31, ఆగస్టు 2019, శనివారం

తొలివలపు(సీరియల్)....PART-2

                                                    తొలివలపు….(సీరియల్)
                                                                 (PART-2)

హైదరాబాద్ కోటి బస్ స్టేషన్. ఆ బస్ స్టేషన్లో నిలబడి అప్పుడప్పుడు మనికట్టు ఎత్తి ఎత్తి చూస్తూ విసుగును బయటపెడుతోంది ఆ అందమైన అమ్మాయి.

దూరాన పొగ కక్కుకుంటూ దూసుకు వస్తున్న బస్సులు, పది నెలల బిడ్డను కడుపులో మోస్తున్నట్టు...'ఎప్పుడురా ప్రశవం?' అనే వేదనతో నిలబడటానికి కూడా సమయం లేనట్లు ఒక్క క్షణం ఆగి వెళ్ళిపోతున్నాయి.

విసుగుతో నిలబడున్న ప్రయాణీకులను మరింత విసుగుకు గురిచేయకుండా, గంటకొక బస్సు ఉన్న ఆ రూటులో వెళ్ళే ఆ బస్సు ఆ రోజు ఎందుకనో పావుగంట ఆలశ్యంగా వచ్చింది. చేయెత్తి ఆపమని అడిగిన ప్రయాణీకులను నిరుశ్చాహ పరచటం ఇష్టం లేక, అక్కడ ఆగి వాళ్లను ఎక్కించుకుని వేగంగా బయలుదేరింది.

ఆరోజు ఆ రూటులో బస్సులు తక్కువగా ఉండటంతో, బస్సులో ప్రయాణీకులు ఎక్కువగా ఉన్నారు. ఒకరినొకరు రాసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. ముందూకూ,వెనకకూ తోసుకుంటున్నారు. ఆ బాధను ఏలాగో ఒర్చుకున్న ఆ అమ్మాయి తన స్టాపింగ్ రావటంతో వేగంగా బస్సు దిగి, మరింత వేగంగా నడవసాగింది. పూర్తిగా పది నిమిషాలను పోగొట్టుకుని ఆ అమ్మాయి ఆ 'నర్సింగ్ హోమ్' ఎంట్రన్స్ చేరుకుంది. ఆదుర్దా పడుతూ తన మనికట్టును ఎత్తి టైము చూసుకుని మరింత ఆదుర్దా పడింది.

'ఈ రోజు ఆ ఆడ హిట్లర్ దగ్గర బాగా 'తిట్లు తినాల్సిందే. భగవంతుడా...నువ్వే నన్ను కాపాడాలి. అర్జంటు మెసేజ్ ను దేవుడుకి పంపించేసి లోపలకు పరిగెత్తింది.

ఎదురుపడ్డ సహ ఉద్యోగి నర్స్ పద్మ దగ్గర విచారించింది.

"పద్మా...మన హిట్లర్ నా గురించి అడిగిందా?"

"అడగకుండానా ఉంటుంది! అవును...ఎందుకు ఆలశ్యం అయ్యింది జానకీ?"

"బస్సు దొరకలేదు"

"ఇలాంటి సాకులన్నీ అ హిట్లర్ మహాతల్లి దగ్గర పనికిరావని నీకు తెలుసుగా...?"

"ఇప్పుడు నేనేం చేయను"

"హు...మాట్లాడకుండా ఒకపని చెయ్యి. ఇలాగే తిరిగి ఇంటికి వెళ్ళిపో. నువ్వు 'లీవు’ అని చెప్పేస్తాను"

"నీకు ఆటగా ఉందా? మన ఇష్టానికి ‘లీవు’ పెట్టలేమని తెలిసే మాట్లాడుతున్నావా?"

"సరే తల్లీ, లోపలకు వెళ్ళు. ఆ దెయ్యం నీకోసమే కాచుకుని కూర్చోనుంటుంది. వెళ్ళి చివాట్లు తిను"--అంటూ వెక్కిరించిన పద్మా నర్స్ ను ఒకసారి కోపంగా చూసి మెల్లగా నడవటం మొదలుపెట్టింది జానకి.

"బెస్ట్ ఆఫ్ లక్ జానకీ. హిట్లర్ను చూశేసి తిన్నగా 'స్టాఫ్స్’ రూము కు వచ్చాయి. అక్కడ నీకోసం నేను 'కర్చీఫ్' తో వైట్ చేస్తూ ఉంటాను"

జానకి పడుతున్న అవస్తను వేలాకోలం చేసే విధంగా పద్మా నర్స్ తన వంతుకు జానకిని భయపెట్టి వెళ్ళింది. చీఫ్ డాక్టర్ గాయత్రి రూము వైపుకు వణుకుతూ నడవటం మొదలుపెట్టింది జానకి.

ఆక్కడున్న నర్సులు మరియూ స్టాఫ్ ‘ఆడ హిట్లర్/ దెయ్యం’ అని పిలువబడే ఆమె సాక్షాత్ ఆ గాయత్రి నర్సింగ్ హోమ్ చీఫ్ డాక్టర్ గాయత్రినే. నర్స్ ట్రైనింగ్ ముగిసిన వెంటనే జానకికి మొదటి ఉద్యోగం గాయత్రి నర్సింగ్ హోమ్ లో దొరికింది. నర్స్ ట్రైనింగ్ కోర్సులో ఎంతబాగా మార్కులు తెచ్చుకున్నా మొట్టమొదటి ఉద్యోగం, కొత్త చోటు, కొత్త బాస్ అనగానే ఏదో తెలియని భయం...ఇది మొదటిసారి ఉద్యోగానికి వెళ్లే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది కదా.

అలాగే డ్యూటీలో చేరిన మొదటి రోజు రాత్రి, ప్రశవించిన ఒక ఆమెకోసం ఉంచబడ్డ ఒక సూదిమందు బాటిల్ ను ఆదుర్దాలో జార విడిచింది జానకి. అప్పుడు అక్కడున్న అందరి ముందూ గాయత్రి దగ్గర బాగా చివాట్లు తిన్నది జానకి.

ఆ రోజు నుండి గాయత్రికి కొంచం దూరంగా ఉండటానికే ఇష్టపడింది జానకి. వైద్యానికి కావలసిన ఉపకరణాలను దగ్గరుండి గాయత్రికి అందివ్వాల్సి వచ్చినప్పుడల్లా 'ఆపరేషన్’ ఎప్పుడవుతుందో నని బయట నిలబడి టెన్షన్ పడుతున్న పేషంట్ బంధువులకంటే... జానకి ఎక్కువగా టెన్షన్ పడుతుంది.

ఇదిగో...ఈ రోజు కొంచం ఎక్కువసేపు తన నర్స్ అలంకరణ కోసం టైము స్పెండ్ చేయటం, జానకి రెగులర్ బస్సు మిస్ అవటానికి ఒక కారణం. గాయత్రిని ఒకసారి అద్దాల తలుపులులలో నుండి చూసిన జానకి, 'ఏం చివాట్లు పెడుతుందో?' అనే భయంతో తలుపు తట్టింది.

ఏదో రాసుకుంటున్న గాయత్రి, తలపైకెత్తి చూసి తల ఊపి జానకిని లోపలకు రమ్మంది. కుర్చీలో బాగా వెనకకు వాలి కూర్చున్న గాయత్రి, తన ముందు వచ్చి నిలబడ్డ జానకిని క్రింద నుండి పైకి ఒకసారి క్షుణ్ణముగా చూసింది. గాయత్రి చూపులకే ఎదురుగా నిలబడున్న జానకికి వణుకు మొదలైంది!

"సా...సారీ డాక్టర్. అదొచ్చి..."

"ఎటువంటి వ్యాఖ్యానమూ అవసరంలేదు. ఇక్కడ నీకేం పనో నీ మనసులో జ్ఞాపకము ఉంచుకునే ఇంట్లో నుంచి బయలుదేరతావు కదా? ఆలశ్యంగా వస్తే నాకు నచ్చదని తెలిసి ఇలా నా ఎదురుకుండా వచ్చి నిలబడటానికి నీకు ఎంత ధైర్యం ఉండాలి?"

"లేదు డాక్టర్...అదొచ్చి..."

"ఇది నా చోటు. ఇక్కడ అంతా నేను చెప్పినట్టే జరగాలి. నా కట్టుబాటులో ఉండటం ఇష్టం లేని వాళ్ళు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు. నెల అయ్యేటప్పటికి చెయ్యి చాచి జీతం తీసుకోవటం తెలుసు కదా? ఉద్యోగానికి సిన్సియర్ గా ఉండాలని అనిపించొద్దా? ఓ.కే.! అవసరంలేకుండా నీతో మాట్లాడి నా టైమును వేస్టు చేసుకోవటం నాకు ఇష్టంలేదు. నువ్వు వెళ్ళొచ్చు. నీకు రావలసిన 'సెటిల్ మెంట్' నీ ఇంటికే వెతుక్కుంటూ వస్తుంది"

గాయత్రి చెప్పింది విని ఒక్క నిమిషం ఏమీ అర్ధంకాక నిలబడింది జానకి.

'ఏం చెబుతోంది ఈవిడ? నన్ను ఉద్యొగం వదిలి వెళ్ళిపొమ్మని చెబుతోందా...అరె భగవంతుడా!'--అదిరిపడ్డ జానకి ఆ తరువాత కొంచం కూడా ఆలొచించ లేదు. గాయత్రి కాళ్ళమీద పడ్డట్టు ప్రాధేయ పడటం మొదలు పెట్టింది.

"నన్ను క్షమించండి డాక్టర్. లేటుగా రావటం నా తప్పే. దానికొసం మీరు ఎటువంటి శిక్ష వేసినా అనుభవిస్తాను. దయచేసి ఉద్యోగం నుండి మాత్రం వెళ్ళిపొమ్మని చెప్పకండి..."--- ఏడవటం మొదలుపెట్టింది.

"సరే...నేను ఈరోజు నీకు వేయబోయే శిక్ష, ఇకమీదట లేటుగా వచ్చే ఒక్కొక్కరికీ పాఠంగా ఉండాలి. నేను చెప్పేంత వరకు నువ్వెళ్ళి బయట... అంటే ఎండలో నిలబడాలి. నీకు ఇష్టం లేకపోతే, ఉద్యోగం మానేసి వెళ్ళిపోవచ్చు"-- చెప్పేసి తన పని చూసుకోవటం మొదలు పెట్టింది గాయత్రి.

మండుటెండలో నిలబడుంది జానకి. 'ఈమెకు ఏమైంది?'--అని వినోదంగా చూస్తూ చాలామంది ఆమెను దాటుకుని వెళ్ళారు. దాని గురించి ఆమె కలత చెందలేదు. సూర్య కిరణాలు ఒకటిగా కలిసి ఎందుకో ఆమె నడి నెత్తిన మాత్రమే కేంద్రీకృతమైనట్లు శరీరమూ, మనసూ వేడితో ఉడికిపోతున్నాయి. పూర్తి కోపమూ గాయత్రి పైన ఉండిపోయింది. కళ్ళు అగ్ని కణాలుగా దహిస్తుంటే, డాక్టర్ మాటలు జానకి మనసును సూదులతో చిల్లులు చేసింది.

'పోవే... నువ్వూ, నీ ఉద్యోగమూ' అని రాజీనామా లేఖను డాక్టర్ ముఖం మీద విసిరి పారేసి వెళ్ళిపోవచ్చు! కానీ, ఒకటో తారీఖు వచ్చిందంటే పైసా కూడా కట్ చేయకుండా ఇరవైవేలు ఎవరు ఇస్తారు? ఉద్యోగం దొరకటమే కష్టంగా ఉన్న ఈరోజుల్లో, ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని నిలబడితే ఆ తరువాత...?

అర్ధీక సమస్యలు భూతంలాగా ఆమె కళ్ళ ముందుకు వచ్చి నిలబడటంతో, మనసులో రేగిన ఆలొచనను మరు క్షణమే మర్చిపోయింది.

'ఇప్పుడొస్తున్న జీతం కంటే ఎక్కువ జీతంతో వేరే ఉద్యోగం దొరికేంత వరకు పొగరుతో విర్రవీగుతున్న ఈ దెయ్యంతోనే కాలం గడపాలి’ --తనలో తానే నొచ్చుకుంది. అదే సమయం,

"హలో!" అని వెనుకవైపు ఎవరిదో గొంతు వినబడి తిరిగి చూసేలోపు "ఎండలో నిలబడాలని ఏదైనా మొక్కా?"--అడిగేసి మెరుపులా మాయమయ్యాడు అతను.

ఒకసారే చూసింది అతన్ని. కానీ, ఆ నిమిషం ప్రేమ అనే మంచుగడ్డ ఒకటి ఆమెలో కరిగి ప్రవహించింది.

ఇంకా ఉంది.....Continued in:PART-3

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి