12, ఫిబ్రవరి 2024, సోమవారం

జ్ఞానోదయం: 'మనసూ-రూపమూ!'(ఆద్యాత్మిక కథ-1)

 

                                                                       జ్ఞానోదయం: 'మనసూ-రూపమూ!'                                                                                                                                                       (ఆద్యాత్మిక కథ-1)

ఎంత దైవీక శక్తి, వరం దొరికినా, నువ్వు దేవుని ప్రతినిధియే తప్ప, నువ్వేమీ దేవుడు కాదు అనేది ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలి.

అరణ్యంలో చాలా రోజులుగా తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఒక ముని. ఆయనకు ఒక శక్తి వచ్చింది.

ఆయన ముందు ఒక ఎలుక, భయంతో వణుకుతుండటం చూశారు.

దానికి కారణం, తన వెనుక నిలబడున్న పిల్లి అనేది గ్రహించి, తన తపో బలంతో ఆ ఎలుకను, పిల్లిగా మార్చారు.

'ఇకమీదట ఆ ఎలుక, పిల్లిని చూసి భయపడక్కర్లేదు...' అని, అనుకుంటూ కళ్ళు మూసుకున్నారు ఆ ముని.

మరుసటి రోజు ప్రొద్దున కళ్ళు తెరిచి చూసినప్పుడు, నిన్న పిల్లిగా మార్చబడిన ఎలుక, కుక్కను చూసి భయపడి, వణుకుతూ ఉన్నది.

'కుక్కను చూసే కదా ఇది వణుకుతోంది. ఇప్పుడు దీన్ని కూడా ఒక కుక్కగా మారిస్తే సమస్య తీరిపోతుందే...'అని అనుకుని అదేలాగా చేశారు.

మళ్ళీ ఆ మరుసటి రోజు కళ్ళు తెరిచినప్పుడు, ఇప్పుడు ఆ కుక్క కూడా వణుకుతూ ఉండటంతో, ముని యొక్క వెనుక వైపు నక్క ఒకటి నిలబడుంది.

నక్కగా మార్చి నందువలన, ఇకనైనా అది ప్రశాంతంగా ఉంటుందని అనుకున్నారు. ఆ నమ్మకమూ ఎక్కువసేపు నిలబడలేకపోయింది. ఆ నక్క, పులిని చూసి వణుకుతున్నది.

ముని కూడా విసుక్కోకుండా నక్కను, పులిగా మార్చారు.

'ఇక మీదట ఈ పులి దేనికీ భయపడ అవసరంలేదు ' అనుకుని, ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నారు.

మరుసటి రోజు ప్రొద్దున మామూలుగా కళ్ళు తెరిచి చూసినప్పుడు, పులి వణుకుతూ ఉన్నది.

మునికి కోపం వచ్చింది. అయినా కానీ పులి దేన్నో చూసి భయపడుతోంది అంటే దానికంటే భయంకరమైన మృగం ఏముంటుందని, తిరిగి వెనక చూశారు. అక్కడ ఒక పిల్లి నిలబడుంది.

ఒక పిల్లిని చూసి ఎలుక భయపడవచ్చు, పులి భయపడ వచ్చా? అప్పుడే మునికి ఒక విషయం అర్ధమయ్యింది.

ప్రారంభంలో ఎలుకగా ఉన్నది, ఒక్కొక్క సారి మారుతూ ఇప్పుడు పులిగా ఉండటం నిజమే. అయినా కానీ రూపం మాత్రమే మారుతూ వస్తోంది కానీ, మనసు అలాగే ఉంది. అందువల్ల ఎదురుగా పిల్లిని చూసిన వెంటనే ఎలుకకే ఉన్న స్వభావమైన భయం వచ్చేసింది.

దీన్ని అర్ధం చేసుకున్న ఆయన వెంటనే ఎలుకగా మార్చి, పిల్లి దగ్గర దొరక కుండా దాన్ని జాగ్రత్తగా కాపాడి, "వెళ్ళు...వెళ్ళి చేరు" అని పంపించారు ముని.

ఇంకొక విషయం కూడా ఆయన అర్ధం చేసుకున్నారు.

ఎంత దైవీక శక్తి వరం దొరికినా, నేను దేవుని ప్రతినిధియే తప్ప, నేనేమీ దేవుడు కాదు అనేది కూడా అర్ధం చేసుకున్నారు ముని.

****************************************************సమాప్తం***********************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి