21, మార్చి 2021, ఆదివారం

అతడే ఆమె…(కథ)


                                                                                        అతడే ఆమె                                                                                                                                                                                        (కథ) 

"ఏమిటి రోజు మన ఊరి రైల్వే స్టెషన్లో ఇంతమంది పోలీసులున్నారు?...మినిస్టర్ ఎవరైనా వస్తున్నారా?" అక్కడున్న టి.టి. ని అడిగాడు అప్పుడే రైల్వే స్టేషన్లోకి అడుగుపెట్టిన ఒక ప్రయాణీకుడు.

"కాదు...కాదు...మన ఊరికి కొత్తగా నియమించబడ్డ లేడీ కలెక్టర్ రోజు చార్జ్ తీసుకోవటానికి వస్తోంది...ఆమెను రీసీవ్ చేసుకోవటానికి, బందోబస్తుకు వచ్చారు పోలీసులు" చెప్పాడు టి.టి..

అక్కడే పూలమాలతో నిలబడున్న విక్రమ్ "వచ్చేది లేడీ కలెక్టర్ కాదు...నా కలెక్టర్ తమ్ముడు, వాడితో పాటు నా తల్లి సరోజ కూడా వస్తోంది" అని చెప్పాలనుకున్నాడు. కానీ చెప్పలేకపోయాడు.

ఇంతలో రైలు వచ్చి ఆగింది. పోలీసు అధికారులందరూ ఒక్కసారిగా .సి కంపార్ట్ మెంట్ దగ్గర గుమికూడారు.

కంపార్ట్ మెంట్లో నుండి హుందాగా ఒక మహిళ దిగింది. పోలీసులు సెల్యూట్ చేశారు. ఆమె చేతికి తమ దగ్గరున్న పూల మాలలు, పూల గుచ్చాలు అందించారు. మహిళా కలెక్టర్ వెనక్కి తిరిగి కంపార్ట్ మెంట్లో నుండి దిగటానికి కష్టపడుతున్న వయసయిన మరో మహిళను తన చేతి సహాయంతో దింపింది."ఈమె నా తల్లి సరోజ" అందరికీ వినబడేలా చెప్పింది.

అందరూ కలిసి స్టేషన్ బయటకు వస్తుంటే ఎంట్రన్స్ దగ్గర విక్రమ్ నిలబడుండటం చూసిన మహిళా కలెక్టర్ తన తల్లి సరొజతో విక్రమ్ దగ్గరకు వెళ్ళింది. విక్రమ్ తన చేతిలో ఉన్న పూల మాలను కలెక్టర్ తల్లి సరొజ మెడలో వేశాడు....అక్కడ గుమికూడిన వారంతా ఆశ్చర్యపోయారు. ముగ్గురూ కలిసి బయటకు నడిచారు.

"అందరివైపు చూసి వచ్చింది మహిళా కలెక్టర్ కాదు...నా తమ్ముడు" అని అరిచి చెప్పాలని అనుకున్నాడు విక్రమ్. చెప్పలేకపోయాడు. ఎందుకంటే అతనొక్కడికే తెలుసు "అతడే ఆమె" అని.

                                                                 ****************************************

సరోజ గుడికి వెళ్ళి అప్పుడే ఇంటికి తిరిగి వచ్చింది. ఎండాకాలంలో పక్కనున్న గుడికి వెళ్ళిరావటమే ఒక పెద్ద ప్రయాణం. ప్రొద్దున్నే ఇంట్లో వాళ్ళు ఎవరూ లేవకపోవడంతో రాత్రి వేసిన పక్క గుడ్డలను తీయకుండానే గుడికి వెళ్లవలసి వచ్చింది సరోజకు. గుడికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు పక్క గుడ్డలన్నీ చిందరవందరగా అలాగే పడున్నాయి. అంటే ఇంట్లోని మిగిలిన వారు ఇంకా లేవలేదని దానికి అర్ధం కాదు. లేచిన వాళ్ళందరూ వాటిని తీయకుండా, ఇంటిని శుభ్రం చేయకుండా తమ తమ పనుల్లో నిమగ్నులైపోయారు.

సరోజకు ఇదేమీ కొత్త కాదు. రోజూ ప్రొద్దున్నే లేచే సరోజకు, ఎప్పుడూ ఆలశ్యంగా లేచే పిల్లలు లేచిన తరువాత ఎప్పుడూ కనిపించే దృశ్యమే అది. సరోజ తప్ప ఇంట్లోని మిగిలిన అందరూ లేటుగా లేవడం, తమ ఆఫీసులకు వెళ్ళడానికి హడావిడిగా తమ కార్యక్రమాలను ముగించుకోవాలనే తాపత్రయం ఇంట్లో కనబడుతుంది.

అందరూ లేచిన తరువాత సరోజ పక్క బట్టలు తీసి, ఇంటిని శుభ్రం చేస్తుంది. గుడికి వెళ్ళి వచ్చిన రోజు కూడా సరోజ అదే పని చేసింది.

పెద్ద కొడుకు విక్రమ్, అతని భార్య గౌరి, కూతురు రేవతి, అందరి కంటే చిన్నవాడు రవి...నలుగురూ ప్రొద్దున్నే, అందులోనూ ఒకే టైముకు బయలుదేరాలంటే అదేమైనా సాధారణ పనా?

ఆకలిగా ఉండటంతో సరోజ టిఫిన్ పెట్టుకుని, తినడం ముగించుకుని ఇళ్ళు శుభ్రం చేయటం మొదలు పెట్టింది.

వంట పనిని కోడలు గౌరి ఎవరి సహాయం లేకుండానే తానే ముగిస్తుంది. అయితే వంట గది మాత్రం ఏదో యుద్ద భూమిలాగా కనబడుతుంది. వంట గదిని శుభ్రం చేయటానికి పట్టే సమయంలో, ఇంకో కుటుంబానికి వంట పూర్తి చేయవచ్చు. అలాంటి వంట గదిని సరోజ శుభ్రం చేసి, తరువాత హాలును శుభ్రం చేసి చివరగా చిన్న కొడుకు రవి గదికి వచ్చింది.

అన్ని గదుల కంటే గదే మరీ చెత్తగా ఉంటుంది. వాడు మధ్యే మహా బద్దకస్తుడుగా తయారయ్యాడు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. గదిలోనే ఎక్కువసేపు గడుపుతాడు. స్నేహుతలని చెప్పి ఇంతవరకు ఒక్కరినీ ఇంటికి తీసుకు రాలేదు. పది మాటలతో ఒక ప్రశ్న వేస్తే...చిన్నగా తల ఆడించి సమాధానం చెబుతున్నాడు.

కానీ రవి చిన్నప్పటి నుండి అలా ఉండేవాడు కాదు. చిన్నప్పుడు మహా చురుకుగా, ఆనందంగా సిగ్గూ, బిడియం అనేది లేకుండా అందరితో కలిసి మెలసి సంతోషంగా కేరింతలు కొట్టేవాడు. పెద్దవాడు అవుతున్న కొద్దీ అతనిలో ఇన్ని మార్పులు వచ్చాయి...తన చిన్న కొడుకు గురించి ఆలొచిస్తూనే వాడి గదిని శుభ్రం చేయటంలో పూర్తి శ్రద్ద వహించింది. వాడి టేబుల్ శుభ్రం చేసేటప్పుడు అక్కడొక చిన్న పెట్టె ఉండటాన్ని గమనించింది.

చిన్న పెట్టె ఎందుకు పనికొస్తుంది...అందులో ఏం పెట్టాడో? ఏమున్నాయో? చూడాలని పెట్టె తెరిచింది. అందులో లిప్ స్టిక్, కాటుక భరిణ, జడ క్లిప్పులు లాంటి ఆడపిల్లలకు కావలసిన వస్తువులు ఉన్నాయి.

ఎవరికొసం ఇవన్నీ కొని అట్టే పెట్టాడు?...అబ్బో...వీడు ఏమీ తెలియని తెలివి తక్కువ వాడు అనుకున్నానే! ఏమీ తెలియనివాడిలా ఉంటూ...ఇన్ని పనులు చేస్తున్నాడా!" ఆశ్చర్యపడింది సరోజ. "ఏమీ తెలియని వాళ్ళలా ఉండే వాళ్లే ఇలాంటి పనులు చేశ్తారు. రానీ... విషయం గురించి వాడ్ని అడుగుదాం " అనుకుంటూ పెట్టెను కూడా తుడిచి శుభ్ర పరిచి ఒక పక్కగా పెట్టింది సరోజ.

                                                                 ****************************************

సాయంత్రం ఏడు గంటలు ఎప్పుడు అవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తోంది సరోజ. ఎందుకంటే సమయానికే రవి ఇంటికి వస్తాడు.

"రవి రానీ... రోజు విషయాన్ని తేల్చేయాలి. ఏదైనా గొడవలు తీసుకు వస్తే ఇంకేమైనా ఉందా...ఇంతవరకు ఆడపిల్లతోనూ రవి మాట్లాడటం నేను చూడలేదు...అమాయకుడిలా ఉంటూ ఇంత తతంగం నడిపిస్తాడా... అన్నయ్యా, వదిన, అక్కలకు విషయం తెలిస్తే వాడ్ని వదిలిపెడతారా? వాల్లందరికంటే ముందు మనమే విషయం తేల్చుకుని, అమ్మాయి ఎవరో తెలుసుకుని...ప్రేమ, దోమ మనకు పడదని, మన ఇంటా వంటా లేదని, అమ్మాయిని మర్చిపోవాలని చెప్పాలి" తనలో తానే నిర్ణయం తీసుకుంది సరోజ.

ఇంటి గేటు బయట నిలబడి రవి కోసం ఎదురు చూస్తున్న సరోజకు వీది చివర రవి తల కనబడింది. వెంటనే గబ గబ రవి రూముకు వెళ్ళి, పెట్టెను చేతిలోకి తీసుకుని వాడి రూములోనే కూర్చుంది.

రవి కాళ్ళు, చేతులు కడుక్కుని తన రూముకు వచ్చాడు. తల్లి అక్కడ ఉండటం వాడ్ని ఆశ్చర్యానికి గురిచేసింది.

"ఏంటమ్మా..." మెల్లగా అడిగాడు.

"నువ్వు నా దగ్గర దాచేస్తే, నేను కనుక్కోలేనా...ఎవర్రా అమ్మాయి? ఎవరికోసం ఇవన్నీ కొని ఉంచావు?" అంటూ చేతిలోని పెట్టేను తెరిచి చూపిస్తూ అడిగింది.

తల్లి చేతిలో ఉన్న పెట్టెను చూసిన రవికి నోటమాట రాలేదు. ముఖం వాడిపోయింది. కొంతసేపు మౌనంగా ఉన్నాడు. తరువాత మెల్లగా గొంతు విప్పాడు.

" అమ్మాయికీ కాదమ్మా" చెప్పాడు రవి.

"అబద్దం చెప్పకు రవి...నిజం చెప్పు" రవిని కోపంగా చూస్తూ గట్టిగా అడిగింది సరోజ.

"నిజమేనమ్మా...ఇవి అమ్మాయికొసమో కొనలేదు. ఇవన్నీ నా కోసమే కొని అట్టేపెట్టాను"

రవి చెప్పింది ఆమెకు అర్ధంకాలేదు. వాడినే చూస్తూ నిలబడింది.

"అమ్మా... చాలా రోజులుగా నీ దగ్గర చెప్పాలనుకున్న విషయం ఇదేనమ్మా...నాకు ధైర్యం చాల లేదు. సందర్భం వదిలితే ఇంకో సందర్భం దొరకదు. కాబట్టి అన్ని విషయాలూ నీతో చెప్పేస్తానమ్మా...నన్ను అర్ధం చేసుకో....అర్ధం చేసుకుంటావుగా...?" రవి కళ్ళలో నీళ్ళు తొంగి చూడటం మొదలయ్యింది.

అప్పటికీ అర్ధం కాని సరొజ కొడుకునే కళ్ళార్పకుండా చూస్తోంది.

"ఏమిట్రా నాన్నా...ఏమిటేమిటో మాట్లాడుతున్నావు. నీ మనసులో ఏముంది? అమ్మ ఉందిగా...ధైర్యంగా చెప్పరా!" అభయం ఇచ్చింది సరోజ.

" అమ్మా...నా పరిస్థితిని నీకు ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. ఆలొచనలన్నీ నాకు మధ్యే రావడం మొదలయ్యింది. అందువలనే ఎవరికీ చెప్పకుండా నాలోనే దాచుకున్నాను"

"నా మనసులో నన్ను నేను ఒక మగవాడిగా అనుకోవటం లేదు. ఒక అమ్మాయిలాగా జీవించాలని ఇష్టంగా ఉంది. పువ్వులు పెట్టుకోవాలని...చీర కట్టుకోవాలని...ఇలా ఆడపిల్లలు చెయ్యాలనుకునే పనులను చేయాలని అనిపిస్తోంది"

"నా మనసులో వస్తున్న ఆలొచనలను చంపుకోవలని జరుగుతున్న యుద్దంలో నేను ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతున్నాను. నా ఆలొచనలకు సమాజం నాకు ఏం పేరు పెడుతుందో నాకు తెలుసమ్మా!...అయినా కాని నన్ను నేను మార్చుకోలేకపోతున్నాను" గొంతు తడి ఆరిపోవడంతో రవి చిన్నగా ఏడవడం మొదలు పెట్టాడు.

ఎవరో తల మీద పిడుగు పడేసినట్లు అనిపించింది సరోజకు.

"భగవంతుడా...నా బిడ్డను ఎందుకు గాయపరుస్తున్నావు" గట్టిగా ఏడవాలనిపించింది సరోజకు.

రవి ఇంత బాధ పడటం తల్లి ఇంతవరకు చూడలేదు. వాడితో పాటూ తాను కూడా కాసేపు ఏడ్చింది. తరువాత ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి మౌనంగా లేచి వెళ్ళిపోయింది. రవి కూడా తల్లిని ఏమీ అడగలేదు.

సాయంత్రం ఒకరి తరువాత ఒకరు పనుల నుంచి రావడం మొదలుపెట్టి... ఇళ్ళే కోలాహళంగా మారింది. సరోజకు మాత్రం మనసులో పెద్ద పోరటమే జరుగుతోంది.

రెండు రోజులు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నది సరోజ. మూడో రోజు పెద్ద కొడుకు ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే వాడ్ని వేరుగా తీసుకు వెళ్ళి తమ్ముడి విషయం చెప్పింది.

విషయాన్ని విన్న వెంటనే పెద్దపెద్ద అరుపులతో గోల గోల చేశాడు పెద్ద కొడుకు. అరుపులకు అప్పుడే లోపలకు వచ్చిన కోడలు విషయాన్ని తెలుసుకుంది. "అయ్యో...ఇదేం కర్మ? మా కుటుంబం చాలా గౌరవమైనది... విషయం వాళ్ళకు తెలిస్తే...వాళ్ళు ముఖం మీద ఉమ్మేశ్తారు! ఏమిటండి...మీ తమ్ముడు ఇలా..ఛీ...ఛీ" భర్తతో చెప్పింది.

మాటలు విన్న రవికి చచ్చిపోదామనిపించింది.

"అవును...నాకు కూడా తేళ్ళు, జర్రులు పాకుతున్నట్లు ఉంది. నాకు పోయి ఇలాంటి తమ్ముడు! చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిస్తే...మనల్ని కాలనీ నుండే వెలి వేశ్తారు. చూడమ్మా నీ చిన్న కొడుకు దగ్గర చెప్పు...మామూలుగా ఉంటే వాడు మనింట్లో ఉండవచ్చు. అలా కాకుండా వెకిలి చేష్టలు చేస్తే బయటకు వెళ్ళిపొమ్మను...ఇలాంటి వాళ్ళందరికీ ఒక సంఘం ఉంది, చోటు ఉంది...అక్కడికి వెళ్ళి ఉండమను. వీడు మౌనంగా, ఎప్పుడూ రూములోనే ఉంటూ ఒంటరిగా గడుపుతున్నప్పుడే అనుకున్నాను...వీడు మన మీద ఏదో ఆటంబాంబు విసిరేట్లు ఉన్నాడని...అనుకున్న దానికంటే పెద్ద బాంబే వేశాడు" పెద్ద కొడుకు తన వొంతుకు కఠినంగా మాట్లాడి రవిని మరింత గాయపరిచాడు.

సరోజ తన కళ్ళల్లోంచి ధారగా కారుతున్న కన్నీటిని తుడుచుకుంది. గొంతు సవరించు కుంది.

"విక్రమ్...ఇప్పుడేం జరిగిందని అంత కోపంగా మాట్లాడుతున్నావు? నీ తమ్ముడు ఏమీ దొంగతనం చేయలేదు, హత్య చేయ లేదు...అది వాడు చేసిన తప్పు కాదు. వాడికి తెలియకుండానే వాడి శరీరంలో ఏర్పడ్డ మార్పులు"

"నీ ఎడమ చేతి వాటం, నీ భార్య మెల్ల కన్ను చూపు...అలాంటిదే ఇది కూడా ..... విషయాల కోసం మిమ్మల్ని వేరుగా చూశామా? వేరుగా ఉంచామా?...ఇలా ప్రతి ఒక్కరూ అనుకోవటం వలనే రవిలాంటి వారికి సమాజంలో గుర్తింపు లేకుండా పోయింది"

"నిన్ను నువ్వు మార్చుకోరా! నేను బాగా ఆలొచించే మాట్లాడుతున్నాను. వాడు ఇష్టం వచ్చినట్లు వాడ్ని ఉండని...కాదూ, కూడదు నాకు అవమానంగా ఉంటుంది అనుకుంటే...మేమిద్దరం వేరే ఇళ్ళు తీసుకుని వేరుగా వెళ్ళిపోతాం. కారణం చేత వాడ్ని ఒకడ్ని వేరుగా పంపించను. అలా గనక చేస్తే, వాడొక్కడే వెడితే వాడి గతి ఎలా ఉంటుందో నీకు తెలుసు...వాడ్ని లోకం చిన్నాబిన్నం చేస్తుంది...అర్ధం చేసుకోరా"

తల్లి మాట్లాడింది విన్న రవి పరిగెత్తుకొచ్చి తల్లి కాళ్ళను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు.

*********************************************************************సమాప్తం***********************************************************

ఇవి కూడా చూడండి:

కన్న రుణం(కథ)

వసంతా టీచర్(కథ)

***************************************************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి