5, ఏప్రిల్ 2020, ఆదివారం

రూపం తెచ్చిన మార్పు…2(పెద్ద కథ-క్రైమ్ స్టోరీ)
                                                    రూపం తెచ్చిన మార్పు-2
                                                               (పెద్ద కథ)


పిల్లాడు నవ్వాడు! బంతిని తీసుకురావడానికి రోడ్డు అవతలవైపుకు నడిచాడు పిల్లాడు! ఆ పిల్లాడు రోడ్డు క్రాస్ చేస్తూ రోడ్డు మధ్యకు వచ్చాడు. వేగంగా వస్తున్న కారు ఒకటి పిల్లాడి వైపుకు వస్తూ ఉండటంతో, జోసఫ్ ఒక జంపు చేసి వెళ్ళి పిల్లాడిని చేతులతో ఎత్తుకుని రోడ్డుకు అటువైపుకు వెళ్ళి పడ్డాడు!

వేగంగా వచ్చిన కారు సడన్ గా బ్రేకు వేసి కొంచం దూరంగా వెళ్ళి ఆగింది.

పడిన వేగంలో గాయపడ్డాడు జోసఫ్. గాయంతో లేచాడు.

కారులో నుండి దిగిన ఆ మహిళ, ఆందోళనతో దగ్గరకు వచ్చింది.

"ఏమైంది?"

"లేదమ్మా! ఏమీ అవలేదు!" చెప్పాడు జోసఫ్.

అంతలో వెంకటేష్ కారు వచ్చింది!

వెంకటేష్ కారు దిగగానే, ఆ మహిళ ఆయన దగ్గరకు వచ్చింది.

"ఇతను మాత్రం సరైన సమయంలో కాపాడకపోయుంటే, పిల్లాడు నా కారు క్రింద పడుంటాడు!"

వెంకటేష్ పిల్లాడ్ని ఎత్తు కున్నాడు.

"మీ సెక్యూరిటీ ఏం చేస్తున్నాడు?"

"నేను కనుక్కుంటాను…చాలా థ్యాంక్స్ అండీ!"

"థ్యాంక్స్ ఈ మనిషికి చెప్పండి!"

ఆమె కారులో ఎక్కి వెళ్ళిపోయింది.

వెంకటేష్, జోసఫ్ దగ్గరకు వచ్చాడు.

"పిల్లాడి ప్రాణం కాపాడిన మీకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పను. లోపలికి రండి!"

ఈ లోపు సెక్యూరిటీ--పనిమనిషి భయపడుతూ వచ్చారు. వెంకటేష్ ఆవేశంగా వాళ్ళ వైపు తిరిగి, "మీరిద్దరూ పనిచేసే లక్షణం ఇదేనా! ఇప్పుడే మీరు ఇంటికి వెళ్ళచ్చు!"

"అయ్యగారూ!"

“నా ముందు నిలబడకండి. పొండి అవతలికి!” అంటూ వాళ్ళ మీద విసుక్కుని, జోసఫ్ వైపు తిరిగి “మీరు లోపలకు రండి!”

పిల్లాడితో పాటూ వెంకటేష్ లోపలకు వెళ్ళాడు. అతని వెనుకే జోసఫ్ కూడా వెళ్ళాడు.

డ్రైవర్ ఉద్యోగానికి వచ్చిన క్యాండిడేట్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు.

"మీ పేరేమిటి?"

"జోసఫ్!"

"ఈ వీధిలో ఎవరినైనా చూడటానికి వచ్చారా?"

"మిమ్మల్ని చూడటానికే వచ్చాను సార్!"

"నన్ను చూడటానికా? ఎందుకు?"

"డ్రైవర్ పనికి మనుషులను తీసుకుంటున్నట్టు విన్నాను. అందుకే"

చటుక్కున వెనక్కి తిరిగాడు వెంకటేష్.

ఇద్దరు పనివాళ్ళు అతని దగ్గరకు పరిగెత్తుకు వచ్చారు.

"డ్రైవర్ పనిలో చేరటానికి ఎంతమంది వచ్చారు?"

"ముగ్గురు సార్----రెకమండేషన్ లెటర్ తో వచ్చారు!"

"వాళ్ళను పంపించేయండి! ఈయన మిస్టర్ జోసఫ్!ఈయన్ని డ్రైవర్ పనిలోకి నేను సెలెక్ట్ చేశాసేను!"

జోసఫ్ తల పైకెత్తాడు.

“నువ్వు ఈ రోజే పనిలోకి చేరొచ్చు, జోసఫ్! పిల్లాడి ప్రాణాన్ని కాపాడిన నీకు ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాను. దానికి కృతజ్ఞతగా నిన్ను ఎప్పుడూ నా పక్కనే ఉంచుకుంటాను...సరేనా?"

"చాలా థ్యాంక్స్ అయ్యగారూ!"

పనివాళ్ళందరినీ పిలిచాడు వెంకటేష్.

“జోసఫ్ ని లోపలకు తీసుకు వెళ్ళి భోజనం పెట్టండి. సాయంత్రం లోపు జోసఫ్ కు కావలసిన డ్రస్సు, టోపీ అన్నీ తయారవ్వాలి! అడ్వాన్స్ ఏమన్నా కావాలా జోసఫ్?"

"వద్దయ్యగారూ! వచ్చిన వెంటనే నాకు పని దొరుకుతుందని నేను ఎదురు చూడలేదు! పిల్లాడి తల్లి బయటకు వెళ్ళేరా?"

"తల్లి-తండ్రీ ఇద్దరూ బయటకు వెళ్ళారు!"

"అంటే, పిల్లాడు మీ వాడు కాదా?"

"లేదు జోసఫ్! ఆ పిల్లాడు, మా అక్కయ్య పిల్లాడు! నాకు పెళ్ళై ఆరు నెలలే అవుతోంది!”

వెంకటేష్ ముఖంలో ఉన్న నవ్వు చటుక్కున మాయమయ్యింది. ఒక గంభీరం చోటు చేసుకుంది!

"వెళ్ళి పని చూడు జోసఫ్!" అని చెప్పి వేగంగా లోపలకు వెళ్ళాడు వెంకటేష్.

వెంకటేష్ మొహంలో ఏర్పడిన మార్పుకు కారణం తెలియక నిలబడ్డాడు జోసఫ్.

                                                    **********************

రాత్రి తొమ్మిదింటికి గదికి చేరుకున్నాడు జోసఫ్.

గోపాల్ చిన్న ఆందోళనలో ఉన్నాడు!

"ఏమిట్రా ఇంత లేటుగా వచ్చావు? నా ప్రాణం నాలో లేదు! ఆ వెంకటేష్ ని ఆవేశంలో నువ్వు ఏమైనా చేశేశేవోమోనని భయపడిపోయాను!"

"ఇదిగో! ఇది తిను!”

జోసఫ్ తాను కొనుక్కొచ్చిన స్వీట్ ప్యాకెట్ లో నుండి ఒక లడ్డూ తీసి గోపాల్ నోట్లోకి తోశాడు!

"ఎందుకురా?"

గోపాల్ను కూర్చోబెట్టి అన్ని విషయాలూ చెప్పాడు జోసఫ్.

"చూశావా? నువ్వు తెలివిగా నడుచుకున్నందుకు ఇమ్మీడియేట్ రిజల్ట్స్. వెంకటేష్ తోనే నువ్వు ఎప్పుడూ ఉండాల్సిన ఛాన్స్ దొరికింది! ఇక నిదానంగా ఉండు!"

"అవును గోపాల్! అది నాకే అర్ధమవుతోంది! నేను అనుకున్న పని జరగాలంటే ఓర్పుతోనే ఉండాలి!"

"ఆ ఇంట్లో ఇంకెవరెవరు ఉన్నారు?"

“వెంకటేష్ గారి భార్య సింగపూర్ వెళ్ళిందట. రేపు వస్తుందట. ఆయన అక్క, బావ ఉన్నారు! పనివాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సిగ్గులేని వెంకటేష్, తన బంధువులను కూడా పక్కనే ఉంచుకుని ఇల్లరికపు అల్లుడుగా జీవిస్తున్నాడు!"

"అవునురా! కోట్ల కొలది డబ్బు! సుదర్శనమూర్తి కూతురు భార్యగా దొరకటం మాటాలా?"

మరుసటి రోజు ప్రొద్దున్నే పనికి వెళ్ళిపోయాడు జోసఫ్.

పని వాళ్ళు కాఫీ ఇచ్చారు. కాఫీ తాగి జోసఫ్ కారును తుడవటం మొదలు పెట్టాడు!

ఏడున్నర కల్లా వెంకటేష్ స్నానం చేసి రెడీ అవటంతో జోసఫ్ కి పిలుపు వచ్చింది!

జోసఫ్ లోపలకు వచ్చి వెంకటేష్ కి నమస్తే చెప్పాడు. వెంకటేష్ తో పాటూ అతని అక్కయ్య, బావ అతనితో వచ్చారు!

"నువ్వేనా జోసఫ్? సరైన సమయంలో నా పిల్లాడ్ని కాపాడావు! చాల థ్యాంక్స్ తమ్ముడూ!" వెంకటేష్ అక్కయ్య అన్నది.

"దానికేగా నీ తమ్ముడు ఏమీ అడగకుండా అతనికి ఉద్యోగం ఇచ్చాడు!" అన్నాడు వెంకటేష్ బావ మోహన్ రావ్.

ఆ మాటలు వెంకటేష్ కి నచ్చలేదు.

"జోసఫ్! నువ్వు లోపలకు వెళ్ళి 'టిఫెన్’ చేసిరా! మనం బయలుదేరదాం!"

"వెంకటేష్! పనివాళ్ళకూ, డ్రైవర్ కూ నువ్వు ఎక్కువ చోటు ఇవ్వకు!"

"ఎవర్ని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు బావా! మీరు మీ పని చూసుకోండి!"

జోసఫ్ లోపలకు వెళ్ళాడు. వెంకటేష్ బావ మోహన్ రావ్ జోసఫ్ దగ్గరకు వచ్చి "ఒక్క నిమిషం జోసఫ్!" అన్నాడు.

"ఏమిటి?"-- అడిగాడు జోసఫ్.

"నా మూడేళ్ళ అబ్బాయి బాగానే మాట్లాడతాడు.'రోడ్డుకు ఎలా వచ్చావూ’ అని వాడ్ని అడిగాను. 'బంతి ఆడుకుంటూ వచ్చాను నాన్నా'…ఆ అంకుల్ బంతిని తీసుకుని రోడ్డుకు అవతలవైపుకు విసిరేశారు’. ఆయ్ జాలీ! అనుకుంటూ నేను దాన్ని తీసుకోవటానికి పరిగెత్తాను అన్నాడు!"

జోసఫ్ గుండె గుభేలు మన్నది.

                                                                                                 (ఇంకా ఉంది) ***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి