9, ఏప్రిల్ 2020, గురువారం

రూపం తెచ్చిన మార్పు…4(పెద్ద కథ-క్రైమ్ స్టోరీ)
                                                 రూపం తెచ్చిన మార్పు…4
                                                               (పెద్ద కథ)

వేగంగా లోపలకు వచ్చిన మోహన్ రావ్ "సుందరీ! వెంటనే….బయలుదేరు! ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండకూడదు" అరిచాడు.

సుందరీ, వెంకటేష్, అమల, సుదర్శనమూర్తి...నలుగురూ పరిగెత్తుకు వచ్చారు.

"ఏమైందండీ?"

"కొత్తగా వచ్చిన డ్రైవర్ నన్ను మర్యాద లేకుండా మాట్లాడాడు...ఇష్టం వచ్చినట్టు కూసాడు"

"ఎందుకు? ఎందుకలా మాట్లాడాడు?"…అడిగింది సుందరి.

"నేను ఈ ఇంట్లో ఒక పనికిమాలిన వేధవనట. పనిపాటా లేకుండా ఉచిత భోజనం తింటున్నానట. ఒక పనివాడు మాట్లాడాల్సిన మాటలా ఇవి?"

సుందరి, వెంకటేష్ దగ్గరకు వచ్చింది.

"ఏమిట్రా తమ్ముడూ ఇది?"

"అక్కా! అతను చాలా మంచివాడు. నీ పిల్లాడి ప్రాణం కాపాడిన వాడు. ఈ పనిలో నేను అతన్ని చేర్చుకోవడానికి అదే కారణం"

"అలాగైతే నేను చెప్పేది అబద్దమా?"-- అడిగాడు మోహన్ రావ్.

సుదర్శనమూర్తి, వెంకటేష్ దగ్గరకు వచ్చాడు.

"అల్లుడూ ఎందుకు ఈ వివాదం? వాడ్ని పిలిచి అడగండి! సరైన జవాబు రాకపోతే వాడ్ని పనిలోంచి తీసేయండి!"

వెంకటేష్ బయటకు వచ్చాడు.

"జోసఫ్! ఇటురా!"

జోసఫ్ బవ్యంగా వచ్చి నిలబడి నమస్తే చెప్పాడు.

"నువ్వు సార్ దగ్గర అమర్యాదగా మాట్లాడావా?"

"లేదండి!"

"అబద్దం చెబుతున్నాడు!"—అరిచాడు మోహన్ రావ్.

"అయ్యగారూ! నేనెందుకు ఈయనతో గొడవ పెట్టుకుంటాను. ఒక పక్కగా నిలబడున్న నా దగ్గరకు ఆయనే వచ్చారు!"

"దేనికి?"

"నువ్వు జీతం తీసుకున్న వెంటనే అందులో పది శాతం కమీషన్ ఇచ్చేయలని అడిగారు! నేను బెదిరిపోయి సెక్యూరిటీ దగ్గర "ఏమిటిది?" అని అడిగాను. ఇదే ఇక్కడి అలవాటు. ఇవ్వకపోతే నువ్వు ఉద్యోగంలో ఉండలేవు! మారు మాట్లాడకుండా ఇచ్చేయి అన్నాడు.నేను మాత్రం ఇవ్వను. ఇదే మాట ఈయనతో చెప్పాను"

అందరూ షాక్ అయ్యారు.

వెంకటేష్ కి కొంచం కొంచం ఈ విషయంపై అవగాహన ఉంది. సుందరికు కూడా భర్త యుక్క నీచమైన బుద్ది బాగా తెలుసు. జోసఫ్ అది అందరి ముందూ చెప్తాడని ఎవరూ ఊహించలేదు!

"ఏమండీ! లోపలకి రండి!"

"ఎ...ఎందుకు?"

"రండి అంటే రండి!"

భర్తను లోపలకు లాకెళ్ళింది సుందరి.

"సుందరీ! ఇతని దగ్గర నేను నిజంగా కమీషన్ అడగలేదు!"

"ఇలా చూడండి! మీ నీచమైన గుణం నాకూ, నా తమ్ముడికీ తెలుసు. పెద్దాయన ముందు నా పరువే పోయింది! ఇక ఈ ఇంట్లో నేను ఎలా తలెత్తుకు తిరగగలను?"

"సుందరీ -- అదొచ్చి....?"

"చాలు ఆపండి! పెట్టేది తినేసి ఒక మూల కూర్చోండి! లేకపోతే భర్త అని కూడా చూడకుండా తరిమి పారేస్తాను అర్ధమయ్యిందా?"

మోహన్ రావ్ మాట్లాడలేదు!

వెంకటేష్ బయటకు వచ్చాడు. తిన్నగా జోసఫ్ దగ్గరకు వెళ్ళాడు.

"అయ్యగారూ! నేను ఉద్యోగం మానుకుంటానండి!"

"నిన్ను నేను ఉద్యోగంలోంచి తీశేశానా?"

"లేదండి! బంధుత్వంలో పగుల్లు పడటానికి నేను కారణం కాకూడదు కదా?"

"అలా ఎప్పుడూ జరగదు! మా బావ నీచమైన మనిషి అని శభలో నువ్వు తోలు వొలిచిన ధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను. ఆ మనిషి ఇక నువ్వున్న వైపుకే రాడు. వెళ్ళి పనిచూడు!"

జోసఫ్ చేతులు జోడించాడు.

లోపలకు వెళ్ళిన వెంకటేష్ నేరుగా సుదర్శనమూర్తి దగ్గరకు వెళ్ళాడు. "మామయ్యా! సారీ!" అన్నాడు.

"ఎందుకు అల్లుడూ?"

"నేను మీ ముందు తల వంచుకుని నిలబడున్నానే...అందుకు!"

"మీరు అలా మాట్లాడనే కూడదు అల్లుడూ! మీరు చేసిన త్యాగానికి ముందు మేమందరమూ ఎందుకూ పనికిరాము! మీ కొసం మేము దేనినైనా సహిస్తాం అల్లుడూ "

"దేనికైనా ఒక హద్దు ఉంటుందిగా మామయ్యా! మా బావకు ఉద్యోగం ఇప్పించారు! అక్కడ డబ్బులు కాజేశాడని ఉద్యోగంలో నుంచి తరిమేశారు! మీ పరువే పోయింది! ఇప్పుడు నా పరువు పోతోంది!"

"వదిలేయండి...ఆ మాటలను వదిలేయండి! కానీ ఆ డ్రైవర్ ధైర్యవంతుడుగానూ, నిజాయతీ పరుడుగానూ ఉన్నాడు! నాకు అతను నచ్చాడు! ఇలాంటి వ్యక్తులను మనం వదులుకోకూడదు!"

"అవును మామయ్యా!"

"సరే టిఫిన్ చేద్దాం రండి!"

అమల, సుందరిని పిలవటానికి లోపలకు వచ్చింది!

"వదినా...టిఫెన్ కు రండి"

"వద్దమ్మా! నాకు మనసే బాగుండలేదు!"

"వదినా! నేను గానీ, నాన్న గానీ ఒక్క మాటైనా అన్నామా? దాని గురించి ఆలొచించకండి! కుటుంబం అంటే అన్నీనూ! దీనికొసం మనసు పాడుచేసుకోవచ్చా? కడుపు మీద కోపం తెచ్చుకుంటే, ఆరొగ్యం పాడైపోతుంది! అన్నయ్య గారూ మీరూ రండి!"

సిగ్గు అనేది లేకుండా మోహన్ రావ్ డైనింగ్ టేబుల్ కుర్చీలో కూర్చున్నాడు. ఒక పట్టు పట్టాడు.

వెంకటేష్ కే అసహ్యం వేసింది!

మోహన్ రావ్ వక్కపొడి వేసుకుని బయటకు వచ్చాడు. కారు డోర్ తెరిచున్నది. సీటులో జోసఫ్ నిద్రపోతున్నాడు.

మోహన్ రావ్ శబ్ధం చేసాడు. జోసఫ్ లేచాడు. కానీ పట్టించుకోలేదు!

"ఎంత పొగరురా నీకు? నీ దగ్గర ఎప్పుడురా నేను కమీషన్ అడిగాను?"

"సరే పోరా!”

"ఏమిటి...'రా' నా?"

"నీకు ఈ మర్యాదే ఎక్కువ! నన్ను ఏమీ చేయలేవు! అతి త్వరలో నిన్ను ఈ ఇంటి నుంచే తరిమేస్తాను చూడు!"

మోహన్ రావ్ ఆశ్చర్యపడ్డాడు.

"చూడరా! నువ్వు చెప్పింది కరక్టే! పిల్లాడ్ని పెట్టుకుని నాటకం ఆడే నేను లోపలకు వచ్చాను. నా నాటకం ఇంకా పూర్తి కాలేదు! నీలాంటి పనిపాటూ లేని వాళ్ళను తరిమితేనే నేను అనుకున్నది జరుగుతుంది!"

"అరి వెధవా! పెద్ద నాటకంతోనే ఈ ఇంట్లోకి వచ్చావా?"

"అవును! సుదర్శనమూర్తి గారి ఆస్తులను చేజిక్కుంచుకోవటం కోసమే వచ్చాను!"

మోహన్ రావ్ కి తల తిరిగింది.

'నిన్న పనిలో జేరిన డ్రైవర్ వలన ఇలా మాట్లాడటం కుదురుతుందా? ఇది నేను చెబితే...ఎవరూ నమ్మరే. నేను అలా చెప్పనే లేదు అని వీడు భయంలేకుండా ప్రామిస్ చేస్తాడే! ఈ ఇంట్లో నాకంటే వీడికే ఎక్కువ మర్యాద! నా పరిస్థితి ఇంత దిగజారిపోయిందే!'

మోహన్ రావ్ కి ఏడుపు ముంచుకు వచ్చింది.

తలెత్తి కోపంగా జోసఫ్ ని చూసాడు.

"ఏమిటి చూస్తున్నావు? పళ్ళు కొరకటం నా దగ్గర పెట్టుకోకు! నీ కళ్ళు పీకేస్తాను. పో!"

మోహన్ రావ్ బెదిరిపోయి లోపలకు వెళ్ళాడు.

జోసఫ్ పగలబడి నవ్వాడు.

బయలుదేరి ఇంటికి వెళ్ళాడు జోసఫ్. గోపాల్ తో విషయాలన్నీ చెప్పాడు.

గోపాల్ ఆశ్చర్యపడ్డాడు.

"పరవాలేదే? ఇంత తెలివిగా పనిచేసేవు! వెరిగుడ్!".

జోసఫ్ లేచి నడిచాడు.

"అక్కయ్యనూ, బావనూ ఆ కుటుంబం భరిస్తోంది! వీల్లిద్దర్నీ తీసి బయట పడేస్తే, తరువాత ఘట్టానికి వెళ్ళోచ్చు!"

“జోసఫ్! తొందరపడకు! ఆ మోహన్ రావ్ సగం పిచ్చోడని తెలిసి, ఒక ఆట ఆడాశావు! కానీ, అక్కయ్య విషయంలో అది ఫలించదు! అక్కయ్యను నువ్వు కెలికినా, వెంకటేష్ వూరికే ఉండడు. నీ వేగాన్ని ఇక్కడ తగ్గించుకోవాలి?"

జోసఫ్ నవ్వాడు.

"గోపాల్! ఒకే ఆటను అన్ని చోట్ల ఆడలేము! మార్చి ఆడాలని నాకు తెలుసు!"

"సరే! వీళ్ళను తరిమి నువ్వు ఏం సాధించ దలచుకున్నావు?"

"కర్ణుడి యొక్క కవచ కుండలాలను తీసింది దేనికి? అతన్ని పడగొట్టటానికే కదా? ఇక్కడ వెంకటేష్ యొక్క పక్క బలాలను అన్నిటినీ తీసేసి, అతన్ని నిరాయుధుడిగా నిలబెట్టే కదా నేను నా కార్యాన్ని సాధించగలను?"

"చెయ్యి! కానీ, ఇక్కడ నీ లెక్క తప్పు!"

"ఎలా?"

“వెంకటేష్ యొక్క బలం అతని అక్కయ్యో, బావో కాదు! కోటీశ్వరడు సుదర్శనమూర్తి మరియు అతని కూతురు అమల. వీళ్ళిద్దరే వెంకటేష్ కి కవచాలుగా ఉంటారు!"

జోసఫ్ మాట్లాడలేదు.

"ఆ కంచె దాటి నువ్వు సులభంగా లోపలకు వెళ్ళలేవు జోసఫ్! నీ ఉద్దేశం వాళ్ళకు ఆవగింజంత తెలిసినా నీకు ప్రమాదం వస్తుంది!"

"అవును గోపాల్!"

“నిదానంగా ప్రవర్తించు! ఒకే ఒక ప్రశ్న! మేరీను మోసం చేసి, కోటీశ్వరురాలి మెడలో వెంకటేష్ తాలి కట్టాడు. సరే! కానీ, ఏమీలేని ఈ వెంకటేష్ ని సుదర్శనమూర్తి ఎలా అల్లుడిగా ఒప్పుకున్నాడు? ఆయన అంతస్తుకు సరితూగే ఒక పెళ్ళి కొడుకు దరకడా?"

జోసఫ్ గబుక్కున వెనక్కి తిరిగాడు.

"గోపాల్! ఇది చాలా మంచి ప్రశ్న! ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం తెలుసుకుంటే, నా పని సులభం అవుతుంది!"

"జోసఫ్! ఇలా చూడు..."

"చెప్పు గోపాల్!"

"నేను చెబుతున్నానని కోపగించుకోకు! చనిపోయిన మేరీ ఇక తిరిగి రాదు కదా? దానికోసం పగ తీర్చుకుని, నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావా?"

జోసఫ్ ముఖం కోపంతో ఎర్ర బడింది!

"గోపాల్! మేరీ నా ప్రాణం అని నీకు తెలుసు! నేను జీవించిందే ఆమె కోసమే! ప్రేమ పేరుతో ఆమెను మోసం చేసి ఆమె ఆత్మహత్య చేసుకునేటట్టు చేశాడు ఆ వెంకటేష్! నేను కళ్ళు మూసుకుంటే చాలు నా మేరీ నా కళ్ల ముందుకొచ్చి నన్ను వేధిస్తోంది. ఆ ద్రోహి వెంకటేష్ లెక్కను పూర్తి చేయటమే నేను మేరీకి ఇచ్చే కానుక! నా నిర్ణయంలో ఎటువంటి మార్పూ లేదు!"

గోపాల్ మౌనం వహించాడు.

                                                                                                       (ఇంకా ఉంది) ****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి