ్ళి తరువాత ఇంకెలా బిహేవ్ చేస్తుందో!..... చెప్పటానికి టైము దొరకలేదని ఎంత సింపుల్ గా చెప్పింది.... ఏం చూసుకుని అంత ధైర్యంగా మాట్లాడింది….అవును అనితను పెళ్ళి చేసుకోవాలా? వద్దా? అనేది నిజంగానే ఆలొచించుకోవలసిన విషయం' అజయ్ మనసులో పెద్ద పోరాటమే జరుగుతోంది.

"ఏరా...నేను అడుగుతూనే ఉన్నాను. నువ్వేమో మౌనంగా కూర్చుని దేని గురించో దీర్ఘంగా ఆలొచిస్తున్నావు" తల్లి సరోజ మళ్ళీ అడిగింది.

"చెబుతానమ్మా! చెప్పకపోతే ఇక నా మనస్సు ముక్కలయేటట్టుంది. అనిత రోజు నాకు ఒక విషయం చెప్పింది... విషయాన్ని తలచుకుంటేనే నాకు...." అజయ్ మాటలలొ కోపం ఎగిసిపడింది.

" రోజు అనిత నీతో ఏం విషయం చెప్పిందో నేను చెప్పనా?" అన్నది అజయ్ తల్లి.

"నీకు తెలుసా?" ఆశ్చర్యంగా అడిగాడు అజయ్.

అనిత తన కిడ్నీని దానం చేసిన దాని గురించే కదా చెప్పింది?"

ఆశ్చర్యానికి పైన మరో ఆశ్చర్యం అజయ్ ను కుదిపేసింది.

"అమ్మా...నీకెలా.......ఎలాగమ్మా! నీకేమైనా దైవ శక్తి ఉన్నదా?" అంటూ నోరు వెళ్లబెట్టాడు.

"దైవ శక్తి మాట అటుంచు...శరీర శక్తే లేదు. రోజు నేను నీ ఎదురుకుండా కూర్చుని మాట్లాడ గలుగుతున్నందుకు కారణం ఎవరో తెలుసా? అనితే... అనిత యొక్క దాన గుణమే కారణం

"అమ్మా...నువ్వేం చెబుతున్నావు!"

అవున్రా ….నువ్వు విదేశాలలో చదువుకునేటప్పుడు నాకు రెండు కిడ్నీలూ పాడైపోయినై. వెంటనే కిడ్నీ మార్పిడి చేస్తే గాని బ్రతకనని చెప్పారు. అంత అర్జెంటుగా కిడ్నీ ఎవరు దానం చేస్తారు?...బ్రతుకు మీద ఆశ వదులుకున్నాను. విషయం నీకు తెలిస్తే నువ్వు భయపడి, చదువును మధ్యలోనే ఆపేసి, తిరిగి వచ్చేస్తావని విషయాన్ని నీకూ, అనితకు తెలియపరచవద్దని మీ నాన్న గారికి చెప్పాను. కానీ విషయాన్ని ఎలాగో తెలుసుకున్న అనిత హాస్పిటల్ కు వచ్చి తనతో ఎందుకు చెప్పలేదని మాతో పోట్లాడి, తన కిడ్నీలలో ఒక కిడ్నీ దానం చేసి నన్ను కాపాడింది. విషయాన్ని నీకు తెలిపితే నీ చదువుకు భంగం కలుగుతుందని అనిత కూడా నీకు విషయం చెప్పలేదురా"

"అవున్రా! నా భర్యనూ, నీ తల్లినీ కాపాడిన దేవతరా అనిత...అనిత నీకు దొరికిన ఒక గుప్త నిధిరా" అప్పుడే వచ్చిన అజయ్ తండ్రి చెప్పాడు.

అన్నీ తెలుసుకున్న అజయ్ అప్పుడు తలవంచుకున్నాడు. తనకు భార్య కాబోతున్న అనిత తన కిడ్నీని ఎవరికో దానం చేసిందని తెలిసినప్పుడు ఏర్పడ్డ కోపం, తాపం తొలగిపోయినై. తన తల్లికే అనిత కిడ్నీ దానం చేసిందని తెలుసుకున్నప్పుడు అతనిలో అనిత మీద ఏర్పడ్డ చిరాకు సూర్యరశ్మికి కరిగిపోయిన మంచుగడ్డలాగా కరిగిపోయింది.

'..ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. అనితను తప్పుగా అర్ధం చేసుకుని, అనిత మీద కోపంతో అమె పిలుస్తున్నా ఏమీ మాట్లాడకుండా వచ్చాశాను? అనిత ఎంత బాధ పడుంటుందో...క్షమించమని అడగాలి' మనసులోనే పశ్చాతాప పడ్డ అజయ్ వెంటనే అనితకు ఫోన్ చేసి పార్కుకు రమ్మన్నాడు.

                                                                ****************************************

మరునాడు అదే పార్కులో.

"హలో అనితా...వచ్చి చాలాసేపైందా?" ఎటొ చూస్తూ, ఏదో ఆలొచిస్తూ కూర్చున్న అనిత భుజం మీద చేయి వేస్తూ అడిగాడు అజయ్.

ఒక్క సారిగా ఉలిక్కిపడ్డ అనిత, అజయ్ వైపు కోపంగా చూస్తూ "నన్ను ముట్టుకోకు" అంటూ అజయ్ చేతిని తోసేసి దూరంగా జరిగి కూర్చుంది.

"ఏం...నేను ముట్టుకోకూడదా? నిన్ను పెళ్ళి చేసుకోబోతున్న నాకు మాత్రం హక్కు లేదా?" నవ్వుతూ శాంతంగా అడిగాడు అజయ్.

"పెళ్ళి చేసుకోబోతున్న వాడే ముట్టుకుని మాట్లాడటానికి అర్హుడని తెలిసి కూడా నువ్వెందుకు నన్ను ముట్టుకుని మాట్లాడుతున్నావు?"

మాటతో కంగు తిన్నఅజయ్ "ఏయ్ అనితా...నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్ధమవుతోందా?" అన్నాడు.

"నాకు బాగా అర్ధమవుతోంది...నీకే అర్ధం కాలేదు. ఇప్పుడు నీకు అర్ధమయ్యేటట్టు చెబుతా విను...నేను నిన్ను పెళ్ళి చేసుకోవట్లేదు

"నో జోక్స్ అనితా"

"జోక్ కాదు...నిజంగానే చెబుతున్నా"

"నీకేమైనా పిచ్చి పట్టిందా?...మనిద్దరం ఆరేళ్ళుగా ప్రేమించుకుంటున్నాము"

"ప్రేమించుకుంటే... "

"అరె...నీకేమైంది అనితా... నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు"

"మాట్లాడేటట్లు చేసింది నువ్వే అజయ్"

"నేనా!?"

"అవును...నిన్న నా కిడ్నీ దానం గురించి చెప్పినప్పుడు నువ్వు మాట్లాడిన తీరు, నేను చెప్పేది పూర్తిగా వినకుండా నాది ఉపొద్ఘాతం అని, ఎదేదో వాగుతున్నాని చెప్పి, నేను పిలుస్తున్నా ఆగకుండా, కనీసం నాతో చెప్పకుండా వెళ్ళిపోయావు"

"అందుకని"

"అందుకనే...నేను నిర్ణయానికి వచ్చాను"

సడన్ గా కిడ్నీ దానం చేశానని చెప్పావు...అప్పుడు ఏం చెప్పాలో తెలియక అలా వెళ్ళిపోయాను...అది ఒక తప్పా?"

"తప్పే"

నువ్వు ఒక ఆడ పిల్లవనే విషయం...అందులోనూ ప్రేమలో పడ్డ ఆడ పిల్లవనే విషయం పూర్తిగా మర్చిపోయి మాట్లడుతున్నావు"

లేదు అజయ్...ఆడపిల్లను కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. జీవితాంతం ఒక మగవాడి తోడుతో బ్రతకాలనే కనీస జ్ఞానం తెలిసిన ఆడ దానిని….అలాగే పరిస్థితులను బట్టి స్వయంగా నిర్ణయం తీసుకునే ధైర్యం కలగిన ఆడపిల్లను.....నీ పర్మిషన్ కోసం నేను రోజు ఆలశ్యం చేసుంటే నేను మనిషి జన్మ ఎత్తినందుకు సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చేది. అది నన్ను జీవితాంతం వేధించేది. కానీ నువ్వు ఇదంతా ఆలొచించకుండా నీ దగ్గర పర్మిషన్ తీసుకోలేదనే ఒక్క కారణంగా నన్ను చీదరించుకుని వెళ్ళిపోయావు…” ఏడుపు గొంతుకు అడ్డుపడుతుంటే మాట్లాడటం ఆపింది అనిత

"నేను అలా బిహేవ్ చేసినందుకు నీకు సారీ చెప్పాలనే వచ్చాను" మనసులోని మాటను బయట పెట్టాడు అజయ్.

"నిన్న అలా మాట్లాడి... రోజు సారీ అడగటానికి వెనుక బలమైన స్వార్ధం ఉన్నదని నాకు తెలుసు"

"స్వార్ధమా..?"

"అవును...నిన్నంతా నువ్వు నీ మనసులో నా గురించి ఏమాలోచించావో నాకు బాగా తెలుసు. మీ ఇంట్లో వాళ్ళు నా గురించి చెప్పిన తరువాత నీ మనసును ఎలా మార్చుకున్నావో తెలుసు. నా కిడ్నీలలో ఒక కిడ్నీని దానం చేయాలని, ఇంకొకరి ప్రాణం కాపాడాలని స్వయంగా నేను తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు జీర్ణించుకోలేకపోయావు. కానీ నిర్ణయం మీ అమ్మగారికోసమే నని తెలిసిన తరువాత అంతవరకు నా మీద నీకు ఏర్పడిన అభిప్రాయాన్ని మార్చుకున్నావు....సారీ చెప్పడానికి వచ్చావు. ఇది కూడా నేను తట్టుకోగలను...కానీ నువ్వు నిన్న అడిగిన ప్రశ్నను నేను తట్టుకోలేను"

" ప్రశ్న?"

"అప్పుడే మర్చిపోయావా?...అదే. ఒక కిడ్నీ లేని నిన్ను నేనేందుకు పెళ్ళిచేసుకోవలి?'

"అది కోపంలో అడిగిన ప్రశ్న....అన్నిటికీ కలిపి నన్ను క్షమించు"

"నిన్ను క్షమించటానికి నేనెవర్ని? జస్ట్ నిన్ను ప్రేమించిన ఒక ఆడపిల్లను...కానీ నువ్వు అడిగిన ప్రశ్న నాకు కరెక్ట్ అనిపించింది. ఒక కిడ్నీ లేని నేను అన్నీ ఉన్న నిన్ను పెళ్ళిచేసుకోవటం న్యాయంకాదని నాకనిపించిందిఅందుకే నిర్ణయానికి వచ్చాను

"క్షమించమని ఆడిగిన తరువాత కూడా నీ నిర్ణయం మార్చుకోవా?"

"మార్చుకోను"

"పొరపాటు చేస్తున్నవ్ అనితా. ఆరేళ్ళుగా ఒకర్ని ప్రేమించావు, ఒక కిడ్నీ లేదు...అలాంటి నిన్ను పెళ్ళిచేసుకోవటానికి ఎవరు ముందుకు వస్తారు?....బాగా ఆలోచించు అనితా"

నిజమే అజయ్...నా మేనమామ సుధీర్ మధ్య ఒక ఆక్సిడెంట్ లో ఒక కాలు పోగొట్టుకున్నాడు. అతనికి నిశ్చయమైన పెళ్ళి ఆగిపోయింది. అతనికి నా గురించి, నేను కిడ్నీని దానంగా ఇచ్చిన దాని గురించి...అంతకంటే మన ప్రేమ గురించి బాగా తెలుసు. అయినా అతను నన్ను పెళ్ళిచేసుకోవటానికి మనస్పూర్తిగా అంగీకరించాడు. నా మేన మామ సుధీర్ ను పెళ్ళిచేసుకోబోతున్నాను. నేనుసుధీర్ కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నాం. ఇది చెప్పడానికే నీకొసం చాలాసేపుగా కాచుకు కూర్చున్నాను...ఇక ఫోన్లు చేసి నన్నుడిస్టర్బ్ చేయకు....వస్తా" అని చెప్పి అక్కడ్నుంచి వేగంగా వెళ్ళిపోయింది.

అజయ్ కి నోట మాట రాలేదు.

పార్కులోని ఒక శిలలా నిశ్చేష్టుడై నిలబడిపోయాడు అజయ్.

*************************************************సమాప్తం*********************************************

ఇవి కూడా చదవండి:

గురుదక్షణ(కథ)

ప్రేమించుకోవచ్చు!(కథ)

*****************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి