మానవత్వం (సీరియల్/నవల)
PART-9
తల్లిగా నాకీ శక్తి నిచ్చింది నీవే...అమృతంలా నాలో ప్రవహిస్తున్న జీవమూ నీవే! అమ్మా నువొక అర్ధనారిశ్వరి!
"అమ్మా..."
"ఏమిట్రా?"
“ఈ రోజు స్కూల్లో నన్ను పిలిచి ఒక విషయం చెప్పారు"
"ఏమిటది?"
"మా స్కూల్లో హాస్టల్ కూడా ఉన్నదని చెప్పాను కదా?"
"అవును"
"మొత్తం తొంబై మంది హాస్టల్లొ ఉంటున్నారట. కానీ ఇద్దరే పనివాళ్ళు ఉన్నారట. అందులోనూ ఒకరు బాగా వయసైన వారట..." అన్న కూతురు వైపు కన్ ఫ్య్యుజ్ గా చూసింది యామిని.
"దానికేమిటిప్పుడు...?"
"పాపమమ్మా! ఆ పిల్లలందరూ మానసిక పరిపక్వత తక్కువగా ఉన్న పిల్లలమ్మా. అందులో ఇరవై మంది పదిహేనేళ్ళ వయసు పైబడిన వాళ్ళు"
"సరేరా... దానికి మనం ఏంచేయాలట?"
”ఆడవాళ్లకే మాత్రమే ఉండే శరీరక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కదమ్మా. వాళ్ళు వాటిని ఎలా తీర్చుకుంటారు...పాపమమ్మా..."
"నాకు అర్ధమైంది. కానీ...దాని గురించి నీ దగ్గర ఏం మాట్లాడారు?"
"ఆ పిల్లలను చూసుకోవటానికి మనుష్యులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారట. అందుకోసం నన్ను హాస్టల్లొ ఉండి ఉద్యోగం చెసుకోవటం కుదురుతుందా అని అడిగారు"
"ఏమిటీ?"
"మేము ట్రైనింగ్ వెళ్ళాము కదా! అప్పుడు అక్కడ ఉన్న పిల్లలను చాలా ప్రేమతో, అభిమానంతో బాగా చూసుకున్నానని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారట...అందుకే నన్ను అడిగారు."
"నువ్వేం చెప్పావు?”
"అమ్మతో మాట్లాడి చెబుతానన్నాను..."- అంటూ జయ చెప్పి ముగించేలోపు యామిని ముఖం మారింది.
"అంటే... తల్లిని వదిలేసి వెళ్ళిపోతావా?"-- యామిని గొంతు బొంగురు పోవటం చూసి తల్లడిల్లిపోయిన జయ…
"చచ...మా అమ్మను వదిలిపెట్టి నేను మాత్రం ఒంటరిగా ఎలా ఉండగలను? దానికి కూడా వాళ్ళే ఒక ఐడియా చెప్పారు"
"ఏమిటది?”
"హాస్టల్లో ఉంటూ స్కూల్లో ఉద్యోగం చేసే వాళ్ళకు వేరుగా గది ఇస్తారట. మనం అందులో ఉండొచ్చు...అక్కడే తిన వచ్చు. అలా వద్దనుకుంటే వేరుగా వంట చేసుకోవచ్చు. కాబట్టి ఇద్దరమూ వెడదామా?"
"ఏమిట్రా బంగారం...అలా అడుగుతున్నావు? ఇది మనం "లోన్’ వేసి కొనుక్కున్న ఇళ్ళు. ఇంకా అప్పు ఉంది. ఇంకొకటి...నా ఉద్యోగాన్ని వదిలేసి ఎలా అక్కడికి రాను?"
"చాలమ్మా...ఇంత కాలం మీరు కష్టపడింది చాలు. ఇక నేను కష్టపడతాను. మీరు రెస్ట్ తీసుకోండి"
"ఏయ్... ఇదే సాకుగా పెట్టుకుని నన్ను వృద్దురాలిని చేసి మూల కూర్చో పెట్టాలని అనుకుంటున్నావా?"
"అయ్యో....ఏమిటమ్మా మీరు....?"
"భయపడకు...సరదాగా అన్నాను. సరే...ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నావు?"
"అమ్మా...బ్యాంకులో ఉన్న డబ్బు తీసి 'లోన్’ పూర్తిగా కట్టేద్దాం. ఈ ఇంటిని అద్దెకు ఇచ్చేద్దాం. ఇద్దరం హాస్టల్లో ఉందాం. నేను స్కూలుకు వెళ్ళిన తరువాత, మీకు బోరు కొడితే, ఇదే కాంపౌండ్లో మనొవ్యాధితో బాధ పడుతున్న వృద్దులు ఉన్నారు. మీరు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళను చూసుకోవచ్చు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మీకు కాలక్షేపమూ అవుతుంది, వాళ్ళకు ఆనందంగానూ ఉంటుంది. నాకు మనస్పూర్తిగా సేవ చేసినట్లూ ఉంటుంది. ఏమంటావమ్మా?"
'ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయికి ఏంత తెలివి? సేవ చేయటానికి ఎంత ఆరాటం చూపుతోంది? ఈమె ఎందుకు తన గురించి ఆలొచించటం లేదు? పెద్ద చదువు చదువుకున్న జయకు మంచి జీవితం ఎలా ఏర్పరచాలా అని నేను పోరాడుతున్నానూ’
'ఇదేమో సేవలు చేస్తానూ...నిన్నూ కూర్చోబెట్టి తిండి పెడతాను అంటోందే! ఎక్కడ్నుంచి వచ్చింది ఈ విస్తృత స్వభావం? దృఢమైన మనసు?'
"మీదగ్గర నుంచేనమ్మా"- అని అంటున్న జయను ఆశ్చర్యంతో చూసింది యామిని.
"ఏమిటి...ఏం చెప్పావు?"
"మీ మనసులో ఎం తలచుకుంటున్నారో నాకు తెలుసమ్మా"
"అరే నా మాహాలక్ష్మీ. నిన్ను కూతురుగా చేసుకున్నందుకు నేను ఎంత పుణ్యం చేసుకున్నానో?"--అంటూ జయను గట్టిగా కౌగలించుకుంది.
ఆ కౌగలింతలో కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుంది జయ.
"మనం హాస్టల్లోకి మారిపోదామా?"
"కొన్ని రోజులు పోనీరా...నా ఉద్యోగాన్ని నేను హటాత్తుగా మానలేను. ఇన్ని సంవత్సరాలు మనల్ని కాపాడింది ఈ ఉద్యోగమేరా. ఇప్పుడు ఉన్నపలంగా విడిచిపెట్టి రాలేను. అంతేకాక నీ పెళ్ళికి అని రెండు చీటీలు వేశాను"
"ప్చ...ఎందుకమ్మా మీకు ఈ అక్కర్లేని పని?"
"ఏమిట్రా... అలా చెప్పావు? నీకు పెళ్ళి వయసు వచ్చింది. నేను డబ్బులు చేర్చొద్దా?"
"వద్దమ్మా! నాకు వాటిల్లో అంతా ఆరాటం లేదు"
"జయా"
"ప్లీజ్ మనం ఇలాగే ఉండిపోదామమ్మా?"
"రేయ్ బుజ్జీ...ఏమిట్రా ఇది? నీ పెళ్ళిని ఎంతో గ్రాండుగా చేయాలని నేను కలలు కంటుంటే....నువ్వెమిటి..."
"వద్దమ్మా... నావల్ల ఇంత వరకు మీరు పడ్డ అవమానాలు చాలు. ఇకమీదట ఎవరి ముందూ నా తల్లిని తల వంచుకో నివ్వను"
"ఏమిట్రా చెబుతున్నావు?”
"ఏమ్మా...పది, పన్నెండో సంవత్సరాలు చదువుకోటనికి వెళ్ళిన స్కూల్లో ఎన్ని ప్రశ్నలు అడిగారు? ఈ పిల్ల తండ్రి ఎవరు?వదిలేసి వెళ్ళిపోయారా? లేక మీరు వదిలేసి వచ్చారా? ఎప్పుడు పుట్టింది? ఎలా పుట్టింది? తప్పు చేసినందువలన పుట్టిన పిల్లా" --అంటూ ఎన్ని ప్రశ్నలు!
"అక్కడేదో...మీరే తప్పు దోవలో వెళ్ళి నన్ను కన్నట్లు హేళన మాటలు.... నిర్లక్ష్యంతో కూడిన తప్పుడు చూపులు. అబ్బబ్బ...నేను దేనీనీ మరిచి పోలేకపోతున్నానే!" అంటున్న జయా వొళ్ళు కంపించింది.
"జయా...అవన్నీ ఎప్పుడో జరిగినై. ఇప్పుడెందుకు వాటి గురించి ఆలోచిస్తున్నావు?"
"లేదమ్మా...స్కూల్లో చేర్చటానికే అన్ని ప్రశ్నలు అడిగారే ...పెళ్ళంటే ఇంకెన్ని అడుగుతారో?"
"జయా…. "
"ఇప్పుడు మనకేం తక్కువ? సంతోషంగా, మనశ్శాంతితో హాయిగా ఉన్నామే? ఇలాగే ఉండిపోదామే?"
"అది కాదురా...! నువ్వు ఆడపిల్లవు. నాకు ఓపికి ఉండంగానే నిన్ను ఒక మంచివాడి చేతికి అప్పగించేస్తే నా బాధ్యత పూర్తవుతుంది"
"మరైతే నా బాధ్యత?"
"........................"
”హాయిగా జీవించాల్సిన వయసులొ నాకోసం అన్నీ వదులుకుని ఒంటరిగా నిల్చున్నావేమ్మా. మిమ్మలని అలాగే నిలబెట్టేసి నేను ఎక్కడికి వెల్తాను...ఎలా వెల్తాను?"
"చిన్న పిల్ల లాగా మాట్లాడకు! అమ్మ కథ వేరు..."
"ప్లీజమ్మా...దయచేసి ఈ విషయం వద్దు. పెళ్ళి, కుటుంబం అనే మాటలు నాకు నచ్చలేదు. మగవాళ్ళను చూస్తే నాకు చిరాకుగా ఉంది. ఒక మగవాడి వలనే కదా నేను వీధిలోకి అనాధగా విసిరివేయబడ్డాను అనేది తలచుకుంటేనే కోపం వస్తోంది...అసహ్యం వేస్తోంది..."
"జయా...శాంతి! శాంతంగా ఉండు. మనం దీని గురించి తరువాత మాట్లాడుకుందాం"
"లేదమ్మా....ఎప్పుడూ మాట్లాడినా నా నిర్ణయం ఇదే! తాత, మామయ్యా, అమ్మమ్మ అందరూ ఏం చెప్పారు? నేను పెద్దైన తరువాత నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అన్నారే...వాళ్ళ మాటలను నిజం చేయకండి"
"నా పుట్టుక రహస్యం, ఇంకొకరి మూలంగా తెలియకూడదనే చెప్పారు? నేను సాధించాటం కోసమే పుట్టానని నన్ను మనో నిబ్బరంతో పెంచి, ఇప్పుడు మళ్ళీ పెళ్ళి అనే సంకటం లో తోసేసి...నా పుట్టుకను అందరూ హేళన చేసేటట్టు చేసేయకమ్మా?"
"నేను యామిని కూతురుగా పెరిగి-జీవించి ముగిస్తాను. నా తల్లి లాగానే అవతలి వారికొసమే జీవించి పుట్టుక ఫలాన్ని నేరవేర్చుకుంటాను. నాకు ఇంకేమీ వద్దమ్మా"-- అని ఏడుస్తూ నిలబడ్డ కూతురును చూసి విస్తుపోయింది యామిని.
Continued...PART-10
***********************************************************************************************
ఇవి కూడా చదవండి:
***********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి