రూపం తెచ్చిన మార్పు…3 (పెద్ద కథ) "ఏమిటి? పిల్లాడ్ని కాపాడినట్టు ఒక నాటకమాడి, పనిలోకి చేరావా?"
జోసఫ్ కి చెమటలు పట్టినై.
వెంకటేష్ బావ గొంతు సవరించుకుని స్వరం తగ్గించి "ఇలా చూడు! నేను మంచివాళ్ళకంటే, దొంగల్ని త్వరగా గుర్తించగలను! నువ్వు నా దగ్గర కొంచం జాగ్రత్తగా ఉండు! అర్ధమయ్యిందా?"
"ఏమండీ! వస్తారా?" -- మోహన్ రావ్ ని పిలిచింది భార్య.
"వస్తున్నా సుందరీ!"
వెంకటేష్ బావ వేగంగా నడిచి వెళ్ళాడు. జోసఫ్ కి ఇంకా గుండె దఢ తగ్గలేదు.
'ఈ ఇంట్లో మనల్ని గమనించటానికి ఒక శత్రువు ఉన్నాడే! నేను చాలా హెచ్చరికగా ఉండాలి!'-- మనసులోనే అనుకున్నాడు జోసఫ్.
జోసఫ్ లోపలకు నడిచాడు. పది నిమిషాలలో కారు దగ్గరకు వచ్చాడు. వెంకటేష్ పెట్టెతో వచ్చాడు. జోసఫ్ కారు డోర్ తెరిచాడు. ఆయన కూర్చున్న వెంటనే కారు డోర్ మూసి, తను డ్రైవర్ సీటులో కూర్చున్నాడు.
కారు తీశాడు.
"నేరుగా తాజ్ హోటల్ కు పో జోసఫ్!"
"సరే సార్!"
"జోసఫ్! మా బావ ఒక రకమైన మనిషి! పనివాళ్ళను కసురు కుంటూనే ఉంటాడు. ఎవర్నీ సంతోషంగా ఉండనివ్వడు. నువ్వు ఆయన్ని పట్టించుకోవద్దు! అర్ధమైందా?"
"నేను అందరి దగ్గరా మర్యాదగానే ఉంటాను సార్"
"అదే కరెక్ట్ జోసఫ్! అది సరే జోసఫ్, నువ్వు ఎక్కడ స్టే చేస్తున్నావు?"
"ఫ్రెండ్ రూములో!"
"మన బంగళాకు వెనుక గదులు ఉన్నాయి! అక్కడ నువ్వు ఉండొచ్చు!"
"కష్టాలలో ఆదరించిన స్నేహితుడ్ని వదిలేసి ఎలా రాగలను సార్? క్షమించాలి! నేను అతనితోనే ఉండనా?"
"నీకు మానవత్వం ఎక్కువ లాగుందే! సరే! మీ ఫ్రెండ్ షిప్ నా వల్ల చెడిపోకూడదు. అక్కడే ఉండు!"
స్టార్ హోటల్ రావటంతో, కారు ఆపాడు, జోసఫ్!
"జోసఫ్...ఇక్కడ ఒక్క గంటే పని. తరువాత ఏర్ పోర్టుకు వెళ్ళాలి!"
"సరే సార్!"
కారును పార్కింగ్ లో ఉంచి, జోసఫ్ సీటులో జారి కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ చెల్లి మేరీ రూపం కళ్ళ ముందుకు వచ్చింది. ఆ రూపం అతని మనసును కెలికింది.
'భార్యా, మామగారూ వస్తున్నారా?'
'నా మేరీ ఉండవలసిన చోట ఒక కోటీశ్వరురాలా?'
జోసఫ్ కి కోపం వచ్చింది! రక్తం వేడెక్కింది!
'నువ్వు వాళ్ళ మీద కోపం తెచ్చుకుని ఏమిటి లాభం జోసఫ్? ద్రోహి ఈ వెంకటేష్! వెంకటేష్ మేరీని మోసం చేసింది వాళ్ళకు తెలుసో తెలియదో?'
ఆ ప్రశ్న జోసఫ్ మనసులో తలెత్తగానే కొంచంగా వణికాడు.
'అలాగూ ఉండొచ్చో?'
'మేరీని మోసం చేసినట్లే, ఈ డబ్బున్న కుటుంబంలోకి చొరబడటానికి ఏమేమి నాటకాలు, వేషాలూ వేశాడో ఈ వెంకటేష్?'
'ఆ విషయం కూడా కనిపెట్టాలి! అన్నిటినీ బయటపెట్టి, అతన్ని రోడ్డు మీద మీదకు తీసుకు వచ్చి నిలబెట్టి అప్పుడు చంపాలి!
'ఇది జరుగుతుందా?'
'ఎందుకు జరగదు? బూజ్ లో ఏర్పడిన భూకంపంలో ఒకే రాత్రితో ఒక కోటీశ్వరడు అన్నీ పోగొట్టుకుని బిచ్చగాడు అవలేదా? ఎవరికీ ఏదీ శాశ్వతం కాదు! ఒక్క క్షణంలో అన్నీ మారోచ్చు! మార్చాలి!'
‘తొందరపడకు జోసఫ్! నిదానంగా నడుచుకో! ఇక మీదటే నీకు 'ఓర్పు’ అవసరం! గోపాల్ గొంతు చెవిలో మారుమోగింది’!
'నీ అడ్వైజ్ ప్రకారమే నడుచుకుంటా! నా లక్ష్యం నెరవేరాలి!’
విమానాశ్రయానికి వచ్చాడు. పది నిమిషాలలో విమానం దిగింది. పరిశోధనలన్నీ ముగించుకుని అమల, సుదర్శనమూర్తి బయటకు వచ్చారు!
వెంకటేష్ పరిగెత్తుకు రాగా, అది విమానాశ్రయం అనేది మర్చిపోయి, వెంకటేష్ ని కౌగలించుకుంది, అమల.
జోసఫ్ కి వొళ్ళు మండింది!
కొత్త డ్రైవర్ అని జోసఫ్ ని పరిచయం చేశాడు వెంకటేష్. ఇద్దరికీ వందనం తెలిపాడు జోసఫ్!
పెట్టెలను డిక్కీలో పెట్టి, అందరూ కారు ఎక్కగానే-- జోసఫ్ పురాణాన్నే చెబుతూ వచ్చాడు వెంకటేష్.
అమల ఆశ్చర్యపోయింది.
"మనకి ఇలాంటి మానవత్వం, దయ, జాలి గుణం కలిగిన వాళ్ళే చాలా మంది కావాలి!"
పళ్ళు కొరుక్కున్నాడు జోసఫ్!
'అది నీ భర్తకు కొంచం కూడా లేకపోవటంతోనే కదా, నా మేరీ ప్రాణాలు వదిలింది! అతనిపై పగ తీర్చుకోవటానికే కదా నేనొచ్చింది!'
ఇల్లు వచ్చేసింది!
జోసఫ్ పెట్టెలు తీసుకు వచ్చి లోపల పెట్టాడు.
వెంకటేష్ యొక్క అక్కయ్య, బావ వీళ్ళను స్వాగింతించటానికి పరిగెత్తుకు రావటంతో -- జోసఫ్ గదిలో ఒక చివరగా నిలబడ్డాడు.
"నేను భోజనం చేసి అమలతో కాసేపు మాట్లాడేసి వస్తాను జోసఫ్! నువ్వు బయట ఉండు!"
జోసఫ్ కారు దగ్గరకు వచ్చాడు!
సెక్యూరిటీ జోసఫ్ దగ్గరకు వచ్చాడు!
"నువ్వు భోజనం చేశావా జోసఫ్?"
"అయ్యిందన్నా!"
"పరవాలేదే! యజమానుల మనసులో పెద్ద చోటు పట్టావు! నిన్ను నాకూ బాగా నచ్చుతుంది!"
"థ్యాంక్స్ అన్నా!"
"జోసఫ్, మన యజమాని అక్కయ్య భర్త ఉన్నాడే, అతని దగ్గర మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి!"
"ఎందుకు?"
"ఎవరినీ ఇక్కడ చొరవగా ఉండనివ్వరు"
"ఏదో ఒక నెపం వేసి తరుముతాడు! అతనితో పోట్లాట పెట్టుకోలేము! పెద్ద సిగ్గు చేటు ఏమిటో తెలుసా? మనం తీసుకునే జీతంలో పది శాతం అతనికి కమీషన్ గా ఇవ్వాలి!"
"అంత దరిద్రుడా?"
"లేకపోతే, పనిలోనే ఉండలేము! నీ దగ్గరకూ వస్తాడు! చూడు!"
"అతను ఎందుకు వీళ్ళతో ఇక్కడే ఉంటున్నాడు?"
"అతనికి ఒక్క పనీ లేదు! పెద్దాయన వీళ్ళను ఎందుకు ఇంట్లోనే పెట్టుకుంటున్నాడో ఎవరికీ తెలియదు. అల్లుడు మీద మర్యాద ఉండాల్సిందే. అందుకోసం ఆయన కుటుంబాన్నే భరించాలా?….సరేన్నా! మనం మాట్లాడుకునేది చూసి ఎవరూ సందేహ పడకూడదు!"
జోసఫ్ అక్కడ్నుంచి వెనక్కి తిరిగి వెళ్ళాడు.
ఎదురుగా మోహన్ రావ్!
జోసఫ్ నమస్తే చెప్పాడు.
"సెక్యూరిటీతో ఏమిటి రహస్య ఆలొచన పెట్టావు. ఎవర్ని మోసం చేద్దామని ప్లాన్ వేస్తున్నావు? నా పిల్లాడ్ని పెట్టుకుని మోసం చేసి లోపలకు వచ్చావు. అది నాకు తెలియదనుకున్నావా? ఈ విషయం అందరితో చెప్పకుండా నిన్ను వదలను!"
జోసఫ్ నవ్వాడు.
"ఎందుకు నవ్వుతున్నావు?"
జోసఫ్ అతని దగ్గరగా వచ్చాడు.
"మా యజమాని ఈ ఇంటి అల్లుడు! ఇంటల్లుడుగా ఉండటం అవమానం...పోతేపోనీ! ఆ విషయం వదిలేద్దాం. ఆయన బావవు నువ్వు...పనీ పాటూ లేని సోమరివి. ఉచిత భోజనం చేసే వాడివి. కష్ట పడి పని చేస్తున్న మమ్మల్ని తరమటానికి నీకు యోగ్యత ఉందా?"
మోహన్ రావ్ బిగుసుకుపోయాడు....అతనికి కోపం నడి నెత్తికి ఎక్కింది!
"రేయ్! మర్యాద లేకుండా నాతో ఎగతాలిగా మాట్లాడతావా? నా పవర్ ఏమిటో తెలుసా? ఎవర్ని చూసి ఉచిత భోజనం గాడివి అని చెప్పావు? ఇంకో పది నిమిషాలలో నిన్ను మెడ పుచ్చుకుని గెంటకపోతే...నా పేరు మోహన్ రావే కాదు?"
వణుకుతున్న గొంతుతో, ఆందోళనతో ఆ మోహన్ రావ్ లోపలకు వెళ్ళాడు.
సెక్యూరిటీ జోసఫ్ దగ్గరకు వచ్చాడు. "అన్నీ విన్నాను! తొందరపడ్డావే జోసఫ్! ఇప్పుడే నీ ఉద్యోగం ఊడిపోతుంది" అన్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి