చీటింగ్ పోలీస్(నవల)…..PART-3
తలుపులు తడుతున్న శబ్ధం మోత వినబడటంతో...నిద్రలో నుండి కష్టపడి తనని విడిపించుకుని, ఆవలించుకుంటూ వెళ్ళి తలుపులు తెరిచాడు ప్రమోద్.
క్రింది పోర్షన్లో ఉంటున్న ఇంటి యజమాని వాళ్ళబ్బాయి నిలబడున్నాడు.
"అన్నా....మీకు ఫోన్ వచ్చింది. నాన్నగారు చెప్పి రమ్మన్నారు."
ఎవరు ఫోన్ చేశారో, ఎక్కడ్నుంచి ఫోన్ చేశారో చెప్పకుండా తండ్రి చెప్పింది వొప్పచెప్పి వెళ్ళిపోయాడు.
"ఎవరై ఉంటారు?" అనే కన్ ఫ్యూజన్ తో, నీళ్లతో నిద్ర మొహం కడుక్కుని క్రిందకు వెళ్ళాడు ప్రమోద్.
"తమ్ముడూ, ఎవరో అంజలి ట ఫోన్ చేసింది. తిరిగి పది నిమిషాల తరువాత మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పింది. అంతవరకు అలా కూర్చోండి" చెప్పాడు ఇంటి యజమాని.
సోఫాలో కూర్చున్నాడు. అంజలి దగ్గర నుండి ఆ టైములో ఫోన్ వస్తుందని అతను ఎదురు చూడలేదు.
"తమ్ముడూ టీ...కాఫీ ఏమన్నా తీసుకుంటావా...?" భవ్యంగా అడిగాడు ఇంటి యజమాని.
"క్షమించాలి...నాకేమీ వద్దు. కాసేపట్లో బయటకు వెళ్ళిపోతాను. అప్పుడు చూసుకుంటాను"
'నిన్నటి వరకు ప్రమోద్ ని తిట్టిన ఇంటి యజమాని నోరు, పదినెలల అద్దె బాకీతో పాటూ, రాబోయే రెండు నెలల అద్దె డబ్బును ప్రమోద్ ముందే ఇవ్వటంతో ఈ రోజు పళ్ళు ఇకలిస్తూ నవ్వు మొహంతో మాట్లాడుతున్నాడు.
"డబ్బుకు ఎంత విలువో?"...మనసులోనే నవ్వుకున్నాడు ప్రమోద్.
టెలిఫోన్ రింగ్ అయ్యింది...సోఫాలో నుండి లేచి ఒక్క నిమిషం ఇంటి యజమాని వైపు చూశాడు. ఆయన తల ఊపటంతో, రిజీవర్ తీసి చెవి దగ్గర పెట్టుకున్నాడు.
అవతలివైపు అంజలి గొంతు.
"హలో..."
"నేను ప్రమోద్ నే...చెప్పు"
"నిన్ను వెంటనే చూడాలి. రాగలవా?"
"ఇంత ప్రొద్దున్నే ఎక్కడకి"
"ఇప్పుడు కాదు...ఎనిమిదింటికి. ఎప్పుడూ ట్యాంక్ బండ్ దగ్గర కలుసుకుంటామే! ఆ చోటికి వచ్చాయి. మిగితాది నేరుగా చెబుతాను"
"సరే"- ఫోన్ పెట్టాశాడు. ఇంటి యజమానిని చూసి ఒక చిరునవ్వు నవ్వేసి, ఎదురుకుండా ఉన్న టీ కొట్టుకు వెళ్ళి అక్కడున్న బెంచ్ మీద కూర్చున్నాడు. ప్రమోద్ ను అడగకుండానే "సారుకు ఒక స్పేషల్ టీ ఇవ్వు" అని కేక వేశాడు టీ కొట్టు యజమాని.
మరు నిమిషం టీ అతనిదగ్గరకు వచ్చింది.
టీ కొట్లో కూడా అదే కథ! నిన్నటి వరకు సింగిల్ టీ చెప్పి, అరగంట కాచుకోవాలి. ఈ రోజు అడగ కుండానే టీ అతనిదగ్గరకు వచ్చింది. అదే డబ్బు మహాత్యం.
అతను...టీ త్రాగుతూ అంజలితో తన ప్రేమ వ్యవహారాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు.
ఆమె తల్లితండ్రులు ఆమెకు కరెక్టు పేరే పెట్టారు. ఆమెను చూసే ప్రతి ఒక్కరూ కొద్ది క్షణాలైనా తమ స్పృహలో ఉండరు. అంత అందంగా ఉంటుంది అంజలి. ఇతనూ అమెను చూసిన వెంటనే మనసు పోగొట్టుకున్నాడు.
ఏన్నోరోజులు అద్దం ముందు నిలబడి, 'నన్నెందుకు అందంగా పుట్టించలేదు’ అంటూ దేవుడ్ని ప్రశ్నించేవాడు .నన్ను అందంగా పుట్టించుంటే ఆమె దగ్గరకు వెళ్ళి ధైర్యంగా నా ప్రేమను చెప్పేవాడిని...!' అని వాపోయేవాడు.
అలా అతను వాపోతున్నప్పుడు అంజలి కళ్ళు ఇతన్నే రహస్యంగా చూస్తూండటం గమనించాడు. ఇతను చూసిన వెంటనే తన చూపును చటుక్కున వేరు చోటుకు తిప్పుకునేది. ఇక ఇతన్ని పట్టుకోగలమా? ఆ రోజే తన ప్రేమను అమె దగ్గర కక్కేశాడు. ఆమె 'నో' చెప్పిన రోజు నుండి, ఇతన్ని చూసినవెంటనే పరిగెత్తి వెళ్ళిపోయేది.
ఆమెను మరిచిపోవడానికి ఎంతో ప్రయత్నించాడు...కుదరలేదు. ఒకసారి పదిమంది ముందు ...ఆవేశంగా తన ప్రేమను చెప్పాడు, దెబ్బలూ తిన్నాడు.ఆ సంఘటన తరువాత ఆమె మెల్ల మెల్లగా భయాన్ని వదిలేసి, అతనికి దగ్గరవడం మొదలుపెట్టింది.
మిగిలిన ప్రేమికులలాగా గంటల తరబడి ఫోన్ మాటలు లేవు. వారానికి రెండు రోజులు మాత్రమే ఒక గంటసేపే కలుసుకుంటారు. కాలేజీలో ఒక సంవత్సరం, ఆ తరువాత నాలుగు సంవత్సరాలు. వీళ్ళు ప్రేమించుకోవటం మొదలుపెట్టి ఈ రోజుతో ఐదు సంవత్సరాలు అయ్యింది.
ఉద్యోగం దొరక్క ఎన్నోసార్లు డీలా పడిన ప్రమోద్ ని తన చేతులతోనూ, మాట్లతోనూ ఉత్సాహపరిచేది అంజలి.
********************************
హైదరాబాద్ ట్యాంక్ బండ్. డబ్బుగలవారికి, లేనివారికి సరిసమానంగా బగవంతుడు ఇచ్చిన వరం. పెందలకడ వచ్చిన కొందరు మార్నింగ్ వాక్ ముగించుకుని తిరిగి వెడుతున్నారు.
వాళ్ళు మామూలుగా కలుసుకునే చోటుకు ప్రమోద్ వచ్చినప్పుడు టైము ఎనిమిది ఐదు. 'అప్పుడే వచ్చుంటుందా?' అనే అతని అపోహను తొలగిస్తున్నట్టు అప్పటికే ఆమె అక్కడకొచ్చి కూర్చోనుంది. తనని గిల్లి చూసుకున్నాడు.
ఆమె ముఖాన్ని తిప్పి చూసింది.
ఏడుస్తున్నది.
ఏమీ అర్ధంకానివాడిలా ఆమె దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు.
"ఎందుకేడుస్తున్నావు?...ఏమైంది?"
ఆమె సమాధానం చెప్పలేదు. అతని చొక్కా పుచ్చుకుని అతన్ని దగ్గరకు లాక్కుని అతని గుండెలపై తన ముఖాన్ని పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. మొదట ఆమెను సమాధాన పరుద్దామనుకున్నాడు. అతనివల్ల అది కుదరలేదు. 'కాసేపు ఏడవని’ అనుకుంటూ నిదానంగా ఉన్నాడు.
ఐదు నిమిషాల తరువాత ఆమె ఆమెను కంట్రోల్ చేసుకుని మాట్లాడటం మొదలుపెట్టింది.
"ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. నిన్న నాకు తెలియకుండానే, నా ఇష్టం కనుక్కోకుండానే పెళ్ళి చూపులకు ఏర్పాటు చేశారు. పెళ్ళి మూహూర్తాలు, తారీఖులూ నిశ్చయంచేసుకున్నారు. ఈరోజు ప్రొద్దున నాన్న దగ్గర మన ప్రేమ విషయం చెప్పాను. లాగి ఒకటిచ్చారు.
నాకు లోకం తెలియదుట. ఆయన చూసిన పెళ్ళికొడుకునే నేను చేసుకోవలట. 'లేకపోతే ఎక్కడకన్నా వెళ్ళిపో, నువ్వు చచ్చిపోయావని అనుకుంటా' అని చెప్పారు"...చెబుతూ కొంచం ఆయశపడింది.
అతను మౌనం వహించాడు.
"నాకేంచేయాలో తెలియలేదు. కోపంగా ఇంట్లోనుండి వచ్చాశాను"
ప్రమోద్ నవ్వాడు.
ఆశ్చర్యంతో అతన్నే చూసింది అంజలి.
"ఎందుకు నవ్వుతున్నావ్?"
“నువ్వు ఏడవటం చూసి ఏమిటో ఏదో అనుకున్నా. ఇది మనం ఎదురుచూసిందే కదా. దీనికొసం ఏడుస్తున్నావా?"
"కాదు..." అంటూ మాట్లాడబోయిన ఆమె నొటిని మూశాడు.
"నాకు సింగపూర్ లో మంచి ఉద్యోగం దొరికింది. నిన్ననే ఫ్లైట్ టికెట్టు కూడా బుక్ చేశేశాను. తీసుకొచ్చి నీకు చూపిద్దాం అనుకునాన్ను. అంతలో ఇవన్నీ జరిగిపోయినై. పరవాలేదు....ఈరోజే టూరిస్ట్ వీసా తో నీకూ టికెట్టు బుక్ చేస్తాను. నాతో వచ్చేసై. విదేశంలో మన జీవితాన్ని ప్రారంభిద్దాం. అక్కడకెళ్ళి వీసాను రెండేళ్ళకు ఎక్స్ టెండ్ చేయించుకుందాం. అలా కాదంటే ఇక్కడే లేడీస్ హాస్టల్లో ఉండు. రెండు సంవత్సారాలు బాగా సంపాదించుకుని వస్తాను. వచ్చిన వెంటనే పెళ్ళిచేసుకుందాం"
"నాకు డబ్బులొద్దు. నువ్వుంటే చాలు. నీతోపాటూ సింగపూర్ వచేస్తాను”
"సరే...నిన్ను మీ ఇంటిదగ్గర నేనే స్వయంగా దింపుతాను. నువ్వుగా ఇంట్లోనుండి పారిపోయి వచ్చినట్టు ఉండొద్దు. మీ నాన్న దగ్గర మాట్లాడతాను. కాదూ కూడదు అంటే...నాతో తిరిగి వచ్చేయి. మిగితా విషయాలు తరువాత చూసుకుందాం"
అంజలి భయంతో అతని చేతిని పుచ్చుకుంది.
“చదువుకునేటప్పుడు ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పినప్పుడు...పెద్దగా పట్టించుకోనట్టు మాట్లాడాను. నిన్ను తిట్టాను...ఒకసారి కొట్టాను. అవన్నీ ఆ వయసులో ప్రేమ మీద నాకున్న భయంతో చేసినవి. నిజానికి, నిన్ను చూసిన మొదటిరోజే ప్రేమలో పడిపోయానన్నదే వాస్తవం. నన్ను క్షమించు. లేదు నన్ను దండించాలనిపిస్తే...నన్ను తిట్టు, కొట్టు. నీతోనే ఉంచుకుని నన్ను చిత్రవధలు పెట్టుకో.......అవన్నీ హాయిగా అనుభవించటానికి నేను రెడీ. కానీ నన్ను వదిలేయకు. నువ్వులేకుండా నేను బ్రతకలేను. అంత గాఢంగా నిన్ను ప్రేమిస్తున్నాను"
ఆమె మాటలు అతనికి సూదుల్లా గుచ్చుకున్నాయి.
"నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో మాటలతో చెప్పేశావు! నిన్ను మహారాణిలాగా ఉంచుకోవాలనే ఒకే కోరికతో, దేశ ద్రోహం అని తెలిసికూడా ఆ పనిచేశాను. ఒకవేల నిన్ను ప్రేమించకుండా ఉండుంటే...'జైహింద్’ చెప్పి కష్టాలను సంతోషంగా స్వాగతించేవాడిని”
మనసులోనే అనుకున్నాడు...బయటకు చెప్పలేదు. అతని చేతులు మాత్రం ఆమె కన్నీటిని తుడిచాయి.
ఆ నిమిషం అతనికి తెలియదు...తనవలన అంజలి ఎన్ని కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందో!
Continued:PART-4
N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)
N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి