చీటింగ్ పోలీస్(నవల)…..PART-7
ప్రతాప్ చెప్పినట్లు ఇన్స్ పెక్టర్ అర్జున్, సబ్ ఇన్స్ పెక్టర్ మూర్తి ఇద్దరూ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్లుగా మారారు.
వీధి చివర జీపును ఆపి....ఇద్దరూ దిగి నడవటం మొదలుపెట్టారు. అర్జున్ తన కళ్ళద్దాలను గుడ్డతో తుడుచుకుని పెట్టుకున్నాడు. జేబులోని కాగితాన్నీ బయటకు తీసి అందులో రాసున్న అడ్రస్సును సరిచూసుకున్నాడు.
తలుపులు తట్టారు. లోపల నుండి యాబై ఏళ్ళ వయసున్న ఒకాయన వచ్చి నిలబడ్డాడు. మధ్యాహ్నం నిద్ర కునుకు ఇంకా ఆయన కళ్ళల్లొ తెలుస్తోంది.
"ఇక్కడ రాధాకృష్ణ ఎవరు?"
"మా అబ్బాయే. మీరెవరు...మీకేం కావాలి?"
"మేము ఇన్ కమ్ టాక్స్ ఆఫీసు నుండి వస్తున్నాం. ఇది మా ఐడి కార్డు. మిమ్మల్ని కొంచం విచారించాలి. లోపలకి వెళ్ళి మాట్లాడుకుందామా?"
ఆయనకేమీ అర్ధంకాలేదు. చేతి వేళ్ళల్లో కొంచం వణుకు. వాళ్ళను ఇంట్లోకి తీసుకు వెళ్లాడు.
"ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చా?"
"వాళ్ళ అమ్మని ఆసుపత్రికి తీసుకు వెళ్ళాడు...వచ్చే టైము అయ్యింది"
“సరే...విషయానికి వస్తాను. మూడురోజులకు ముందు ఇరవై లక్షల రూపాయలు మీ అబ్బాయి తన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేశాడు. అది బ్లాక్ మని అని మా సందేహం. ఆ డబ్బులు ఎలా వచ్చాయో తెలుసుకోవచ్చా?"
“వాడి పేరుమీద అశోక్ నగర్ లో ఉన్న స్థలాన్ని ఆమ్మాడు. ఆ డబ్బులే అవి"
"దానికి ఆధారం?"
"ఒక్క నిమిషం..." గొణుగుతూ లేచి గదిలోకి వెళ్ళాడు. ఐదు నిమిషాల తరువాత ఒక డాక్యూమెంట్ తో వచ్చాడు.
"ఇదిగోండి. మేము స్థలం అమ్మటానికి వేసుకున్న డాక్యూమెంట్"
అర్జున్ ఆ డాక్యూమెంట్ ను తీసుకున్నాడు. చదివి చూశాడు. అన్నీ కరెక్టుగానే ఉన్నాయి.
"ఇప్పుడు ఆ స్థలాన్ని అమ్మాల్సిన అవసరం ఏమిటి?"
“నా భార్యకు ఇంకో నాలుగు రోజుల్లో హార్ట్ ఆపరేషన్. ఎలా చూసుకున్నా పది లక్షలకు పైనే ఖర్చౌతుంది. అంత డబ్బును అప్పుగా తీసుకోనూలేము. వడ్డీ కట్టటానికే వాడి సగం జీతం కావాలి. అందుకని స్థలాన్ని అమ్మేశాడు"
“బయటిదేశానికి వెళ్ళటానికి మీ అబ్బాయి విమానం టికెట్టు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది"
"మా అబ్బాయి దుబాయిలో పనిచేస్తున్నాడు. స్థలం అతనిపేరు మీద ఉండటం వలన దాన్ని అమ్మటానికి, తల్లి ఆపరేషన్ సమయంలో ఆమెను దగ్గరుండి చూసుకోవడంకోసం వచ్చాడు. ఒక పదిరోజులుండి వెళ్ళిపోతాడు"
అనుమానం వచ్చేటట్టు ఏదీ లేకపోవటంతో, ఇద్దరూ బయలుదేరటానికి రెడీ అయ్యారు.
"స్థలం అమ్మకం వలన వచ్చిన డబ్బుకు వచ్చే సంవత్సరం పన్ను కాట్టాల్సి వస్తుంది...గుర్తుంచుకుని కట్టేయండి"
"కరెక్టుగా కట్టేస్తామండి. మాలాంటి చిన్న వాళ్ళ దగ్గరే మీ అధికారం చూపిస్తారు. కోట్ల లెక్కలో పన్ను కట్టకుండా మోసం చేసేవాళ్ళను వదిలేస్తారు..."
"మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలి...వస్తాం"
అనవసరంగా ఆయనతో మాట పడాల్సి వచ్చినందుకు బాధపడి ఆయనకు నమస్కరించి అక్కడుంచి బయటకు వచ్చారు.
జేబులోని రెండో కాగితం తీసి అడ్రస్సు చూసుకున్నారు.
సుదర్షన్! అక్కడకూడా ఇదే ప్రశ్నలు అడిగారు. అనుమానం వచ్చేటట్టు ఏ క్లూ దొరకలేదు. ఇక చివరిగా వాళ్ళ దగ్గరున్న అడ్రస్స్ చీటిలోని పేరు ప్రమోద్. వీడూ దొరక్కపొతే వాళ్ళ ప్రయత్నం వృధా అవుతుంది.
ఆ ఇంటిదగ్గర వాళ్ళిద్దరినీ దింపేసి పోలీసు జీపు ఒక పక్కగా నిలబడింది.
మేడ మెట్లు ఎక్కి గుమ్మం దగ్గరకు వెళ్ళారు. గుమ్మం వాకిటి తలుపుకు తాళం వేసుంది. క్రింద ఇంట్లో విచారించటానికి క్రిందకు దిగివచ్చి వాళ్ళ తలుపు మీద కొట్టారు.
లోపల నుండి ఒక ఆడమనిషి వచ్చింది.
"పైన అద్దెకుంటున్న అతని పేరు ప్రమోద్ కదా?"
"అవును. మీరెవరు?"
"మేము ఇన్ కం టాక్స్ ఆఫీసు నుండి వస్తున్నాం. అతను ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసా?"
"ఎక్కడకెళ్ళాడో తెలియదు సార్...ఏదైనా ప్రాబ్లమా?"
"లేదమ్మా...చిన్న ఎంక్వయరీ. అతను ఎక్కడ పనిచేస్తున్నాడు?"
"ఇన్నిరోజులూ ఉద్యోగంలేక ఉరంతా తిరిగి వచ్చేవాడు. ఇప్పుడేదో సింగపూర్ లో ఉద్యోగం దొరికిందని చెప్పాడు. అంతే కాదండి...పది నెలల అద్దెను నిన్ననే ఇచ్చాడు"
ఇద్దరి ముఖాలలోనూ ఒక వెలుగు కనిపించింది.
"ఇంకేమీ లేదమ్మా...మేము చూసుకుంటాం"
అర్జున్ సెల్ ఫోన్ తీసి ప్రతాప్ నెంబర్లు నొక్కాడు. అవతల ఫోన్ ఆన్ చేసిన చప్పుడు.
"సార్....నాకు ఎందుకనో ఇతనిమీద అనుమానంగా ఉన్నది. బయటకు ఎక్కడికో వెళ్ళాడు. వచ్చేంతవరకూ ఆగుదామా....లేక, తాళం పగులకొట్టి చూసేద్దామా?"
"ఆగటానికి మనకు టైము లేదు. తాళం పగులకొట్టి వెళ్ళండి"
ఇద్దరూ మేడపైకి వెళ్ళారు. ప్రమోద్ గది తలుపు తాళం పగులకొట్టారు. లోపలకు వెళ్ళారు.
లోపలకు వెళ్ళి చూశారు. బాంబు తయారుచేయటానికి మందు గుండులో ఉపయోగించిన రసాయనం మిగులు ఒక డబ్బలో ఉన్నది. వైర్ ముక్కలు ఒక పక్కగా మూలలో ఉన్నాయి. ఇంకా కొంచం లోతుగా వెతికినప్పుడు అతను ఉపయోగించిన ‘వయర్ లెస్’ ఫోన్ దొరికింది. అర్జున్ మళ్ళీ ప్రతాప్ కి ఫోన్ చేశాడు. ఐదు నిమిషాలలో ప్రతాప్ అక్కడికి చేరుకున్నాడు.
ప్రతాప్, డి.జి.పి నెంబర్ నొక్కాడు. వివరాలు తెలిపాడు.
"సార్...ప్రమోదే నేరస్తుడు. తరువాత ఏం చేయాలి?"
“అతనెక్కడుంటాడో విచారించారా?"
“అతను అద్దెకుంటున్న ఇంట్లో కింద అద్దెకున్నవారిని అడిగాము. బయటకు వెళ్ళాడు. ఎక్కడికి అని ఎవరికీ తెలియదు"
"అతని గదిలో ఉన్నవాటిని ఎక్కడుండేవో అక్కడే పెట్టేసి, గది తలుపులు వెసి మీరు వచ్చేయండి"
"ఓ.కె. సార్...అర్ధమయ్యింది. అతను వస్తే తప్పించుకుపోకుండా పట్టుకోవటానికి పదిమందిని మఫ్టీలో పంపించండి..."
"వెంటనే పంపిస్తాను. నేరస్తుడ్ని ప్రాణాలతో పట్టుకోవటం చాలా ముఖ్యం. దీన్ని మనసులో ఉంచుకుని మీరు పనిచేయాలి"
"ఖచ్చితంగా సార్”
పది నిమిషాలలో పోలీస్ స్క్వాడ్ అక్కడకు వచ్చింది. స్క్వాడ్లోని పోలీసులను ఇద్దరిద్దరుగా వేరుచేసి అక్కడక్కడ నిలబడమని ఆదేశాలు ఇచ్చాడు ప్రతాప్. అందరూ వాళ్ళ వాళ్ళ పొజీషన్లో రెడీగా ఉన్నారు.
చిన్నగా ఊగుతూ వీధిలోకి ఒక ఆటో వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది. మరుసటిరోజు జరగబోతున్న తన పెళ్ళికోసం కొత్త పంచ, చీర, బంగారు తాళి, నగలు అంటూ రెండు పెద్ద సంచులు తీసుకుని...ఆటోలోనుండి దిగాడు ప్రమోద్.
మేడ మెట్లు ఎక్కాడు.
తలుపుకు వేయబడ్డ తాళం సరిగ్గా వేసుండకపొవడం చూసిన అతనికి సందేహం వచ్చింది.
'తాళం వేయటం మర్చిపోయుంటాను...' తనలో తానే అనుకుంటూ తలుపు తెరుచుకుని లోపలకు వెళ్ళాడు. సంచులను క్రిందపెట్టాడు.
'రేపు ఈ సమయానికి నువ్వు... అంజలి మెడలో వేలాడుతూ ఉంటావు. మా ప్రేమను, 'భార్యా-భర్త' అనే పుణ్యమైన బంధానికి తీసుకు వెడతావు...అంటూ తాళికి ముద్దు పెట్టాడు.
మరుక్షణం...ఇంటిచుట్టూ ఏదో శబ్ధం వినబడింది. తాళిని సంచీలో పెట్టేసి, తలుపుదగ్గరకు వెళ్ళి ఒక మూలగా దాక్కుని చెవులను చురుకుగా ఉంచుకున్నాడు.
అతను సందేహించింది కరెక్టే! షూ చప్పుడ్లు మెల్లమెల్లగా పెరుగుతూ తన గదివైపు రావడం విన్నాడు.
తన చుట్టూ ఏదో విపరీతం జరగబోతోందని అతని మనసు అతన్ని హెచ్చరిస్తోంది. అతని నుదిటి మీద నుండి చెమట కారుతోంది.
Continued: PART-8
N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి