1, మార్చి 2021, సోమవారం

ఆమే వస్తానంది...!(కథ)

 

                                                                            ఆమే వస్తానంది !                                                                                                                                                                                       (కథ)

వీధి చివర నిలబడి ఎవరికోసమో ఎదురుచూస్తోంది కమల. ఆమె మొహంలో ఏదో అదుర్ధా కనబడుతోంది. పక్కింటి భాస్కర్ రావడం చూసి తల దించుకుంది. భాస్కర్ ఆమెను దాటి వెడుతుంటే "ఒక్క నిమిషం" భాస్కర్ కి మాత్రమే వినబడేంత నెమ్మదిగా పలికింది. అప్పటికి కమలను దాటి రెండడుగుల దూరం వెళ్ళిన భాస్కర్ వెనక్కి తిరిగి కమలను చూసి "నన్నా" అన్నట్లు సైగచేసి అడిగేడు.`

"అవును" అన్నట్లు తలూపింది కమల.రెండడుగులు వెనక్కి వచ్చి కమల ముందు నిలబడ్డాడు భాస్కర్.

రోడ్డుకు ఇరువైపులా ఒకసారిచూసి, దగ్గరగా మరింకెవరూ లేరని నిర్ధారించుకునిఎవరూ లేనప్పుడు మీ ఇంటికొచ్చి, మీతో కొంచం మాట్లాడాలి. ఎవరూ లేనప్పుడు సైగ చేయండి...వస్తానుఅని మెల్లిగా భాస్కర్ కు చెప్పి గబుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది కమల.

అనుకోని సంఘటనకు బిత్తరపోయిన భాస్కర్ తేరుకుని "ఎస్...నా ప్రయత్నం వృధా కాలేదు. లేడి నా వలలో చిక్కింది. వారం రోజుల కల. రోజు నిజమవబోతోంది. అయితే కమల ఇంత త్వరగా చిక్కుతుంది అనుకోలేదు. ఏది ఏమైనా నువ్వు గ్రేట్ రా భాస్కర్" తనని తానే ప్రశంసించుకున్నాడు భాస్కర్.

"ఇప్పుడేం చేయాలి...ఎలా చేయాలి" అన్న ఆలొచనలతో మెల్లిగా ముందుకు నడుస్తున్న భాస్కర్ కు ఏదో ఐడియా తట్టింది. "ఎస్...ఇదే కరెక్ట్" అనుకుంటూ జేబులోనుండి సెల్ ఫోన్ తీసుకుని ఏవో నెంబర్లు నొక్కి చెవి దగ్గర పెట్టుకున్నాడు.

"హలో భాస్కర్...ఏమిటి ప్రొద్దున్నే ఫోన్ చేసేవు" ఫోన్లో అవతలి కంఠం.

భాస్కర్ రాని దగ్గును తెప్పించుకుంటూ "ఒంట్లో బాగుండలేదు సార్...రాత్రి నుండి దగ్గూ, ఒళ్ళు నొప్పులూ, జ్వరం... రోజు ఆఫీసుకు రాలేను. సెలవు కావాలి సార్" చెప్పేడు.

".కే....కే...డాక్టర్ దగ్గరకు వెళ్ళు. అంతేగానీ నీకిష్టమొచ్చిన మాత్రలు వేసుకోకు...ఆరోగ్యం జాగ్రత్త"

"అలాగే సార్...ధాంక్యూ సార్" అని చెప్పేసి సెల్ ఫోన్ ఆఫ్ చేసి జేబులో పెట్టుకుని "అమ్మయ్య ఒక ప్లాన్ సక్సస్ అయ్యింది. మరి రెండో ప్లాన్. దీన్ని ఎలా సక్సెస్ చేయాలి" అనుకుంటూ, ఏదో ఆలొచిస్తూ మళ్ళీ ముందుకు నడవసాగేడు. వీధి చివరున్న కిళ్ళీకొట్టు దగ్గరకు వెళ్ళేడు. జేబులోంచి వందరూపాయల నోటును కొట్టు వాడికి అందిస్తూ "సిగిరెట్టు పెట్టె ఇవ్వు" అన్నాడు.

"ఏంటి సార్...రోజూ ఒక సిగిరెట్టు మాత్రమే కొనుక్కుని తాగేవారు, ఈరోజు పెట్టె కొంటున్నారు. సిగిరెట్లు ఎక్కువ తాగకండి సార్. ఆరొగ్యం దెబ్బతింటుంది" భాస్కర్ అందించిన వంద రూపాయల నోటు తీసుకుని సిగిరెట్టు పెట్టెను భాస్కర్ కు అందిస్తూ ఆరొగ్యసూత్రాలు చెప్పేడు కొట్టతను.

"ఏం లేదు...అలాంటిదేం లేదు. ఊరు వెళ్ళాలి. అక్కడ బ్రాండు దొరకదు...అందుకని" అంటూ సిగిరెట్టు పెట్టె అందుకుని, అందులోంచి ఒక సిగిరెట్టు తీసి అంటించుకుని ఆలొచించసాగేడు. అతని మెదడులో ఏదో తట్టినట్టుంది. గబగబా అడుగులు వేసుకుంటూ, వేగంగా నడుస్తూ ఇంటికి వెళ్ళేడు. గేటును స్పీడుగా తోసుకుని ఇంట్లోకి వెళ్ళిన భాస్కర్ కు భార్య వంటింట్లో ఉందన్న విషయం గ్రహించి అక్కడికి వెళ్ళేడు.

"స్వాతీ...మీ అమ్మ మళ్ళీ ఫోన్ చేసిందన్నావ్. నిన్ను చూడాలనుందని చెప్పిందన్నావు. మీ అమ్మను చూడాలని నువ్వూ అంటూ ఉంటావు కదా... రోజు వెళ్ళిరా" అన్నడు భాస్కర్. సింకులో ఉన్న సామాన్లను తోముతున్న స్వాతి భర్త మాటలకు ఒకసారి వెనక్కి తిరిగి చూసింది.

"నేను ఎలాగూ రోజు భోజనానికి రాను. రోజు మా మేనేజర్ తో బయటకు వెళుతున్నాను. సాయంత్రం రావడం కూడా ఆలస్యం అవచ్చు. ఒక్క దానివే ఏముంటావ్...నువ్వు త్వరగా రెడీ అయిపో...నేను ఆటోస్టాండ్ దాకా వచ్చి, ఆటో డ్రైవర్ కి నువ్వు ఎక్కడ దిగాలో చెబుతాను" స్వాతి సమాధానానికి తావివ్వకుండా మాట్లాడేడు.

"అది కాదండి... నేనొస్తున్నట్లు అమ్మకి చెప్పలేదే...తీరా నే వెళ్ళిన తరువాత ఆవిడ లేకపోతే" ప్రశ్నార్ధకంగా అడిగింది స్వాతి తన సహజ ధోరణిలో.

"ఆవిడకి ఇల్లూ, లేకపోతే ఇల్లూ తప్ప ఇంకేమున్నాయి. నువ్వొస్తున్నావని ఇప్పుడే ఆవిడకు ఫోన్ చేసి చెప్తాను. నువు రెడీ అవ్వు" అని భార్యకు చెప్పి హాలులోకి వచ్చి జేబులో ఉన్న సెల్ ఫోన్ తీసుకుని అత్తగారికి ఫోన్ చేసి స్వాతి వస్తున్న సంగతి చెప్పేడు.

హాలులో ఉన్న సోఫాలో కూర్చున్నాడు భాస్కర్. ఎదురుగా ఉన్న టీపాయ్ మీద రోజు పేపర్ కనబడుతోంది. తీసి చదవాలన్న కోరిక పుట్టలేదు. మళ్ళీ ఇంకో సిగిరెట్టు ముట్టించి ఆలొచనలో పడ్డాడు.

"కమల వస్తానంది...ఇంట్లో ఎవరూ లేకుండా చూసుకోమంది. ఎవరూ లేనప్పుడు సైగ చేయమంది. అంటే బాల్కనీలోనే ఉంటుందన్నమాట. ఒక వేళ రాకపోతే...నో...నో...నో నెగటివ్ ధాట్స్"

"ఏమండీ నేను రెడీ...అవును మీరు రెడీ అవలేదేమిటి" భార్య స్వాతి మాటలతో ఆలొచనల్లో నుండి బయటపడ్డాడు.

"నేను రావడం లేదు...నువ్వు ఒక్కదానివే వెళుతున్నావ్. ఇందాకే చెప్పేను కదా ఆటోస్టాండుకు వచ్చి, ఆటో డ్రైవర్ కి నువ్వు ఎక్కడ దిగుతావో చెప్తాను అని. అప్పుడే మర్చిపోయేవా"

"సరిగ్గా వినలేదు లెండి. ఎప్పుడూ నన్ను దింపి, మీరు అట్నుంచి ఆఫీసుకు వెడతారు కదా. అందుకని అడిగేను"

నేనూ వచ్చేట్లయితే...ఆటో మాటెందుకొస్తుందే...బండిలోనేగా వెడతాం. ఇంత తెలివితక్కువదాన్ని ఎక్కడా చూడలేదు"

తెలివితక్కువదాన్నేం కాదు. మీరూ రావచ్చు కదా అని, ఎందుకు రావట్లేదని అర్ధం"

లేదు...లేదు. అలా చేస్తే ఆఫీసుకు ఆలస్యం అవుతుంది. మేనేజర్ కేకలేస్తాడు. మామూలు రోజులైతే పర్వాలేదు. రోజు బయటకు వెళ్ళాలి"

అయితే కాసేపాగండి. మీకు టిఫిన్ రెడీ చేసి...అప్పుడు వెడతా"

"అక్కర్లేదు. రోజు బయట తింటా. నువ్వు బయలుదేరు" చొక్కా బటన్స్ వేసుకుంటూ ఇంటి తాళాలు తీసుకున్నాడు.

"ఏమిటి రోజు అదోలా మాట్లాడుతున్నారు. ఆఫీసులో ఏదైనా ప్రాబ్లమా?"

"అలాంటిదేమీ లేదు గానీ...నువ్వు బయలుదేరు. నిన్ను ఆటో ఎక్కించి, నేను ఇంటికొచ్చి రెడీ అయి వెళ్ళాలి" స్వాతి మరింకేమీ మాట్లాడలేదు.

భార్యను తీసుకుని, పక్క వీధిలో ఉన్న ఆటోస్టాండ్ కు వెళ్ళి భార్యను ఆటో ఎక్కించేడు. ఆటో బయలుదేరింది. "హమ్మయ్య" అనుకుంటూ వెనక్కి తిరిగేడు భాస్కర్.

గబగబా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళేడు భాస్కర్. గేటు తీస్తూ ఒక్కసారి బాల్కనీ వైపు చూసేడు. కమల బాల్కనీలో లేదు.

"అప్పుడే ఎందుకుంటుంది. రెడీ అవాలి. నాలాగా తన ఇంట్లో వాళ్ళకి ఏవో కబుర్లు చెప్పాలి. టైమ్ పడుతుంది. లోపు మనం రెడీ అవచ్చు" అనుకుంటూ ఇంటితాళం తీసి, ఫ్యాను వేసుకుని, టీపాయ్ మీదున్న ఖాలీ గ్లాసుతీసుకుని వంటింట్లోకి వెళ్ళి దాన్ని సింకులో పడేసి, ఫ్రిజ్ తెరుచుకుని చల్లటి మంచినీళ్ళ బాటిల్ తీసుకుని హాలులోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు.

బాటిల్ మూత తీసి చల్లటినీళ్ళను సగం తాగి, బాటిల్ ను టీపాయ్ మీద పెట్టి, సోఫాలో వెనక్కి వాలి రిలాక్స్ గా ఫీలవుతూ కళ్ళు మూసుకున్నాడు. పాతజ్ఞాపకాలు అతని కళ్ళముందుకు వచ్చినై.

పదిరోజుల ముందు, ఒకరోజు ఒక చేత్తో సిగిరెట్టు ఉంచుకుని, మరో చేతిలో ఒక పాతగుడ్డ పట్టుకుని తన మోటర్ సైకిల్ ను తుడుస్తూ "ఏమే...కాఫీ అడిగేను...ఇంకా తేలేదేం" అని భార్య స్వాతికి వినబడేట్లుగా అంటూ ఉండగా స్వాతి కాఫీగ్లాసుతో వచ్చింది.

భర్తకు కాఫీగ్లాసు అందిస్తూ "త్వరగా తాగండి...బండి తుడుస్తూ మర్చిపోయి, చల్లారిపోయింది మళ్ళీ వేడిచేసివ్వు అనకండి" భాస్కర్ తో చెప్పింది.

"సరే" అంటూ, నిలబడి కాఫీ తాగుతూ అనుకోకుండా పక్కింటి వైపు తిరిగేడు. పక్కింటి బాల్కనీలో అందమైన అమ్మాయి. కళ్ళు జిగేలుమన్నాయి. "ఇంతకు ముందు అమ్మాయిని చూడలేదు. కొత్తగా అద్దెకు దిగేరనుకుంటా" అనుకుంటూ కళ్ళార్పకుండా అటే చూస్తూండిపోయేడు భాస్కర్.

"కాఫీ గ్లాసిస్తారా" అన్న భార్య మాటలకు ఉలిక్కిపడి, ఖాలీ గ్లాసును భార్యకు అందిస్తూ "స్వాతీ...పక్కింటికి ఎవరైనా అద్దెకు వచ్చేరా" అని అడిగేడు.

"మీకు తెలియదా...వచ్చేరు...వారం రోజులయ్యింది వచ్చి. తల్లి, తండ్రి, కూతురు. ముగ్గురే. పాపం అమ్మాయిదే విషాదం. సంవత్సరం క్రిందట పెళ్ళి అయిందట. 6 నెలల క్రితం భర్త యాక్సిడెంట్లో చనిపోయేడట. భగవంతుడెంత క్రూరుడో చూడండి. వయస్సులో అమ్మాయిని విధవరాలు చెయ్యడం... తల్లిదండ్రులను క్షోభపెట్టడం

"అబ్బో...అప్పుడే అన్ని విషయాలూ తెలుసుకున్నావే"

"వారం రోజులయ్యింది కదండి" అంటూ ఖాలీ గ్లాసుతో లోపలకు వెళ్ళింది స్వాతి.

భార్య లోపలకు వెళ్ళడం చూసి మరోసారి పక్కింటి బాల్కనీవైపు చూసేడు భాస్కర్. అమాయి అక్కడే నిలబడుంది. "ఎంత అందంగా ఉందో...చేసుకున్నవాడు దురదృష్టవంతుడు. ఆనందంగా గడపాల్సిన ఏళ్ళ జీవితానికి దూరమయ్యేడు" అనుకుంటూ అటే చూస్తున్న భాస్కర్ కు అమ్మాయి లోపలకు వెళ్ళడం కనిపించింది.

మరుసటిరోజు ప్రొద్దున నిద్రలేచిన దగ్గర నుండి కమల రూపమే భాస్కర్ మదిలో మెదులుతోంది. బయటకు వచ్చి పక్కింటి మేడవైపు చూసేడు.

బాల్కనీలో కమల పేపర్ చదువుతూ కూర్చోనుంది. ఎలాగైనా కమల తన వైపు చూసేటట్లు చేయాలనుకున్నాడు. ఎక్సర్ సైజ్ చేస్తున్నట్లు చేతులు ఊపుతూ కమలకు సైగలు చేసేడు. కమల బాల్కనీలో నుండి లోపలికి వెళ్ళిపోయింది.

మరుసటిరోజు కూడా అలాగే చేసేడు. కానీ కమల తనవైపు చూసినట్లు, చూస్తున్నట్లు అనిపించలేదు. మోటర్ సైకిల్ స్టార్ట్ చేసి, ఆక్సిలేటర్ రైజ్ చేసి, ఇంజెన్ శబ్ధం పెంచేడు.

కమల లోపలకు వెళ్ళిపోయింది. భాస్కర్ మాత్రం వరండాలో అటూ ఇటూ తిరుగుతూ కమల మళ్ళీ బాల్కనీలోకి వస్తుందేమోనని ఆశపడ్డాడు.

చేతిలో ఒక సంచీతో ఇంట్లో నుండి బయటకు వచ్చిన కమల, రోడ్డుపై నడవడం మొదలు పెట్టింది. ఇది చూసిన భాస్కర్ వెంటనే బైక్ తీసుకుని కమల వెళ్ళినవైపు వెళ్ళేడు.

కమల కనబడగానే ఆమె ముందుకు వెళ్ళి బైక్ ఆపి జేబులో నుండి సెల్ ఫోన్ తీసి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు నటించేడు. కమల, భాస్కర్ ను పట్టించుకున్నట్లు భాస్కర్ కు అనిపించలేదు.

మరుసటి రోజు "ఎలాగైనా అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి" అనుకుంటూ బైకు తీసుకుని కమలను వెంబడించేడు.

కమల ముందు నుంచి వెళ్ళడం, కమలకు కనబడేటట్టు సెల్ ఫోన్ను చెవికీ, భుజానికీ మధ్య పెట్టుకుని స్టైలుగా బండి నడుపుతూ, ఆమె ముందుకు వచ్చి, ఆమెకు కనబడేటట్లు యూటర్న్ చేసి వెళ్ళడం లాంటి ఎన్నో బైక్ విన్యాసాలను చేసేడు. ఒకసారి మాత్రం ఆమెకు కనబడేటట్లు చేతులు వదిలేసి బండి నడుపుతూ, ఆమె దగ్గరకు వెళ్ళి యూటర్న్ చేసేడు. కమల ఒక్క నిమిషం అతనివైపు చూసి తల దించుకుంది.

టీపాయ్ మీద పెట్టిన సెల్ ఫోన్ మోగడంతో ఆలొచనల నుండి బయటకు వచ్చేడు. సెల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడి, టైము చూసుకున్నాడు.

"అయ్యో, టైమవుతోంది" అనుకుంటూ టవల్ తీసుకుని స్నానాకి వెళ్ళేడు.

స్నానం అదీ పూర్తి చేసుకుని ఫ్రెష్ అయి వచ్చిన భాస్కర్ ఒకసారి వరండాలోకి వెళ్ళి చూసేడు. కమల కనబడలేదు. "బహుశ తాను ఇక్కడకి రావడానికి రెడీ అవుతూ ఉండొచ్చు" అనుకుని లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. అతని బుర్రలో మళ్ళీ ఆలొచనలు.

"నా ప్రయత్నం వృధా కాలేదు. చేతిమీదే ఫలితం...ఇదిగో ఇలాగ ఎవరూ లేనప్పుడు మీతో కొంచం మాట్లాడాలి...అయాం సో లక్కీ...పాపం చాలా చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. ఆమెకూ యుక్త వయసు ఆశలుంటాయి కదా... నన్నూ నా భర్యనూ అన్యోన్యంగా ఉండటం చూసి, ఇలా లేకపోయేనే అని అనుకోనుంటుంది. నేనూ నా భార్య కలిసి గుడికి వెళ్ళటం, నేను భార్యకు పూవులు కొనుకెళ్ళడం లాంటివి చూసుంటుంది. కోరికల తపనతో విలవిలలాడిపోయుంటుంది"

టైమైపోతోంది అన్న ఆలొచన రాగానే లేచి వరండాలోకి వెళ్ళి పక్కింటి మేడవైపు చూసేడు. బాల్కనీలో కమల నిలబడి తనింటివైపే చూస్తోంది.

"ఇంట్లో ఎవరూ లేరు...నేను మాత్రమే ఉన్నాను. నువ్వు రావచ్చు" సైగలతో కమలకు చెప్పేడు.

కమల లోపలకు వెళ్ళిపోయింది.

అక్కడే నిలబడి కమల ఇంటివైపే చూస్తున్న భాస్కర్ కి ఇంటిగేటు తెరుచుకుని, కమల రావడం, అదీనూ తన ఇంటివైపు రావడం చూసి భాస్కర్ గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయేడు.

సోఫాలో కాలుమీద కాలు వేసుకుని పేపర్ చదువుతున్నట్టు నటించేడు. కమల తిన్నగా హాలులోకి రావడం చూసి పేపర్ పక్కన పెడుతూ "రండి...మీకొసమే ఎదురుచూస్తున్నాను" అన్నాడు భాస్కర్.

కమల ఇంట్లోపలికి అటూ, ఇటూ చూసింది.

"ఎవరూ లేరు...నా భార్యను వాళ్ళ అమ్మా వాళ్ళింటికి పంపించేను. మీరు ఫ్రీగా ఉండొచ్చు...రండి...అలా కూర్చోండి" అన్నాడు.

"వద్దు...నేను ఇక్కడే నిలబడతాను" కమల గోడనానుకుని నిలబడింది.

"మీకు హాలులో ఇబ్బందిగా ఉంటే...రండి బెడ్రూములోకి వెళ్ళి మాట్లాడదాం" అంటూ సోఫాలో నుండి లేచి కమల వైపుకు రాబోయేడు భాస్కర్.

"అక్కర్లేదు...నేను మాట్లాడవలసింది ఇక్కడ నుండే మాట్లాడతాను. మీరు సోఫాలోనే కూర్చోండి" అన్నది కమల కొంచం అనునయిస్తూ.

షాక్ తిన్నవాడిలా మారిపోయిన ముఖంతో "సరే...మీ ఇష్టం" అంటూ వెనక్కు వెళ్ళి సోఫాలో కూర్చుని "చెప్పండి" అన్నాడు భాస్కర్.

"రెండు రోజుల నుండి మిమ్మల్ని బజారు వీధిలో చూస్తున్నాను. సెల్ ఫోన్ మాట్లాడుతూ వేగంగా బైకు తోలుకుంటూ వెడుతున్నారు. హెల్మెట్ కూడా వేసుకోలేదు. అటూ, ఇటూ ఎవరొస్తున్నారా అని చూడకుండా సడన్ గా బండి తిప్పేరు"

నా భర్త కూడా మీలాగే హెల్మెట్ వేసుకోకుండా. సెల్ ఫోన్ మాట్లాడుతూ బైకు నడుపుకుంటూ వెళ్ళ్తున్నప్పుడే యాక్సిడెంట్ జరిగింది. ఆయన అక్కడిక్కడే చనిపోయేరు. ఇదిగో నేను ఇలా అయిపోయి పుట్టింటికి వచ్చేసేను" అంటూ కళ్ళు తుడుచుకుంది.

"నా భర్తకు జరిగినట్లు మీకు జరగకూడదు. నాకు పట్టిన గతి మీ భార్యకు పట్టకూడదు. భర్తలేని ఆడపిల్ల ఎన్ని కష్టాలకు గురౌతుందో నాకు మాత్రమే తెలుసు. ఇంక మీదట బైకులో వెళ్తున్నప్పుడు హెల్మెట్ వేసుకోండి. సెల్ ఫోన్ మాట్లాడుతూ బండి నడపకండి. చావును కోరి తెచ్చుకుని మిమ్మల్ని నమ్ముకున్నవారికి అన్యాయం చేయకండి"

మరోసారి కళ్ళు తుడుచుకుంటూ "ఇది చెప్పాలనే నేను వచ్చేను. అందరి ముందూ మాట్లాడినా నష్టం నాకే. మీ భార్య ముందు మాట్లాడితే మీ గురించి తప్పుగా అనుకుంటుంది"

"అందుకే ఎవరూ లేని సమయంలో మీకొక్కరికే విషయం చెప్పాలని సాహసం చేసి వచ్చేను" అని చెప్పేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది కమల.

భాస్కర్ ఎక్కడలేని సిగ్గుతో తలవంచుకున్నాడు.

***************************************************సమాప్తం*********************************************

ఇవి కూడా చదవండి:

ఆనంద నిలయం(కథ)

జెంటిల్ మ్యాన్(కథ)

********************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి