మానవత్వం (సీరియల్/నవల)
PART-4
మహిళా.... చెత్త కుండిలో విసిరివేయబడ్డ నల్లపూసను వజ్రంగా మార్చగల
మహా శక్తి నువ్వు!
ఇల్లు తుడిచి, సాంబ్రాణి పొగను వేసి ఇళ్ళంతా వ్యాపింప జేస్తున్న సరోజ, వాడిన మొహంతో వచ్చిన భర్తను, బిడ్డను గుండెలకు హత్తుకుని వచ్చిన కూతురుని చూసి బిత్తరపోయింది.
"ఏమండీ...ఏమైంది? బిడ్డను పోలీసులకు అప్పగించలేదా? ఏయ్...నువ్వెందుకే బిడ్డను నీతోనే తీసుకు వచ్చావు?"
"అమ్మా...పాప గుడ్డను తడిపింది. మార్చి తీసుకు వస్తాను "- - అంటూ మామూలుగా గదిలోకి వెళ్ళింది. తల్లి గందరగోళంగా చూడగా, రామారావు చిన్నబోయిన ముఖంతో వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
"ఏమండీ...పోలీసు స్టేషన్ కు వెళ్ళలేదా?"
"వెళ్ళాము"
"మరెందుకు బిడ్డను ఇవ్వకుండా వచ్చారు?"
"సరోజా! వాళ్ళు...మేము చెప్పింది నమ్మలేదు".
"ఎందుకని?"
“మనం చెప్పేలాగా వాళ్ళకు ఎటువంటి ఫిర్యాదు రాలేదట. నిజంగానే ఈ బిడ్డ రోడ్డులో పడుందా అని గుచ్చి గుచ్చి అడిగారు"
"అయ్యో తరువాత...?"
"ఈ బిడ్డను అనాధ బిడ్డ అంటే నమ్మనంటున్నారు"
"ఎలా నమ్ముతారు...? ఇది ఆ బిడ్డకు స్నానం చేయించి, తల దువ్వి, పౌడర్ అద్ది, బుగ్గన చుక్క పెట్టి, మంచి డ్రెస్ వేసి, సింగారించి, పట్టుపరుపులాంటి గుడ్డలో తీసుకువెడితే ఎలా నమ్ముతారు?"
"నమ్మకపోయినా పరవాలేదు. తప్పు తప్పుగా మాట్లాడారు"
"ఏమని?"
"ఏమ్మా...నువ్వే బిడ్డను కనేసి, ఇప్పుడు అనాధ అని తీసుకువచ్చి వదుల్తావా? పెంచటానికి దారిలేని దానివి ఎందుకమ్మా కన్నావు? నీ అవసరానికి కనేసి...పరువు, మర్యాదకు భయపడి ఒక పసి బిడ్డను అనాధ చెయ్యబోతావా? నీలాంటి ఆడవాళ్ల వలనే అనాధశరణాలయాలు నిండి పొంగిపొతున్నాయి"
“ఆడ పిల్ల కదా! దాని భవిష్యుత్తు గురించి ఆలొచించావా? రేపు అది పెద్దదై నిలబడ్డప్పుడు, తల్లి తోడు లేక ఎంత కష్టపడుతుందో ఆలొచించావా? మీకు శరీర శుఖం మాత్రమే పెద్దగా తెలుస్తోందా?' అని అడుగుతున్నారు..."
"చాలండీ...చాలు"-- సరోజ చెవ్వులు మూసుకొన్నది.
"దీనికంటే ఎక్కువగా ఒక మహిళా పోలీసు సరోజా, ఆ మాటలు ...చెప్పటానికే నాకు వొళ్ళంతా గగుర్పుగా ఉన్నది"
"ఇది ఏమైనా సమాధానం చెప్పిందా?"
"ఆ...చెప్పిందిగా, 'క్షమించండి మేడం'. ఈ బిడ్డ నా బిడ్డే. నేనే పెంచుకుంటాను అని చెప్పి వచ్చేసింది"
"ఏమి కర్మమండీ ఇది?" తలమీద బాదుకుంటూ చెప్పింది సరోజ.
"నేను ఎంతో చెప్పి చూశాను. అది వినిపించుకోవటం లేదు"
"వినిపించుకోకపోతే అలా వదిలేయటమేనా? ఏది అది?"
"యామినీ... యామినీ..." అరుచుకుంటూ ఆవేశంగా కూతురి గదిలోకి వెళ్ళగానే, చూపుడు వేలును పెదవులమీద పెట్టుకుని "ఉష్" అంటూ తల్లి ఆవేశాన్నంతా అణిచివేసింది యామిని.
"ఉష్...శబ్ధం చేయకమ్మా. పిల్ల ఇప్పుడే నిద్రపోయింది"
"ఒసేయ్...పాపీ! నీకు బుర్రలో ఏమైనా ఉన్నదా? ఆ రోజే నెత్తీ నోరు కొట్టుకున్నానే! నా మాట విన్నావా?"
"ఎందుకమ్మా అలా కేకలేస్తున్నావు?"
"ఎందుకు అడగవే? పోలీసులు నమ్మకపోతే ఏమిటిప్పుడు? ఏదైనా అనాధ ఆశ్రమంలో తీసుకు వెళ్ళి పడేసి వచ్చుండొచ్చు కదా? ఇలా తిరిగి ఇంటికి తీసుకు వచ్చావే...?"
"అమ్మా...నీ మాట కోసమే తీసుకువెళ్లాను. కానీ, అక్కడ ఆ 'మేడం' చెప్పిన తరువాతే ఈ పాప ఇంకా ఎన్నికష్టాలు ఎదుర్కోవాలో అర్ధమయ్యింది. పాపం...ఆడపిల్లకు తల్లి యొక్క తోడు, సంరక్షణ ఎంత ముఖ్యమో నీకు తెలియదా అమ్మా?"
"ఒసేయ్...అది పాపను కన్న తల్లి ఆలొచించి ఉండాలి"
ఒకతికి రాయి లాంటి హృదయం ఉన్నదని, మనమూ అలాగే ఉండాలా?"
"ఓసేయ్..."
"ఇంకా కొన్నిరోజుల్లో అది పెరుగుతుంది. దానికి మంచి చెడు చెబుతూ పెంచాలి. చదివించాలి. వయసుకు వచ్చినప్పుడు రక్షణగానూ, పక్క బలంగానూ నిలబడాలి. అది ఇష్టపడ్డ చదువును చదివించాలి. సమాజంలో అందరూ గౌరవించే విధంగా దాన్ని ఎత్తులో ఉంచాలమ్మా.
తరువాత పెళ్ళి వయసు రాగానే అల్లుడిని వెతకాలి…పెళ్ళి, పదహారు రోజుల పండుగ, శ్రీమంతం, ప్రసవం, బారసాల అని ఎన్నో సంబరాలు ఉన్నాయమ్మా. అన్నిటికీ తల్లి కచ్చితంగా కావాలి. నేను దానితో ఉండే తీరాలి.
దుర్దృష్టకరంగా కొంతమంది అమ్మాయలకు తల్లి లేకుండా పోతుంది. తల్లి ప్రేమ, అభిమానం, సంరక్షణ దొరకక వాళ్ళు పడే కష్టాలు నా కళ్ళతో చూశానమ్మా. అలాంటి కష్టం ఈ పాపకు రాకూడదు"
"యామినీ..."
"పుట్టుకతో ఇది ఒక అనాధ అయ్యుండొచ్చు. కానీ, దీన్ని అనాధాగా పెరగనివ్వను. ఇక నేనే దీనికి అమ్మ. ఇదే దాని ఇళ్లు. ఈ తల్లి ఒడిలో, తాత-అమ్ముమ్మల ప్రేమలో నా బిడ్డ సంతోషంగా పెరగుతుంది..."
"నోరు మూసుకో!"….చాలా కఠినంగా చెప్పింది సరోజ.
"అమ్మా...?"
"పాప...పాప అంటూ దాని గురించే మాట్లాడుతున్నావే! నీ గురించి, నీ జీవితం గురించి, నిన్ను కన్నవాళ్ళను గురించి, వాళ్ళు ఎంత ఏడుస్తారో, వారి బాధ్యతలు, వాళ్ళ ఆశల గురించి, నీ కుటుంబం గురించి ఆలొచించావా...? కన్నవారి ఆశలను, కలలను తీర్చటం పిల్లల బాధ్యత. అది తీర్చకపోగా వాళ్ళ మనసుకు మరింత కష్టాలను తెచ్చిపెట్టట్టం న్యాయమా?"
"......................."
"ఇప్పటికే చుట్టుపక్కల వాళ్ళు, పిల్లను ఇచ్చిన ఇంట్లోని వాళ్ళూ, పిల్లను తెచ్చుకున్న ఇంట్లోని వాళ్ళూ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాం. రెండు రోజులకే ఇంత కష్టంగా ఉందంటే... నువ్వు జీవితాంతం ఉంచుకుంటాను అంటున్నావే! ఇది సాధ్యమేనా?"
“ఎందుకు సాధ్యపడదు? మనం ఉరుకొసం జీవించ కూడదు. మన కోసం జీవించాలి"
"ఊరుతో కలిసి జీవించటమేనే జీవితం. ఊరుతో విరోధం పెట్టుకోవచ్చు, బంధుమిత్రులతో విరోధం పెట్టుకోగలమా? మీ అక్కయ్య పరిస్థితిని ఆలొచించించి చూడు? దాని అత్తగారింట్లో ఏమేమి మాట్లాడతారో?"
"అమ్మా...నేనేమీ తప్పుడు మార్గంలో వెళ్ళి బిడ్డను కని రాలేదే! ఆదరణ లేని బిడ్డకు జీవితం ఇస్తున్నాను. న్యాయంగా చూస్తే నేను చేస్తున్న పనిని అందరూ మెచ్చుకోవాలి"
"మెచ్చుకుంటారు...మెచ్చుకుంటారు! నా భార్య అడుగుతున్న ప్రశ్నలకే సమాధానం చెప్పలేకపోతున్నాను" అంటూ లోపలకు వచ్చిన ప్రశాద్ ను చూసిన వెంటనే యామిని మొహం మారింది.
"అన్నయ్యా?"
"ఇలా చూడు...ఇలాంటి విప్లవాత్మక పనులన్నీ సినిమాలకు, కథలకు సరిపోతుంది. యధార్ధానికి సరిపోదు"
"ఇదేమీ విప్లవాత్మకమైన పనికాదు. మానవ స్వభావం. మనసులో దయ, జాలీ ఉన్న వాళ్ళు చేసే సాధారణ సహాయం"
"అది ఒంటరిగా ఉన్న మనిషి చెయ్యొచ్చు. లేకపోతే జీవితంలో అన్నీటినీ పోగొట్టుకొని ఒంటరి అయుపోయిన మనిషి చెయ్యొచ్చు. కానీ, నువ్వొ....నేనో చెయ్యలేము"
"ఎందుకు చెయ్యలేము?"
“మనమంతా ఒక కుటుంబం. బంధు మిత్రులనే వలలో చిక్కుకోనున్నాం యామిని. వాళ్ళను కాదని ఏమీ చెయ్యలేము"
"అందుకని...?"
"మాట్లాడకుండా నేను చెప్పేది విను. నువ్వు మామూలుగా పనికి వెళ్ళిపో...దీన్ని నేను చూసుకుంటాను"---అంటూ నిదానంగా చెప్పిన ప్రశాద్ మాటలకు కంగారు పడ్డది.
"అన్నయ్యా! ఏం చెయ్యబోతావు?"
"కంగారుపడకు....బిడ్డను చంపను. నేనూ పిల్లలను కన్న వాడినే"
"ఇంకేం చెయ్యబోతావు?"
"నాకు తెలిసిన ఒకాయన 'కారుణ్య గృహం' నడుపుతున్నాడు. అతని దగ్గర వదిలేద్దాం. అక్కడ ఇలాంటి పాపలు చాలా ఉన్నారు...వాళ్ళతోపాటు కలిసి ఇది కూడా పెరగనీ"
"నువ్వు...దీని వర్తమాన కాలం మాత్రమే చూస్తున్నావు అన్నయ్యా! నేను భవిష్యత్తు గురించి ఆలొచిస్తున్నాను”
"మొదట నీ భవిష్యత్తు గురించి ఆలొచించు...ఆ దివాకర్ ఫోన్ చేసినప్పుడు నువ్వు నిర్లక్ష్యంగా మాట్లాడావుటగా?"
"దివాకర్ ఒక స్వార్థపరుడు. ఆదిపత్య మనోభావం కలిగినవాడు. అతన్ని నా భవిష్యత్తుగా ఆలొచించటం మూర్ఖత్వం"
"అయితే రమేష్ ను పెళ్ళిచేసుకో! వాడికేం తక్కువ? సొంత మామయ్య కొడుకు...నీమీద చాలా ప్రేమగా ఉంటాడు"
"అమ్మా.....ఇప్పుడు సమస్య నాకు పెళ్ళిచేయడం గురించి కాదు. ఈ బిడ్డకు సంరక్షణ..."
"సమస్యే ఈ పాపే కదా! మొదట దాన్ని నా దగ్గర ఇవ్వు. ఈ రోజే వెళ్ళి విడిచిపెటి వచ్చేస్తాను"--... ప్రశాద్ గుడ్డ ఊయలలొ నిద్ర పోతున్న పాపను ఎత్తుకోగా, ఆ స్పర్శకు ఉలిక్కిపడిన పాపకు నిద్ర చెదిరిపోయింది.
"ఇవ్వు నా బిడ్డను...!”- ఆవేశంగా అతని దగ్గర నుండి పాపను లాక్కుని తన గుండెలకు హత్తుకుంది యామిని. గ్రద్ద దగ్గర నుండి తన పిల్లను కాపాడుకున్న కోడిలాగా చిరుత వేగంతో ఉన్న యామిని ని చూసి ప్రశాద్ మాత్రమే కాదు... సరోజ కూడా హడలిపోయింది.
Continued...PART-5
********************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి