రూపం తెచ్చిన మార్పు…8 (పెద్ద కథ) హాస్పిటల్ కు వెళ్ళిన ఒక గంట తరువాతే డాక్టర్ వచ్చాడు.
"ఆమె ప్రాణానికి ఆపద లేదు"
"హమ్మయ్య" వెంకటేష్ చేతులెతి దన్నం పెట్టాడు.
"ఉండండి! తొందరపడకండి!"
"ఏం డాక్టర్?"
“తలపై బలమైన దెబ్బ తగలటంతోనూ, పిల్లాడు పోయినందువలననూ ఆమె మెదడు ఆందోళనతో వాపు చెందింది!"
"ఏ...ఏమిటీ?"
"సృహ వచ్చింది! నా బిడ్డని నేను చూడాలని పిచ్చి పట్టిన దానిలాగా లేచి, మందుల ట్యూబును పీకి పారేసి బయటకు వచ్చింది! ఆమెను పట్టుకుని, మత్తు మందు ఇన్ జెక్షన్ ఇచ్చి, పడుకో బెట్టాము. దానికి మేము పడ్డ బాధ వివరించలేను"
"అయ్యో!"
"ఈ ఒక్కరోజు ఇక్కడ ఉండనివ్వండి. రేపు ఇంటికి తీసుకు వెళ్లిపొండి! ఇక వైద్యం అవసరం లేదు!"
"ఇంట్లో ఉంచుకుని ఆమెను పట్టుకోగలమా డాక్టర్?"
"ఖచ్చితంగా కుదరదు. దానికి నేను ఒక దారి చెబుతాను. మనోవ్యాధితో బాధపడే వారిని సంరక్షించే సంస్థ ఒకటుంది! దానికి నేను రెకమండేషన్ లెటర్ ఇస్తాను. ఖచ్చితంగా చేర్చుకుంటారు! సుమారుగా ఒక డొనేషన్ ఇవ్వండి! అప్పుడప్పుడు వెళ్ళి చూడండి! ఇప్పుడు ఇది తప్ప వేరే దారి లేదు"
"మేము ఇప్పుడు చూడచ్చా?"
"మెల్లగా వెళ్ళి చూడండి!"
వెంకటేష్, అమల లోపలకు వెళ్ళారు. కళ్ళు తెరుచుకునే ఉన్నది సుందరి!
"అక్కా!"
“నా పిల్లాడి దగ్గరకు నన్ను తీసుకు వెళ్ళు!"
"సరేక్కా! దానికోసమే నేనొచ్చాను!"
“లేదు...నువ్వు అబద్దం చెబుతున్నావు! నన్ను అందరూ మొసం చేస్తున్నారు. నా పిల్లాడి దగ్గర నుండి నన్ను వేరు చేస్తున్నారు! నాకు నా బిడ్డ కావాలి!"
హఠాత్తుగా గట్టిగా అరవటంతో, డాక్టర్ పరిగెత్తుకు వచ్చాడు. మిగిలిన వాళ్ళు సుందరిని లాగి పట్టుకున్నారు. డాక్టర్ మళ్ళీ మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు.
సుందరి సృహ కోల్పోయింది.
వెంకటేష్, అమల బెదురుతో బయటకు వచ్చారు.
సుదర్శనమూర్తి బాధతో చూశాడు---
"నాన్నా! మనవల్ల అవదు నాన్నా! వెంటనే మనొవ్యాధి సంరక్షణ కేంద్రంలో చేర్చేయాలి"....చెప్పింది అమల.
జోసఫ్ కొంచం దూరంలో నిలబడి కళ్ళు తుడుచుకుంటూ అన్నీ వింటూ నిలబడున్నాడు...
"అమలా! డాక్టర్ దగ్గర లెటర్ తీసుకుని, వెంటనే అక్కయ్యను అక్కడ చేర్చేద్దాం!"...చెప్పేడు వెంకటేష్
"సరే నండి!"
“ఈ అక్కయ్యా, ఈమె కుటుంబం బాగా బ్రతకాలనే కదా నేను త్యాగం చేసాను! ఆ రోజు అక్కయ్య పెట్టిన ఏడుపూ, పెడబొబ్బులు వలనే కదా నా మనసు మారింది! నా త్యాగానికి అర్ధమే లేకుండా పోయింది!'---వెంకటేష్ అక్కడే ఓర్పు నసించి కూర్చున్నాడు.
ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా నిలబడింది అమల.
వెంకటేష్ మాటలు విని జోసఫ్ ఆశ్చర్యపడ్డాడు...'త్యాగమా? ఈయన త్యాగం చేశాడా?'...'త్యాగమా? కోటీశ్వరుల కుటుంబంలో జీవించటానికి ఇష్టపడి, నా చెల్లెలు మేరీ కి ద్రొహం చేసింది త్యాగమెలా అవుతుంది?'
పళ్ళు కొరుక్కున్నాడు జోసఫ్!
ఆ రోజు సాయంత్రం మనోవ్యాధి సంరక్షణ కేంద్రంలో సుందరిని చేర్చారు -- సుదర్శనమూర్తి ఒక పెద్ద మొత్తాన్ని డొనేషన్ గా ఇచ్చాడు.
సుందరిని గొలుసులతో కట్టవలసిన అవసరం ఏర్పడుతోందేమో అన్నట్టు ప్రవర్తించింది సుందరి!
అందరూ బయటకు వచ్చారు.
కొంచం దూరంగా నిలబడున్నాడు మోహన్ రావ్. వెంకటేష్ కోపంగా అతని దగ్గరకి వెళ్లాడు, అతని చొక్కాను రెండు చేతులతో పుచ్చుకున్నాడు.
"ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నువ్వు తీసుకున్న అప్పును కట్టటానికీ, నువ్వు జైలుకు వెళ్ళకుండా తప్పించుకోవటానికి, ఆ రోజు నన్ను నేను తాకట్టు పెట్టుకున్నాను! ఇప్పుడేమైంది? అదంతా ప్రయోజనం లేకుండా పోయింది! నా కళ్ళ ముందు నిలబడితే, నిన్ను నేను చంపేస్తాను...పారిపో!"
మోహన్ రావ్ గొంతు నొక్కటానికి వెంకటేష్ ప్రయత్నించాడు. జోసఫ్ అడ్డుకున్నాడు-- వెంకటేష్ ని పక్కకు లాకొచ్చాడు!
"వద్దు అయ్యగారూ. ఉన్న బాధలు చాలవా?"
అందరూ తలో పక్కకూ వెళ్ళి కూర్చున్నారు.
అందరూ ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి పది గంటలు అయ్యింది.
"జోసఫ్! నువ్వు ఇంటికి వెళ్ళి ప్రొద్దున్నే రా!"
************************
"ఏం జరుగుతోంది జోసఫ్?" ఇంటికొచ్చిన జోసఫ్ ని అడిగాడు గోపాల్.
"నేను అనుకున్నదాని కంటే ఎక్కువగానే జరుగుతోంది! వెంకటేష్ చుట్టూ ఉన్న బంధువులు చిన్నాబిన్నమయ్యారు! ఇక వెంకటేష్ ఒక్కడే!"
"ఏం చెయ్యబోతావు?"
"తెలియటం లేదు! నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఆ కోటీశ్వరడు సుదర్శనమూర్తి, అతని కూతురు అమల ఈ వెంకటేష్ కుక్కను ఇంటి నుండి తన్ని తరిమేయాలి!"
"అది జరుగుతుందా జోసఫ్! ఏది ఏమైనా ఆ వెంకటేష్, సుదర్శనమూర్తి అల్లుడు కదా?"
"అయితే ఏమిటి? అల్లుడు మంచివాడైతే ఊరే మెచ్చుకుంటుంది. అదే అల్లుడు చెడ్డవాడు, అయోగ్యుడు అయితే సహిస్తుందా?"
"ఏమంటున్నావు?"
"దానికీ ఒక నాటకం జరపాల్సిందే. దానికి కావలసిన ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాను!"
"జాగ్రత్త! నువ్వు ఉంటున్నది డబ్బు గల వాళ్ళ ఇంట్లో. ఏదైనా తప్పు జరిగిందో అన్నీ తల కిందలవుతాయి. నీకు ఆపద వస్తుంది చూసుకో!"
"రానీ! నా మేరీనే పోయింది! ఆమె చావుకు కారణమైన వారిని నడిరోడ్డులో నిలబెట్టి, వారి చావుకు వారే కారణం అయ్యేటట్టు చేయాలనేదే నా పధకం. ఆ పధకం యొక్క చివరి ఘట్టానికి నేను దగ్గరవుతున్నాను గోపాల్"
గోపాల్ ఏమీ మాట్లాడలేదు!
"ఏమిట్రా ఏమీ మాట్లాడటం లేదు?"
"నీ ఆవేశం తప్పు అని నేను చెప్పటం లేదు? పగ తీర్చుకునే కారణంగా, ఒక మనిషి అన్నీ సాధించలేడు జోసఫ్! చివరికి మిగిలేది బాధ, ఆవేధన, నేర భావం. వెంకటేష్ మీద పగ తీర్చుకోవటానికి ఆ పసిపిల్లవాడిని, అదే మోహన్ రావ్ కొడుకును ఎందుకు బలితీసుకున్నావు. ఆ పసివాడు ఏం చేశాడు, వాడి తల్లి ఏం చేసింది. బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లి శాపం నిన్ను ఊరికే వదులుతుందా? నీ చెల్లి చావుకు కారణం ఆ వెంకటేష్...అతను చేసిన పాపానికి ఆ కుటుంబమే ఎక్కువ అనుభవించేటట్టు చేశావు. అది చాలదా?"
"నిన్న మేరీ కూడా కలలో కనబడి ఈ మాటే చెప్పింది.చాలదు! ముఖ్యమైన మనిషి వెంకటేష్. అతని పతనాన్నీ, చావునూ నేను చూడాలి గోపాల్. దానికోసం, నేను వేసే ప్లానులో మధ్యలో ఎవరెవరు బలి అవుతారో నాకు తెలియదు. అది వాళ్ల దురదృష్టం. దానికి నేను కారణం కాదు. ఆ వెంకటేషే కారణం!"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి