మానవత్వం (సీరియల్/నవల)
సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు. మానవత్వం లేని మతం రాణించదు.మానవత్వం అంటే కరుణ, ప్రేమ, దయ, ఇంకా ఎన్నో ఉన్నాయి.ఉదాహరణకు: బాధితులపట్ల కనికరం చూపటం, కులమతాలకు అతీతంగా మనుషులందరినీ ప్రేమించటం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం ఇంకా ఎన్నో. ఈ గుణాలన్నీ ఆడవారికి ఎక్కువగా ఉంటుందని చెబుతారు. ఈ నవలలోని హీరోయిన్ అలాంటి గుణం కల ఒక ఆడది. తనని పెళ్ళి చూపులకు (ప్రేమించినతనే) వస్తున్నారని తల్లి ఆఫీసుకు ఫోన్ చేసి, ఆఫీసు నుండి త్వరగా బయలుదేరి రమ్మని చెప్పింది.
ఇంటికి వస్తున్న దారిలో చెత్త కుండికి దగ్గరగా ఎవరో అప్పుడే పుట్టిన బిడ్డను పడేశారు. మానవత్వం నిండిన హీరోయిన్ అందరూ వేడుక చూస్తూండగా, తానుగా ముందుకు వచ్చి ఆ బిడ్డను కాపాడి ఇంటికి తీసుకు వెళ్ళింది.
పిల్లను చూద్దామని వచ్చిన పెళ్ళి వారు, ప్రేమికుడూ, తల్లి, తండ్రి, మిగిలిన కుటుంబ శభ్యులు ఆమె చర్యకు ఆశ్చర్యపోయారు. హీరోయిన్ బిడ్డను ఏం చేసింది? ప్రేమికుడికి ఏం సమాధనం చెప్పింది? తల్లి-తండ్రులకు ఏం చెప్పింది?......చివరికి ఆమె, ఆమె జీవితాన్ని, బిడ్డ జీవితాన్ని ఎలా మలుచుకుంది?...ఇవన్నీ ఈ సీరియల్ ను/నవలను చదివి తెలుసుకోండి.
PART-1
యంత్రంలాగా పనిచేస్తున్న ప్రపంచంలో ఎక్కడో ఒక మూల కనబడుతూనే
ఉన్నది మానవత్వం అనే తడి.
ఆఫీసు పనిలో లీనమైపోయిన యామిని, ఆరవసారిగా తల్లి దగ్గర నుండి వచ్చిన సెల్ ఫోన్ ఆహ్వానం వలన, అవసరవసరంగా టేబుల్ మీదున్న ఫైళ్ళను మూసేసి, ఫైళ్ళను టేబుల్ సొరుగులో పెట్టి, సొరుగుకు తాళం వేసి, తాళం చెవిని హాండ్ బ్యాగులో వేసుకుని లేచింది.
సహ ఉద్యోగి నలిని యామినిని ఆశ్చర్యంగా చూసింది.
"ఏమిటి యామిని...ఈ రోజు త్వరగా బయలుదేరావు?"
"దివాకర్ వాళ్ళింట్లో నుండి వస్తున్నారు"
"పెళ్ళి చూపులకా?"
"ఆలాంటిదే" చిన్నగా నవ్వుతూ అన్నది యామిని.
యామినిని కోపంగా చూస్తూ "నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే?" అన్నది నలిని.
"ఊష్! గట్టిగా మాట్లాడకు...'ప్లీజ్'. ….. అసలు వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలుసా? వాళ్ళకు నేను, మా కుటుంబం నచ్చాలట. మా కుటుంబంలోని వారికి వాళ్ళు నచ్చాలి. దాని తరువాతే మిగిలిన విషయాలన్నీ. అందుకే...అంతవరకు ఎవరిదగ్గరా చెప్పకూడదని ఆగాను"
"నువ్వు చాలా మొండిదానివే!?"
"చెప్పకూడదని అనుకోలేదు నలిని. అన్నీ ఓ.కే. అయిన తరువాత చెబుదామని ఆగాను "
"అర్ధమైంది. ఏది ఏమైనా...నీకు నా శుభకాంక్షలు..."
"థాంక్యూ! నేను బయలుదేరుతాను"
నవ్వుతూ సహ ఉద్యోగిని దగ్గర సెలవుతీసుకుని, మేనేజర్ రూముకు వెళ్ళి అనుమతి తీసుకుని నడకలో వేగం పెంచి మెట్రో రైలు స్టేషన్ కు వచ్చి చేరింది యామిని.
చేతి గడియారంలో టైము చూసింది. సాయంత్రం నాలుగు అయ్యింది.
'ఆరు గంటలకే కదా వస్తానని చెప్పాడు దివాకర్….ఒక గంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చు’ మనసులోనే అనుకుని ఒకసారి చుట్టూ చూసింది యామిని. ప్లాట్ ఫారం మీద అక్కడక్కడా జనం నిలబడున్నారు. ‘ఇంకొంచం సేపట్లో జనం ఎక్కువ అవుతారు. ఆ లోపు రైలు వచ్చేస్తే పరవాలేదు’ అనుకుంటూ రైలు వచ్చే మార్గాన్నే చూస్తోంది. దూరంగా రైలు రావడం కనబడింది.
ప్రయాణీకులు ప్లాట్ ఫారం చివరకు వచ్చి నిలబడ్డారు. పెద్ద మోతతో ఆ విద్యుత్ రైలు వచ్చి ఆగింది.
లేడీస్ పెట్టెలోకి ఎక్కి కూర్చుంది. తనని రిలాక్స్ చేసుకుని, బ్యాగ్ తెరిచి సెల్ ఫోన్ తీసి చూసింది.
పన్నెండు మిస్డ్ కాల్స్. 'ఓ గాడ్' అనుకుంటూ వాటిని చెక్ చేసింది. అమ్మ మరియు దివాకర్...మారి మారి కాల్ చేశారు. మొదట తల్లికి ఫోన్ చేసింది. రింగ్ కొట్టిన వెంటనే 'ఫోన్’ తీసి కోపంగా మాట్లాడింది యామిని తల్లి సరోజ.
"ఏమిటే...ఫోన్ చేస్తే తీయవా?"
"సైలెంటులో పెట్టుంచాను...ఇప్పుడే తీసి చూశాను"
"అంటే ఇంకా ఆఫీసులోనే ఉన్నావా?"
"లేదమ్మా...బయలుదేరాను.వస్తున్నాను"
"బయలుదేరేవా! త్వరగారావే. ఇక్కడ అందరూ చాలాసేపటి నుంచి కాచుకోనున్నారు"
“అందరూ అంటే ఎవరమ్మా?"
"పెళ్ళికొడుకు తరఫు వాళ్ళు"
"ఏమిటీ!?"- సీటులో వేనక్కి జరిగి నిటారుగా కూర్చుంది యామిని.
"మూడు గంటలకే వచ్చాశారు. నువ్వు త్వరగా వచ్చి చేరు. పెళ్ళికొడుకు తల్లికి మొహమే మారిపోయింది. గొణుగుతూనే ఉన్నది. అందుకే 'లీవ్' పెట్టు...'లీవ్' పెట్టు అని మొత్తుకున్నాను. విన్నావా?"
"అమ్మా... ఆరు గంటలకు కదా వాళ్ళు వస్తామని చెప్పింది? మూడింటికే ఎందుకు వచ్చారట?"
“ఆరు గంటలకు ఒక ఫంక్షన్ కు వెళ్ళాలట. ఈరోజు ప్రొద్దునే చెప్పారట. అందుకే 'మూడింటికే వచ్చేస్తాం' అని మధ్యాహ్నమే ఇంటికి ఫోన్ చేసి చెప్పారు. నేనూ పదిసార్లు నీకు ఫోన్ చేశాను. ఫోన్ తీయలేనంత ముఖ్యమైన పనేమిటే?”
"సరేనమ్మా...గొణగకు. నేను వచ్చేస్తాను"
"సరే...స్టేషన్ నుండి నడిచి రాకు! 'ఆటో' చేసుకురా"
'సరే" అంటూ ఫోన్ కట్ చేసింది యామిని.
'ఛఛ! ఈరోజే పని ఎక్కువ రావాలా! 'ఫోన్’ అయినా గమనించి ఉండాలి. దివాకర్ తల్లితండ్రులు మొట్టమొదటిసారి నన్ను చూడటానికి వచ్చినప్పుడు నేను ఇలా నలిగిపోయిన చీర, వాడిపోయిన జిడ్డు మొహం వేసుకుని వాళ్ళ ముందు నిలబడాల్సి వచ్చిందే! ఇంతసేపు వాళ్ళను కాచుకోనిచ్చానే? వెళ్ళిన వెంటనే క్షమించమని అడగాలి’--అనుకుంటున్నప్పుడు తాను దిగాల్సిన స్టేషన్ వచ్చింది.
హడావిడిగా దిగింది. వేగంగా నడిచి స్టేషన్ బయటకు వచ్చి, ఆటో స్టాండు వైపుకు వెళ్ళింది. ఆటో స్టాండ్ దగ్గర చాలామంది గుమికూడి ఉన్నారు.
'ఏమీటీ గుంపు? ఎందుకని దారికి అడ్డంగా గుమి కూడి ఉన్నారు?' కొంచం విసుగ్గా గుంపును తోసుకుంటూ ముందుకు కదులు తుండగా...చెవిని తొలుస్తునట్టు ఒక శబ్ధం. సన్నని గొంతు నుండి వస్తున్న ఏడుపు. అది మామూలు ఏడుపు కాదు. గొంతు ఎండిపోతున్నా ఆపుకోలేని బాధతో కూడిన ఏడుపు. ఆ ఏడుపు విన్న వెంటనే యామిని పాదాలు సడన్ గా ఆగినై. గుంపును తోసుకుంటూ, ఏడుపు వస్తున్న వైపు వేగంగా వెళ్ళి ఆగింది. అక్కడ చూసిన దృశ్యం ఆమె గుండెను పిండేసింది.
పుట్టి కొన్ని గంటలే అయిన ఒక పసి గుడ్డు, పేగు కూడా పూర్తిగా కోయబడని స్థితిలో...మురికి కాలువ దగ్గరగా 'పాలీతిన్’ సంచీతొ చుట్టబడి పడుంది. కాళ్ళూ, చేతులూ ఎగరేసుకుంటూ గొంతు చించుకుని ఏడవటం వలన 'పాలితిన్’ సంచీ నుండి కొంచంగా బయటకు వచ్చిన ఆ పసిగుడ్డు, మట్టి నేల మీద ఉండగా... యామిని వొల్లు కంపిస్తూ, మనసు కొట్టుకుంటుంటే పరిగెత్తుకునెళ్ళి ఆ పసిబిడ్డను ఎత్తుకుంది.
"అయ్యో! ఎంత దారుణం ఇది? ఏమ్మా ఇంతమంది గుమికూడి ఉన్నారే...ఎవరైనా ఒక్కరు ఈ పసిబిడ్డను నేలపై నుండి తీసుండకూడదా? గొంతు చించుకునేల ఏడిపించి, వేడుక చూస్తూ నిలబడ్డారే...? మీకందరికీ హృదయం ఉండాల్సిన చోట రాయి పెట్టేశాడా ఆ దేవుడు?" ఆవేశంగానూ, కోపంగానూ అడుగుతూ పసిబిడ్డ చుట్టూ ఉన్న పోలితిన్ సంచీని తీసి అవతల పారేసింది.
ఆ పసిబిడ్డ వొల్లంతా చీమలు తిరుగుతున్నాయి...వొణికిపోయింది యామిని.
"అయ్యో ఎన్ని చీమలో? ఎవరైనా మంచినీళ్ళు ఉంటే ఇవ్వండి"
"ఏమ్మా! ఇప్పుడే పుట్టిన బిడ్డ అది. నీళ్ళు పోయబోతావా?" గుంపులో ఉన్న ఒక ఆవిడ అడగగా కన్నీటితో ఆవిడవైపు చూసింది యామిని.
"బిడ్డ వొళ్ళంతా మట్టి, మురికిగా ఉన్నది. కడిగితే ఏమీ అవదు. 'ప్లీజ్'....ఎదురు కొట్టుకు వెళ్ళి ఒక బాటిల్ నీళ్ళు తీసుకురండి" ప్రాధేయపడింది.
"ఇదిగో చూడమ్మా...చూస్తే వయసులో ఉన్న అమ్మాయిలాగా కనబడుతున్నావు. నీకు అనుభవం చాలదు. చల్లటి నీళ్ళు పోస్తే వెంటనే జ్వరం వస్తుంది. ఆ జ్వరం వస్తే బిడ్డ బ్రతకదు. బిడ్డ చచ్చిపోతే నీతో పాటు నేనూ పోలీసులకు పట్టుబడతానే"
"ఏమిటీ...జ్వరం వస్తుందా"
"అవునమ్మా! ఇంతకుముందే బిడ్డ ఏడ్చి ఏడ్చి గుక్క తిప్పుకోలేకపోయింది. చూడు...ఛాతి కూడ ఎలా పైకీ కిందకూ వేగంగా ఆడుతున్నదో..."...ఆవిడ చెప్పిన తరువాత...పసిబిడ్డను పూర్తిగా చూసింది యామిని.
ఆ పసిగుడ్డు చాలాసేపటి నుండి ఏడుస్తూ ఉండుండాలి. నాలిక ఎండిపోయి, ముఖమంతా ఎర్రబడి...గొంతు సరిగ్గా రాక, ఏడవటానికి తత్తరబిత్తర పడుతోంది. గుండె గూడు వేగంగా కొట్టుకుంటోంది. గొంతు దగ్గర ఏర్పడిన లోతు, వెక్కిళ్ళు మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టటంతో... యామిని హృదయం తల్లడిల్లింది.
"అరె ఏమైంది...? పెద్దమ్మా కొంచం చూడమ్మా" భయంతో అడిగింది యామిని.
"ఇక బ్రతకదమ్మా..."
"రెండు గంటలుగా ఆపకుండా ఏడుస్తున్నది. ముఖమంతా రంగు మారింది. ఇక బ్రతకదు. సైలెంటుగా తీసిన చోటే పడేసి వచ్చేయమ్మా. చేతుల్లో ఉన్నప్పుడు ప్రాణం పోతే...మీమీదే పోలీసులు సందేహపడతారు. అందుకనే మేము దూరంగా నిలబడ్డాం. ఏమీ చేయకుండా మేమందరం ఎందుకు నిలబడున్నామో తెలుసుకోకుండా నువ్వెళ్ళి గబుక్కున బిడ్డను తీసుకున్నావే...?" గుంపులోని మరొక ఆవిడ యామినిని హెచ్చరించింది.
"మీరందరూ మానవ జన్మ ఎత్తిన వారేనా? మీ అందరికీ గుండెళ్ళో కొంత కూడా జాలి, దయ లేదా? రెండు గంటలుగా చీమలు, దోమలు కుట్టటం తో ఈ పసిగుడ్డు అల్లలాడిపోయుంటుందే. ఆ బిడ్డను కాపడదామనే ధ్యాస లేకుండా...'ఎప్పుడు చచ్చిపోతుంది?' అని కాళ్ళు నొప్పులుపుడుతున్నా నిలబడి వేడుక చూశారే. మీకందరికీ సిగ్గుగా లేదు? మీరందరూ పిల్లల్ను కన్న వాళ్ళే కదా? ఎలాగమ్మా ఇలా మనసులో జాలి లేకుండా నిలబడ్డారు...?”
"ఇలా చూడమ్మా...ఊరికే నోరు పారేసుకోకు! ఈ బిడ్డను కన్నదేవరో? ఏ సిగ్గుమాలిన పనివలన పుట్టిందో? కన్నదే ఎగరేసి విసిరేసి వెళ్ళింది...మాకేమిటి అవసరం?" గుంపులోని ఒకరు.
"అదే కదా...ఈ బిడ్డను తీసుకు వెళ్ళి మేమేమి చేసుకుంటాం?" గుంపులోని మరొకరు.
"ఎవరైనా 'ఆంబులాన్స్’ కు ఫోన్ చేయండయ్యా" గుంపులోని మొదటావిడ.
“చేస్తే పోలీస్ కేసు అవుతుంది” ఇంకో గొంతు.
“అవనివ్వండి …వాళ్ళే ఈ బిడ్డను ఏదైనా అనాధ శరణాలయంలో చేర్పిస్తారు" గుంపులోని మొదటావిడ.
"అంతవరకు ఆ బిడ్డ బ్రతికుంటుందా?”
గుమికూడిన గుంపులోని వారు దూరంగా నిలబడే మాట్లాడుతుంటే, వాళ్ళను కోపంతో చూసింది యామిని. తన చీర కొంగుతో బిడ్డ వొళ్ళంతా తుడిచి....గుండెలకు హత్తుకుని, అక్కడ నీలబడున్న ఆటోవైపుకు వెళ్ళింది.
"ఇదిగో అమ్మాయ్...బిడ్డను ఎక్కడికి తీసుకు వెడుతున్నావ్?" గుంపులో ఎవరో అరిచారు.
అక్కడ గుమికూడిని వాళ్ళెవరికీ సమాధనం చెప్పకుండా ఖాలీగా ఉన్న ఆటొలో ఎక్కి కూర్చుంది.
"అన్నా...బిడ్డ గుండె కొట్టుకోవటం తగ్గిపోతోంది. పక్కన ఏ ఆసుపత్రి ఉందో ఆ ఆసుపత్రికి వెళ్ళండి...త్వరగా" ఆటో డ్రైవర్ తో చెప్పింది యామిని.
"సరేనమ్మా..." స్పీడ్ పెంచాడు ఆటో డ్రైవర్. బిడ్డ చుట్టు తన చీర కొంగును కప్పింది.
ఆప్పుడు, పూర్తిగా ఏడుపు ఆగిపోయింది. గొంతు క్రింద పడే గుంట అతిమెల్లగా ఎగిసిపడుతోంది. మళ్ళీ యామిని కళ్ళు నీటితో నిండిపోగా, ఆ బిడ్డను గుండెలకు మరింత దగ్గరగా హత్తుకుంది.
"నీకు ఏమీకాదు. నిన్ను చనిపోనివ్వను. నేనున్నాను. నిన్ను కాపాడి, సంరక్షించే చోట నిన్ను చేరుస్తాను. నువ్వు బ్రతకాలి. "- బిడ్డ చెవిలో మాట్లాడుతూ వస్తుంటే....ఆసుపత్రి ఏంట్రన్స్ వచ్చింది. ఆటో ఆగింది.
తాను ఎందుకోసం పర్మిషన్ తీసుకుని ఆఫీసు నుండి త్వరగా బయలుదేరిందో… ఆ విషయమే మరిచిపోయి , ఆ బిడ్డను కాపాడటానికి ఆసుపత్రిలోకి పరిగెత్తింది యామిని.
Continued...PART-2
********************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి