10, మార్చి 2020, మంగళవారం

"మీలా లేడండి...!"....(కథ)




                                                     "మీలా లేడండి...!"
                                                                (కథ)


"ఏమండీ...మీ అబ్బాయ్, మీ లాగా లేడండి!" -- అని చెప్పిన తన భార్య విమలను ఆశ్చర్యంగా చూసాడు సత్యమూర్తి. కొంచం దిగ్భ్రాంతి కూడా చెందాడు.

ఇలాంటి ఒక నిరుత్సాహం, ఆమె దగ్గర నుండి వస్తుందని ఏమాత్రం అతను అనుకోలేదు.

'ఎందుకలా చెబుతోంది?' -- ఎరుపెక్కిన కళ్ళతో మంచంలో కూర్చోనున్న తన భార్యను చూశాడు.

ఈ ముప్పై ఏళ్ళల్లో ఆమె అంతలా మనసు విరిగి పోవటం తను చూడలేదు.

పాపం అనిపించింది. ఆమె చేతులు గట్టిగా పుచ్చుకున్నాడు.

"ఎందుకు విమలా అలా మాట్లాడుతున్నావు?" -- మాటల్లో ఓదార్పు పూసి అడిగారు.

సమాధానం చెప్పటానికి నోటి నుండి ఏమీ రాలేదు! విమల కూడా భర్త చేతులు గట్టిగా పుచ్చుకుంది.

భర్త రెండు చేతులూ పుచ్చుకుని, తన మొహానికి అడ్డుపెట్టుకుని వెక్కి, వెక్కి ఏడ్చింది.

ఆమెకు ఓదార్పు కావాలి. ఆమె తల మీద చేయి పెట్టి తన గుండెలకు హత్తుకున్నాడు సత్యమూర్తి..

విమల కళ్ళ ముందు పాత జ్ఞాపకాలు నీడలాగా పరిగెత్తినై. అప్పుడు ఆమె గర్భంతో ఉన్నది.

"ఏమండీ...మీ అబ్బాయి మీలాగానే ఉన్నాడండి..."

"ఎందుకలా చెబుతున్నావు?"

"ఎంతలా తోసుకుంటూ కాలుతో తంతున్నాడండీ..." అని భార్య చెప్పిన వెంటనే పగలబడి నవ్వాడు.

అర్జున్ పుట్టినప్పుడు "ఏమండీ, అబ్బాయి ముక్కూ , మొహమూ, నుదురూ చూడండి. అచ్చం మీలాగే ఉంది. మీ పోలికలే ఉన్నాయి. గిరజాల జుట్టు కూడా అదేలాగనే ఉంది"

నడవటం మొదలు పెట్టిన ప్రారంభంలో "నడిచే అందంలోనూ వీడు మిమ్మల్ని వొలిచి పెట్టినట్టు ఉన్నాడు చూడండి" అన్నది.

స్కూలుకు వెళ్ళే వయసు వచ్చినప్పుడు "ఏమండీ వీడు అచ్చం మీలాగానే...'నేను చెప్పేది అర్ధమవుతోందా?' అని అడుగుతున్నాడండీ”

ఇలా రోజుకు ఒకసారైనా కొడుకును భర్తతో పోల్చి చెప్పని రోజే లేదు.

విమల అలా చెప్పినప్పుడల్లా... సత్యమూర్తి మొహంలో గర్వం, గొప్పతనం కనబడుతుంది. సత్యమూర్తికి ఆమె వర్ణనను పోల్చి చేసి చూడాలనే ఉంటుంది.

కొన్ని సమయాలలో సంతోషంలో ఆమెకు వొళ్ళు జలదరిస్తుంది. అదే విమల ఈ రోజు. "ఏమండీ...మీ అబ్బాయి మీలాగా లేడు" అని చెప్పినప్పుడు ఏర్పడ్డ ఆశ్చర్యం, షాక్ నుండి సత్యమూర్తి ఈ నిమిషం వరకూ తేరుకోలేదు.

వెక్కి వెక్కి ఏడుస్తున్న విమల గడ్డం పుచ్చుకుని, మొహాన్ని పైకెత్తాడు. చెమర్చిన, ఎరుపెక్కిన ఆమె కళ్ళను చూసి మళ్ళీ అడిగాడు.......

"ఎందుకలా చెబుతున్నావు?"

"అవునండీ...మీ దగ్గర ఈ ముప్పై సంవత్సరాల జీవితంలో, 'నా మాట వినండి...నేను చెప్పేది చేయండి అని ఎన్ని సార్లు చెప్పానో మీకు గుర్తుందా"

"నేను చెప్పింది చెయ్యలేదని మీ దగ్గర ఎన్నిసార్లు, ఎంత గొడవ చేసుంటాను? అన్నిటినీ సహిస్తూ, ఓపికగా ఉంటూ, మీ అమ్మా-నాన్నలను మనతోనే ఉంచుకుని కాపాడారు. కానీ, ఈ విషయంలో వాడు అలాగే మీకు ఆపోజిట్ గా ఉన్నాడు. మారిపోయాడు..." ఏడుస్తూ చెప్పింది!

"డబ్బులు కట్టేశాను...అప్పుడప్పుడు వచ్చి చూస్తాను...చూసి జాగ్రత్తగా ఉండండి!" అని చెప్పేసి వృద్దాశ్రమంలో నుండి బయటకు వెడుతున్న తన కొడుకు చెవులకు వినబడేలాగా మళ్ళీ ఒకసారి చెప్పింది విమల.

"ఏమండీ...మీ అబ్బాయి మీ లాగా లేడండి!" **************************************************సమాప్తం**************************************

3 కామెంట్‌లు:

  1. కథ బాగుంది. క్లుప్తత, స్పష్టత కలిగి చక్కగా ఉంది. ఆ అబ్బాయి పేరు మీరు చెప్పలేదు - అవసరం కాదు అవసరం కాదు కథా శిల్పం దృష్ట్యా అని కదా, ఆ మాటా ఆ పిల్లాడి తల్లిదండ్రులకూ వర్తిస్తుంది. వీలైతే అలా సవరించండి. అన్నట్లు మీ కథలో కొసమెఱుపు చాలామందికి నచ్చుతుందని అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు సార్....కొడుకు పేరు ఒకే ఒక చోట చెప్పాను. కానీ, నిజానికి ఈ కథకు కొడుకు పేరు పెద్దగా అవసరం లేదు అనిపించింది. తల్లి-తండ్రుల పేర్లు రాయకపోతే ఈ కథ ఒక వ్యాసంలాగా ఉంటుందేమోనని అనిపించింది.

      తొలగించండి
    2. అవునండి ఒకపేరాను "అర్జున్ పుట్టినపుడు" అని మొదలుపెట్తారు. కథలో పాత్రలకు అవసరం కాకపోతే పేర్లు పెట్టనవసరం లేదు. పాత్రల పేర్లు లేనంత మాత్రాన కథ కాస్తా వ్యాసం ఐపోదండీ.

      తొలగించండి