మానవత్వం (సీరియల్/నవల)
PART-7
నన్ను ఈ లోకానికి ఇచ్చిన ఆమెను తలుచుకుంటుంటే విసుగు పుడుతోంది. కానీ, నిన్ను చూస్తున్నప్పుడు ఆ చేదు అనుభవం మాయమవుతోంది!
"ఆ మనిషి నన్ను ఇక్కడికి రానివ్వలేదు. నువ్వైనా ఒకసారొచ్చి చూశావా? దగ్గర్లోనే ఉంటున్నా మమ్మల్ని చూడాలని అనిపించలేదు. ఎంత రాతి గుండె నీకు"--అత్రమూ, ఆవేశమూ, కోపమూ కలిగిన మాటలతో ఏడుస్తూ అన్నది సరోజ.
మారని నవ్వుతో కాఫీని చల్లార పోసి గ్లాసును తల్లికి ఇస్తూ.
"కాఫీ తాగమ్మా"
"నేను అడిగినదానికి సమాధానం చెబుతావా నువ్వు?"
"అమ్మా! నేను ఈ ఇంట్లో ఉంటునట్లు మీకందరికీ తెలుసు. కానీ, ఎవరైనా వచ్చి చూశారా? అలాంటప్పుడు నేనెలా రాగలను? ఒకవేల వచ్చినా అవమానంతో తిరిగి వెళ్ళాలి. అలా జరిగి మనసు ప్రశాంతతను కోల్పోవటం ఎందుకని నేను రాలేదు"
"హూ...బాగా మాట్లాడుతావే నువ్వు. నీకు వైరాగ్యం ముఖ్యం. మీ నాన్నకూ, అన్నయ్యలకు గౌరవం ముఖ్యం...మధ్యలో కన్న తల్లిని బాధ పెట్టేరు కదా మీరు"
"సరి...సరి...వదిలేయమ్మా! అందరూ ఎలాగున్నారు?"
"ఏదో ఉన్నాం" అన్న మీనాక్షి కళ్ళు……బాగా పొడుగెదిగి, దిట్టంగా నిలబడ్డ జయను ఒకసారి పైకీ, కిందకూ చూసినై.
"యామినీ ఇదేమిటీ...వయసు కంటే పొడుగెదిగి నిలబడింది. సంపాదిస్తున్నదంతా దీని తిండికే ఖర్చుపెడుతున్నావా?"
"అమ్మా...పిల్ల ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడాల్సిన మాటలా అవి?"
"ఇది పిల్లా? నీకు అక్కయ్యలాగా ఉన్నది"
"జయా...నువెళ్ళి హోం వర్క్ ఉంటే చేసుకోరా..."
"సరేనమ్మా" - జయ తన గదిలోకి వెళ్ళిన వెంటనే, తల్లిపై కోపం కక్కింది యామిని.
"ఏమ్మా మీరు ఇంకా మారలేదా?"
"ఏమిటే... ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను? రాత్రింపగళ్ళు పని చేసి నువ్వు చిక్కి శల్యమైపోయి నిలబడ్డావు. అదేమో లావుగా బొద్దుగా తలతల మెరిసిపోతోంది. అందుకే కోపం వచ్చి అలా అడిగాను"
"కోపమా? అమ్మా అది నీ మనుమరాలు"
"చీచీ....ఎవరికో పుట్టింది నాకు మనుమరాలా? నోరు కడుక్కోవే..."
"అమ్మా"
"ఇలా చూడవే....నువ్వు కావాలంటే దానికి అమ్మ అని చెప్పుకుంటూ తిరుగు. కానీ, ఆ అనాధ గాడిద నాకు ఏరోజూ మనుమరాలు కాలేదు"
"ఈ మాట ఎప్పుడో చెప్పేశారు కదా...! మళ్ళీ ఎందుకు ఇప్పుడొచ్చి జ్ఞాపకం చేస్తున్నావు?"
"నేనే ఎందుకు వచ్చనో పరోక్షంగా అడుగుతున్నావా?"
"లేదు...నేరుగానే అడుగుతున్నాను. ఇప్పుడు ఎందుకు వచ్చావు?"
"అలా అడుగు. మన రమేష్ లేడు..."
"దయచేసి ఎవరి పురాణాలూ నా దగ్గర చెప్పకు..."
"పూర్తిగా వినవే...అతని భార్య చనిపోయింది తెలుసా?".
"ఎప్పుడూ!?…"
“అది జరిగి రెండు నెలలు అయ్యింది...జబ్బు మనిషిని కట్టబెట్టి మా అన్నయ్య కొడుకు జీవితాన్నే నాశనం చేశాడు. నువ్వు గనుక ఈ దరిద్రాన్ని తీసుకు రాకుండా ఉండుంటే....ఈపాటికి నిన్ను వాడికి పెళ్ళిచేసి ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఇద్దరూ, పిల్లా పాపలతో సంతోషంగా ఉండేవారు"
"ఆపండమ్మా! ప్రతి విషయాన్నీ నా పిల్లతో ముడివేయకండి?"
"భగవంతుడు వేసిన ముడిని ఎవరూ ఉడదీయలేరు యామినీ. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను"
"ఏందుకు?"
"రమేష్ చాలా పాపమే. ముగ్గురు పిల్లలను పెట్టుకుని ఒంటరిగా అల్లల్లాడిపోతున్నాడు. నువ్వూ ఇక్కడ ఒంటరిగా పోరాడుతున్నావు కదా! అందుకని..."- అంటూ మాట్లాడుతున్న తల్లిని కోపంగా చూసింది.
"అందుకని?"
"అంటే అదొచ్చి...నువ్వు వాడిని పెళ్ళిచేసుకో"
"అమ్మా...?"
"ఎందుకే అరుస్తావు? వాడు నీ మామ కొడుకేగా? ఇంకా, ఇప్పటికీ నీ జ్ఞాపకంగానే ఉన్నాడు"
"చిచీ! ఇలా మాట్లాడటానికి నీకు అసహ్యంగా లేదు?"
"యామినీ..."
"నా జ్ఞాపకంగానే ఉన్నవాడు వేరే పెళ్ళి చేసుకుని పిల్లల్ని ఎలా కన్నాడు?"
"ఆ పెళ్ళీ...మా వదిన కోసం చేసుకున్నాడు"
"ఎవరికొసం చేసుకున్నాడో? చేసుకున్నాడుగా...! దానితో కాపురంచేసి పిల్లల్ని కూడా కన్నాడే...? ఇప్పుడు ఆమె చచ్చిపోయి రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే ఇంకో పెళ్ళాం కావలటనా? మనిషేనా అతను?" ఆవేశపడింది.
"వొసాయ్..వాడ్ని తప్పు చెప్పకు! ఇది నేను తీసుకున్న నిర్ణయం"
"ఏ ధైర్యంతో ఈ నిర్ణయం తీసుకున్నావు? నాకు పెళ్ళి చెయ్యండని నేనొచ్చి అడిగానా?"
"ఏమే...పిల్లల్ను అడిగా కన్నవారు పెళ్ళి చేస్తున్నారు.? మాకు మాత్రం మీ మీద ప్రేమ ఉండదా?"
"ఆహా....మీకు ఎలాగమ్మా ఇంత ప్రేమ వచ్చింది? అందులోనూ ఇన్నేళ్ళ తరువాత వచ్చింది?"
"అదా...ఇదిగో ఈ పిల్లను పెంచాలని మమ్మల్ని వదిలి ఇన్నిరోజులు వేరుగా ఉండిపోయావు! ఇప్పుడు ఇది గుర్రంలాగా పెరిగి దర్జాగా ఉన్నదే? ఇక తన దారి తాను చూసుకోనీ. నువ్వు...నా మాటలు విని నడుచుకో"
“చాలు. ఇక ఆపండి. ఇంతవరకే మీకు మర్యాద! దయచేసి బయటకు వెళ్ళండి”
"ఏ.మి.టే?"
"వెళ్ళిపొండి! ఇంకాసేపు మీరు ఇక్కడుంటే నా నోటికి ఏవైనా నీచమైన మాటలు వస్తాయి"
"వస్తాయే...వస్తాయి! ఏదో కన్న బాధ్యతకు నీకు ఒక జీవితం ఏర్పాటు చేసి ఇద్దామని ఇక్కడకు వచ్చాను చూడు. నువ్వు ఏవైనా మాట్లాడతావు...ఎంతైనా మాట్లాడతావు"
"నా జీవితం ఇదేనని నిర్ణయించుకుని పదిహేను సంవత్సారాలయ్యింది. దీని తరువాత ఎందుకు ఇంకో జీవితం."
"ఇప్పుడు ఇలాగే మాట్లాడతావు! నువ్వు కష్టపడి పెంచుతున్నావే అది...రేపే ఎవడిన్నన్నా లాక్కుని వెళ్ళినప్పుడు ఒంటరిగా నిలబడతావే! అప్పుడు తెలుస్తుంది ఈ తల్లి యొక్క అవసరం. ఇది పెరిగి నీకు గంజి పోస్తుందని ఎదురు చూడకు"
"దేనినీ ఎదురు చూసి నా బిడ్డను నేను పెంచటం లేదు. ఇదేమీ వ్యాపారం కాదమ్మా. జీవితం! జీవించే జీవితం అవతలివారికి ఉపయోగపడేలా ఉండాలని అనుకున్నాను. అలాగే జీవిస్తున్నాను. నా లక్ష్యం, బాధ్యత దాన్ని మంచిగా పెంచడమే…దానికి పక్వత వచ్చి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు సంతోషమే. అది ఎలా జీవించాలనుకుంటే అలాగా జీవింప చేస్తాను. దాని దగ్గర నుండి ఎలాంటి ప్రతిఫలమూ ఎదురుచూడటంలేదు. అది నా బిడ్డ. ఎప్పుడూ దానికి నేనే. దాంట్లో ఏ మార్పూ లేదు. మీరు వెళ్ళొచ్చు"
"ఇలా చూడవే...నేను...."
“వద్దమ్మా...అమ్మా అనే మాటకు చాలా మాహాత్యం ఉన్నది. దాన్ని నేను గౌరవిస్తాను. దయచేసి దాన్ని చెడపకండి...ప్లీజ్"
సరోజ మొహం చిటపటలాడింది.
"ఎలాగైనా పోవే. ఇక నీ గుమ్మం తొక్కను"-అంటూ వెళ్ళిపోయింది.
యామిని ఆయాసపడుతూ సోఫాలో వాలిపోయి కళ్ళు మూసుకుంది. పక్క గదిలో కూర్చుని వాళ్ళ వాదనలను విన్న జయ మెల్లగా లేచి వచ్చింది.
తల్లి యొక్క వాడిపోయిన ముఖాన్ని చూసిన జయకు ఏడుపు ముంచుకు వచ్చింది. తన వల్ల తల్లికి ఏర్పడ్డ కష్టాలనూ, అవమానాలనూ చూసి అలవాటు పడినా, ఇప్పుడు బాగా వివరాలు అర్దమైన తరువాత...తన పుట్టుక మీద విరక్తి ఏర్పడింది. తనని కన్నవాల్ల తప్పు వలన ఈ రోజు ఎన్ని హృదయాలు కష్టాలను భరిస్తున్నాయి?
విరక్తి పెరుగుతున్నా యామినిని చూస్తున్నప్పుడు మనసు, శరీరమూ జలదిరించింది. ఇలా కూడ ఒక మహిళ జీవించగలదా? ఎక్కడో కాలువ పక్కన పడున్న శిశువుకోసం తన కుటుంబాన్నీ, భవిష్యుత్తును పక్కన పెట్టి...జీవితాన్ని అంకితం చేయొచ్చా? ఆమె మహిళ కాదు...జీవించే దైవం!
కళ్ళు తుడుచుకుని...తల్లి పాదాల దగ్గర కూర్చుంది జయ.
యామిని పాదాల మీద కన్నీటి బొట్లు పడగా, గబుక్కున చెదిరి నిలబడింది.
"బంగారం! ఎందుకురా క్రింద కూర్చున్నావు? లే. అమ్మ దగ్గరకు వచ్చి కూర్చో" అని చెప్పిన తల్లి కాళ్ళను గట్టిగా పట్టుకుంది జయ.
"అమ్మా...అమ్మా, మీరు దేవత అమ్మా!" అంటూ ఏడుస్తున్న జయను కంగారుగా పైకిలేపి వొళ్ళో కూర్చోబెట్టుకుంది.
"ఏరా...ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? కళ్ళు తుడుచుకో" .
"వద్దమ్మా...నేను ఏడవాలి...నన్ను ఏడవనివ్వు!"
"వద్దు తల్లీ! ఆడువారి బలహీనం వాళ్ళ కన్నీరే. అమ్మ ఏ రోజైనా ఏడుస్తున్నానా? నువ్వు ఏడవచ్చా?"
"కుదరటంలేదమ్మా! నావల్ల...మీకు ఎన్ని కష్టాలు"
"దెబ్బలు తింటావ్! ఇదంతా ఒక కష్టమా? అమ్మమ్మకు నిదానంగా మాట్లాడటం తెలియదు. ఆమె స్వభావమే అంతే"
“లేదు...అమ్మమ్మ కూడా మంచిదే. ఆమెకు నా మీదే కోపం. దాన్ని తప్పు అని చెప్పలేమే!"
"పెద్ద మనిషిలాగా మాట్లాడటం చేతనవుతుంది. కానీ, పసిపిల్లలాగా ఏడుస్తున్నావే! ముందు లే. లేచి ఇలా వచ్చి కూర్చో..." చెబుతూ కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకుని చీర కొంగుతో జయ మొహం తుడిచింది.
"అమ్మా..."
"చెప్పరా"
"అమ్మమ్మకు ఎందుకమ్మా నేనంటే ఇష్టం లేదు? మా అమ్మ చేసింది తప్పే. కానీ, అందులో నా తప్పేముంది?”
“అమ్మమ్మకు నీ మీద కోపం లేదురా! వాళ్ళ అన్నయ్య కొడుకును నేను పెళ్ళిచేసుకోలేదని కోపం"
"నాకోసమని మీరు ఆ అంకుల్ ని పెళ్ళిచేసుకోలేదా?"
"అయ్యయ్యో...ఆ బియ్యం మూటనా పెళ్ళిచేసుకునేది. చాన్సే లేదు. ఎప్పుడు చూడు రైస్ మిల్ లాగా ఏదో ఒకటి నములుతూనే ఉంటాడు. నాకు వాడ్ని చూస్తేనే మహా అలర్జీ"
"అలాంటప్పుడు ఇంకెవరినైనా పెళ్ళి చేసుకోని ఉండచ్చే?"
“ఏమిటీ వయసుకు మీరిన ప్రశ్నలు? వెళ్ళు...వెళ్ళి పడుకో"
"లేదమ్మా...ఒకవేల మీరు ఇంకెవరినైనా పెళ్ళి చేసుకోనుంటే అమ్మమ్మ-తాతయ్యలకు మీ మీద కోపం వచ్చి ఉండేది కాదుగా?" అంటున్న కూతుర్ని చూస్తున్నప్పుడు, మనసులోకి దివాకర్ వచ్చి వెళ్ళాడు. అతని మాటలు కూడా గుర్తుకు రావడంతో...ఇబ్బందిగా నవ్వింది యామిని.
“మన దేశంలో నలుగురు పిల్లలున్న ఒక మొగవాడికి ఈజీగా పిల్లనిచ్చి పెళ్ళిచేస్తారు. కానీ, పసిపిల్లతో ఉన్న ఆడదాన్ని ఏ మగాడూ ఆమొదించి పెళ్ళిచేసుకోడు"
"సరె...వదిలేయ్. అమ్మాయిగా పుడితే కచ్చితంగా పెళ్ళి చేసుకోవాలా ఏమిటి? పెళ్ళి, పిల్లలూ మాత్రమే జీవితం కాదురా! ఇంకా ఎంతో ఉన్నది. ప్రాణాలతో ఉన్నంతవరకు ఎవరికైనా మంచి చేయాలి. కష్ట పడుతున్న జీవికి మనవల్ల చేయగలిగిన సహాయం చేయాలి. మనకొసం స్వార్ధంగా జీవించడం జీవితం కాదురా”
"ఇదిగో నేను నీకొసం జీవిస్తున్నాను. నువ్వు పలువురి మంచికొసం జీవించాలి. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. ఈ రోజు మనల్ని హేళనగా చూసేవారిని...చులకనగా మాట్లాడేవారి ముందు మనం సాధించి చూపాలి. మనల్ని వెలివేసిన అందరూ ఆశ్చర్య పడేటట్టు జీవితంలో పైపైకి ఎదిగిపోవాలి.
"నువ్వు విజయం సాధించటానికి పుట్టావు. అందుకనే నీకు జయ అని పేరు పెట్టాను. చెప్పు! నువ్వు విజయం సాధిస్తావా? చదువులో, భవిష్యత్ జీవితంలో విజయం సాధించి చూపుతావా?" అంటూ యామిని నమ్మకంతో అడుగగానే, జయ నిటారుగా కూర్చుంది. కళ్ళను గట్టిగా తుడుచు కుంది.
"ఖచ్చితంగా...మీరు పడ్డ ఒక్కొక్క కష్టానికీ, చిందించిన ఒక్కొక్క చెమట చుక్కకూ, నా విజయంతో సమాధానం చెబుతాను. ఇక ఎవరు ఏంచెప్పినా బాధ పడను. ఏడవను, బలహీన పడను"
"విజయం సాధిస్తాను! చదువులో కచ్చితంగా మొదటి ర్యాంకులో వస్తాను. యామిని కూతురు అన్న అంగీకారంతో చదివి ముగించి ఈ ఊరు కోసం...మీ కల కోసం...కష్టపడుతున్న జీవులకొసం నా జీవితాన్ని అంకితమిస్తాను. ఇది ప్రామిస్" అంటున్నప్పుడు యామినియే భ్రమించి పోయింది.
Continued...PART-8
********************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి