మానవత్వం (సీరియల్/నవల)
PART-10
అర్ధంకాని అభిమానం దగ్గరగా ఉన్నా ప్రయోజనం లేదు....అర్ధం చేసుకున్న అభిమానానికి ఎడబాటు పెద్ద దూరం కాదు!
"నేను ఎం చెప్పను. పాపిస్టోడు తాగితాగి ఆరొగ్యం పాడుచేసుకున్నాడు. నువ్వు ఇంటినుంచి వెళ్ళిన రోజు నుండి తాగటం మొదలు పెట్టారు. రోజు రొజుకూ తాగటం ఎక్కువ అయ్యింది. అందులోనూ నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిన తరువాత ఎప్పుడూ తాగుడే. ఒంట్లో ఏ వ్యాధి ఉన్నా హాస్పిటల్ వైపుకు వెళ్ళను అని ఇంట్లోనే కూర్చునే ఉండటం వలన అన్నీ పోయినై...అన్నీ పోయినై..." --అంటూ సరోజ గట్టిగా ఏడ్చింది.
ఆ రోజు సెలవు రోజు కాబట్టి కొంచం సేపు ఎక్కువగా నిద్రపోతున్న జయ ఆ ఏడుపు విని హడావిడిగా లేచింది.
అదే హడావిడితో మంచం దిగి బయటకు వచ్చింది. హాలులో కూర్చోనున్న తన తల్లికి కాఫీ చల్లార్చి ఇస్తోంది నా తల్లి యామిని.
"మొదట కాఫీ తాగమ్మా"
"వద్దే...భర్త అలా మంచానికి అతుక్కుపోయింటే నా గొంతులోకి ఆ కాఫీ కాదు కదా మంచి నీళ్ళు కూడా దిగటం లేదు. నా పసుపు కుంకాలు పోబోతున్నాయి?"
"మొదట అలా మాట్లాడటం ఆపు...నాన్నకు ఏమీ కాదమ్మా. కాపాడుకుందాం"
"ఎలా కాపాడతావే? అందులోనూ రెండు కిడ్నీలూ పాడైపోయినై అని డాక్టర్లు చెప్పాశారే...!మంచానికే పరిమితమై ఉన్నారే మీ నాన్న"----అంటూ ఏడుస్తూ చెబుతున్న సరోజ కి కన్నీరుతో పాటు ముక్కు కారటంతో లేచి ముక్కు చీదుకుని, ముఖం కడుక్కుని వచ్చి కూర్చుంది.
అంతవరకు బిడియంతో నిలబడ్డ జయ "అమ్మమ్మా" అని పిలిచింది.
గబుక్కున వెనక్కి తిరిగిన సరోజ ఆ పరిస్తితిలోనూ పళ్ళు కొరుక్కుంది.
"ఎవరికి ఎవరే అమ్మమ్మ?"
"అమ్మా..."
“అన్నిటికీ కారణం ఈ శనేశ్వరమే కదా! దీన్ని ఎప్పుడు ఇంట్లోకి తీసుకు వచ్చావో, అప్పుడే మనింట్లో ఉన్న సంతోషం, ప్రశాంతత అన్నీ పోయినై. దరిద్రం...దరిద్రం. ఎవత్తో తనకు వద్దని రోడ్డు మీద పారేస్తే నువ్వు ఇంట్లోకి తీసుకు వచ్చావు...నిన్ను అనాలే"
"అమ్మా...నాన్న తాగి తాగి తన ఆరొగ్యం పాడుచేసుకుంటే నా కూతురు ఏంచేస్తుంది?"
"నువ్వు దీన్ని తీసుకు వచ్చినందువలనే నీ జీవితం నాశనమైంది. కన్న కూతురు జీవితం ఇలా అయిపోయిందే అన్న బాధ ఆయనకు ఉండదా?"
"బాగుందే! పూర్వం తాగేవాడే తాను తాగడానికి ఏదైనా ఒక కారణం కనిపెడతాడు. ఇప్పుడు దానికి సపొర్ట్ చేసేవాళ్ళు కూడా కారణం కనిపెడుతున్నారే! బాగానే ఉంది అభివృద్ది"
"ఏమే...మరణంతో పోరాడుతున్న మనిషి గురించి నేను మాట్లాడుతున్నాను. నువ్వేంటి వేలాకోలం చేస్తున్నావు"
"జయా...నువ్వెళ్ళి కాఫీ పెట్టుకుని తాగు. అమ్మమ్మకు ఏదైనా టిఫిన్ చెయ్యి"
"సరేనమ్మా..."
"ఏయ్...ఆగు! నీ చేతులతో ఇస్తే మంచి నీళ్ళు కూడా తాగను. నాకోసం ఏమీ చెయ్యకు"
"ఎందుకమ్మా అంత అనవసర పట్టుదల? అది నీ మనుమరాలు"
“వెయ్యి సార్లు అమ్మమ్మా అని చెప్పినా....ఇది నాకు మనుమరాలు అవలేదు"-- సరోజ కచ్చితంగా తెలిపింది.
ఇక అక్కడ ఉండబుద్ది కాని జయ వంటింట్లోకి వెళ్ళింది.
కాసేపు మౌనం తరువాత సరోజ గొంతు వినబడింది.
"చివరి సారిగా ఒకసారి నిన్ను చూడాలని నాన్న ఆశపడ్డారు. అందుకోసమే ఇప్పుడు వచ్చాను. ఈ రోజు ఆఫీసుకు సెలవే కదా? ఒక సారి వచ్చి పో! నీకు బోలడంత పుణ్యం వస్తుంది"
”ఎందుకమ్మా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? స్నానం చేసి వస్తాను. కలిసే వెల్దాం"
"నువ్వొక్కత్తివే వస్తే చాలు" --అని చెప్పి...చాల్లారిపోయున్న కాఫీని నోట్లో పోసుకున్న తల్లిని కాసంత బాధతో చూసింది యామిని. ‘ఎన్ని రోజులైనా తల్లి మారదు’ అనుకుంటూ అక్కడ్నుంచి కదిలింది యామిని.
"గబగబా స్నానం చేసిరా. నాన్న ఒక్కరే ఉంటారు. డాక్టర్ వచ్చే టైము...నేను అక్కడ ఉండాలి"
"అయన ఒక్కరే ఉన్నారా?"
"అవును...రెండు నెలలుగా నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను"
"ఎందుకమ్మా...నువ్వు ఒక్కదానివే?...అన్నయ్య, వదిన వాళ్ళంతా రావటం లేదా?"
"వాళ్ళు ఎలా వస్తారు? వస్తే నేను ఖర్చులకు డబ్బులు అడుగుతానని భయపడి ఉంటారు"
"ఏంటమ్మా మీరు చెప్పేది? అప్పుడు ఆసుపత్రి ఖర్చులకు, తిండికి ఏం చేస్తున్నావు?"--కూతురు ప్రేమగా అడిగేటప్పటికి సరోజకి ఒక్కసారిగా ఏడుపు ముంచుకు వచ్చింది.
"అదెందుకే అడుగుతావు? మగ పిల్లలు...మగ పిల్లలని వాళ్ళు చెప్పిన మాటలు విని నిన్ను బయటకు పంపించాము. కొన్ని రోజులు మామూలుగా ఉన్నారు. ఒక రోజు పెద్దోడు ఏదో వ్యాపారం పెడుతున్నానని చెప్పి మామగారితో వెళ్ళి సెటిల్ అయ్యాడు. చిన్నోడు తన పెళ్ళాం మాటలు విని వేరుగా వెళ్ళిపోయాడు. మునుపంతా ఏదో ఒక రోజు వచ్చి ఖర్చులకు డబ్బిచ్చి వెళ్ళేవాడు. తండ్రి మంచాన పడిన దగ్గర నుంచి రావటం మానేశాడు. చెతిలో, మెడలో ఉన్నవన్నీ తాకట్టు పెట్టి కాలం గడిపాను.
ఇప్పుడు ఏమీ లేదు. అందుకనే ప్రభుత్వ ఆశుపత్రికి తీసుకువెళ్ళి చేర్చాను. మందులు, డాక్టర్ల ఫీజూ లాంటి ఖర్చులు లేవుగానీ కాఫీ,టీ ఖర్చులు, బస్సు చార్జీలూ, తిండి లాంటివాటికి డబ్బులు కావాలి కదా...చుట్టు పక్కల అప్పు చేసి కాలం గడుపుతున్నాను"
"ఏమ్మా ఇన్ని కష్టాలు పడుతున్నా నాతో ఒక మాటైనా చెప్పాలని తోచలేదు కదా నీకు?"
"నన్నేం చేయమంటావు....ఇంతకు ముందు నిన్ను చూడటానికి వచ్చేదాన్ని... అది ఎలాగో మీ నాన్నకు తెలిసిపోయింది. నాతో రెండు నెలలు మాట్లాడలేదు"
"అవునా!?”
"అంత కోపం ఎందుకో? ఆసుపత్రిలో చేర్చే ముందు కూడా...యామిని దగ్గర చెప్పనా? అని అడిగాను. ‘దాని డబ్బుతో వైద్యం చేయించు కోవడం కంటే...నా ప్రాణం పోయినా పరవాలేదు’ అని చెప్పారు"
ఇప్పుడు వొంట్లో ఓపిక లేదు. ప్రాణ భయం వచ్చేసింది. కొండంత ఆశ పెట్టుకున్న కొడుకులు రావడమే మానేశారు. మనసు కృంగిపోయింది. అందుకనే చివరగా నిన్ను ఒకసారి చూడాలని రాత్రంతా ఒకటే కలవరింత"
తన విషయంలో తండ్రి గురించి తల్లి చెప్పేది అబద్దమని తెలిసినా, తను మాటలు పెంచితే అమ్మ వాదనకు దిగుతుందని ఆ విషయం గురించి నోరు మెదపలేదు యామిని.
"సరేమ్మా! నువ్వు ఏడవకు. నేనున్నాను. నాన్నకు కిడ్నీ మార్చగలరేమో అడిగి చూద్దాం"
"రెండు నెలల క్రితమే చెప్పారు...కిడ్నీ దొరక లేదు"
"అలాగా!"
“ఆపరేషన్ చేసి వేరే కిడ్నీ పెడితే బ్రతుకుతారని చెప్పారు. కుటుంబంలో వాళ్ళ కిడ్నీ అయితే బాగా చేరుతుంది అన్నారు. నా కిడ్నీ తీసుకోండి అని చెప్పాను. కానీ, నా నెత్తురు వేరే గ్రూపట. అది సెట్ అవదని చెప్పారు"
"ఏమ్మా...అన్నయ్యలకు నాన్న బ్లడ్ గ్రూపే కదా?”
"అయ్యో! అదెందుకు అడుగుతావు? డాక్టర్ చెప్పింది వాడి దగ్గర చెప్పేటప్పుడే...మీ వదిన పెద్ద గొడవ చేసింది. కాటికి వెల్లాల్సిన వయసులో బ్రతకటానికి ఎందుకు అంత ఆరాటం. అన్ని బాధ్యతలూ తీర్చేశారు కదా. బ్రతికుండి ఇంకా ఏం చేస్తారు? నా భర్త కిడ్నీ ఇచ్చేసి, రేపు ఆయనకేదైనా అయితే...నేనూ, పిల్లలూ రోడ్డు మీద కూర్చుని బిచ్చమెత్తుకోవాల్సిందే....! కొట్టి తరిమేసినట్లుగా తరిమి కొట్టింది. ఆ తరువాత నాన్నను చూడటానికి కూడా రాలేదు. ముగ్గురు పిల్లల్ని కన్నా మేము అనాధలుగానే నిలబడ్డాం"--తల్లి ఏడుపు యామినిని కాల్చింది.
భర్తను కాపాడు కోవటానికి తల్లి ఎంతో పోరాడిందని అర్ధమయ్యింది యామినికి. ఇద్దరు మగ పిల్లలు ఉండి కూడా తిండికి దారిలేక తల్లి-తండ్రులు అల్లల్లాడిపోయారని ఆమె మనసు కొట్టుకుంది.
వేగంగా తన గదిలోకి వెళ్ళి బీరువాలో ఉన్న డబ్బును తీసుకు వచ్చి ఇచ్చింది.
"అమ్మా, ప్రస్తుతానికి ఇది ఖర్చులకు ఉంచుకో. నువ్వు హాస్పిటల్ కు వెళ్ళు. నేను స్నానం చేసి, నాకు తెలిసున్న వారి దగ్గర కిడ్నీ దొరుకుతుందా అని అడిగొస్తాను. నువ్వు బయలుదేరు..."
"యామినీ! కిడ్నీ దొరుకుతుందా?"
"దొరుకుతుందమ్మా! దానికి చాలా మంది ఉన్నారు. ప్రయత్నించి చూద్దాం. నాన్నను ఎలాగైనా కాపాడు కుందాం"
"కానీ...డబ్బులు?"
"అదంతా నేను చూసు కుంటాను. నువ్వు బయలుదేరు....”
"ఏమిటోనమ్మా...నువ్వైనా నా భర్తను కాపడి నాకివ్వు. ఆయనా లేకపోతే ఈ మొగ పిల్లలు నన్ను రోడ్డు మీద వదిలేస్తారు..."
"అలగంతా ఏమీ జరగదు లేవమ్మా. దేముడు మీద నమ్మకం ఉంచు. నాన్నకు ‘ఓ పాజిటివ్ రక్తమే’ కదా! ఎలాగైనా ‘కిడ్నీ’ దొరుకుతుంది. ఖచ్చితంగా నాన్నను కాపాడుకుంటాము. నువ్వు ధైర్యంగా వెళ్ళు. నేను ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని హాస్పిటల్ కు వస్తాను"
"సరేనమ్మా! నిన్ను నమ్మే వెడుతున్నాను. త్వరగా వచ్చేయ్ తల్లి"
"వచ్చేస్తానమ్మా! ఆశుపత్రి పేరు, వార్డు నెంబరు చెప్పు..." అని యామినీ అడిగింది. ఆ మాటలు జయకు వినబడ్డాయి.
సరోజ చెప్పిన హాస్పిటల్ డీటైల్స్ ను తన మనసులో దాచుకున్న యామిని తీవ్ర ఆలొచనలో మునిగిపోయింది.
Continued....PART-11
*******************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి