జెంటిల్ మ్యాన్(కథ)
నందిని ఆ రోజు చాలా అదుర్దాగా ఉంది.
కారణం.
ఆ రోజు ఆమె పనిచేస్తున్న ఆఫీసు బాధ్యతను స్వీకరించడానికి కొత్త ఎం.డి రాబోతున్నారు.
ఆమె ఆదుర్దాకు అదొక్కటే కారణం కాదు. ఆ కొత్తగా వస్తున్న ఏం.డి పేరు సత్య ప్రకాష్ అని ఉండటం కూడా ఒక కారణం.
"వచ్చేది...అతనై ఉంటాడా?" అని అనుకున్న వెంటనే ఆమెలో వణుకు పుట్టింది.
నందినికి పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. భర్తకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్ పోర్ట్ వ్యాపార సంస్థలో "మేనేజర్" ఉద్యోగం. మామగారూ, అత్తగారూ అనే ఉమ్మడి కుటుంబం. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తున్న జీతాలతో ఆ ఇల్లు హాయిగానే గడుస్తోంది.
సరిగ్గా సమయం ఉదయం 10.30. తలుపు వేగంగా తెరుచుకుంది. లోపలకు వచ్చాడు కొత్త ఎం. డి. అతను అదే సత్య ప్రకాష్! నందిని గుండే వేగంగా కొట్టుకుంటోంది.
ఆఫీసులో అందరినీ పరిచయం చేస్తున్నాడు మెనేజర్.
“సార్...ఈవిడ పేరు నందిని! మీకు ఈవిడే పర్సనల్ సెక్రటరీ. పది సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తోంది. షార్ట్ హాండ్, కంప్యూటర్ ఆపరేటింగ్ అన్నీ బాగా తెలిసున్న మేధావి అని చెప్పొచ్చు"
ఆ సమయంలో నందిని జ్ఞాపకాలు పదిహేను సంవత్సరాలు వెనక్కి వెళ్ళినై.
************************************
ఆ కాలేజీ కధానాయకుడు సత్య ప్రకాష్. ఆటలలొ చాంపియన్. ఫుట్ బాల్ టీమ్ క్యాప్టన్. చదువులో గోల్డ్ మెడలిస్ట్. స్టూడెంట్ యూనియన్ ప్రెశిడెంట్. ఆ కాలేజీలో చదువుతున్న అమ్మాయిలలో చాలా మంది అతని ఫ్యాన్స్! అందరూ అతన్ని జెంటిల్ మ్యాన్ అని పిలుస్తారు.
"ఇతనిలాంటి ఒకతనే భర్తగా దొరకాలి" అనుకుని ఎంతోమంది ఆడపిల్లలు నిట్టూర్పు విడిచిన కాలం అది.
అలాంటి సత్య ప్రకాష్ తనతో పాటు చదువుతున్న ఒక అమ్మాయిని ప్రేమించాడు. అమె పేరు శ్యామల. అందం, తెలివి, ఆస్తి పాస్తులు...ఇలా అన్నిట్లోనూ సత్య ప్రకాష్ కు సరితూగుతుంది శ్యామల. కాలేజీ స్టూడెంట్స్, లెక్చరర్స్, ప్రొఫసర్స్, మిగిలిన ఆఫీస్ స్టాఫ్ అందరూ సత్య ప్రకాష్ - శ్యామల ప్రేమను చూసి ఆనందించారు. ఆ సంవత్సరం జరిగిన బెస్ట్ జోడి పోటీలో వాళ్ళకు టైటిల్ అవార్డ్ లభించింది.
కానీ పోను పోనూ వాళ్ళకు ప్రేమ కలిసి రాలేదు.
సత్య ప్రకాష్ శ్యామలను వదిలేశాడని కాలేజీ మొత్తం కోడై కూసింది. సత్య ప్రకాష్ జెంటిల్ మ్యాన్ కాదు, అవకాశవాది అని కొందరు అతన్ని ఆడిపోసుకున్నారు.
ఎంతో అన్యోన్యంగా ఉండే సత్య ప్రకాష్-శ్యామల మధ్య ఏం జరిగుంటుంది?….ఎందుకు విడిపోయుంటారు?…అనేది మాత్రం చాలా మందికి అర్ధం కాలేదు.
********************************************
పాత జ్ఞాపకాలు నుండి బయటపడ్డ నందినికి సత్య ప్రకాష్ - శ్యామల మధ్య ప్రేమ ఎందుకు వికటించింది, దానికి ఎవరు కారణం అనేది తెలుసుకోవాలనే తపన ఎక్కువయ్యింది.
చాలా రోజులుగా సమాధానం దొరకని ఆ ప్రశ్నకు...ఒకరోజు సత్య ప్రకాష్ ఆఫీసులో ఒంటరిగా కూర్చున్నప్పుడు కారణం ఏమిటని అడిగింది నందిని.
"సార్...ఆఫీసులో అడుగుతున్నానని తప్పుగా అర్ధం చేసుకోకండి...మీరు ఎక్కడ ఒంటరిగా ఉంటారో నాకు తెలియటంలేదు. అందుకని ఆఫీసులో ఒంటరిగా ఉంటున్నప్పుడు అడగాలని అనుకున్నాను...అడగొచ్చా?"
"నేనేమీ తప్పుగా అనుకోను...అడుగు నందిని"
"కాలేజీలో మీరూ, శ్యామల విడిపోవడానికి ఏమిటి కారణం?"
నందిని వైపే కొద్ది క్షణాలు సూటిగా చూసిన సత్య ప్రకాష్, పెద్దగా గాలి పీల్చుకుంటూ “నేను కాలేజీ చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు మా నాన్న వ్యాపారం బాగా దెబ్బ తిన్నది. ఈ విషయం తెలుసుకున్న శ్యామల కొంచం కొంచంగా నాకు దూరంగా జరిగింది. ఒకరోజు నా దగ్గరకు వచ్చి పెళ్ళి పత్రిక ఇచ్చింది. ఆమె అత్త కొడుకే పెళ్ళి కొడుకు. నాకు షాక్ అనిపించింది. నేను ఆమె దగ్గర ఏదీ అడగలేదు!”
"మీరెందుకు శ్యామలను ఏమీ అడక్కుండా మౌనంగా ఉండిపోయారు? మిమ్మల్ని ప్రేమ పేరుతో మోసంచేసిన ఆమెను బాగా నాలుగు మాటలు అడగాల్సింది!"
"లేదు నందిని! నేను ఆమెను మనసారా ప్రేమించాను. ఆమెకు నాతో ఇబ్బందేమిటో నాకు తెలియదు. నా కంటే తన అత్త కొడుకే బెటర్ అనుకున్నదేమో...అతన్ని ఎన్నుకుంది. ఆమె ఎక్కడున్నా బాగుండాలి" అంటున్న సత్య ప్రకాష్ ను చూస్తుంటే నందిని కళ్ళలో నీళ్ళు తిరిగినై.
"ప్రకాష్...నీకా ఈ పరిస్థితి”____ఆమెలో బాధ పెరిగింది.
“ప్రకాష్… శ్యామల పోతే పోనీ. నీ మంచితనం గురించి ఆమె తెలుసుకోలేకపోయింది...దాని తరువాత?"
"శ్యామల నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత నాకు ఎవరినీ పెళ్ళిచేసుకోవాలని అనిపించలేదు. అలాగే ఉండిపోయాను" అంటూ నవ్వుతూ చెప్పాడు.
సత్య ప్రకాష్ నవ్వుతూ సమాధనమిచ్చినా అతని కళ్ళలొ బాధ, మనసులో నొప్పి నందిని గ్రహించగలిగింది.
"అవకాశవాది సత్య ప్రకాష్ కాదు, శ్యామలానే"...... అనుకున్న నందినికి అతనిపై ఒక గౌరవం ఏర్పడింది.
***********************************************
"ప్రకాష్...విష్ యూ హ్యాపీ బర్త్ డే"...అంటూ లంచ్ టైములో వచ్చి నిలబడ్డ నందినిని తల ఎత్తి చూశాడు సత్య ప్రకాష్.
ఆమె చేతిలో అందమైన రెడీమేడ్ షర్ట్ ఉంది.
"ధ్యాంక్స్" అంటూ నవ్వుతూ ఆ షర్టును తీసుకుని తిరిగి ఆమె చేతికే ఇచ్చాశాడు.
“నందిని...నువ్వే ఉంచుకో! సమయం వచ్చినప్పుడు తీసుకుంటాను”
ఆ రోజు రాత్రి 10.30 కు సత్య ప్రకాష్ కు ఫోన్ వచ్చింది.
"ప్రకాష్...మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనిపించింది. నేనే స్వయంగా సెలెక్ట్ చేసి తీసుకున్న షర్ట్ అది...మీరెందుకు నా గిఫ్టును తీసుకోకుండా నా దగ్గరే ఉంచుకోమని చెప్పారు? ఏం నేను మీకు గిఫ్టు ఇవ్వ కూడదా?" అన్నది.
“ఒక మగాడికి ఆడది షర్ట్ గిఫ్టుగా ఇస్తోందంటే ఆమె అతనికి తల్లిగానో, చెల్లిగానో, భార్యగానో, కూతురుగానో లేక ప్రేమికురాలుగానో అయ్యుండాలి...నువ్వు ఆ షర్టును నీ భర్తకు ఇస్తేనే కరెక్టుగా ఉంటుంది" అన్నాడు.
ఆమె వైపు నుండి మౌనం మాత్రమే వచ్చింది.
నిద్ర పోవటానికి ముందు "గుడ్ నైట్! స్వీట్ డ్రీమ్స్" అని నందిని సత్య ప్రకాష్ కు మెసేజ్ పంపించింది.
ఆ తరువాత ప్రతిరోజూ 11 గంటల తరువాత అతనికి మెసేజ్ చేయటం ఆమెకు అలవాటయ్యింది.
***************************************************
ఒకరోజు
నందినిని తన క్యాబిన్ కు రమ్మన్నాడు సత్య ప్రకాష్.
"నందినీ...సమయం చూసుకుని మా ఇంటికి ఒక రోజు రా! నీతో కొంచం మాట్లాడాలి"
ఆదివారం సాయంత్రం సత్య ప్రకాష్ కి ఇంటి కాలింగ్ బెల్ మోత వినబడటంతో గాబరా పుట్టింది. గుండె ధడ మొదలయ్యింది.
తలుపు తెరిచాడు.
"లోపలకు రా నందిని" అని ప్రేమగా లోపలకు ఆహ్వానించాడు. నందినిని కూర్చోమని చెప్పి వేడి వేడి కాఫీ కలుపుకు వచ్చాడు.
"నేనే కలిపిన కాఫీ ఇది! ఎలా ఉందో చెప్పు..."నవ్వుతూ అన్నాడు.
సత్య ప్రకాష్ విషం ఇచ్చినా తాగే మనోభావంలో ఉన్న నందినికి కాఫీ తాగుతున్నట్లు అనిపించలేదు.
తల వంచుకునే కూర్చున్న నందినిని జాలిగా చూశాడు.
"నందినీ! నువ్వు పంపిన ఎస్.ఎం.ఎస్ లన్నింటినీ చూశాను. నువ్వు చాలా పెద్ద కన్ ఫ్యూజన్లో ఉన్నావని అనుకుంటాను"
"ప్రకాష్! నేను చేసేది తప్పు అని నాకు తెలుస్తోంది. కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను" నందిని పెదవులు వణుకుతుంటే...ఆమె కళ్ళ నుండి ధారగా నీళ్ళు కారినై. కానీ ఆమె గట్టిగా ఏడవలేదు.
వణుకుతున్న చేతులతో హ్యాండ్ బ్యాగ్ తెరిచి, అందులో నుండి మడతపెట్టిన కాగితాన్ని తీసి అతనికి ఇచ్చింది.
"దీన్ని రాసి, ఒక నెలరోజులుగా నా దగ్గరే ఉంచుకున్నాను. నీకు ఇవ్వటానికి ధైర్యం రాలేదు" చిన్నగా చెప్పింది.
"ఏం ప్రకాష్! నేను చెడ్డ మనిషినా?" అంటూ పెద్దగా ఏడ్చింది.
“ఫస్టు ఆ ఏడుపు ఆపు. నీ మనసులో ఉన్నదేమిటో నాకు తెలుసు. నీకు మంచి భర్త దొరికాడు. ప్రేమించే పిల్లలు, సలహాలిచ్చే అత్తమామలు ఉన్నారు. నువ్వు చాలా అద్రుష్టవంతురాలివి. ఎవరికి దొరుకుతుంది చెప్పు ఇలాంటి జీవితం? నీ మనసులో ఒక సంచలనం ఏర్పడిపోయింది. ఇది చాలా మందికి ఏర్పడేదే. అందువల్ల నువ్వు చెడ్డ మనిషివని అర్ధం కాదు. నువ్వు ఇప్పుడున్నది అందమైన ఒక గాజు గూటిలో. అందులో చిన్న పగులు ఏర్పడితే జీవితమే పాడైపోతుంది నందిని”
"ఈ లెటర్ లో ఏం రాసుంటావో నేను ఊహించుకోగలను. ఎంత మూర్ఖమైన పని చేశావో తెలుసా. ఈ లెటర్ ఇంకెవరి చేతికైనా దొరికుంటే ఏమై ఉండేది?" అంటూ ఆ లెటర్ను చదవకుండానే ముక్కలు ముక్కలుగా చంచి పారాసాడు.
"ఇకమీదట నాకు ఎస్.ఎం.ఎస్. లు పంపొద్దు. నీ భర్తకు తెలిస్తే నీ జీవితమే చీకటిమయం అయిపోతుంది...కాలేజీలో చదువుకునేటప్పుడు నన్ను చూసి స్నేహపూర్వకంగా ఒక నవ్వు నవ్వుతావే...ఏదీ అలా ఒకసారి నవ్వు"
సన్నగా నవ్వింది నందిని.
"ఇప్పుడు నీ మనసు తేలిక పడుంటుందే. నీ మనసులోని కన్ ఫ్యూజన్ పోయుంటుందే" అంటూ అభిమానంగా అడుగుతున్న సత్య ప్రకాష్ ను చూసి ఉత్సాహంగా అవునన్నట్లు తలు ఊపింది.
“సరే నందిని! నువ్వు వచ్చి చాలాసేపయ్యింది. చీకటి కూడా పడింది. నువ్వు ఒక్క దానివే వెళ్ళకు...నా కార్లో దింపుతాను"
నందినని కార్లో తీసుకు వెళ్ళిన సత్య ప్రకాష్ కారును నందిని ఉంటున్న ఇంటి సంధు మొదట్లొనే ఆపాడు.
"ఇక్కడ దిగి వెళ్ళిపో"
“నందిని...ఇంకొక్క విషయం. ఇక్కడ మన బ్రాంచి సేల్స్ టార్గెట్టును కంప్లీట్ చేసాను. కలకత్తా బ్రాంచ్ వీక్ గా ఉంది. నేను అక్కడికి వెళ్ళి ఆ బ్రాంచిని డెవలప్ చేయాలి. ఇంకో వారం రోజుల్లో బయలుదేరుతాను. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఫోన్ చేయవచ్చు. నేను నీకు ఎప్పటికీ ఒక పాత స్నేహితుడినే!ఓ.కే...బాయ్" అని చెప్పి బయలుదేరాడు.
కళ్ళ నుండి కారు మాయమయ్యేవరకు కారుతున్న కన్నీటిని తుడుచుకోవాలని కూడా అనిపించని నందినికి " సత్య ప్రకాష్...నిజంగానే నువొక జెంటిల్ మ్యాన్" అని అరవాలనిపించింది.
ఓపన్ గా అరవలేక...మనసులోనే అరిచింది.
********************** సమాప్తం **********************
N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)
N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి