చీటింగ్ పోలీస్(నవల)…..PART-5
‘ఎవరీ ప్రతాప్?... అసిస్టంట్ కమీషనర్ రత్న కుమార్ కి ఇతని మీద ఎందుకంత కోపం?’
ప్రతాప్ పుట్టి పెరిగింది జమీందారి వంశంలో. కానీ ‘విధి’ అతనితో ఆడుకుంది. అతనికి పదమూడేళ్ళు ఉన్నప్పుడు ఒక ప్రమాదంలో తల్లితండ్రులను కోల్పోయాడు. ఆస్తులన్నీ బంధువులు పంచుకున్నారు...వీడిని అనాధలాగా నిలబెట్టారు.
ఒక పూట భోజనానికే దారి తెలియక 'ఏం చేయాలి’ అని సతమతమవుతున్నప్పుడు 'పిక్ పాకెట్' ఒకటే దారి చూపింది. కొద్ది సంవత్సరాలలోనే దాంట్లో ఎక్స్ పర్ట్ అయ్యాడు. ఎంతో మంది జేబులను కొల్లగొట్టినా పోలీసుల దగ్గర చిక్కుకోలేదు.
అతనికి ఒకటే ఒకే లక్ష్యం...'నేను నా జమీందరి ఆస్తులను తిరిగి కొనాలి’ అనేదే. పిక్ ప్యాకెట్ మూలం అతనికి వచ్చిన ఆదాయం అతని ఖర్చులకే సరిపోయింది కానీ అతని లక్ష్యసాధనకు ఏమాత్రం సహాయపడలేదు.
అలా కాలం గడుపుతున్నప్పుడు ఒకరోజు ఒక 'పిక్ ప్యాకెట్' కేసులో ప్రతాప్ ను పట్టుకున్నాడు కమీష్నర్ రత్న కుమార్. ప్రతాప్ పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకుని పారిపోయాడు. అప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో ఇన్స్ పెక్టర్ సుధా మాత్రమే ఉంది.
నేరస్తుడిని తన కేర్ లెస్స్ నెస్ వలన తపించుకు పోనిచ్చిందని సుధాను, కమీషనర్ పిచ్చి,పిచ్చిగా తిడుతున్నప్పుడు...ఆమె అందానికి బానిస అయిన ప్రతాప్ తానుగా ముందుకు వచ్చి లొంగిపోయాడు. తనకోసం, తన గౌరవం కోసం పారిపోయిన ప్రతాప్ తిరిగి పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోవటంతో సుధా మనసులో అతనికి స్థానం దొరికింది. ప్రతాప్ మొదటి నుండీ పిక్ ప్యాకెట్ దొంగ కాదు...అతను జమీందారీ వంశంలో పుట్టినవాడు అని తెలుసుకున్నది సుధా.
కానీ, అసిస్టంట్ కమీషనర్ రత్న కుమార్ ఎలా రియాక్ట్ అయ్యుంటాడో ఇకచెప్పాలా? ఆ రాత్రంతా మూడు లాఠీలు విరిగినై. మరుసటిరోజు అతన్ని కోర్టులో హాజరు పరిచారు. ఆరునెలలు జైలు శిక్ష పడింది. శిక్ష పూర్తి చేసుకుని జైలు బయటకు వచ్చిన ప్రతాప్ కు సుధా తో ప్రేమ వికసించింది. ఆమెనే పెళ్ళి చేసుకున్నాడు.
భార్య చెప్పిన గీతోపదేసంతో డిటెక్ టివ్ ఏజన్సీ మొదలుపట్టాడు. నాలుగు సంవత్సరాల కాలంలో ఆ రంగంలో ఎదిగిపోయాడు.
సుధాకు దొరికిన రెండు ఉద్యోగ ప్రమోషన్లకు కారణం ప్రతాప్ ఇచ్చిన ఆలొచనలే. పోలీస్ డిపార్ట్ మెంట్ సాల్వ్ చేయటానికి కష్టపడిన కొన్ని కేసులను ప్రైవేట్ డిటెక్టివ్ గా ఉండి సాల్వ్ చేసిచ్చాడు ప్రతాప్. అయినా కానీ, ఎంత గొప్ప డిటెక్ టివ్ గా మారినా, కమీషనర్ చూపులకు మాత్రం ప్రతాప్ ఇంకా ఒక 'పిక్ ప్యాకెట్' గాడే.
*****************########****************
డి.జి.పి ముందు నిలబడి విరక్తిగా 'సల్యూట్' చేశేడు కమీషనర్. ఆయన ఎదురుగా ఉన్న టేబుల్ ముందు కూర్చున్నాడు.
"సార్...మీరు ఆ ప్రతాప్ కు చాలా అలుసు ఇస్తున్నారు"
"మనకు వేరే దారిలేదు కమీషనర్. ఈ పరిస్థితుల్లో ఏంచేయాలో తెలియటంలేదు. మనం ఏమీ కనిపెట్టలేకపోయాము. ఇప్పుడు అతన్ని నమ్మే తీరాల్సిన పరిస్థితి వచ్చింది.
బాంబు పెట్టిన వాడి వివరాలు దొరకనివ్వండి...ఇతన్ని పంపించేయటం గురించి ఆలొచిద్దాం"
"అతను కనుక్కుంటాడని మీరు నమ్ముతున్నారా...?"
"అరగంటలో చెప్పేస్తాను అన్నాడే? చూద్దాం... లేకపోతే, తరువాత ఏం చేయాలో అప్పుడు అలొచిద్దాం"
"మీకొసమే చూస్తున్నా. లేకపోతే....అతన్ని కాల్చిపారేసే వాడిని" అంటూ, నడుము దగ్గర చెయ్యి పెట్టాడు.
"సార్...తుపాకీ లేదు"
"ఎక్కడ పెట్టారు...? బాగా ఆలొచించి చూడండి కమీషనర్ "
"పొద్దున పెట్టుకున్న గుర్తు. ఖచ్చితంగా ఆ ప్రతాపే తీసుంటాడు"
"అనవసరంగా అతన్ని తప్పు పట్టకండి. ఒకవేల ఇంట్లోనే పెట్టి మర్చిపోయుంటారు. వెంటనే ఫోన్ చేసి కనుక్కోండి"
"వద్దు సార్...నేనే నేరుగా ఇంటికివెళ్ళి చూసొస్తాను" అని చెప్పి ఇంటికి బయలుదేరాడు కమీషనర్.
*************************************
ఇన్స్ పెక్టర్ గణపతి జీపు డ్రైవ్ చేస్తున్నాడు. ప్రతాప్ అతని పక్కన కూర్చున్నాడు.
జీపు సెంట్రల్ జైలు వైపు వెడుతోంది. దారిలో తన జమిందారి బంగళా ఉండాల్సిన చోట ఫైవ్ స్టార్ హోటల్ ఉండటం చూసి బాధ పడ్డాడు ప్రతాప్.
జైలు వాకిట్లో జీప్ ఆగింది. డి.జి.పి సురేందర్ ఇచ్చిన స్పేషల్ అనుమతి లేఖ ఉండటంతో ఏ అడ్డంకులూ లేకుండా లోపలకు వెళ్ళగలిగారు.
గణపతి, జైలు అధికారి దగ్గర ఒక చీటీ చూపించాడు...జైలు అధికారి, ఒక జైలు వార్డన్ను తోడు ఇచ్చి పంపించాడు. రాజుల కాలం నాటి సొరంగం లాంటి ద్వారం దగ్గరకు వెళ్ళారు.
వెలుతురు తక్కువగా ఉన్న ఒక గదిలో ప్రతాప్ ను కూర్చోబెట్టి, దిలీప్ ను తీసుకు వచ్చారు.
రెండు సంవత్సరాలకు ముందు బలమైన కండరాలతో దృడంగా ఉన్న దిలీప్ జైలునివాశం వలన పూర్తిగా చిక్కిపోయి బలం లేకుండా అయిపోయి...ఎముకలతో అతుక్కుపోయిన జంతువులా అతుక్కుపొయి ఉన్నాడు.
నడవటానికే కష్టపడుతున్న దిలీప్ ను నిదానంగా తీసుకువచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టారు.
ప్రతాప్ నోరు తెరవటానికి ముందే దిలీప్ మాట్లాడటం మొదలుపెట్టాడు.
"నాకు ఆ సంస్థ గురించి ఏమీ తెలియదు. కొట్టాలనుకుంటే కొట్టేసి వెళ్ళండి"
"నీదగ్గర నేను ఆ సంస్థ గురించి అడగటానికి రాలేదు....ఇప్పుడు టైము పదకుండు గంటలు. ఇది నాకు'టీ టైమ’. ఇప్పుడు టీ తాగబోతున్నాను. మీకు టీ కావాలా...?"
అతను విరక్తిగా ప్రతాప్ ను ఒక చూపు చూసి, తిరిగి మౌనంగా ఉండిపోయాడు.
"సరె...నీక్కూడా టీ చెబుతున్నాను. సార్...రెండు టీలు. అలాగే ఇతని సంకెళ్ళు తీసేయండి. నేను ఇతనితో పర్సనల్ గా మాట్లాడలి"
వేడిగా టీ వచ్చింది.
తాగుతూ మాట్లాడటం మొదలుపెట్టాడు.
"చెప్పండి...దేనికోసం బాంబు పెట్టడానికి వొప్పుకున్నారు. డబ్బుకోసమే కదా?”
అతను మౌనంగా టీ తాగాడు.
"డిగ్రీ చదువుకున్న మీరు చేసిన ఈ తప్పువలన ఎక్కడికొచ్చారో చూడండి"
అతని కళ్ళల్లొ నుండి ధారగా నీళ్ళు కారినై.
"ఇలా మౌనంగా ఉండటంవలన ప్రయోజనం లేదు. మీరు లేనందువల్ల ఇప్పుడు ఆ సంస్థకు ఎలాంటి బాధ లేదు. ఇప్పుడు మీలాంటి ఇంకోక యువకుడు ఆ సంస్థ వలలో చిక్కుకున్నాడు. మీరు చెప్పేదాన్నిబట్టే వాళ్ళు జరుపబోయే తర్వాతి ప్లానును మేము ఆపగలం. మీలాంటి డిగ్రీ చదువుకున్న ఒకతన్ని, అమాయకపు ప్రజలను కాపాడవచ్చు. చెప్పండి"
అతను మాట్లాడటం మొదలుపెట్టాడు.
“అందరి యువకుల లాగానే డిగ్రీ పూర్తిచేసిన నేను ఎన్నో కలలతో కాలేజీ నుండి బయటకు వచ్చాను. అప్పుడే ఈ ప్రపంచం ఎంత కృరమైనదో తెలుసుకున్నాను. ప్రభుత్వ ఉద్యోగాలకే కాక ప్రైవేటు ఉద్యోగాలకు కూడా లంచాలు అడుగుతున్నారు. చదువుకున్న చదువుకు ఉద్యోగం లేదు. ఎన్నో కంపెనీల చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరిగాను. కన్నవారిపై భారంగా ఉండదలుచుకోలేదు. ఇల్లు వదిలిపెటి వచ్చేశాను...స్నేహితులతో రూములో ఉన్నాను. చేతిలో ఉన్న డబ్బు కరిగిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థిలో మొదటిసారిగా ఒకమ్మాయి హ్యాండ్ బ్యాగు దొంగలించాను. పట్టుబడ్డాను"
"ఓ...పిక్ పాకెట్టా..?"
"అవును"
“నా లాగానే నువ్వు"...అతన్ని కౌగలించుకున్నాడు.
ప్రతాప్ వేసుకున్న డ్రస్స్ వైపు చూశాడు దిలీప్.
"ఏమిటి...ఈ డ్రస్సేమిటా అని చూస్తున్నావా? ఇది వూరికినే ఒకరోజుకు. నిజంగానే నేనూ ఒక పిక్ పాకెట్ గాడినే! నా పేరు ప్రతాప్. ఓల్డ్ సిటీ వైపు వెళ్ళి అడిగి చూడు...అవును నువ్వెలా పట్టుబడ్డావు...?"
"చేతిలో ఉన్న బ్యాగును లాక్కోగానే ఆ అమ్మాయి గట్టిగా కేకలేసింది. హాండ్ బ్యాగ్ చేతిలో ఉంటే ప్రమాదం అని నేను ఆ బ్యాగును అవతల పారాశాను. దాన్ని ఒకడు చూశాశాడు"
"అక్కడే నువ్వు తప్పు చేశావు...! ఆ సమయంలో బ్యాగును క్రింద పడేసి, హ్యాండ్ బ్యాగును కాలుతో బస్సు సీటు క్రిందకు తోశేసుంటే పట్టుబడేవాడివి కావు"
ఇన్స్ పెక్టర్ గణపతి ప్రతాప్ వైపు అదొలా చూశాడు.
"గణపతి గారూ...మేము మా వ్యాపార రహస్యాల గురించి మాట్లాడుకుంటున్నాము. మీరు కొంచం బయట వైట్ చేస్తారా?"
ఒక పక్క కోపం వచ్చినా... ఆరోజుకు డి.జి.పి అతను. కార్యం జరగాలి కాబట్టి వార్డన్ తో కలిసి బయటకు వెళ్ళాడు ఇన్స్ పెక్టర్ గణపతి.
"తరువాత ఏమైంది?"
"దొంగాడు అనే బిరుదు రుద్దారు. అ తరువాత నాకెక్కడ ఉద్యోగం దొరుకుతుంది? అప్పుడే ఆ సంస్థ నుండి ఫోన్ వచ్చింది"
"ఇప్పుడే మీరు నేను ఎదురుచూస్తున్న చోటుకు వచ్చారు. ఆ సంస్థకు మీ గురించి ఎలా తెలిసింది? మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేశారు...వాళ్ళ వలలో మీరెలాపడ్డారు? అ బాంబు పేలుడికి ఎంత డబ్బు ఇచ్చారు...ఎలా ఇచ్చారు? అన్నిటి గురించి చెప్పండి. వీలైనంతవరకు టూకీగా చెబితే మంచిది"
అతను చెప్పటం మొదలు పెట్టాడు. అరగంట తరువాత చిరునవ్వుతో బయటకు వచ్చాడు ప్రతాప్.
"ఏమిటీ...'క్లూ' దొరికినట్లు తెలుస్తోంది..." ఇన్స్ పెక్టర్ గణపతి కుతూహలంగా అడిగాడు.
"అవును... దొరికినట్లే! నేను వెంటనే డి.జి.పి తో మాట్లాడాలి"
ఇన్స్ పెక్టర్ గణపతి సెల్ ఫోన్లో నెంబర్లు నొక్కి ప్రతాప్ చేతికి ఇచ్చాడు.
"సార్... నేను ప్రతాప్ ని"
"చెప్పండి! ఎదైనా ముఖ్యమైన విషయమా?"
"అవును సార్...నాకు రెండు లిస్టులు కావాలి. ఒకటి, గత వారం రోజులలో ఎవరెవరి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లలో పది లక్షల రూపాయల కంటే ఎక్కువ డెపాజిట్ అయ్యిందో చూడాలి. రెండు.ఈరోజు నుండి రాబోవు పదిహేను రోజులకు బయటి దేశాలకు వెళ్ళటానికి ఎవరెవరు రిజర్వేషన్ చేసుకున్నారో, ఆ లిస్టు కావాలి"
"దేనికోసమో తెలుసుకోవచ్చా?"
"ఇప్పుడు టైము లేదు సార్...డైరెక్టు గా మీమల్ని కలుసుకున్నప్పుడు చెప్తాను. ఈలోపు నేనడిగిన డీటైల్స్ రెడీ చేయండి. ఆ పనులు ఇప్పుడే మొదలుపెట్టండి"
"మీరడిగిన రెండో లిస్ట్....ఓ.కే..! మొదటిదే కష్టం. వెయ్యికిపైనే ఉన్నాయి బ్యాంకులు. ఒక్కొక్కదానికీ వెడితే...రెడీచేయటానికి రెండురోజులు పడుతుంది"
"అది చాలా కష్టం. మన పోలీసులలో నుండి యాబై మందిని సెలక్ట్ చేయండి. ఒకరికి 20 బ్యాంకులు అప్పజెప్పండి. నేరుగా వెళ్ళక్కర్లేదు. ఫోన్ మూలంగా విషయం చెప్పి, లిస్టు ను మన ఆఫీసుకు పంపమనండి. ఇప్పుడంతా కంప్యూటర్ యుగం కదా! కాబట్టి, మనం అడిగిన లిస్ట్ 'ఈజీగా' దొరుకుతుంది. నా అంచనాల ప్రకారం ...ఇంకో రెడుగంటల్లో మనకు అన్ని వివరాలూ వచేస్తాయి"
"ఓ.కే..! నేను వెంటనే ఆర్డర్స్ ఇచ్చేస్తాను"
"తరువాత ఇంకో విషయం. మన గ్రూప్ లోని అందరినీ మళ్ళీ సమావేశ పరచండి..."
డి.జి.పి రూములో మళ్ళీ సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ రౌండుగా కూర్చున్నారు. మధ్యలో ప్రతాప్ నిలబడ్డాడు. ప్రతాప్ ఏం చెప్పబోతాడోనని అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
Continued: PART-6
N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి