8, మే 2021, శనివారం

మానవత్వం...(సీరియల్/నవల)...PART-12

 

                                                                                      మానవత్వం                                                                                                                                                                          (సీరియల్/నవల)

                                                                                         PART-12

కొన్ని బంధుత్వాలు తామర ఆకు మీద ఉన్న నీళ్ళులాగా అంటీ అంటనట్టు బంధుత్వాన్ని చూపుతాయి...నీళ్ళూ, నూనె లాగా ఒకటిగా కలవదు!

అన్ని పరిశోధనలూ పూర్తి అయ్యి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసేంతవరకూ కూతురుతోనూ, మనుమరాలుతోనూ బాగానే ప్రవర్తించింది సరోజ. పెద్దగా రాసుకు పూసుకుని ఉండకపోయినా, తన కూతురుతో చెప్పి టైము టైముకూ పళ్ళ రసం, మందూ-మాత్రలు, కూరగాయల సూప్ ఇవ్వమనడం, జయను మంచం మీద నుండి లేవకుండా చూసుకుంది.

కానీ, పది రోజుల సెలవు ముగిసిన తరువాత యామిని మళ్ళి ఉద్యోగానికి వెళ్ళేటానికి రెడీ అయినప్పుడు, తిరిగి తన నిజ స్వరూపాన్ని చూపించింది సరోజ.

"నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపోతే మీ నాన్ననే చూసుకోనా.... జయానే చూసుకోనా?" ముఖం చిట్లించుకుంటూ అడిగినప్పుడు యామిని మనస్సు చివుక్కుమన్నది. యామిని జవాబు చెప్పటానికి రెడీ అవుతుంటే ఆమె చేతిని పుచ్చుకుని తనవైపుకు లాగింది జయ.

"నేనేమన్నా చిన్న పిల్లనా? నన్ను నేనే చూసుకుంటాను...మీరు బయలుదేరండి"

"లేదురా బంగారం, ఆపరేషన్ చేసిన వొళ్ళు కదా?"

"ఇదేమన్నా పెద్ద ఆపరేషనా? చిన్న వయసే కదా? అందులోనూ ఆరొగ్యమైన, దృఢమైన శరీరమేగా? ఇక తానుగా లేచి పనులు చేసుకోనీ"

సరోజ అలా చెప్పటంతో యామిని కోపం ఆపుకోలేకపోయింది.

కానీ, ఆశుపత్రిలో ఉండి మాటలను పెంచటానికి ఇష్టపడలేదు. ఆసుపత్రి బిల్లు కట్టేసి ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నప్పుడు మొదలయ్యింది తరువాత సమస్య.

"యామినీ...మేమున్న ఇంటికి ఆరు నెలలు అద్దె బాకీ ఉన్నాము. అడ్వాన్స్ డబ్బు అయిపోయింది. అందుకని, మీ ఇంటికే వెళ్ళిపోదామా? నాన్నను అప్పుడప్పుడు చెక్ అప్ కు పిలుచుకు రావాలి. దానికి ఆటో మాట్లాడుకోవాలి. మీ ఇంట్లో ఉంటే వసతిగా ఉంటుంది కదా?" సరోజ ఆరాటపడుతూ అడిగింది.

యామినికి ఇష్టం లేకపోయినా 'సరే' అని తల ఊపటానికి రెడీ అవుతున్నప్పుడు తండ్రి రామారావు అడ్డుపడ్డాడు.

"వద్దు! ఇప్పటికే యామిని మనకి ఎంతో చేసింది. ఇంకా దాన్ని ఇబ్బంది పెట్టకూడదు"

"ఏమిటి నాన్నా మీరు...కన్న వాళ్ళకు చేయడాన్ని ఇబ్బంది అనుకుంటానా?"

"నువ్వు అనుకోవమ్మా. కానీ, గాడిదల్లాగా ఇద్దరు కొడుకులు ఉండంగా, ఆడపిల్ల దయలో బ్రతకాలనుకుంటుంటే...కష్టంగా ఉన్నదే"--అంటున్నప్పుడు ఆయన గొంతు బొంగురు పోయింది.

ఎంతో గంభీరంగాఎంతో ధైర్యంతో...ఎంతో ఆవేశంతో మాట్లాడే ఆయన, ఒక నెలలో పూర్తిగా మారిపోయారు. అందులోనూ జయ కిడ్నీయే తనకు పెట్టబడిందని అని తెలుసుకున్నప్పుడు జయ చేతులు పుచ్చుకుని కళ్ళకు అద్దుకుంటూ కన్నీరు కార్చేరు.

తరువాత నుండి రోజు వరకు ఆయనలో కనిపించింది ప్రశాంతత, ప్రశాంతత, ప్రశాంతత మాత్రమే! మరణం కోరలలోకి వెళ్ళి కష్టపడి తిరిగి వచ్చినందువల్ల, మనసు పరిపక్వత పొంది ఉండవచ్చు. కోపమో, విరోధమో, ఆరాటమో అతని ప్రాణం కాపాడలేదు. ప్రెమ, అభిమానం మాత్రమే కాపాడింది.

కన్న కూతురు, ఆమె చేరదీసిన బంధువు చూపిన ప్రేమ వలనే తను రోజు ప్రాణాలతో ఉన్నానని ఆయన హృదయం అర్ధం చేసుకుని కృతజ్ఞతతో నిండిపోయింది.

కానీ, సరోజ! మొగుడి ప్రాణం దక్కగానే ఆమె ముఖం నుండి విచారము, కృతజ్ఞత మాయమైనట్లు షష్టంగా తెలుస్తోంది.ఆమె మాటలు దానిని రుజువు చేశాయి. జయను చూస్తున్న ఆమె కళ్ళల్లో పాత ద్వేషపూరిత భావన ఉన్నదని తెలుసుకున్నప్పుడు యామిని చాలా బాధ పడింది. ఎంత ప్రయత్నించినా యామిని తల్లి గుణాన్ని మార్చలేకపోయింది.

ఆసుపత్రిలో వేరు వేరు వార్డులలో ఉన్నప్పుడే జయపై అప్పుడప్పుడు చీదరింపును కక్కిన తల్లి, ఒకే ఇంట్లో కళ్ళెదుట కనబడే తన కూతురును చూసి వూరికినే విడిచిపెడుతుందా? తన చీదరింపుతోనే జయను ఫుట్ బాల్ ఆడుకుంటుందే నన్న భయం యామిని మనసులోకి జొరబడింది.

అందువల్ల తండ్రి యొక్క విముఖతను తోసిపుచ్చలేక యామిని అవస్తపడుతున్నప్పుడు సరోజ కలుగచేసుకుంది.

"వంకరగా మాట్లాడకండి.... బిడ్డైతే ఏమిటి? ఇద్దరినీ మనమే కదా కన్నాము? ఒకేలాగానే కదా పెంచాము? మనల్ని చూసుకోవలసిన బాధ్యత దీనికీ ఉంది" అన్నప్పుడు యామిని నవ్వుకుంది.

అదికాదు సరొజా...నాలుగు నెలలుగా ఆశుపత్రిలోనే కదా ఉన్నాము. నీ కొడుకులు రెండు సార్లు వచ్చి చూశెళ్ళారు. పది పైసలు కూడా ఇవ్వలేదు. పాపం....మొత్త ఖర్చునూ యామిని ఒక్కత్తిగా ఖర్చుపెట్టిందే! ఇంకా దీని దగ్గర ఉండి దాన్ని శ్రమ పెట్టాలా?"

"ఎవరికి చేసింది...కన్న తండ్రికే కదా చేసింది. దాని బాధ్యతే కదా అది?"

"ఇదే భాద్యత గురించి నీ కొడుకుల దగ్గర చెప్పొచ్చు కదా?"

"వాళ్ళకు బోలెడు ఖర్చులు ఉంటాయి? పిల్లల్ను చదివించాలి. తిండి, బట్టలు అని ఎన్నో ఖర్చులు? దీనికి అలా లేదే! ఇన్ని సంవత్సరాలు తాను సంపాదించింది ఎవత్తో కన్నదానికి ఇది ఖర్చుపెట్టింది. ఇకనైనా మనకొసం ఖర్చుపెట్టనివ్వండి?"---అన్న తల్లి మాటలకు యామినికి వెక్కిళ్ళు వచ్చినై.

ఏమిటిది... రోజు మాంగల్య భిక్ష పెట్టిన దైవం...ఈరోజు మళ్ళీ ఎవరో కన్న బిడ్డ అయిపోయిందా? ఊహూ...అమ్మ మారదు. ఇది ఆమె పుట్టుకతో వచ్చిన గుణం. ఇప్పుడే ఇన్ని మాటలంటోందే. ఇంట్లో ఉంచుకుంటే ఇంకెన్ని మాటలు అంటుందో? ప్రశాంత వాతావరణంతో ఉన్న నా ఇళ్లు యుద్ద భూమిగా మారిపోతుందే. దీన్ని అనుమతించకూడదు. కన్న వాళ్ళను కాపాడవలసిన బాధ్యత ముఖ్యమైనదే. దానికోసం జయ మనసును గాయపరచ కూడదు.

"అమ్మ మన ఇంట్లో ఉంటే జయను ఉసికొలుపుతుంది. కత్తి కంటే పదునైనది నాలుక. మాట్లాడే చంపేస్తుంది. దానికి మనం అసలు తావు ఇవ్వకూడదు”--తీర్మానించుకున్న యామిని నిటారుగా కూర్చుంది.

"నాన్న చెప్పేదే కరెక్ట్ అమ్మా. మీరు మన పాత ఇంటికే వెళ్ళిపొండమ్మా"

"ఏం మాట్లాడుతున్నావే నువ్వు?"

"అదికాదమ్మా...ఎల్ల వేలలా ఇళ్ళు తాళం వేసుంటే, ఇంటి యజమాని ఇళ్లును ఇంకెవరికైనా ఇచ్చేస్తాడు. తరువాత మన వసతికి మనకు ఇళ్లు దొరక్టం కష్టమౌతుందే...?"

"ఎందుకు వేరే ఇళ్లు చూసుకోవాలి? ఇది నీ సొంత ఇళ్లే కదా? ఇంత పెద్ద ఇంట్లో మాకు ఒక రూము ఇవ్వవా?"

"ఛఛ...అలా కాదమ్మా! నేనున్నది మూడో అంతస్తు. నాన్న వల్ల మెట్లు ఎక్కటం కష్టం"

"ఎందుకు మెట్లెక్కాలి? మీ అపార్ట్ మెంట్లో లిఫ్ట్ ఉంది కదా?"

"అలా కాదమ్మా...నాన్న బాగా స్వతంత్రం గా ఉన్న మనిషి. పాత ఇంటి చుట్టూ పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వెళ్ళి రావచ్చు. విడిగా ఉండే ఇళ్లు. ఏటువంటి శ్రమా లేదు…..ఇక్కడ అలా కాదు. నాలుగు గోడల మధ్యే పడుండాలి. చుట్టు పక్కల ఉన్న వాళ్ళు ఉద్యోగాలకి వెల్తారు. కాబట్టీ ప్రొద్దున్నంతా అన్ని ఇళ్ళూ తాళలు వేసే ఉంటాయి.

నేనూ, జయ ఇద్దరం ఉద్యోగాలకు వెళ్ళిపోతాం. మీరిద్దరూ ఒంటరిగా ఉండాలి. అర్జెంట్ సహాయానికి కూడ మనుష్యులు ఉండరు" అని చెప్పిన కూతురును తీవ్రంగా చూసింది సరోజ.

"నువ్వు ఏం చెప్ప దలుచుకున్నావు?" కూతుర్ను గట్టిగా అడిగింది సరోజ.

"ఇవ్వాల్సిన అద్దె బాకీ, నెల నెలా అద్దె నేనే ఇచ్చేస్తాను. సరుకులు, నాన్నకు మందులు -అవన్నీ కూడా నేనే కొనిస్తాను. చెక్-అప్ వెళ్ళటానికి నేనే టాక్సీ బుక్ చేసి తీసుకు వస్తాను. రోజూ పని అయిన తరువాత వచ్చి చూసి వెడతాను"

"అంటే...మీ ఇంటికి మమ్మల్ని పిలుచుకు వెళ్ళవు?"

"అమ్మా..."

"అర్ధమయ్యిందే! నిన్ను ఇంట్లోనుండి పంపించేసినందుకు సమయం చూసి పగ తీర్చుకుంటున్నావు కదూ?"

"అయ్యో అమ్మా...."

నాకు జరగాల్సిందే...చావుకు దగ్గర అవుతున్న రోజుల్లో నైనా కొన్ని రోజులు కన్న బిడ్డ ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని గంజి తాగుదామని ఆశ పడ్డను! నాకు అవమానం జరగాల్సిందే"

"అమ్మా...నేనలా..."

"వద్దు!నువ్వు మాకు ఎటువంటి ఖర్చూ పెట్టకు. మా తలరాత ఎలా ఉందో అలాగే జరగనీ. నువ్వు బయలుదేరు"

"......................"

ఊర్లో, ప్రపంచంలో ఎన్నో వృద్ధాశ్రమాలు ఉన్నాయి...అక్కడ మాకు చోటు దొరక కుండానా పోతుంది? పో...నువ్వూ, శణేశ్వరం సంతోషంగా ఉండండి. మేము ఎలా పోతే నీకేమిటి?"

"అమ్మా..."

" సరోజా ఎందుకలా మాట్లాడతావ్? మన కూతురి మనసు ఎంత బాధ పడుతుందో ఆలొచించావా?"

"అది ఆలోచించిందా? ఇంత వయసు వచ్చిన తరువాత కూడ మనం ప్రశాంతంగా కుర్చుని తినే భాగ్యం మనకు లేదండి. నలుగురు బిడ్డలను కన్నాం. అందరూ మనల్ని వదిలేసేరు. పోతే పోనివ్వండి. పిల్లలే పుట్టకుండా ఎంతోమంది ఉన్నారు. మనమూ అలా అనుకుందాం"

"అమ్మా...."

దాన్ని వెళ్ళమని చెప్పండి. మన సంగతి మనం చూసుకుందాం. ఏదైనా అనాధ ఆశ్రమంలో చోటు దొరుకుతుందా అని చూద్దాం. అదీ దొరకకపోతే...అదిగో కళ్ళకు కనిపించే దూరంలోనే ఉన్నది ట్యాంక్ బండ్. వెళ్ళి దూకేద్దాం"-- అన్న తల్లిని గట్టిగా కౌగలించుకుంది యామిని.

"వద్దమ్మా! అలా మిమ్మల్ని వదిలి పెట్టనమ్మా. మీకు నేనున్నాను. మన ఇళ్లు ఉంది. వెల్దామమ్మా...మనింటికే వెల్దామమ్మా..."-- యామిని ఏడుస్తూ చెప్పగా సరోజ సంతోష పడింది.

                                                                                                               Continued...PART-13

************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి