మరో ప్రపంచం నుండి వచ్చిన మనిషి? (మిస్టరీ)
ఇప్పుడిప్పుడే భూమిలాంటి మరో గ్రహం ఉన్నది అని చెబుతున్నారు
కానీ 1954 లో జపాన్ లోని టోక్యో విమానాశ్రయంలో జరిగిన ఒక వింత సంఘటనను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే, ఇప్పుడు చెబుతున్న భూమిలాంటి మరో గ్రహం ఎప్పటి నుండో ఉండి వుండవచ్చు, అందులో మనలాంటి మానవజాతి మనుగడ కలిగి ఉండవచ్చునేమోనని చాలామంది శాస్రవేత్తలకు, మేధావులకు, ప్రజలకు అనిపిస్తోంది.
1954 సంవత్సరం జూలై నెలలో టోక్యో విమానాశ్రయంలో ఒక మనిషి దిగాడు. అతను చూడటానికి యూరప్ ఖండానికి చెందిన మనిషిలా కనిపించాడు. మన సంప్రదాయ రీతిలోనే ఉన్నాడు. కానీ విమానాశ్రయ అధికారులకు అతని మీద అనుమానం వచ్చింది.
అతని పాస్ పోర్టును తనిఖీ చేశారు. అతను ‘టౌరడ్’ అనే దేశానికి చెందినవాడని అందులో రాసుంది. అతని పాస్ పోర్ట్ వాస్తవమైన అధార స్థానం నుంచి ఇవ్వబడినట్లే ఉన్నది. కానీ అతను చెప్పిన దేశం మన ప్రపంచంలోనే లేదు.
అతన్ని విచారణకు తీసుకు వెళ్ళి అతని దేశం ఎక్కడుందో చెప్పమన్నారు. మ్యాపులో చూపించమన్నారు. అతను వెంటనే మ్యాపులోని 'ప్రిన్సిపాలిటీ ఆఫ్ అండోర్రా' అనే దేశంపై తన వేలు ఉంచి చూపించాడు(అండోర్రా: అధికారిక నామం ప్రిన్సిపాలిటీ ఆఫ్ అండోర్రా. పశ్చిమ యూరప్ లోని ఒక చిన్న భూపరివేష్టిత దేశం. ఈ దేశం, పైరెనీస్ పర్వతాలకు తూర్పున, స్పెయిన్ మరియూ ఫ్రాన్స్ దేశాలు సరిహద్దులుగా కలిగి ఉన్నది). అయితే అతనికి వెంటనే కోపం వచ్చింది. కోపంతో పాటు గందరగోళంలో పడ్డాడు. నా దేశం పేరు ‘టౌరడ్’. అండోర్రా పేరు నేనెప్పుడూ వినలేదు. అయినా నా మాతృదేశం ఎందుకు ఈ మ్యాపులో లేదు అని అడిగాడు.
అతను చెప్పినదాని ప్రకారం అతని దేశం 1000 సంవత్సరాల నుండి ఉన్నది. అతని దగ్గరున్న డబ్బు చూపించమన్నారు. పలు యూరోపియన్ దేశాల కరెన్సీ అతని దగ్గర ఉన్నది.
అతని పాస్ పోర్ట్ మీద అతను ఇంతకు ముందు చాలాసార్లు వచ్చి వెళ్ళినట్లు పలుదేశాల ముద్రలు ఉన్నాయి. టోక్యోకి వచ్చిన ముద్రలు కూడా ఉన్నాయి. తికమక పడిన అధికారులు అతన్ని ఖైదు చేసి టోక్యో నగరంలోని ఒక హోటల్లో ఉంచి, అతనికి కాపలాగా ఇద్దరు పోలీసులను ఉంచారు. అతని పూర్తి వివరాలు తెలుసుకునేంతవరకు అతన్ని అక్కడే ఉంచాలని నిర్ణయించుకున్నారు.
అతను ఒక కంపెనీలో పనిచేస్తున్నట్టు ఆధారాలు చూపించాడు. పోలీసులు ఆ కంపెనీకి ఫోన్ చేసి విచారించారు. అటువంటి పేరుతో ఎవరూ పనిచేయడం లేదని ఆ కంపెనీ వారు తెలియజేశారు. మరి ఆ కంపెనీ ఆధారాలు అతని దగ్గర ఎలా ఉన్నాయి? అందులో అతని పేరు ఎలా వచ్చింది?
అతను ఒక హోటల్ పేరు చెప్పి అందులో తను రూము బుక్ చేసుకున్నట్టు చెప్పాడు. ఆ హోటల్ వారిని అడిగితే, ఆ పేరు మీద బుకింగ్ జరగలేదని తెలిపారు. టోక్యోకి ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు ఒక కంపెనీ పేరు చెప్పి వారితో వ్యాపారం చేయడానికి వచ్చానని చెప్పాడు. మీరు ఊహించింది కరెక్టే. ఆ కంపెనీ వారు కూడా అలాంటి మనిషి మాకు తెలియదని తల అడ్డంగా ఊపారు.
ఇక లాభం లేదని అతన్ని కోర్టుకు అప్పగించాలని అతని రూముకు వెళ్ళి తాళం తీశారు. అతను అక్కడ లేడు. మాయమయ్యాడు. పోలీసులు కాపలా ఉన్నారు. తాళాలు తీయబడలేదు. కిటికీ కుండా పారిపోయుంటాడా? అవకాశమే లేదట. కారణం, అతని రూము పలు అంతస్తులున్న హోటల్లోని రూము మరియూ ఆ రూములో బాల్కనీయే లేదు.
అంతే అతన్ని మళ్ళీ ఎవరూ చూడలేదు. ఈ విషయం ఇంకా మిస్టరీగానే ఉన్నది.
ఇది ఒక కథనా....?
ఈ విషయం The Directory of Possibilities, Colin Wilson & John Grant(Corgi Paperback,1982,ISBN:0-552-119946) అనే పుస్తకంలో రాయబడింది. ప్రభుత్వ పత్రాలు గానీ, ఆనాటి వార్తా పత్రికలలో గానీ, ఇతర ఆధారాలు లేవు. అండొర్రా అనే దేశం ఒకప్పుడు ఉండేది. పశ్చిమ దేశాల కూటమి ఆ దేశాన్ని ఆక్రమించింది. అండొర్రాలో ఎప్పుడూ రాజకీయ మార్పులు మరియు అంతర్ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఏ దేశమైనా ఇతన్ని గూఢచారిగా పంపించి ఉండవచ్చు. అందుకే జపాన్ ప్రభుత్వం అతని గురించిన వివరాలనూ మరియూ అలాంటి విషయం జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేకుండా చూసుకున్నదని కొంత మంది...కాదు కాదు అతను ఖచ్చితంగా అక్షరేఖకు అవతల పక్క ఉన్న ప్రపంచం నుండి వచ్చి ఉంటాడని మరికొందరు చెబుతున్నారు.
ఏది నిజమే తెలియదు కనుక ఈ విషయం అతిపెద్ద మిస్టరీగా ఉంటోంది/ఉండిపోయింది.
Images Credit: To those who took the original photos.
************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి