2, ఏప్రిల్ 2021, శుక్రవారం

పెంపకం…(కథ)

 

                                                                                        పెంపకం                                                                                                                                                                                      (కథ

 పుట్టింటికి వచ్చి రెండు రోజులయ్యింది. తల్లి తనతో సరిగ్గా మాట్లాడ్డం లేదు. మొహం చాటేస్తోంది. తాను ఏదైనా మాట్లాడితే ముఖం పక్కకు తిప్పుకుని ఒక ముక్కతో సమాధానం చెబుతోంది. ఎప్పుడూ తన మీద అపరితమైన ప్రేమను చూపే తల్లి విధంగా ఉండటం జానకి కి బాధ కలిగించింది. ఉండబట్టలేక అడిగేసింది.

"ఏంటమ్మా? ఏమైందని నువ్విప్పుడు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు? నేనేం తప్పు చేశేనని నువ్వు నాకు అంత దూరంగా ఉంటున్నావు" తల్లిని నిలదీసింది జానకి.

"ఏం తప్పు చేశేనని అడుగుతున్నావా...నీకు తెలియదు నువ్వేం తప్పు చేశేవో" …కస్సు మన్నది జానకి తల్లి అనసూయ.

"చెబితేనేగా తెలిసేది" తాను కూడా కస్సుమని అరిచింది జానకి.

"నువ్వు నీ అత్తగారిని కష్టపెడుతున్నది నాకు కొంచం కూడా నచ్చలేదు"

"ఆవిడ్ని నేను ఏం కష్టపెట్టానని నువ్వింత రాద్దాంతం చేస్తున్నావు"

"నా కంటే వయసులో పెద్దదైన ఆవిడ్ని అన్ని పనులూ చేయమని చెప్పి ఆవిడ్ని ఒక పనిమనిషిలా చూస్తున్నావే...నీకు కొంచం కూడా జాలనేదే లేదా? చదువుకున్న అమ్మాయికి సంస్కారం ఉండక్కర్లా? "

పనులు చేస్తే తప్పేమిటి? అంతకంటే ఇంకేం పనుంది ముసలిదానికి? నేను ఆఫీసుకు వెళ్ళి రాత్రి ఏడింటికి తిరిగి వచ్చేటప్పటికి ఎంత టయర్డ్ గా ఉంటానో తెలుసా? ఇంట్లో కూర్చుని మూడుపూట్లా మెక్కి తినే మనిషి కొంచం పనులు చేస్తే అరిగిపోతుందా?"

"ఓహో...ముసలిదని చెబుతున్నావా? పనికి వెడుతున్నావు కాబట్టి అత్తగారిని మర్యాద లేకుండా అలా మాట్లాడతావా?...డబ్బుకు కొదవలేదు. వెయ్యో, రెండువేలో పడేస్తే ఒక పనిమనిషి దొరుకుతుంది...అన్ని పనులకూ ఒక పనిమనిషిని పెట్టుకోవచ్చు కదా?"

"పనిమనిషిని పెట్టుకోవాలో అక్కర్లేదో నిర్ణయించుకోవలసింది నా భర్త ఇష్టం"

"నువ్వు మీ అత్తగారిని చూసుకునే విధం చూసి మీ చుట్టుపక్కలున్న వాళ్ళు నిన్ను "పీడించుకుని తినే కోడలు" అనే పేరు తెచ్చుకోకుండా చూసుకో...నాకు చాలా అవమానంగా ఉంది?"

"ఎందుకని ఇప్పుడు ఏవేవే మాట్లాడి నస పెడుతున్నావు? నేనంత కఠినాత్మురాలినా?"

"కాదా...ఒక బిడ్డను కని, కంటికి రెప్పలా చూసుకుని, కష్టపడి పెంచి, పెద్దవాడ్ని చేసి, బాగా చదివించి, పెద్ద ఉద్యోగానికి పంపి, చేతి నిండుగా డబ్బు సంపాదించే పొజిషన్ కు వచ్చిన కొడుకును భర్తగా నీకిచ్చింది...అలాంటి భర్తను నీకు అందించిన ఆవిడపైన నీకు కృతజ్ఞతా భావం ఉండక్కర్లేదా....అలాంటి అత్తగారిని దైవంగా చూడద్దూ?"

"ఆవిడ్ని ఎలా చూడాలో నాకు బాగా తెలుసు...నువ్వు నాకు పాఠాలు చెప్పక్కర్లేదు..." జానకి ముగించే లోపు ఫోను మోగింది.

తల్లి అనసూయ ఫోను ఎత్తింది...ఫోన్లో అవతల జానకి అత్తగారు కస్తూరమ్మ.

"చెప్పండి...వదినగారు" భవ్యంగా మాట్లాడింది జానకి తల్లి అనసూయ.

"నా కోడలు గురించి మీతో చాలా మాట్లాడాలి. జానకి దగ్గరున్న తప్పొప్పుల గురించి మీ దగ్గర నా మనసు విప్పి మాట్లాడాలి" చెప్పింది కస్తూరమ్మ.

."..........." ఏం చప్పాలో తెలియక కూతురివైపు ఒకసారి చూసింది అనసూయ.

మళ్ళీ జానకి అత్తగరే మాట్లాడింది "ప్రొద్దున్నే కాఫీ పెట్టాలి, టిఫిన్-భోజనం రెడి చేయాలి...ఇంకా అన్నీ నేనే చేయాలి"

"వదినగారూ... పనులన్నీ మీరెందుకు చేస్తున్నారు" అడిగింది జానకి తల్లి అనసూయ.

"ఊరికే ఉండవమ్మా! వయసైన కాలంలో ఆడుతుపాడుతు హుషారుగా ఉంటేనే కదా...మనవడు, మనవరాళ్ళతో ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండొచ్చు. మూడు పూట్లా కడుపు నింపుకుని వూరికే కూర్చుంటే ఏమవుతుంది? తరువాత బి.పి, షుగర్, మోకాళ్ళ నొప్పులు లాంటి వ్యాధులు వచ్చేస్తాయి"

తల్లి మాట్లాడుతున్నప్పుడే తల్లి చేతిలోనుండి రిసీవర్ లాక్కుని "మేడం...జానకి మాట్లాడుతున్నాను. బాగున్నారా?" అత్తగారిని అడిగింది జానకి.

"ఏమిటే పిల్లా...నేను నీకు మేడం నా?"

లేకపోతే కన్నె పిల్లవా?...కావాలంటే ఇక మీదట పేదరాసి పెద్దమ్మా అని పిలుస్తా...చాలా"

నేను పేదరాసి పెద్దమ్మనా? ఇక్కడికిరా నీ పని చెబుతాసరే మధ్యాహ్నం భోజనం చేశావా?" ఆప్యాయంగా అడిగింది.

"ఇక్కడ హాయిగా భోజనం తినే భాగ్యం నాకు లేదు. ఎప్పుడు చూడు ఒకటే నస"

"ఎవరు నస పెడుతున్నారు...ఎందుకు నస పెడుతున్నారు"

అప్పుడు కూతిరి చేతిలో నుండి రీసీవర్ లాక్కుని అనసూయ మాట్లాడింది "మీ ఇంట్లో నా కూతుర్ని చాలా బాధపెడుతున్నారట"

"అలా చెప్పిందా...?"

తరువాత ఇంకో విషయం వదినగారు. మిమ్మల్ని పేదరాసి పెద్దమ్మ, ముసలిది అంటోంది. చిన్నా-పెద్ద మర్యాద ఉండక్కర్లేదా...ఇది తప్పు కాదా? అలా మాట్లాడటాన్ని ఖండిచక్కర్లేదా?...దీన్నే నస అంటోంది"

"ఓహో...అదా విషయం! జానకి నా గారాల పట్టి. కొన్ని సార్లు రావే-పోవే అని పిలుస్తుంది. ఇది మీకు తెలుసా?"

తల్లి ఏదో చెప్పబోతుంటే ఆమె మాటలకు అడ్డుపడిన జానకి "అవునమ్మా...నువ్వు వూరికే ఉండు. స్నేహితుల మధ్య వయసు తేడాలు ఉండవు. ఎలా కావాలంటే అలా మాట్లాడుకోవచ్చు" అన్నది.

ఇవన్నీ రిసీవర్లో అవతల వైపు నుండి వింటున్న జానకి అత్తగారు కస్తూరమ్మ "మళ్ళీ మీ పోట్లాటను మొదలు పెట్టారా? అమ్మా...జానకమ్మా...రెండురోజులు ఉండిరా. తల్లితో గొడవ పెట్టుకుని మరుసటిరోజే బయలుదేరి రామోకు...అనసూయ బాధ పడుతుంది" కోడలుతో చెప్పింది.

"కుదరదు పాపా...నేను రేపే బయలుదేరి వస్తాను. దీనికి అడ్డు చెప్పారా, నా సొంత ఇంట్లోకి నన్ను రానివ్వటం లేదని మీ మీద పోలీసు కంప్లైంట్ ఇస్తా" అత్తగారిని వెళాకోలంగా బెదిరించింది జానకి.

"తల్లీ...సర్వాధికారీ, నువ్వు అలా చేసినా చేస్తావు గాని...రేపే బయలుదేరి వచ్చేయమ్మా"

"అది... భయం ఉండాలి...ఫోను పెట్టేస్తున్నా అత్తా" అని చెప్పి ఫోను పెట్టేసిన జానకి మెల్లగా నడుచుకుంటూ హాలులో ఉన్న సోఫాలో కూర్చుని టీ.వీ ఆన్ చేసి చూడటం మొదలు పెట్టింది.

ఆశ్చర్యం నుండి ఇంకా తేరుకోని జానకి తల్లి అనసూయ, కూతురి వెనుకే మెల్లగా నడుచుకుంటూ వచ్చి, సోఫాలో కూర్చున్న కూతురి పక్కనే కూర్చుని " దొంగా...ఒక నాటకమే ఆడి నన్ను పిచ్చిదాన్ని చేశేవే?... కుటుంబ గౌరవాన్ని కాపాడేవే తల్లి" అంటూ కూతుర్ని కౌగలించుకుని " రోజు లాగా, నీ పెళ్ళి రోజున కూడా నేను ఇంత సంతోషంగా లేనే...అత్తగారిని ముసలిదానా అంటున్నావు, పాపా అంటున్నావు, పేరు పెట్టి పిలుస్తున్నావు. ఇలాంటి అత్తా-కోడళ్ళను నేను చూసిందే లేదు" అంటూ కూతుర్ని ముద్దు పెట్టుకుంది.

అదంతా నీ పెంపకం విధానమే అనసూయ. నిజమైన ప్రేమ - అభిమానంతో ఎటువంటి వారినైనా కట్టి పడేయొచ్చు అని నాకు పాఠాలు చెప్పింది నువ్వే కదా... అంతే కాదు నువ్వు నీ అత్తగారిని...అదే బామ్మను ఎలా ప్రేమగా చూసుకునే దానివో నేను చూడలేదా? మీరిద్దరూ అత్తా కోడళ్లేనా అనే సందేహం నాకు ఎన్నో సార్లు కలిగింది. అలాంటి ప్రేమను నీ దగ్గర చూసిన నేను ఇంకెలా పెరుగుతాను. ప్రేమ-అభిమానాలు చూపే పిల్లగానే పెరిగాను. ఇంత వయసు వచ్చింది ఇది కూడా నీకు తెలియదా" అన్నది జానకి.

"చెప్పుడు మాటలు విని నిన్నురాతి గుండె దానివని తిట్టేను... నన్ను క్షమించు తల్లీ" అంటూ బుజ్జగిస్తూ మళ్ళీ కూతుర్ని ముద్దు పెట్టుకుంది అనసూయ.

"నన్ను మెచ్చుకున్నది చాలు గానీ....నన్ను టీ.వీ సీరియల్ చూడనిస్తావా" తల్లిని బ్రతిమిలాడింది జానకి.

"నీ ఇష్టమొచ్చినట్లు ఉండవే తల్లీ" అని చెప్పి సంతోషంగా వంట గదిలోకి వెళ్ళింది అనసూయ.

***********************************************సమాప్తం***************************************

ఇవి కూడా చదవండి:

ఆర్గానిక్...(కథ)

మీలా లేడండి...!...(కథ)

**********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి