12, మే 2021, బుధవారం

మానవత్వం...(సీరియల్/నవల)...PART-14

 

                                                                                        మానవత్వం                                                                                                                                                                         (సీరియల్/నవల)

                                                                                           PART-14

కొట్టను కొట్టను అనిగిపోవటానికి నువ్వేమీ వెన్నుపూస లేని పిరికిదానివి కాదు! దైర్యంగా తల ఎత్తుకుని నిలబడు...శత్రువులు నిన్ను చూసి భయపడనీ!!

"కడుపు బాగా నొప్పి పుడుతోంది. నా వల్ల కావటంలేదు"--కన్నీళ్ళతో పదమూడేళ్ళ మూగపిల్ల సైగలతో చెప్పగా, జయ ప్రేమతో పిల్ల తల నిమురుతూ పడుకోబెట్టింది.

రెండు రోజులు నొప్పి ఉంటుంది. తరువాత తగ్గిపోతుంది. భయపడకూడదు"- సైగలతోనే సమాధానం చెప్పింది జయ. అర్ధమైనట్లు తల ఊపి జయను గట్టిగా కౌగలించుకుని కళ్ళు మూసుకున్నది పిల్ల.

జయ గొంతుకలో ఏదో అడ్డుపడిన ఫీలింగ్.

మహిళలకు మాత్రమే వచ్చే నొప్పి. అవస్త. తల్లి నీడలో పెరుగుతున్నప్పుడు ఇవన్నీ అంత పెద్దవిగా తోచవు. పెద్దదై నిలబడినప్పుడు పేగు బంధం చూపించే ప్రేమ, చూసుకునే విధం ఎక్కువగా ఉన్నప్పుడు ఇదొక కొత్త అనుభూతిని ఇస్తుందనేదీ నిజం.

కానీ, పిల్లలు? పుటినప్పటినుంచి తల్లి ముఖాన్ని చూడని అమాయకపు జీవులు. ఆకలినో, దాహాన్నో, సుఖాన్నో, బాధనో ఎవరి దగ్గర చెప్పుకుంటారు? ఎలా చెబుతారు? హృదయాన్ని ఆక్రమించే భయ బావాన్ని ఎవరి దగ్గర చూపగలరు? ఒకేవేల తమ భాష మూలం చెప్పినా అది ఎంతమంది గ్రహించగలరు?

గొంతుకలో అడ్డుపడ్డ దుఃఖం అక్కడ్నుండి విడుపడి కళ్ళల్లో నీరుగా కనబడింది. వరుసగా పడుకున్న పిల్లలను పరిశోధించింది. చీకటి భయమో...ఒంటరితనం వలన ఏర్పడ్డ కలతనో తెలియటంలేదు. ఒకొళ్ళకొకళ్ళు కౌగలించుకునో, చేతులు గట్టిగా పట్టుకునో పడుకున్నారు.

ఎంత బాధాకరమైన విషయం! అనాధగా పుట్టటమే ఘోరం. అందులోనూ ఇలా మూగ, గుడ్ది, మానసిక వికలాంగంతో పుట్టి అనాధగా చేయబడటం ఘోరాతిఘోరం. ఆడపిల్లల విషయం చెప్పనే అక్కర్లేదు...అది మరింత వేధన.

దేముడా! మనుష్యులు చేసే పాపాలకు నువ్వు దండన ఇవ్వవలసిందే. దాన్ని నేను వద్దనడంలేదు. కానీ, దండనను పాపం చేసిన వాళ్ళకు అప్పుడే ఇచ్చేయి. అదివదిలేసి ఇలా పాపమూ చేయని పసిపిల్లలను అంగవైకల్యంతో పుట్టించి ఎందుకు వేధిస్తావు? పిల్లలు చేసిన పాపం ఏమిటి?

ఎందుకని వీళ్ళకు శిక్ష? పాపం చేస్తున్నప్పుడే దండన దొరికితేనే భయం ఉంటుంది? మళ్ళీ పాపం చేయకూడదనే ఆలొచన వస్తుంది? అది వదిలేసి పెద్దలు చేసిన పాపానికి పిల్లలని శిక్షించడం విధంగా న్యాయం?

"జయా!"--ఆశ్రమ వార్డన్ పిలుపుతో లోకానికి వచ్చింది.

"మేడం..."

"నువ్వింకా ఇంటికి వెళ్ళ లేదా?"

"లేదు మేడం! గౌరీకి రోజు కడుపు నొప్పి ఎక్కువగా ఉన్నది. పాపం...గిలగిలా కొట్టుకుంది. అందుకని మందు ఇచ్చి పడుకో పెడుతున్నాను

"అది మంగ చూసుకుంటుంది కదా! టైము తొమ్మిది అవుతోంది. ఇంట్లో అమ్మ ఎదురుచూస్తుంది కదా...నువ్వు బయలుదేరు"

"అయ్యో...టైము తొమ్మిదైపోయిందా!---అదుర్దా పడుతూ లేచిన జయా చేతులను గౌరీ గట్టిగా పుచ్చుకోనుంది నిద్రలోనే.

మెల్లగా గౌరీ చేతులను విడదీసుకుంది జయ.

"పిల్లలందరూ నీతో బాగా చనువుగా ఉంటారనుకుంటా?"

"అవును మేడం...మేమందరం ఒకే జాతి కదా!"

" జయా..."

"అది...అది...మేమందరమూ మహిళలమే అన్నాను"

"నేనూ ఒక మహిళే కదా జయా. నా దగ్గర ఇంత చనువుగా ఉండరు, మాట్లాడరు"

"మీరు టీచర్ మేడం. నేను వాళ్ళల్లో ఒకత్తిని. అంతే కాకుండా వీళ్ళ భాషను చదువుకున్నాను"

"అందుకనే ఇక్కడే ఉండి ఉద్యోగం చేయగలవా అని అడిగాను. నువ్వే ఏమీ చెప్పటం లేదు"--ఆవిడ కష్టం గా చెబుతుంటే, జయ మనసు తానుగానే సరోజ దగ్గరకు వెళ్ళింది.

"ఇంట్లో ఆవిడ చేత వధ పడటం కంటే... పిల్లలకు తల్లిగా మారి సేవలు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోవచ్చు. ఇందులో దొరికే ఆత్మ తృప్తి ఇంకెందులోనూ దొరకదు. కానీ అమ్మ? అమ్మను విడిచిపెట్టి ఎలా రాగలను? ఇప్పుడు అమ్మ కూడా నాతో రాలేదు?

"జయా"

"మేడం..."

"ఏమిటి అలొచిస్తున్నావు? బయలుదేరమ్మా! మిగిలినవి రేపు మాట్లాడుకుందాం"

"సరే మేడం"

" సమయంలో బస్సులు ఉంటాయా?"

"దొరుకుతై మేడం...వెళ్ళొస్తాను"---అన్న జయ విశ్రాంతి గదికి వెళ్ళి తన హాండ్ బ్యాగును తీసుకుని, ఆశ్రమ వాకిటిని వదిలి, రోడ్డు మీద నడుస్తుంటే పెద్దగా గుంపు లేని బస్సు రావటం, జయ చెయ్యి చాచటం--బస్సు ఆగటంతో-- బస్సులోకి ఎక్కి కూర్చుంది.

టికెట్టు కొసం డబ్బులు తీస్తున్నప్పుడు సెల్ ఫోన్ గురించిన ఆలొచన వచ్చింది. తీసి చూసింది. అదిరిపడ్డది. పదిహేను మిస్స్డ్ కాల్స్ అని తెరమీద కనబడుతోంది. సెల్ ఫోన్ను ఆన్ చేసి చూసింది. పదిహేను కాల్సూ అమ్మ దగ్గర నుండే. వెంటనే అమ్మకు ఫోన్ చేసింది.

కాల్ కనెక్ట్ అవకపోవటంతో.....మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది. చివరగా విసుగుతో ఫోన్ ను ఆఫ్ చేసి బ్యాగులో పడేసినప్పుడు దీగాల్సిన చోటు వచ్చింది. బస్సు దిగి ఇంటి వైపుకు నడవటం మొదలు పెట్టింది. మామూలుగా సాయంత్రం ఆరు గంటలకు నడిచి వెళ్ళే వీధి. రోజు రాత్రి పది గంటలు అవుతుండగా...హడావిడి తగ్గి మనుష్యుల పోకడే తగ్గిపోయి కనిపించింది.

మూసున్న ఇళ్ళల్లో నుండి టెలివిజన్ కాంతులు, వీదిలో కుక్కల అరుపులు మాత్రమే వినిపిస్తుండగా జయా నడకను వేగవంతం చేసింది. ఇంటి సమీపానికి వెళ్ళి నప్పుడు అక్కడ నిలబడ్డ యామిని పరిగెత్తుకుంటూ వచ్చింది.

"జయా...వచ్చేశావా? ఎందుకమ్మా ఇంత ఆలశ్యం?"

"సారీమ్మా...కొంచం లేటయ్యింది"

"ఒక ఫోన్ చెయ్య కూడదా? నేనెంత భయపడ్డానో తెలుసా? రోజులు బాగా లేవురా జయా? పగటి పూటే ఆడపిల్లల్ని రోడ్డు మీద స్వతంత్రంగా ఆడుకోవటనికి పంపటం లేదు. నువ్వేంట్రా అంటే...ఒక్క దానివి ఇంత రాత్రివేలలో..."

"ఇదిగో నీ తెలివిగల కూతురు వచ్చేసింది కదా? ఇప్పుడైనా వచ్చి బోజనం చేయవే. నువ్వు రాకుండా, మీ నాన్న నిద్రపోకుండా నన్ను చూసి గొణుగుతునే ఉన్నాడు. వాకిట్లోనే నిలబడి మీ ప్రేమను వొలకబోయాలా?" సనుగు కుంటూ వెళ్ళిన సరోజ వెనుకే ఇద్దరూ మౌనంగా వెళ్ళారు.

ఇంట్లోకి వెళ్ళిన వెంటనే భర్త గది తలుపులు దగ్గరకు వేసి, యామిని దగ్గరకు వచ్చి అడిగింది.

"ఇంతసేపు ఎక్కడ ఉరు తిరిగి వస్తందో అడిగావా...?

"హాస్టల్లొ ఎదో ఒక పిల్లకు వొంట్లో బాగుండలేదుట. అందుకని పిల్లతో ఉండి చూసుకుందట"

"ఇదెప్పుడు డాక్టర్ అయ్యింది?"

"అమ్మా..."

"నువ్వు ఉత్త అమాయకురాలివి యామిని. అందుకే నిన్న పుట్టిన పిల్లకూడా నిన్ను ఏమారుస్తోంది. కానీ, సరోజ ని ఎవరూ ఏమార్చలేరు"

"అమ్మా...నువ్వెళ్ళి పడుకో. మొదట అది భోజనం చేయనీ"

"అలాగే నిర్లక్ష్యంగా వదిలేయ్. ఎవరెవరితో ఎక్కడెక్కడ తిరిగొస్తోందో?"

"అమ్మా........." గట్టిగా అరిచింది యామిని.

"నా మీదెందుకే అరుస్తావు? వయసులో ఉన్న అమ్మాయి. మధ్య రాత్రి దాకా ఉరు తిరిగోస్తే ఏమిటి అర్ధం? ఇదేమన్నా సత్రమా....”

"నా కూతురు గురించి నాకు తెలుసు. మీరు అనవసరంగా బాధ పడకండి. వెళ్ళి పడుకోండి"

"ఎవరెలా పోతే నాకేమొచ్చింది?"

"కానీ, ఒకటి మాత్రం చెప్తాను. విను.....నువ్వు ఇప్పుడే దీన్ని కంట్రోల్లో పెట్టటం మంచిది. లేకపోతే రేపే తన తల్లిలాగా కడుపు పెంచుకుని వచ్చి నిల..."

"అమ్మమ్మా..."-- జయా అరుపుతో యామిని అధిరిపడ్డది.

సరోజ మాత్రం బెదరలేదు!

"ఎందుకే అరుస్తావు? మీ అమ్మ ఎవడి దగ్గరో ఏమారిపోయే కదా నిన్ను కన్నది. లేకపోతే ఉత్తపాపానికే నిన్ను రోడ్డు మీద పారేసి వెడుతుందా? దాని బుద్దులే కదా నీకు వస్తాయి? వూరికెనా చెప్పారు తల్లిలాగనే బిడ్డ: దారం లాగానే చీర అని...."

అయితే మా అమ్మ కచ్చితంగా మీకు పుట్టలేదు..."

జయా ఆవేశంగా అనడంతో యామినితో పాటూ గదిలో నుండి వచ్చిన రామారావు కూడా కంపించిపోయారు. సరోజకి రక్తం ఉడికిపోయింది.

"ఏయ్...ఏం కూస్తున్నావే. నాలుక చీరి పారేస్తాను. యామిని నా కూతురే".......

"ఖచ్చితంగా నీ కూతురు అయ్యుండదు"

"ఏయ్..."

"తల్లి లాగానే పిల్లలు అన్నారు. మీ అమ్మాయి మీలాగా స్వార్థపరురాలిలాగా, పేరాశ పట్టిన పిశాచి లాగా, అవతలవారిని కష్టపెట్టి అందులో సంతోషాన్ని వెతుక్కునే అల్ప జంతువులాగా కదా ఉండాలి?

కానీ, మా అమ్మ దేవత కదా! జాలి చూపటంలోనూ...దయా గుణంలోనూ, మానవత్వం చూపటంలోనూ, అభిమానం చూపటంలోనూ ఆవిడ కళ్ళకు కనబడే దేవత కదా...? ఆవిడ మీ కూతురెలా అవుతుంది?"

"ఏమేవ్ యామిని! ఏమిటే అనాధ గాడిద ఏమిటేమిటో వాగుతోంది? నువ్వేమో రాయిలాగా నిలబడ్డావు?"

"అది ఇంకేం చేయగలదు సరోజా? మెత్తగా ఉన్న వాళ్ళు కఠోరంగా మారితే ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోవద్దా? జయను ఎన్ని మాటలన్నావు, ఎంత బెదిరించావు? అది మాత్రం ఎంత దూరం పరిగెడుతుంది? అదే...ఆగి, నిలబడి చూస్తోంది"

"ఏమయ్యొవ్...బుద్దిలేని మనిషీ! ఎవత్తో ఒకత్తికొసం నన్నే ప్రశ్నలడుగుతావా? ఇక్కడ పంచాయతీ చెయ్యమని నిన్ను ఎవరైనా పిలిచారా? వెళ్ళవయ్యా...వెళ్ళి నీ పనిచూసుకో"

"తాతయ్యా...నువ్వెళ్ళి చెవులు మూసుకుని పడుకో. మంచి వాళ్ళు మంచి విషయాలను మాత్రమే వినాలి...వెళ్ళు తాతాయ్యా"

జయ ఎదిరించే బానిలో మాట్లాడటంతో, తాతయ్య రామారావుసరేఅన్నట్టు తల ఊపి "సరేనమ్మా"--అనేసి అంతకు మించి అక్కడ నిలబడకూడదని గదిలోకి వెళ్ళి గొళ్ళేం పెట్టుకున్నారు.

యామిని మాట్లాడకుండా నిలబడి ఉండటం చూసి సరోజ దగ్గరకు వెళ్ళింది జయ.

"ఏమన్నారు...? మా అమ్మ తప్పు దోవలో వెళ్ళి నన్ను కన్నదా? మా అమ్మకు ప్రశవం చూశారా? లేదు...నన్ను కన్న తల్లి మీకు తెలుసా?"

"ఏయ్...ఏయ్...ఏమిటి మీద మీదకు వస్తున్నావు?”

నన్ను కన్న తల్లి తానుగా నన్ను విసిరిపారేసుండదు. మీలాంటి ఒక రాక్షస అత్తగారిలా వచ్చి, ఆడపిల్లతో వస్తే నీకు ఇంట్లో చోటు లేదు అని చెప్పుంటుంది. లేకపోతే మీలాగ హృదయమే లేని ఒక నయవంచకుడు నన్ను కన్న తల్లికి తెలియకుండా తీసుకువచ్చి పారేసుంటాడు"

అలా కూడా కాకపోతే మీలాంటి స్వార్ధ గుణం కలిగిన ఒక వేట కుక్క, వెటాడి వెళ్ళిపోయినందువలన నా తల్లి మోసిన మలినం గా పుట్టుంటాను. ఆమెకు మీలాగే పేరాశ కలిగిన తల్లి ఉండుంటుంది. ఆమె కూడా నన్ను విసిరి పారేసుంటుంది"

"ఏయ్...ఎందుకే ప్రతి దానికీ నాలాంటిది...నాలాంటిదని చెబుతున్నావు"

"అవును...!అద్భుతమైన తల్లి దొరికి కూడా, మీలాంటి మనుషులే మమ్మల్ని అనాధగా నిలబెడుతున్నారు. ఎన్ని రోజులు...ఎన్నిసార్లు మీ నోటితో అనాధ అనే మాటను విని విని...నేనూ అనాధలాగానే..."

మాటలు గొంతుకకు అడ్డుపడటంతో... యామిని నోరు తెరిచింది.

"జయా..."

"వద్దమ్మా...అనాధ అనే పిలుపుతో ఇక్కడ ఉండటం కంటే...అనాధ శరణాలయానికే వెళ్ళిపోతాను"

"జయా"

"చాలమ్మా...నావలన రోజూ అమ్మమ్మ దగ్గర గొడవు పడుతూ ఎంతో మనో వేదనతో కష్టపడుతున్నారు మీరు? కన్నవారికి మీ వేదన అర్ధం అవకపోయుండొచ్చు. కానీ, నాకు అర్ధమవుతోందమ్మా, ఇకమీదట నాకోసం మీరు పోరాడద్దొమ్మా?"

"...................."

"నేను వెళ్ళిపోతానమ్మా! నాలాగా ఉన్న ఎందరో జీవులకు నా సహాయం కావలసుంది. ఇలా కొందరికి అడ్డుగా పరిగెత్తుతూ ఉండటం కంటే, పాపం ఎరుగని పాపత్ములకు మంచి సన్నిహితురాలుగా ఉండి నా జీవితాన్ని ఇంకొకరికి ఉపయోగపడేటట్టు చేసుకుంటాను. నన్ను వెళ్ళనీయమ్మా...ప్లీజ్"

బ్రతిమిలాడుతున్న కూతుర్ను చూసింది. లోతుగా చూసింది. కళ్ళలోకి చూసింది.

ఒకసారి కాదు అలా మళ్ళీ మళ్ళీ చూసి..ఒకసారి నిట్టుర్పు విడిచి చెప్పింది.

"పో..."

"అమ్మా..."

"పో...వెళ్ళిపో"--గట్టిగా చెప్పింది యామిని.

                                                                                                              Continued....PART-15(చివరిది)

************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి