4, జనవరి 2020, శనివారం

లక్కీ క్యాట్ గుడి…(ఆసక్తి)



                                                     లక్కీ క్యాట్ గుడి


మనం ఏదైనా గుడికివెళ్తే ఇంటికి ప్రసాదం పట్టుకుపోయినట్లే, ఈ లక్కీ క్యాట్ ఆలయానికి వచ్చిన వారందరూ అక్కడుండే పిల్లి బొమ్మను కొనుక్కుపోతారు. ఎందుకంటే అదో అదృష్టచిహ్నంగా భావిస్తారు. దేవతగా నమ్ముతారు. ఇవన్నీ టోక్యోలోని 'గొటుకూ-జీ గుడి విశేషాలు. ఇక్కడుండే పిల్లి బొమ్మను 'లక్కీ క్యాట్' గా భావిస్తారు. కారణం తెలుసుకోవాలంటే దీని కథ తెలుసుకోవల్సిందే.


శకునం (Omen) అనగా జరగబోవు పని గురించిన సంజ్ఞ. కొన్నిటిని కొందరు వ్యక్తులు శుభ శకునాలుగానూ, కొన్నిటిని అశుభ శకునాలుగానూ భావిస్తారు. శకునాల శాస్త్రీయత ప్రశ్నార్ధకమైనందువల్ల హేతువాదులు శకునాలను పట్టించుకోవటాన్ని మూఢ నమ్మకంగా చెప్తారు. అయితే మానవ చరిత్రలో మరియు జానపద వాజ్మయంలో(Index) శకునాలకు చాలా ప్రధానపాత్ర ఉన్నది.


జానపదులు అనేక రకాల శకునాలను చూసుకుంటారు. అందులో ముఖ్యంగా కాకి శకునం వివరంగా చూసుకుంటారు. కాకి అరుస్తూ ఉంటే చుట్టాలొస్తారని ఎదురు చూస్తూ ఉంటారు.

శకునాలు తెచ్చే ఫలితాలను బట్టి వాటిని శుభశకునాలు మరియు అశుభ శకునాలుగా వర్గీకరిస్తారు. శకునాలు ఆ యా దేశాల సంస్కృతిని బట్టి మారుతూ ఉంటాయి. ఒక సంస్కృతిలో శుభ శకునంగా పరిగిణించిన దాన్ని వేరొక సంస్కృతిలో అశుభ శకునంగా పరిగణించే అవకాశం ఉంది. ఉదాహరణకు అమెరికాలో నల్లపిల్లిని అశుభ సూచకముగా భావిస్తే, ఇంగ్లాండులో అదే నల్లపిల్లిని శుభ సూచకముగా భావిస్తారు.


శకునాలను, వాటి ఫలితాలను భారతీయులు ఎంతగానో విశ్వసిస్తుంటారు. శుభకార్యాల నిమిత్తం బయలుదేరుతున్నప్పుడు, శుభకార్యాలకి సంబంధించిన పనులను ప్రారంభిస్తూ వున్నప్పుడు సహజంగానే శకునం చూసుకుంటూ ఉంటారు. శకునం మంచిగా అనిపించకపోతే శుభకార్యాలను వాయిదా వేయడమే కాదు, రద్దు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది.


ఈ శకునాల్లో పిల్లి శకునం మరింత ప్రభావం చూపుతుందని భావిస్తూ వుంటారు. పెంపుడు పిల్లికి తప్పులేదనే విశ్వాసం వుండటం వలన, తమ పిల్లి కాకుండా మరో పిల్లి ఎదురుపడితే దానిని శకునంగానే భావిస్తుంటారు. అంతేకాదు పెంపుడు పిల్లి ఇల్లు వదిలిపోతే ఇంటిలోని అదృష్టం కూడా దానితోనే పోతుందంటారు పెద్దలు. శకునాలలో ప్రపంచవ్యాప్తంగా పిల్లి శకునాన్నే ఎక్కువమంది పట్టించుకుంటున్నారు. పిల్లి ప్రవర్తన ఆధారంగా భవిష్యత్తు గురించి పలు జోస్యాలు చెబుతుంటారు. పిల్లి కదలికల్లో ఏదో ఒక సూచనను చూసేవారు కోకొల్లలుగా ఉన్నారు.


వెన్నెలలో నల్లపిల్లిని చూడడం ఆ ప్రాంతంలో ఏదో ఒక అంటు వ్యాధి ప్రబలనున్నదనడానికి సూచనట(ఇది ఐరిష్ ప్రజల భయం). ఉద్దేశపూర్వకంగా పిల్లిని చంపితే మీరు మీ ఆత్మను దయ్యానికి కోల్పోయినట్టే(ఇది బ్రిటన్ వాసుల నమ్మకం). ఒక పిల్లి తన తోకను మంటవైపు ఉంచి, తన చెవుల పై భాగాన్ని నాకుతూ ఉంటే వాతావరణ పరిస్థితులు విషమిస్తాయి. వివాహవేదిక వద్ద పిల్లి ఉండడం మంచి అదృష్టం. ఒక మృతుడి శవపేటికపైనుంచి పిల్లి దూకితే శాశ్వత నిద్రపోతున్న ఆ మహానుభావుడు స్వర్గానికి చేరే ప్రసక్తే లేదు.(ఇది ఆస్ట్రేలియన్ల మాట). ఒక పిల్లి కిటికీలో నుంచి అదే పనిగా బయటకు చూస్తుంటే వర్షం ఖాయంగా రాబోతోందనడానికి సూచన.కలలో పిల్లి దర్శనమిస్తే ధన లాభం. వ్యాపారంలో కలిసొస్తుంది. నల్ల, తెల్ల పిల్లులు స్వప్నంలో కనిపిస్తే మీ సంతానం విషయంలో మీరు చాలా అదృష్టవంతులు. చారలపిల్లి కలలో కనిపిస్తే మీ ఇంటిలో అదృష్టం వర్షిస్తుంది. నల్ల పిల్లులు గుప్త నిధులను కనిపెట్టగలుగుతాయి. ఐదురోడ్ల కూడలివద్దకు పిల్లిని తీసుకువెళ్ళి వదిలేయండి. ఆ తరువాత దానిని అనుసరించండి. మీకు గుప్తనిధులు దొరుకుతాయి( ఇది ఫ్రెంచ్ వారి ఆశాభావం).


జపాన్ దేశంలో సైగచేసే పిల్లి అదృష్టం, ఐశ్వర్యం తీసుకువస్తుందని గట్టి నమ్మకం. పిల్లులు సైగలు చేస్తాయా? వాటి ప్రవర్తనల బట్టి వాటికి శకునాలు నిర్ణయించుకున్నారు. పూర్వం ఒక రాజు సెటగయా నగరంలో నుండి వెడుతూ, అలసిపోయి ఉండటంతో సేద తీర్చుకోవడానికి ఒక చెట్టు దగ్గర ఆగాడు. ఇది గమనించిన ఒక పిల్లి ఆ రాజుకు సైగ చేసి వేరే చోటుకు తీసుకు వెళ్ళింది. కొద్దిక్షణాలలో గాలివానతో కూడిన వర్షం రావడం, అప్పుడు ఒక పిడుగు, అంతకు ముందు రాజు నిలబడ్డ చోట పడటం జరిగింది. అది చూసిన రాజు, ఆ పిల్లిని తన అదృష్ట దేవతగా భావించి, కోట్లకొలది డబ్బుతో అక్కడ ఆ పిల్లికి ఒక గుడి కట్టించాడట. అప్పటి నుండి ఆ గుడి, సైగచేసే ఆ పిల్లి, జపాన్ ప్రజలకు ప్రియమైనదిగా మారింది.


'మనేకి నెకో’ లేక 'సైగ చేయు పిల్లి’ ...ఇది జపాన్ దేశంలో అత్యంత పేరుపొందిన బొమ్మ (విగ్రహం). అదృష్టం, ఐశ్వర్యం తీసుకువస్తుందని గట్టి నమ్మకంతో జపాన్ దేశ ప్రజలు తమ ఇళ్ళల్లో, షాపులలో, వ్యాపార కేంద్రాలలో, ఆఫీసులలో ఈ పిల్లి బొమ్మను తప్పక ఉంచుకుంటారు. సెటగయా నగర సరిహద్దులలో 'గొటుకూ-జి’ అనే పేరుతో ఈ పిల్లి విగ్రహంతో ఒక గుడి ఉన్నది.

సైగ చేసే పిల్లుల బొమ్మలను బ్యాటరీలతో తయారు చేసి అమ్ముతున్నారు. ఈ బొమ్మ, బ్యాటరీ పవర్ తో, చేతితో సైగ చేస్తుంది. ఈ బొమ్మను అందరూ కొనుక్కుని తెచ్చుకుంటున్నారు. ఈ బొమ్మ శక్తి ఇప్పుడు ఆసియా దేశాలలో కూడా వ్యాపించింది.

Images Credit: To those who took the original Photo. ****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి