23, ఏప్రిల్ 2020, గురువారం

రూపం తెచ్చిన మార్పు…10(చివరి భాగం)

                                    రూపం తెచ్చిన మార్పు…చివరి భాగం
                                                            (పెద్ద కథ)

“మేరీ అనే అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. ఆమెతో పెళ్ళికి కూడా సన్నాహాలు పూర్తి చేశాను. ఆమెను రిజిస్టర్ ఆఫీసుకు రమ్మని చెప్పాను. నా బావ పరిస్తితి కారణంగా, ముందు రోజు రాత్రి అక్కయ్య తన కుటుంబానికి విషం ఇచ్చి, తానూ చనిపోవాలని నిర్ణయించుకుంది. ఆమెను నేను కాపాడే తీరాలి. అమ్మలాగా ఉండి నన్ను పెంచి, చదివించి, మనిషిని చేసిన అక్కయ్య ముఖ్యమా? మేరీ ముఖ్యమా? అక్కయ్యే విజయం సాధించింది! నేను రిజిస్టర్ ఆఫీసుకు వెళ్ళలేదు.

మేరీ రిజిస్టార్ ఆఫీసులో నా కోసం కాచుకుని కాచుకుని, నేను వెళ్ళకపోవటం వలన, అవమానపడిన కారణంగా ఆమె తన జీవితాన్నే ముగించుకుంది! ఈ వార్త నాకు ఎప్పుడు తెలిసిందో తెలుసా? అమల మెడలో నేను తాలి కట్టిన తరువాత!

అక్కయ్య కుటుంబం బ్రతికింది, జోసఫ్! కానీ నేను చచ్చిపోయాను. ఒక అమ్మాయి చావుకు కారణమైన పాపాత్ముడ్ని అయిపోయాను. ఆ పాపం వలనే అక్కయ్య కుటుంబం ఈ రోజు నాశనమైపోయింది! మేరీ కడుపు మంట వూరికే వదలదు! అది నన్నూ నాశనం చేస్తుంది! నేనూ నాశనమైపోవాలి. అదే నేను చేసిన పాపానికి పూర్తి పరిహారం!"--తల పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడు!

జోసఫ్ కారును పక్కగా ఆపాడు.

జోసఫ్ గబుక్కున కారులో నుండి దిగాడు.

కారు మీద ఆనుకుని నిలబడ్డాడు. ఏడుపును దిగమింగుకుంటూ కళ్ళు మూసుకున్నాడు.చెల్లి రూపం కళ్ళెదుటకు వచ్చింది.

‘చూశావా అన్నయ్యా తల్లి లాగా పెంచిన అక్కయ్య కుటుంబం నాశనం అవకూడదని తనని తాను త్యాగం చేసుకున్నారు ఆయన. ఇది ద్రొహం కాదే! నేను ఆయన్ని ఘాడంగా ప్రేమించాను. అందువలన ఆయన్ని అర్ధం చేసుకోలేకపోయాను. సరిగ్గా అర్ధం చేసుకోకుండా, ఆయన మీద పగ తీర్చుకోమని నిన్ను ఒత్తిడి చేశాను. నన్ను నేను నాశనం చేసుకున్నాను. నువ్వు, ఆయన మీద పగ తీర్చుకునే పేరుతో ఏమీ తెలియని ఆ పసిబిడ్డనీ, ఆయన అక్కయ్యనూ ధండిచావు’….మేరీ రూపం జోసఫ్ ను కుదిపింది.

"జోసఫ్ ఇంటికి వెలదాం"...వెంకటేష్ పిలుపుతో కళ్ళు తుడుచుకుని కారులోకి ఎక్కాడు. కారు తోలుతున్నంత సేపు ఇద్దరి మధ్య మాటలు లేవు. జోసఫ్ మనసు అతన్ని కుంగదీసింది.

“అయ్యగారూ…”

“చెప్పు జోసఫ్”

"అయ్యగారూ! మీరు డబ్బు కోసం తాలి కట్టారు! ఇప్పుడు మీరు నాశనమైపోతే, అది డబ్బు ఇచ్చిన వాళ్ళకు మీరు ద్రోహం చేసినట్లు అవదా?"

“జోసఫ్?"

"వద్దు అయ్యగారూ! చనిపోయిన వాళ్ళ కోసం బ్రతికున్న వారిపైన పగ తీర్చుకోకోండి. ఈ అమ్మగారు ఏ పాపమూ చేయలేదు. అమ్మగారిని దండించకండి--ఈమెతో మనస్పూర్తిగా కాపురం చేయండి! అన్ని పాపాలకూ అదే పరిహారం. మీ త్యాగానికీ అదే మర్యాద! నేను చెప్పేది తప్పైతే నన్ను క్షమించండి!"

వెంకటేష్ ను ఇంట్లో దింపేసి ఇంటికి బయలుదేరాడు జోసఫ్. అతని మనసు అతన్ని వేధిస్తూనే ఉంది.

‘వెంకటేష్ అక్కయ్య కుటుంబం నాశనం అవటానికి నేను కారణమయ్యేనే! తప్పు! నా పగ, ప్రతీకార భావం ఈ క్షణమే కాలి బూడిదైపోవాలి! నేను మనిషిగా మారాలి! నా జీవితాంతం వీళ్ళకు పనిచేయటమే నేను చేసిన పాపానికి పరిహారం. గోపాల్ దగ్గర వెంటనే ఈ విషయం చెప్పాలి’

మరుసటి రోజు ప్రొద్దున జోసఫ్ పనిలోకి వచ్చిన వెంటనే, అమల అతని దగ్గరకు వచ్చింది.

"నమస్తే అమ్మగారూ!"

"చాలా థ్యాంక్స్ అన్నయ్యా...మీకు!"

"అన్నయ్యా నా?"

"అవును! మీరు మాట్లాడిన తీరు ఆయనలో పెద్ద మార్పు తీసుకు వచ్చింది! 'నిన్ను బాగా చూసుకోవటమే, నేను చేసిన పాపానికి పరిహారం' అంటూ పదిసార్లకు పైనే నాతో చెప్పుంటారు. ఆయనలో కొత్త ఉత్సాహాన్ని ప్రేరేపించిన మీరు ఈ ఇంటికి డ్రైవర్ అయుండచ్చు. నాకు మాత్రం అన్నయ్యే. సరేనా?"--- చేతులెత్తి దన్నం పెడుతూ చెప్పింది అమల.

ఆ చోట అమలకు బదులు చెల్లెలు మేరీ కనబడింది--- జోసఫ్ కి.

'నా మేరీ చావలేదు! అమల లోపల దూరిపోయింది! ఈ ఆనందం జీవితాంతం ఉంటే చాలు! చాలా థ్యాంక్స్ చెల్లీ!'

చాలా రోజుల తరువాత ఆనంద పడిన జోసఫ్, హాయిగా నవ్వుకున్నాడు.

అమల లోపలకు వెళ్ళిన తరువాత కారు తాళాలను టీపా మీద ఉంచి, మరింత హాయిగా నవ్వుకుంటూ ఇంటి బయటకు వచ్చి, ఆటో ఎక్కి పోలీస్ స్టేషన్ కు వెళ్ళి సుందరి కొడుకు చనిపోవటానికి నేనే కారణం అని చెప్పి లొంగిపోయాడు.

                                                                                                    (సమాప్తం) **********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి