12, జులై 2019, శుక్రవారం

చీటింగ్ పోలీస్(నవల)…..PART-2


                                 చీటింగ్ పోలీస్(నవల)…..PART-2

డి.జి.పి సురేందర్ ఆదేశానికి అనుగునంగా ఐదుగురు పోలీస్ అధికారులు ప్రొద్దున ఆరుగంటలకల్లా ఆయన రూములో హాజారై ఉన్నారు.

ఆయన టేబుల్ ఎదురుగా కుడి చేతివైపున్న రెండు కుర్చీలలో ఇన్స్ పెక్టర్ గణపతి మరియు ఇన్స్ పెక్టర్ అర్జున్. వీళ్ళిద్దరూ డి.జి.పి కి కుడి భుజాలని చెప్పొచ్చు. పోలీసు అధికారులు తీసుకునే లంచాలు, రాజకీయ నాయకులు-గూండాలు చేయబోతున్న పనులు డి.జి.పి చెవికి తీసుకు వెళ్ళటమే వీరిద్దరి ముఖ్య పని.

మధ్యలో అసిస్టంట్ కమీషనర్ రత్న కుమార్. చాలా మంది రౌడీలకు బుల్లెట్లను బహుమతిగా ఇచ్చిన దానకర్ణుడు. అవును...ఎన్ కౌంటర్ స్పేషలిస్ట్. నేరస్తులంటే అసలు గిట్టదు. ఈ స్పేషల్ పోలీస్ టీమ్ లో డి.జి.పి తరువాత అధికార పూర్వమైన ఆదేశాలు ఇస్తూ, నిర్ణయాలు తీసుకునే పవర్ కలిగిన ఆఫీసర్.

ఎడం పక్కన ఉన్న మొదటి కుర్చీలో కూర్చున్న సబ్ ఇన్స్ పెక్టర్ మూర్తి, నగరంలో జరిగే ముఖ్య బహిరంగ శభలు, రోడ్డు రోకోలు లాంటి పోరాటాలను మేనేజ్ చేయటంలో స్పేషలిస్ట్.

ఎడం పక్కన ఉన్న రెండో కుర్చీలో లేడీ ఇన్స్ పెక్టర్ సుధా. ఈ మధ్య సిటీలో జరిగిన కఠినమైన దొంగతనాలను చాకచక్యంతో కనిపెట్టిన కారణంగా ఆమెకు ప్రమోషన్ ఇవ్వటంతో ఆమెకు ఈ స్పేషల్ గ్రూపులో చోటు దొరికింది.

ఈ ఐదు గురిని డి.జి.పి తన బలం అనుకుంటాడు.

డి.జి.పిలో ఎప్పుడూ కనబడే ఉత్సాహం ఆ రోజు కనబడలేదు. ఏదో చిక్కుముడి విప్పాల్సిన సమస్యలాగా ఉన్నదని అక్కడున్న అందరూ అనుకున్నారు.

తన జేబులో నుంచి ఒక క్యాసెట్ ను తీసి టెప్ రికార్డర్లో ఉంచాడు డి.జి.పి....అది మాట్లాడడం మొదలు పెట్టింది.

“ఐ.పి.సి.ఐ 507 ఎం.ఎస్.ఐ సంస్థ...రేపు రాత్రి పన్నెండు గంటలకు హైదరాబాదులో”...అంటూ ఒక గొంతు పలికిన తరువాత ఢాం అని తుపాకీ శబ్ధం వినిపించింది. ఆ తరువాత కొద్ది క్షణాల నిశ్శబ్ధం...కొంచం సేపు మౌనం తరువాత మళ్ళీ అదే గొంతు వినబడింది.

"ఏమిటీ...తుపాకీ శబ్ధం వినబడిందా? ఏమీలేదు, మీ పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఒకడ్ని కాల్చేశాం. ఇకపోతే అసలు విషయానికి వస్తాను. రేపు రాత్రి హైదరాబాదులో ఒక బాంబు పేలబోతోంది. మీవల్ల కుదిరితే ఆపుకోండి. ఇప్పుడు మా చేత చంపబడిన పోలీసోడి శవం, ప్రొద్దున మూసీ కాలువలో తేలుతుంది. తీసుకువెళ్ళి చేయవలసిన మర్యాదలు చేసుకోండి"...క్యాసెట్ లోని గొంతు ఆగిపోయింది.

డి.జి.పి మొదలుపెట్టాడు.

“ఈ టెర్రరిస్ట్ సంస్థ గురించి అందరూ వినే ఉంటారు 'భారతదేశం మా బానిస’ అనేదే ఈ సంస్థ నినాదం. ఇంతవరకు పలు చోట్ల జరిగిన బాంబు పేలుల్లలో వీరి హస్తం ఉన్నది.

భారతదేశం, మానవ శక్తిలో అతిపెద్ద దేశంగా ఉంటోంది. గత కొద్ది సంవత్సరాలుగా ఆర్ధీకంగా అభివ్రుద్దిపొంది, డబ్బుగల ఇతర దేశాలను కూడా భయపడేట్టు చేస్తోంది. ఇదే వేగమైన అభివ్రుద్దితో మనదేశం ముందుకుపోతే...మరో పది సంవత్సరాలలో అంతర్జాతీయంగా ఆర్ధీకంగానూ, అర్ధీకరంగంలొనూమొదటి స్థానంలో ఉంటుంది. దీన్ని ఆడ్డుకోవటమే ఈ సంస్థ యొక్క ముఖ్యమైన లక్ష్యం. మన దేశ అభివ్రుద్దిని చూసి వోర్వలేని కొన్ని దేశాలు వేస్తున్న డబ్బు బిక్షకు వీళ్ళు చిందులు వేస్తున్నారు. మనకింకా పద్దెనిమిది గంటలే ఉన్నది. ఈలోపు మనం బాంబు పేలడాన్ని అడ్డుకోవాలి" ఆందోళన పడుతూ చెప్పాడు.

"సార్. ఈ క్యాసెట్టులో వినబడిన శబ్ధం ఆధారంగా వాళ్ళు ఉండే చోటును మనం కనుక్కునే ప్రయత్నం చెయ్యచ్చే?"

“ఈ రోజు వరకు అలా కనుక్కోలేకపోయాము. మన ఇంటలిజన్స్ విభాగం ఇంకొక టెర్రరిస్ట్ సంస్థ గురించి తెలుసుకోవటానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఈ సంస్థ గురించి తెలుసుకుని వెంటనే మనకు సమాచారం పంపారు. అలా సమాచారం పంపుతున్నప్పుడే వాళ్ళ దగ్గర దొరికిపోయిన ఒక అధికారి ఇందాకా ప్రాణం వదిలాడు"

"బాంబు ఎక్కడపెట్టారో...ఎవరు పెట్టారో మనకు తెలియదు. ఆ బాంబును ఎలా పేలకుండా చెయాలో తెలియదు. ఇంత తక్కువ సమయంలోపు మనం వాటిని కనుక్కొవటం సులభమా?" ఇన్స్ పెక్టర్ గణపతి తన ప్రశ్నను ముందుంచాడు.

"కష్టమే! కానీ ఈ మూడిటి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, తెలుసుకుని బాంబును పేలకుండా చేయాలి"

“సార్. బాంబు స్క్వాడ్ కు ఫోన్ చేసి, నగరంలోని ముఖమైన ప్రదేశాలలో తనికీ చేయమని చెబుదాం. తరువాత...ప్రజలు ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, షాపింగ్ మాల్స్ ఇలా అన్ని చోట్లా తనికీలు చేయమందాం"

"ఇది మామూలుగా జరిగే పనే. ఆ పని దానిపాటికి అది జరుగుతుంది. అదే సమయం...బాంబు ఎక్కడున్నదీ సరిగ్గా కనిపెట్టాలి. దానికి ఏం చేయాలో చెప్పండి"

ఆ గది అంతటా కొద్ది నిమిషాలు మౌనం.

సుధా మెల్లగా తన చేతిని పైకెత్తింది.

"చెప్పండి...ఏదైనా ఐడియా ఉందా?" ఇన్స్ పెక్టర్ సుధాను అడిగాడు డి.జి.పి.

"ఎస్ సార్…నా భర్త ప్రతాప్ ను పిలిస్తే...ఆయన ఏదైనా క్లూ ఇస్తారు"

"అలాగా...?"

"అవును సార్. మీకు వాళ్ళాయిన గురించి తెలియదు. కొన్ని దొంగతనాల కేసుల్లో నేనే అయ్యన్ని పట్టుకుని జైలుకు పంపాను"....అసిస్టంట్ కమీషనర్ రత్న కుమార్ చెప్పాడు.

"అయితే పె.ము-పె.త తరువాత ఆయన పైన కేసులు ఏమైనా పెండింగులో ఉన్నాయా?"

"అదేంటి పె.ము-పె.త తరువాత అంటే?" డి.జి.పి అడిగాడు.

"పె.ము అంటే పెళ్ళికి ముందు, పె.త అంటే పెళ్ళి తరువాత అని అర్ధం. ఆయన జమీందారి వంశం నుండి వచ్చారు. మధ్యలో కొంత కాలం దొంగతనాలు చేసేరన్నది నిజం. కానీ, ఇప్పుడు గౌరవంగా 'డిటెక్టివ్ ఏజన్సీ' నడుపుతున్నారు. చాలా నేరాలలో మన డిపార్ట్మెంటుకూ, నాకూ క్లూ ఇచ్చి నేరస్తులను పట్టుకోవడంలో సహాయపడ్డారు. అలా నా భర్త సలహా తీసుకుని అవార్డులు కొట్టేసిన ఒక ఆఫీసర్ ఇక్కడ ఒకాయన ఉన్నారు. కావాలంటే ఆయన్ని అడగండి" చెప్పింది ఇన్స్ పెక్టర్ సుధా.

“ఒక క్రిమినల్ యొక్క బుద్ది ఇంకో క్రిమినల్ కే కదా తెలుస్తుంది"

“క్రిమినల్స్ కు బుద్ది ఉంటే ఉంది. మనకు బుద్ది లేనప్పుడు వాళ్ళను బుద్ది సహాయం ఇవ్వమని అడగటంలో తప్పులేదు"

"ఎవరికి బుద్ది లేదని చెబుతున్నారు?" అసిస్టంట్ కమీషనర్ రత్న కుమార్ ఉద్రేకంగా అడిగాడు.

"ఆపుతారా మీ పోట్లాటను..." డి.జి.పి అరిచాడు.

"సారీ సార్. ఆయన నా భర్తను అవమానపరచి మాట్లాడుతున్నారు. ఇప్పుడెళ్ళి ఆయన ఆఫీసును చూడమనండి"

"మిసర్స్ సుధా...మొదట్లో మనం ప్రయత్నిద్దాం.మన వల్ల కాదు అనుకున్నపుడు మిగిలిన ఐడియాల గురించి ఆలొచిద్దాం"

"సారీ...డి.జి.పి గారు. ఏ.సి గారినే బాగా ఆలొచించమందాం. ఆయనకొక్కడికే 'పోలీస్ మైండ్' ఎక్కువ. ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడండి. అలా క్లూ ఏమీ దొరకలేదంటే చెప్పండి. నా భర్తతో మాట్లాడతాను. నేను చెబితే ఆయన ఎంత పెద్ద కష్టమైన పనినైనా కాదనరు” కోపంగా మాట్లాడి కూర్చుంది ఇన్స్ పెక్టర్ సుధా.

డి.జి.పి తో సహా మిగిలిన పోలీసు అధికారులు తమ బుర్రలను కెలుక్కున్నారు, గోక్కున్నారు. గోడగడియారంలో ముల్లు పరిగెత్తుతోందేకాని వాళ్ళకు ఎటువంటి ఐడియాగానీ, క్లూగానీ దొరకలేదు. సమయం పదిగంటలు దాటింది.

డి.జి.పి ఫోన్ మోగటంతో...తీశారు. అవతలి పక్క మాటలను వింటుంటే ఆయన ముఖం ఎర్రగా మారిపోయింది.

“ఆ పోలీసతని బాడీని మూసి కాలువలో నుండి అరగంట ముందు తీశారట. తుపాకీ గుండు చొచ్చుకుపోయి చనిపోయున్నా కూడా, వదలకుండా బాడీని ముక్కలు ముక్కలుగా చేసి పారేశారు. దీని తరువాత కూడా మనం నిదానంగా ఆలొచిస్తూ కూర్చుంటే ప్రయోజనమే లేదు" అని డి.జి.పి నిర్ణయాకి వచ్చారు.

అది విన్న వెంటనే అసిస్టంట్ కమీషనర్ రత్న కుమార్ తప్ప మిగిలినవారందరూ ఇన్స్ పెక్టర్ సుధా భర్త ప్రతాప్ సహాయం పొందటానికి తమ ఆమోదం తెలిపారు.

"సార్...నాకు ఇది అక్కర్లేని పనిగా అనిపిస్తోంది" చెప్పాడు అసిస్టంట్ కమీషనర్ రత్న కుమార్.

"మిస్టర్ రత్న కుమార్....ఆ ప్రతాప్ గురించి, ఆయన యొక్క డిటెక్టివ్ ఏజన్సీ గురించి నేనూ విన్నాను. ఆయన దగ్గర అడుగుదాం. 'క్లూ' దొరికితే మంచిది. మీరూ ఆలొచించండి...మీకు ఏదైనా 'క్లూ' దొరికితే, ఆ దారిలోనూ మనం ప్రయత్నించి చూద్దాం. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో 'ఈగో'కు చోటిస్తే మనకు పనిజరగదు. ఇన్స్ పెక్టర్ సుధా...మీ ఆయనకు ఫోన్ చేసి రమ్మని చెప్పండి" ముగించాడు డి.జి.పి.

గర్వంగా ఫీలౌతూ తన సెల్ తీసి భర్త ఫోన్ నెంబర్లను నొక్కింది ఇన్స్ పెక్టర్ సుధా.

"హలో...ఒక అవసరం. డి.జి.పి మీతో ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలట. వెంటనే బయలుదేరి మా ఆఫీసుకు రండి."

"లేదు డార్లింగ్. నేను ఇప్పుడే..."

"ఏదైనా సరే తరువాత చూసుకుందాం. వెంటనే బయలుదేరి రండి"

“నువ్వు ఆర్డర్ వేయటం, నేను చేయకపోవటమా. ఇదిగో ఇప్పుడే వస్తున్నా"...అవతల వైపు ఫోన్ పెట్టేసిన చప్పుడు.

పది నిమిషాల తరువాత డి.జి.పి కి ఆఫీస్ ఎంట్రన్స్ సెక్యూరిటీ దగ్గర నుండి ఫోన్."మీరు రమ్మని చెప్పారని ప్రతాప్ అనే ఒకాయన వచ్చారు"

“డిటెక్టివ్ ప్రతాపేనా...? పంపించు"

"చూస్తే డిటెక్టివ్ లాగా కనిపించటం లేదు సార్. నాకెందుకో సందేహంగా ఉంది సార్"

"నీకెందుకయ్య అక్కర్లేని సందేహం. ఆయనకోసమే మేమందరం కాచుకోనున్నాం. వెంటనే నా గదికి పంపు"

సుధా తన తలను పక్కకు తిప్పి, ఎడం చేతిని చెంపల క్రింద ఉంచుకుని గది ద్వారం వైపే భర్త రాకకై చూస్తోంది. ఆమె మాత్రమే కాదు....ఆ బృందంలోని అందరూ గది ద్వారం వైపే చూస్తున్నారు...గది తలుపులు తెరుచుకున్నాయి.

కళ్ళకు కూలింగ్ గ్లాస్ పెట్టుకుని, నలిగిపోయిన లుంగీ, మాసిపోయిన బనీను వేసుకుని ద్వారం దగ్గర నిలబడ్డాడు ప్రతాప్.

భార్యను చూశాడు. "హాయ్ బ్యూటీ" అంటూ చేయి ఊపాడు...అది చూసిన ఇన్స్ పెక్టర్ సుధాకు తల తిరిగినట్లనిపించింది.

Continued: PART-3

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి