3, ఏప్రిల్ 2020, శుక్రవారం

రూపం తెచ్చిన మార్పు...1(పెద్ద కథ-క్రైమ్ స్టోరీ)




                                                రూపం తెచ్చిన మార్పు-1
                                                             (పెద్ద కథ)


బొర్ల పడుకున్నాడు, జోసఫ్! కళ్ళు మూసుకున్నప్పుడు మళ్ళీ, మళ్ళీ ఆమె రూపమే వచ్చింది! పకపక నవ్వింది! వెంటనే నవ్వు మారి, ఏడ్చింది!

ఆ గదంతా ఆమె కాళ్ళ గొలుసు శబ్ధం వినబడింది!

‘నువ్వు ఇంతేనా అన్నయ్యా? నా ఎడబాటు నిన్ను బాధించటం లేదా? చెల్లీ చెల్లీ అని నువ్వు అన్నప్పుడల్లా నాకు మన అమ్మే గుర్తుకు వచ్చేది. అమ్మలేని లోటును తీర్చిన నువ్వు, నా చావుకు కారణమైన వాళ్ళను వూరికే వదిలిపెడితావా? నీకు నామీద ప్రేమే లేదా?’

"ఉంది! ఉంది!" అరుస్తూ లేచి కూర్చున్నాడు జోసఫ్!

అతని వొళ్ళంతా వొణుకుతో ఊగిపోతోంది. చెమటతో స్నానం చేసినట్లు అతని చొక్కా అంతా తడిసిపోయింది!

హడావిడి పడుతూ లోపలకు వచ్చాడు, స్నేహితుడు గోపాల్!

జోసఫ్ లేచాడు.

"నేను వెలుతున్నానురా, గోపాల్. మూడు పూట్లా తింటూ, నీ నీడలో జీవించటానికా పుట్టాను. నచ్చలేదురా! తిన్నగా వెళ్ళి, వెంకటేష్ కథ ముగించి, పోలీసులకు లొంగిపోతాను!"

"తరువాత ఉరి శ్థంభం ఎక్క బోతావా?"

"వెలాడిందే! నా మేరీ వేలాడిందే! గొంతు ఎముకలు విరిగి, కళ్ళు బయటకు వచ్చి, నాలుక బయటకు వచ్చి నా మేరీ, 'అందమైన మేరీ వికారంగా చావాలేదా?’ అది వాడుకూడా అనుభవించాలి. ఇప్పుడే వెడతాను"

గోపాల్ అడ్డుపడ్డాడు.

"మూర్ఖుడిలా మాట్లాడకు! నువ్వు వెళ్ళిన వెంటనే అతన్ని చంపేయగలవా? మొదట అతని దగ్గరకు చేరుకోగలవా? నువ్వు ఆ ప్రయత్నం చేస్తేనే పట్టుబడిపోతావు! ఆ తరువాత నువ్వు అనుకున్నది జరగదు! హత్యా ప్రయత్నం చేసేవని లోపల పెట్టి నీ నెత్తురు,కండ బయటకు తీసేస్తారు. అది కావాలా?

"పరవాలేదు...అవును. నువ్వెందుకు నాకు అడ్డుపడుతున్నావు?"

"పిచ్చోడా! అడ్డుపడటం లేదురా! తెలివితేటలతో నడుచుకో అని చెబుతున్నాను. దానికోసం నేనొక మంచి వార్తతో వచ్చాను"

"ఏమిటది?"

"ఆ వెంకటేష్, డ్రైవర్ ఉద్యోగం కోసం మనుషులను తీసుకుంటున్నాడు!"

"అందుకని?"

"ఆ డ్రైవర్ ఉద్యోగంలో నువ్వు జేరాలిరా! ఆ ఉద్యోగం నీకు దొరికితే, అతను ప్రయాణం చేసే ప్రతిసారీ నువ్వు అతనితోనే ఉంటావు! అతని అలవాట్లు, పనులు నీకు తెలుస్తాయి! అప్పుడు నీ పని సులువు అవుతుంది. నీ పగను నువ్వు తీర్చుకోవాలి. కానీ, నువ్వు పోలీసులకు దొరకకూడదురా! అంతేగానీ, అలా ఆవేశపడ కూడదురా…. ఆవేశంలో తీసుకునే ఏ నిర్ణయానికైనా ఆయువు ఎక్కువ ఉండదు!"

జోసఫ్ తల ఎత్తాడు.

"ఇలా చూడు! ఒకరి ప్రాణం తీయడానికి కొద్ది నిమిషాలే పడుతుంది. దానికంటే, వాన్ని చిత్రవధ చెయ్యి! నీ చెల్లి మేరీ చనిపోయే ముందు ఎంత చిత్రవధ అనుభవించి ఉంటుందో, అంతే చిత్రవధ చనిపోయే ముందు ఆ వెంకటేష్ కూడా అనుభవించాలిరా….దానికోసం ఆలొచించు"

"నువ్వు చెప్పేది బాగుందే!"

"అమలు చెయ్యి! నీ మేరీ ఉరేసుకుంది! ఉరేసుకునే ముందు ఆమె ఎంత మనోవ్యాధితో భాదపడిందో! ఆ బాధే కదా ఆమెను ప్రాణం తీసుకోవాలనే నిర్ణయానికి తీసుకు వెళ్ళింది! దానికి కారణమైన వెంకటేష్ ని అంత చిత్రవధకు గురి చెయ్యొద్దా?"

“ఖచ్చితంగా చేయాలిరా, గోపాల్!”

“దానికి కావలసిన సంధర్భం వచ్చింది! వెళ్ళిరా!”

“చాలా మంది ఆ ఉద్యోగం కోసం పోటీ పడతారే! వెంకటేష్ కోటీశ్వరుడు. నాకు ఆ ఛాన్స్ దొరుకుతుందా?”

"అది నీ చాకచక్యం. నీలో అతన్ని అంతంచేయాలనున్న పగను ప్లానుగా మార్చు"

జోసఫ్ లేచాడు!

"సరే గోపాల్! నేను బయలుదేరుతాను!"

"బెస్ట్ ఆఫ్ లక్! వివేకంతో నడుచుకుని విజయాన్ని కైవసం చేసుకో. నీకు తోడుగా నీ మేరీ ఉంటుంది!"

జోసఫ్ ఒక్క క్షణం కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. గబుక్కున తుడుచుకుని, వేగంగా లోనికి వెళ్ళాడు!

పది నిమిషాలలో స్నానం ముగించుకుని, డ్రస్సు మార్చుకుని, బయటకు వచ్చాడు!

వీధి చివరకు రాగానే, బస్సు రావటంతో, పరిగెత్తుకుని వెళ్ళి దాంట్లో ఎక్కాడు.

ఇరవై నిమిషాల ప్రయాణం తరువాత దిగి నడవసాగాడు.

పది నిమిషాల నడక!

సిటీ అవుటర్ లో, అది డబ్బుగలవారు నివసించే ప్రాంతం. వరుసగా విలాశమైన భవనాలు!

ఖాలీగా ఉన్న రోడ్డు!

వీధి చివర్న మొబైల్ ఇస్త్రీ బండి! కుక్కలతో నడుస్తున్న వృద్దులు.

'సర్.సర్’ మని వేగంగా వెడుతున్న విదేశీ కార్లు.

ఒక పర్టికులర్ బంగళా దగ్గరకు వచ్చాడు. తల కంటే ఎత్తులో అమర్చ బడ్డ 'గేటు’ బంగళాను అడ్డుకుంటోంది!

గేటును మెల్లగా తెరిచాడు.

వెంటనే సెక్యూరిటీ వచ్చాడు.

"ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి?"

"యజమాని వెంకటేష్ గారిని చూడాలి!”

"అపాయింట్ మెంట్ ఉందా?"

"డ్రైవర్ పనికి మనుషులను తీసుకుంటున్నారట. అందుకనే వచ్చాను!"

జోసఫ్ ను ఒకసారి పైకీ కిందకూ చూశాడు సెక్యూరిటీ.

"నీకంటే ముందే ముగ్గురు వచ్చున్నారు! అందులోనూ రెకమెండేషన్ లెటర్లతో వచ్చారు! నీకు ఎవరి రెకమండేషన్?"

"దేవుడు!"

సెక్యూరిటీ నవ్వాడు.

"సరే! దేవుడు పేరు చెప్పిన కారణంగా నిన్ను లోపలకు పంపిస్తున్నాను! కానీ, నీకు ఉద్యోగం దొరుకుతుందని నాకు నమ్మకం లేదు! లోపలకు పో!"

జోసఫ్ లోపలకు నడిచాడు.

'ఇంతకు ముందే ముగ్గురు. అందులోనూ రెకమండేషన్లతో. నాలుగో వాడిగా నేను?'

మొల్లగా నడుస్తున్న జోసఫ్ ఒక అందమైన పూలతోటను దాటాడు.

అక్కడ ఒక పిల్లాడు -- మూడేళ్ళ వయసున్న చిన్నవాడు. బంతితో ఆడుకుంటున్నాడు. పనిమనిషి ఒకత్తి కొంచం దూరంలో తిరుగుతోంది.

పెద్ద బంతితో ఆ పిల్లాడు ఉత్సాహంగా, ఆనందంగా ఆడుకుంటున్నాడు.

పనిమనిషి, సెక్యూరిటీ దగ్గరకు వెళ్ళి ఏదో మాట్లాడుతోంది. అతను కూడా ఆమెతో స్వారస్యముగా మాట్లాడుతున్నాడు.

పిల్లాడు ఎగరేసిన బంతి 'గేటు’ దగ్గరకు వెడుతూండటం గమనించాడు జోసఫ్!

దగ్గర దగ్గర గేటుకు దగ్గరగా వెళ్ళింది బంతి! గేటు బయటకు వెళ్ళింది. కానీ సెక్యూరిటీ అక్కడ లేడు. కాబట్టి పిల్లాడు గేటు తోసుకుని బయటకు వెళ్ళే ప్రమాదం ఉంది. పిల్లాడు బయటకు వెళ్ళిపోతాడేమో నన్న భయంతో జోసఫ్ గేటు వైపుకు వెళ్ళాడు. పిల్లాడ్ని చేరుకునే లోపు, పిల్లాడు గేటు తోసుకుని బయటకు వచ్చాడు.

'నీలో వెంకటేష్ ను చంపాలని ఉన్న పగను, నీ మేధస్సుతో ప్లానుగా మార్చు! వివేకంగా నడుచుకుని విజయాన్ని కైవసం చేసుకో!'--స్నేహితుడు గోపాల్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.

జోసఫ్ ఒక్క క్షణం ఆలొచించాడు. వేగంగా వెళ్ళి బంతిని పట్టుకున్నాడు. కావాలని బంతిని రోడ్డుకు అవతలవైపుకు విసిరేశాడు!

                                                                                                   (ఇంకా ఉంది) ****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి