19, డిసెంబర్ 2021, ఆదివారం

పవిత్ర...(సీరియల్)...PART-1

 

                                                                                     'పవిత్ర'...(సీరియల్)                                                                                                                                                                           PART-1

సతీసావిత్రి జీవించిన కాలం నుండి...భర్త ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో జీవించి తిరిగి వచ్చినా, అతని పాదాలు తాకి కళ్ళకద్దుకుని అతనే తన భర్త అని చెప్పే మహిళనే పతివ్రత అంటున్నారు. కన్యాత్వం అనేది మగవాడికీ, ఆడదానికీ సమం కాదా?

పెళ్లైన జీవితం అందరికీ విజయవంతంగా ఉండటం లేదు. నవలలోని హీరోయిన్ పవిత్రకు కూడా అదే జరిగింది. కానీ అందులో ఆమె తప్పేమీ లేదు. పెళ్ళి చూపులకు వచ్చి, పవిత్రను పలుమార్లు చూసి, ప్రశ్నలతో పాటూ కట్నకానుకలు అడిగి పెళ్ళిచేసుకున్న తరువాత, ఆమె బాగుండలేదని, రోజు మహిళలాగా లేదని విదిచిపెట్టాడు పవిత్ర భర్త రామ్మోహన్.

తనకు ఏర్పడిన ఓటమిని విజయవంతంగా చేసుకునేందుకు తనని తాను పక్వ పరుచుకుంది పవిత్ర. మెరుగు దిద్దబడ్డ వజ్రంలాగా  మారిపోయింది. ఆమెకు పక్క బలంగా నిలబడ్డాడు ఆమె తమ్ముడు మనోహర్. కొన్నేళ్ళలలో ఆమె 21 శతాబ్ధపు మహిళలా మారిపోయింది.

అనుకోకుండా ఒక ఆసుపత్రిలో రామ్మోహన్, పవిత్రను చూస్తాడు. తిరిగి ఆమెతో కలిసి కాపురం చేద్దామని ఆమె వెనుక పడతాడు. అత్తగారిని తన మాటలతో ఒప్పిస్తాడు. అల్లుడితో తిరిగి కలిసిపొమ్మని తల్లి పవిత్ర మీద ఒత్తిడి తెస్తుంది.

తల్లి ఒత్తిడికి తలవొగ్గిందా పవిత్ర? 'కొట్టినా, తిట్టినా భర్తే' అనే పాత వాదనను నిజం చేస్తూ తిరిగి రామ్మోహన్ తో కలిసిపోయిందా? లేక తన జీవితాన్ని విజయవంతం చేసుకొవాలనుకున్నట్టుగా తాను పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకుందా? రామ్మోహన్ తిరిగి పవిత్రతో ఎందుకు కలిసి జీవించాలనుకున్నాడు?.....వీటన్నిటికీ సమాధానాలు   సీరియల్ చదివితే దొరుకుతుంది.

ఈ 'పవిత్ర ' సీరియల్ ను పూర్తి నవలగా ఒకేసారి చదవాలనుకుంటే ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి.

'పవిత్ర '...పూర్తి నవల @ కథా కాలక్షేపం-2

************************************************************************************************

ఇళ్ళంతా మగవాళ్ళు, ఆడవాళ్ళు, బంధువులతో నిండిపోయింది. గోడ చివర నేరస్తురాలుగా నిలబెట్ట బడింది పవిత్ర. అందరూ మాట్లాడిన మాటలను, వంచుకున్న తలతో చాలా నిదానంగా వింటున్న పవిత్ర ఓర్పులో భూదేవి, పతివ్రతలలొ సీత, దయ చూపించటంలో తల్లి. అభిమానాన్నీ, గౌరవాన్నీ ఇవ్వటంలో దైవం. మొత్తానికి కుటుంబానికి తగిన వెన్నెల.

ఇన్ని గొప్పతనాలను తనలో ఉంచుకున్న ఆమెను కుటుంబాన్ని నడపటానికి ప్రయోజనమే లేదూ అని వాదాడుతున్నాడు ఆమె భర్త రామ్మోహన్.

అతను చెబుతున్న నేరారోపణలకు అతని బంధువులు తల ఊపగా, ఆందోళనతో కాదని చెబుతున్నారు పవిత్ర యొక్క తల్లి-తండ్రులు. ఆడపిల్లను కన్నవారు కదా!

కార్యం జరగాలంటే గాడిద కాళ్ళు అయినా సరే పట్టుకునే కావాలి అనేలాగా తన అల్లుడు కాళ్ళు పట్టుకోవటానికైనా తయారుగా ఉన్నట్టు చెప్పి బ్రతిమిలాడుతున్నారు.

తండ్రి బ్రతిమలాడటం పవిత్ర కళ్ళల్లో నీళ్ళు తెప్పించినై. ఆమె తోబుట్టువైన మనోహర్ మొహంలో విపరీతమైన కోపాన్ని తెప్పించింది. తండ్రితో ఆవేశంగా మాట్లాడాడు.

నాన్నా...మీరెందుకు నాన్నా మనిషి దగ్గరకు వెళ్ళి బ్రతిమిలాడుతున్నారు?” --  మనోహర్ కోపంగా అడిగినప్పుడు రామ్మోహన్ లబోదిబోమంటూ ఎగిరాడు.

విన్నావయ్యా...విన్నావా. మీ అబ్బాయి ఏం చెబుతున్నాడో విన్నావా? నీ కూతురు లాగానే వీడు కూడా నన్ను గౌరవించటం లేదు

క్షమించండి అల్లుడుగారూ...వాడు చిన్న పిల్లాడు...

ఏమిటీ...చిన్న పిల్లాడా? ఎద్దులాగా పెరిగున్నాడు. వీడు చిన్న పిల్లాడా?”

అదే కదా...ఇంటల్లుడనే మర్యాద కొంచమైనా ఉందా?” -- రామ్మోహన్ తల్లి అడిగినప్పుడు, ఆమె వైపు కోపంగా తిరిగి చూసాడు మనోహర్.

మర్యాదనేది తానుగా దొరకాలి. అడిగి తీసుకోకూడదు

మనో... నువ్వు కాముగా ఉండు

మాట్లాడకండీ నాన్నా. మనిషి అక్కయ్యను ఇష్టమొచ్చినట్టు నీచంగా తిడుతున్నాడు. వాడి పళ్ళు ఊడకొట్టకుండా బ్రతిమిలాడుతూ నిలబడ్డారు?”

వినండయ్యా... అమ్మాయి మంచితనం తెలియకుండా మాట్లాడుతున్నాను అన్నారే! వీడు మాట్లాడేది విన్నారా? వీడే ఇలా మాట్లాడితే...ఇది ఎలా మాట్లుడుతుందో ఊహించుకోండి?”

ఇలా చూడవయ్యా, పవిత్రా గురించి మాకు బాగా తెలుసు. అమ్మాయి ఎవర్నీ ఎదిరించి మాట్లాడదు -- పవిత్ర బాబాయ్ చెప్పటంతో, ఆయన పైన విరుచుకు పడ్డాడు రామ్మోహన్.

అంటే నేను అబద్దం చెబుతున్నానా...?”

అది ఊరికే తెలుసు!

మనో...నువ్వు కాసేపు నిదానంగా ఉండరా

ఎంతసేపు బాబాయ్? దగ్గర దగ్గర ఒక గంట సేపటి నుంచి అక్కయ్య నేరస్తురాలు లాగా నిలబడింది. ఇతను మాట్లాడుతున్నది అందరూ వింటూనే ఉన్నారు కదా?"

ఇతను చెప్పేదాంట్లో ఒక చుక్క అయినా నిజముందా? న్యాయం ఉందా? ఇప్పుడెందుకు ఊర్లో అందరినీ పిలిచి పంచాయితీ పెడుతున్నాడని ఎవరైనా అడిగారా?”

ఎవరూ అడగక్కర్లేదు. నేనే చెబుతాను. ఇంతకు మించి దీనితో నేను కాపురం చేయలేను. మీరే బాంధవ్యాన్ని తెంచేయండి -- భర్త సాదారణంగా చెప్పగా... పవిత్ర శరీరమంతా కంపించింది.

కళ్ళల్లో నీరు ఉబికి వస్తుంటే మెల్లగా తలెత్తి భర్తను చూసింది. భార్య వైపు కన్నెత్తి కూడా చూడకుండా మాట్లాడుతుంటే...బంధువుల గుంపు స్థంభించిపోయింది. తమ్ముడు మనోహర్ రక్తం ఉడికిపోయింది.

పవిత్ర తండ్రి గోపాల కృష్ణ ఎక్కువగా బెదిరిపోయాడు అల్లుడూ! ఏం మాట చెప్పారు?”

మీ అమ్మాయిని వద్దని చెబుతున్నా. ఇంకా ఏమిటి...అల్లుడూ, గిల్లుడూ అంటూ బంధుత్వం కావలసి ఉంది?”

ఏయ్...మా అక్కయ్య దగ్గర ఏమిటయ్యా అంత పెద్ద కొరత చూశావు? వద్దనటానికి

హు...ఒకటా, రెండా? కొరతలు అని వేటి వేటిని అంటామో, అవన్నీ మీ అక్కయ్య దగ్గర ఉన్నాయే" --- నిర్లక్ష్యంగా చెప్పిన అతని చొక్కా పుచ్చుకున్నాడు మనోహర్.

ఇలా చూడూ...మా అక్కయ్య భర్తవని ఇంత ఓర్పుగా మాట్లాడుతున్నాను. లేదంటే...ఇక్కడే నిన్ను చంపి పాతేస్తాను

అయ్యో...అయ్యో...కుటుంబమేనా ఇది? మా అబ్బాయిని చంపేస్తామని చెబుతున్నారే! సరైన రౌడీ గుంపు దగ్గరకొచ్చి చిక్కుకున్నామే రామూ" -- అతని తల్లి గట్టిగా ఏడవగా, బంధువులొచ్చి ఇద్దర్నీ విడిపించారు.

మనో! ఏమిట్రా ఇది? ఇది మీ అక్కయ్య జీవితం రా. కాస్త నిదానంగా ఉండు -- కొడుకును సమాధానపరిచాడు తండ్రి గోపాల కృష్ణ.

అప్పుడు లోపలకు వచ్చింది పవిత్ర తల్లి స్వరాజ్యం. చేతిలో అర్చన పళ్లెం బుట్ట. వొళ్ళంతా చెమటతో స్నానం చేసినట్టు చెమట...ఆశ్చర్యంగా అందరినీ చూసింది.

అరెరె...రండి...రండి అల్లుడుగారూ...రండి వదిన గారూ -- ఎప్పుడొచ్చారు?”

మేమొచ్చి రెండు గంటలు అవుతోంది

అలాగా...క్షమించండి. రోజు వరలక్ష్మీ వ్రతం కదా. అందుకే గుడికి వెళ్ళాను. అక్కడ బాగా జనం. అందుకే ఆలశ్యం...  మాట్లాడుతూ వచ్చిన ఆమె మొహం మారింది.

కూతురు కళ్ళల్లో నీరు, భర్త మొహంలో శోకం, బంధువుల మొహాలలో కలత...ఇవన్నీ గమనించిన స్వరాజ్యం ఏదో సమస్య  అని గ్రహించింది. తిన్నగా కూతురు పవిత్ర దగ్గరకు వచ్చింది.

పవిత్రా...ఏమ్మా...ఏమైంది?”

ఏమీ లేదమ్మా--సన్నని స్వరంతో చెప్పిన పవిత్ర వైపు కోపంగా చూసాడు రామ్మోహన్.

ఏమిటీ...ఏమీ లేదా? ఏమిటే...నేనొకడ్ని ఇక్కడ ఇంతసేపు కుక్కలాగా అరుస్తుంటే, నువ్వేంటే కూల్ గా ఏమీ లేదంటున్నావు? నన్ను చూస్తే నీకు జోకర్ లాగా కనబడుతున్నానా?”

అల్లుడుగారూ...ఎందుకలా మాట్లాడుతున్నారు?”

మీ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాగా...ఇంకెలా మాట్లాడను?”

అల్లుడూ గారూ. ఏదైనా సమస్యా?”

మీ అమ్మాయిని రోజున పెళ్ళి చేసుకున్నానో... రోజు నుంచి నా జీవితమే సమస్య అయిపోయింది  

అల్లుడు గారూ...

చదువుకోని పిల్ల వద్దని తలబాదుకున్నాను. విన్నావా అమ్మా! నీ వలనే నా జీవితం నాశనం అయ్యింది -- తల్లి మీద కోపాన్ని చూపుతున్న అతన్ని భయంతో చూస్తూనే, కూతురి మొహాన్ని పైకెత్తింది స్వరాజ్యం.

పవిత్రా...ఏమిటే ఇది? అల్లుడి గారితో ఏదైనా గొడవ పడ్డావా?”

లేదమ్మా

మరెందుకు అల్లుడుగారు ఇలా మాట్లాడుతున్నారు? ఏమండీ...మీరెందుకు ఏమీ మాట్లాడకుండా నిలబడ్డారు? మనో...ఏమిట్రా ఇదంతా?”

స్వరాజ్యం...నాకు ఏమీ అర్ధం కావటం లేదు. అల్లుడు ఏమిటేమిటో చెబుతున్నాడు. చాలా కోపంగా మాట్లాడుతున్నారు

మీ పంచాయతీ తరువాత పెట్టుకోండి. నా పని మిగించి నన్ను పంపండి. నాకు లక్ష పనులున్నాయి

ఏమయ్యా...కొంచం ఓర్పుగా మాట్లాడవయ్యా. గబుక్కున తెంచిపారేయటానికి ఇదేమన్నా ఆటనా? ఆడపిల్ల జీవితం

ఇదిగో పెద్దాయినా, నీ దగ్గర అడ్వైజ్అడగలేదు. నాకు ఈమె వద్దు. రోజుతో అంతా అయిపోవాలి. తెంపేయండి

స్వరాజ్యం ఆందోళన పడింది.

అయ్యో...అల్లుడుగారూ...ఎంత మాట అనేశారు?”

వూరికే అరిచి గోల చేయకండి. దీనితో రెండు సంవత్సరాలు కాపురం చేసిందే పెద్ద విషయం. ఇక మీదట దీనితో ఒక్క నిమిషం కూడా కాపురం చేయ్యలేను

అంత పెద్ద తప్పు నా కూతురు ఏం చేసింది?” 

అమ్మాయిని కని పడేసారు. పచ్చి జఠం. ఒక్క అభిరుచి కూడా లేదు. చదువుదా లేదు కదా కొంచం డీసెంటుగా ఉండొద్దా? సుద్ద మట్టి బుర్ర” 

అల్లుడుగారూ...

నా రంగుకూ, అందానికీ చదువుకూ మీ అమ్మాయి కొంచమైనా సరితూగుతుందా? దాని మొహం చూడండి...ఛఛ..దాన్ని చూస్తేనే నచ్చలేదు --- అంటూ మొహం తిప్పుకున్న అతన్ని చూస్తూ కుమిలి పోయింది పవిత్ర.

కోపంతో అతని దగ్గరకు వెళ్ళాడు మనోహర్.

ఏరా! మేమేమన్నా మా అక్కయ్య మొహాన్ని కప్పి పుచ్చి నీకు కట్టబెట్టామా? పెళ్ళి చూపులకు వచ్చినప్పుడు నీకు కళ్ళు దొబ్బినయా? నీ అంగీకారంతోనే కదా అంతా జరిగింది

నేనేమీ దీని అందంలో పడిపోయి తల ఊపలేదు. మా అమ్మ గోల భరించలేక సరేనన్నాను

దానికి మాత్రమేనా అంగీకరించావు? మెడ నిండా నగలు...నీకు ఒక మోటార్ సైకిల్, కట్నకానుకలు ఇచ్చామే?”

ఏమిటి పెద్దగా మీరు ఇచ్చి చించింది? చదువుకోని పిల్లకు ఇది కూడా చెయ్యకపోతే ఎలా?”

ఇలా చూడూ మాటి మాటికీ మా అక్కయ్యను చదువుకోలేదని సాధించావో, నీకు మర్యాదగా ఉండదు

అలాగేరా చెబుతాను. జస్ట్ ఎనిమిదో క్లాసు చదువుకున్న దానికి గౌరవం కావాలా? ఛఛ...నా చదువుకూ, ఉద్యోగానికీ ఎలాంటి అమ్మాయి దొరికుండేది?”

నా కలే...చదువుకుని -- ఉద్యోగానికి వెళ్ళే అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనే. చదువురాని మొద్దు మొహాన్ని నాకు కట్టబెట్టి నా జీవితాన్నే చీకటిమయం చేసారు

ఎవరురా మొద్దు మొహం? నిన్నూ...

మనో! నువ్వు ఆగరా. ఏం వియ్యపురాలా...మీ అబ్బాయి మాట్లాడేది వింటూ, ఏమీ మాట్లాడకుండా నిలబడ్డారు?”     

నేనేం మాట్లాడను? నేనే మా అబ్బాయి జీవితాన్ని పాడు చేసేను. డబ్బు, నగలూ ఎక్కువగా దొరుకుతుందని వాడ్ని బలిపసువుగా నిలబెట్టాను

ఏమ్మా మీ మాటలన్నీ ఒక మాదిరిగా ఉన్నాయి? ఎలాగైనా మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి అంటూ చెప్పులు అరిగేలాగా తిరిగింది మర్చిపోయారా?”

ఏమిటి కథలు చెబుతున్నారు? మా అమ్మ, మీ ఇంటి చుట్టూ తిరిగిందా...దేనికి? మొద్దు మొహం కోసమా?”

తమ్ముడూ నువ్వు మాట్లాడేది చాలా తప్పు. పిల్లకు ఏం తక్కువని అలా మాట్లాడుతున్నావు?”

ఊరుకోవయ్యా. విషయం గురించి వెయ్యిసార్లు మాట్లాడానే! దీనితో ఇక నేను జీవించలేను...అంతే

తొందర పడి మాటలు జారకు అబ్బాయ్

ఏమిటయ్యా, అర్ధం లేని న్యాయం మాట్లాడుతున్నారు? ఏమే... పేపర్లలో సంతకం  పెట్టు. నేను వెళ్లాలి" -- తన ముందు జాపబడ్డ కాగితాలను ఆశ్చర్యంతో చూసింది పవిత్ర.

ఏమిటి చూస్తున్నావు? హు...పెట్టు"

ఏమండీ...నేను...

హు...! నీ దగ్గర మాట్లాడటానికి రాలేదు. సంతకం మాత్రం పెట్టు -- చిటపటలాడుతున్న మొహంతో నిలబడ్డ అతన్ని మౌనంగా ఒకసారి చూసి, అతను జాపిన కాగితాలను--పెన్నునూ ఆమె చేతిలోకి తీసుకుంది.

పవిత్ర కుటుంబమంతా ఒక్కసారిగా అధిరిపడింది

                                                                                                                    Continued...PART-2

**********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి