రూపం తెచ్చిన మార్పు…9 (పెద్ద కథ) ఇంటి నుండి డ్యూటీకి వచ్చాడు జోసఫ్.
కారు తాళాలు తీసుకోవడానికి లోపలకు వెడుతున్న సమయంలో....లోపలమాటలు వినబడటంతో లోపలకు వెల్దామా, వద్దా అనే ఆలొచనతో అక్కడే నిలబడ్డాడు.
"అక్కయ్య కుటుంబం పతనమవటంతో అల్లుడు ఆఫీసుకు సరిగ్గా వెళ్ళటం లేదట"--కూతురు అమలతో చెప్పాడు సుదర్శనమూర్తి.
"నేనూ విన్నాను నాన్నా. నాకు చాలా బాధగా ఉంది నాన్నా"
"ఆఫీసులో చాలా పనులు ఆగిపోయున్నాయిట. నా దగ్గర ఫిర్యాదు వచ్చింది" సుదర్శనమూర్తి కూతురు దగ్గర చెప్పాడు.
అమల మౌనంగా నిలబడింది
"ఏమ్మా? అల్లుడు ఎప్పుడు మామూలు మనిషయ్యి, రెగులర్ జీవితంలోకి వస్తాడు? అతని చుట్టూ చాలా బాధ్యతలు ఉన్నాయి!"
"నేను మాట్లాడుతాను నాన్నా"
సోకంగా సోఫాలో కూర్చున్న భర్త దగ్గరకు వచ్చింది అమల, వెంకటేష్ దగ్గర మాట్లాడటం మొదలు పెట్టింది.
"ఎప్పుడు పనుల మీద శ్రద్ద పెడతారు?"
"నాకు ఇష్టం లేదు!"
"మీ ఆవేదనను అర్ధం చేసుకోగలను! అందుకోసం వేల మంది కార్మీకుల జీవితం ప్రశ్నార్ధకం అవచ్చా?"
"దాని గురించి నేను బాధపడటం లేదు!"
"ఇలా మాట్లాడటం న్యాయంగా ఉందా?"
"నా బంధుత్వాలు అన్నీ పోయినై! నేను అనాధగా నిలబడ్డాను!"
“ఏం? మీకు సహాయం చేయటానికి నేను లేనా? నన్ను మీరు మనిషిగా లెక్క వేయటం లేదా?"
వెంకటేష్ కి కోపం వచ్చింది!
"లేదు! లేక్క వేయటం లేదు! నేను నిన్ను ఇష్టపడి పెళ్ళి చేసుకోలేదు! డబ్బుకోసం, నిర్భందం కోసం చేసుకున్నాను. దేనికోసం నన్ను నేను త్యాగం చేసుకున్నానో, అదంతా వృధా అయ్యింది! నాకు జీవించటానికే నచ్చలేదు"
గబుక్కున లేచాడు. ఆ గది నుండి తన గదికి వెళ్ళాడు. అది మేడపై నుండి చూసారు సుదర్శనమూర్తి.
గుమ్మంలోకి వచ్చి నిలబడ్డ జోసఫ్ ఇదంతా విన్నాడు. వెంకటేష్ మాటలు అతనిలో వికారం పుట్టించింది. కడుపు తిప్పుతున్నట్టు అనిపించింది.
లోపల అమల ఏడవటం గమనించాడు.
సుదర్శనమూర్తి గారు కూడ అమల ఏడవటం గమనించారు.
ఆయనలో ఉన్న ఆవేదన, ఆవేశంగా మారటం మొదలుపెట్టింది.
వెంకటేష్ బయటకు వెళ్లటానికి రెడీ అయ్యి హాలుకు వచ్చినప్పుడు.
"అల్లుడుగారూ ఆగండి! నేను కొంచం మాట్లాడాలి?"--వెంకటేష్ ను సుదర్శనమూర్తి ఆపాడు.
"ఏం మాట్లాడాలి?"
"మీ అక్కయ్య కుటుంబం నాశనం అయ్యుండొచ్చు. కానీ దానికి కారణం మేము కాదు! నా కూతుర్ని దండిస్తే, ఇక వూరికినే ఉండను!"
వెంకటేష్ వెనక్కి తిరిగాడు.
"మామయ్యా నాకు ప్రేమ ఒకటే తెలుసు. మీకు డబ్బు తప్ప ఏమీ తెలియదు!”
సుదర్శనమూర్తి కి ఆగ్రహం ఎక్కువైయ్యింది.
"మాటలు తిన్నగా రానివ్వండి అల్లుడు గారూ! ఆ డబ్బూ మీకూ అవసరమొచ్చింది కదా! మీరే వెతుక్కుంటే వచ్చారు. మిమ్మల్ని ఎవరూ కట్టేసి లాక్కు రాలేదు! మీ స్వార్ధం కోసం నా కూతురు మెడలో తాలికట్టారు!"
గబుక్కున తిరిగాడు వెంకటేష్!
"అవును! నా బావ తీసుకున్నపెద్ద అప్పుకు డబ్బులు కట్టటానికీ, ఆయన జైలుకు వెళ్ళకుండా అడ్డుకోవటానికి -- డబ్బు అవసరం ఉండి మీ అమ్మాయి మెడలో తాలి కట్టానండి! ఈ రోజు మా అక్కయ్య పరిస్థితి చూశారు కదా. చూసి కూడా ఎలా ఇలా మాట్లాడ గలుగుతున్నారు”--- అని చెప్పేసి మామగారి జవాబుకు ఎదురుచూడకుండా బయటకు నడిచాడు. గుమ్మం దగ్గర కనబడ్డ జోసఫ్ ను చూసి "రా జోసఫ్...మనం బయటకు వెల్దాం" అన్నాడు.
కారులో వెడుతూ "సార్..." అని వెంకటేష్ తో మాట్లాడబోయాడు జోసఫ్.
“నువ్వేం అడగబోతావో నాకు తెలుసు...నేనే చెప్తాను. అప్పుడే నా మనసులో ఉన్న భారం తగ్గుతుంది. అంతవరకు నువ్వు సిటీలోనే తిరుగు”
జరిగిన సంఘటలను వెంకటేష్ చెప్పటం మొదలుపెట్టాడు!
"ఆ రోజు మనసు బాగలేక సముద్ర తీరానికి వెళ్ళి కూర్చున్నాను.
'ఎలా అప్పులు తీర్చబోతాను?...బావ చేసిన అప్పులు ఎలా తీర్చబోతాను. వారం రోజుల్లో అప్పులు తీర్చకపోతే బావను జైలులో పెడతారు. అప్పుడు అక్కయ్య మొహం నేను ఎలా చూడను' అనే కలతతో -- చీకటి సమయంలో అక్కడ కూర్చున్నాను. ఒకమ్మాయి సముద్రంలోకి దిగటం చూశాను.లేచి పరిగెత్తాను.
అంతలో ఆ అమ్మాయి వేగంగా లోపలకు దిగిపోయింది. నేనూ కూడా పరుగు పెట్టి వెళ్ళి ఆమెను కాపాడాను. ఆమె చెప్పిన అడ్రస్సుకు--బంగళాకు తీసుకు వెళ్ళాను.
ఆమే అమల!
ఆమె ఆత్మహత్యా ప్రయత్నం గురించి తెలుసుకున్న ఆమె తండ్రి సుదర్శనమూర్తి వణికిపోయి ఏడవటం మొదలు పెట్టాడు.
నేను కారణం అడిగాను.
"చెప్తానండీ! నాకు అన్ని వసతులూ ఇచ్చిన ఆ దేవుడు, నా కూతురుకు ఇవ్వవలసింది ఇవ్వలేదు!"
"అలా అంటే?"
“ఆమెకు 18 ఏళ్ళ వయసొచ్చినా ఇంకా పుష్పవతి కాలేదు. ఒక డాక్టరమ్మను కలిసినప్పుడు, పరిశోధనలు చేసేరు! అమలకి గర్భ సంచీ లేదు! ఒక ఆడదానికి జీవితంలో దొరికేవేవీ అమలకు దొరకదని అర్ధం చేసుకున్నాను. ఇది ఆమె మనసులోకి దూరి ఆమెను తీవ్రమైన చిత్రవధకు గురిచేస్తోంది. అందుకే ఆమె చచ్చిపోవాలనే నిర్ణయానికి వచ్చింది!"
"తప్పండీ! మీరు పుట్టిందే ఏదో ఒకటి సాధించటానికే! వారసుడు కావాలంటే రేపు దత్తతు కూడా తీసుకోవచ్చు" అంటూ అమెతో మాట్లాడి మాట్లాడి ఆమె మనసులో జీవించాలనే నమ్మకాన్ని కలుగజేశాను.ఆమె మనసు మార్చాను.
అది ఆమె మనసులో నామీద ప్రేమగా మారింది. నన్ను పెళ్ళి చేసుకోవాలనే ఆశ అమలలో విశ్వరూపం ఎత్తింది!
"నా బావను కాపాడటానికీ, అక్క జీవితంలో దీపం వెలిగించటానికి నాకు డబ్బు అవసరం! పెద్ద మొత్తం! అందుకోసమే ఆమె మెడలో తాలి కట్టాను. ఈ త్యాగంలో స్వార్ధం ఉంది! అదే సమయం దీని వెనుక అతిపెద్ద ద్రోహం దాగుంది!"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి