7, మే 2020, గురువారం

'నాన్నా' రా! ... (కథ)
                                                            'నాన్నా' రా! 
                                                                   (కథ)


"అమ్మా...ఎప్పుడు చూడు నా భార్యతో గొడవపెట్టుకోవటం ఆపుతావా...లేదా? ఇక మీదట దాన్ని తిడితే నాకు పిచ్చి కోపం వస్తుంది!"---ఆవేశంలో కోపాన్ని కక్కుతున్న కొడుకు శ్రీకాంత్ ను చూసి ఆశ్చర్యపోయి, షాక్ తిన్నది తల్లి రాజ్యం.

"ఏమిట్రా చెబుతున్నావు...సునీతతో నేను గొడవ పడుతున్నానా? దాన్ని తిడుతున్నానా? సునీతేరా నాతో గొడవపెట్టుకుంటోంది, 'నువ్వు ఇక్కడ కూర్చోకూ! ఇది తీయకు... అది తీయకు, దాన్ని తాకకు అని ఏదో ఒకటి చెబుతూనే ఉంటోంది"

పొంగుకు వస్తున్న కన్నీటిని తిరిగి కళ్ళల్లోకే పంపటానికి ప్రయత్నించి ఓడిపోయింది.

"సునీతా తోనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావని చూస్తే...నాతోనూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా?"

"ఏమిట్రా అబ్బాయ్...ఏదేదో మాట్లాడుతున్నావు! వయసైన కాలంలో, వొంట్లో బాగుండక ఏదో కష్టపడుతూ కాలం గడుపుతున్నాము...దాంతో పాటు ఎందుకురా మమ్మల్ని మాటలతోనే చంపుతున్నావు? మేము ఇక్కడ ఉండటం మీ ఇద్దరికీ ఇష్టం లేకపోతే చెప్పు. నేనూ, నాన్నగారూ ఎక్కడైనా వృద్దాశ్రమంలోకి వెళ్ళి జేరిపోతాము"

"..........." మౌనంగా నిలబడ్డాడు శ్రీకాంత్.

"ఏమండీ...ఇంకాసేపు కూడా నేను ఇక్కడ ఉండలేనండి. మన అబ్బాయి, కొడలూ మనల్ని కష్ట పెడుతుండటం నేను సహించలేకపోతున్నాను. రండి...ఎక్కడికైనా వెళ్ళిపోదాం!" ఏడుస్తున్న భార్య రాజ్యం ను చూసిన సుబ్రమణ్యానికి గుండె పగిలిపోయేటట్టు అనిపించింది.

"నా పెన్షన్ డబ్బుతో మనం ఎలాగైనా కాలం గడపవచ్చు రాజ్యం. కానీ, అరవై ఏళ్ళు దాటిన మన వొళ్ళు మనకి సహకరించటంలేదే"

"అయినా పరవాలేదండి. మీకు నేను, నాకు మీరు, ఇద్దరం ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఏలాగో కాలం గడిపేద్దాం. కానీ ఈ ఊరిలోనే మనం ఉండకూడదు. వీళ్ళ మొహాలనే చూడకూడదు. వీళ్ళ కళ్ళకు కనిపించనంత దూరం వెళ్ళిపోదాం"

“సరే రాజ్యం...నువ్వు ఏడవకు. నేను ఏర్పాటు చేస్తాను"

రాజమండ్రి నుండి బయలుదేరిన రైలు హైదరబాద్ చేరుకుని నిట్టూర్పు విడిచింది. రైలుకు పలు గంటులు ప్రయాణం చేసిన బడలిక. వీళ్ళకు పలు సంవత్సరాలు శ్రమ పడ్డ బడలిక.

రైల్వే స్టేషన్లో నుండి బయటకు వచ్చారు.

"ఎక్కడికి వెళ్ళబోతాం...ఏదైనా నిర్ణయించుకున్నారా?" ---అడుగుతూ వస్తున్న భార్య రాజ్యం ను చూసాడు సుబ్రమణ్యం.

"మనకు ఇక వృద్దాశ్రమమే గతి! అక్కడికే వెళ్ళబోతాం రాజ్యం. మన అబ్బాయి కళ్ళకు కనబడకూడదనే ఇంత దూరం వచ్చాను. వాళ్ళ ప్రశాంతతను మనమెందుకు డిస్టర్బ్ చేయటం? వాళ్ళకు దూరంగానే ఉందాం" భర్త చెప్పగా, దుఃఖం ఆపుకోలేక పరితపించింది రాజ్యం.

ఆటో ఎక్కి రాసిపెట్టుకున్న అడ్రస్సు చెప్పి, వెతుక్కుంటూ వెళ్ళారు. వాళ్ళు వెతుకుతున్న చోటు వచ్చింది.

ఐదునిమిషాల తరువాత...వృద్దాశ్రమం లోపలి నుండి వచ్చిన ఆయన్ను చూసిన సుబ్రమణ్యం - రాజ్యం దంపతులకు శ్వాసే ఆగిపోయేటట్టు అనిపించింది. పెదవుల నుండి మాటలు రావడానికి నిరాకరించినై. ఇద్దరి మొహాలు షాక్ యొక్క తీవ్రతలో ఉన్నాయి!

ఆ వృద్దాశ్రమం యొక్క నిర్వాహకుడు కూడా చిన్నగా షాక్ తిన్నా కూడా, తమాయించుకుని మాట్లాడటం మొదలుపెట్టాడు.

"రారా సుబ్రమణ్యం...కాలం ఎలా మారిపోయిందో చూసావా? ఆ రోజు మీ ఇద్దరూ కలిసి నన్ను ఇంట్లో నుండి తరిమేశారు. చేతిలో చిల్లి గవ్వలేకుండా వచ్చాను. వైరాగ్యంతో వచ్చాను...స్నేహితుడి సహాయంతో ఈ ఆశ్రమం మొదలుపెట్టాను. నేను ఎనభై ఐదు ఏళ్ళు దాటిన ముసలోడినేరా! కానీ, నిన్నూ, నీ భార్యను ఇప్పుడు కూడా నేను కాపాడగలను. ఎందుకంటే నేను నీ నాన్ననురా! రారా లోపలకు...నువ్వు కూడా రా అమ్మాయ్”

“ఆ రోజు ఏదేదో మాట్లాడి నన్ను ఇంట్లోంచి తరిమేవు! ఈ రోజు నీ పరిస్థితి కూడా అలాగే అయిపోయిందే? పరవాలేదు...నేను మిమ్మల్ని క్షమించాసాను. ఇద్దరూ రండి" -- తండ్రి కల్యాన్ రాం గంభీరంగా మాట్లాడాడు.

సుబ్రమణ్యం తల దించుకున్నాడు... రాజ్యం ముఖం వెలవెల పోయింది! ఇద్దరూ గుమ్మం దగ్గరే నిలబడిపోయారు.

"నాన్నా...రా' అని ప్రేమగా కొడుకును,కోడల్నీ ఆహ్వానించాడు కల్యాన్ రాం.

*********************************************సమాప్తం******************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి