3, ఫిబ్రవరి 2020, సోమవారం

ఆలయం(సీరియల్)...PART-13




                                                  ఆలయం(సీరియల్)
                                                             (PART-13)


ప్రసాదు కంపనీ గేటులోపలో నుండి ఫ్యాక్టరీలోకి ప్రవేశిస్తున్నప్పుడే విధి తన ఆట మొదలు పెట్టింది.

'సెక్యూరిటీ' పరిగెత్తుకుంటూ వచ్చి ప్రసాదును  అడ్డుకున్నాడు. “'పి.ఆర్.ఓ' విఠల్ రావు గారు మిమ్మల్ని చూడాలట, ఆయన్ని ఆయన డిపార్టుమేంటులో కలిసి చూసి వెళ్ళమన్నారు” చెప్పాడు సెక్యూరిటీ.

'సరే' నని తల ఊపుతూ 'బైకు’ ను 'స్టాండు’ లో పెట్టి, 'పి.ఆర్.ఓ.' సెక్చన్ కు వెళ్ళాడు ప్రసాదు. అప్పుడు విఠల్ రావు రూములో నుండి మధ్యం వాసన తొంగి చూసింది.

'భగవంతుడా'...అని గొణుక్కుంది ప్రసాద్ పెదవులు.

అయినా తప్పదని గది తలుపు తట్టాడు.

"లోపలకు రండి..." ఆహ్వానం వచ్చిన వెంటనే లోపలకు వెళ్ళాడు.

విఠల్ రావ్ ప్రసాద్ ని క్రిందా పైకీ చూసాడు. తన ఎదురుకుండా ఉన్న కుర్చీలో ప్రసాద్ ని కూర్చోమని చెప్పాలని కూడా ఆయనకు అనిపించలేదు. కంపనీ నిర్వాహ అధికారంలో ఉన్న అధికారులు, మిగిలిన అధికారులను తప్ప మిగిలిన వారిని ఎవర్నీ కూర్చోబెట్టి మాట్లాడ కూడదు అని అనేది అక్కడ రాయబడని రూలు. కుర్చీలో కూర్చోబెడితే సరిసమంగా చూసినట్లు అవుతుంది. అదే వాళ్ళకు పొగరు తెప్పిస్తుందని అని ఎవరో...ఎప్పుడో చెప్పిన దానిని గట్టిగా పట్టుకున్నారు. ప్రసాద్ కొంచం సేపు నిలబడి చూసి తానుగా కుర్చీలో కూర్చున్నాడు. అది విఠల్ రావ్ కి కోపం తెప్పించింది.

"నువ్వేనా వెంకట్ ప్రసాద్?"

"అవును సార్... కానీ మీరు కొంచం మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. నేనూ ఈ ఆఫీసులో ఒక సీనియర్ ఉద్యోగిని...మీకంటే వయసులో పెద్ద వాడిని"

"భయంకరమైన రోషగాడివిగా ఉన్నావే?"

"ఇప్పుడెందుకు ఈ ప్రశ్నలు...నన్ను ఎందుకు పిలిచారు? విషయానికి రండి. నేను 'డిపార్ట్ మెంటు’ కు ఒక్కరోజు కూడా ఆలస్యంగా వెళ్ళింది లేదు"

"టైముకు వెడుతున్నావని గొప్ప ప్రతిభావంతుడవని అనుకోవద్దు"

"ఏమిటి సార్ చెబుతున్నారు?"

"వూరికే సినిమా చూపించవద్దని చెబుతున్నా"

“మీరు అడిగినందుకు నేను చెప్పాను...నేనుగా ఏమీ చెప్పలేదే...?"

"నీ గురించి నేను విన్నదంతా నిజమనే అనిపిస్తోంది..."

"ఏం విన్నారు?"

"దాన్ని వివరంగా చెప్పటం నాకు ఇష్టం లేదు. ఒకటి మాత్రం బాగా తెలుసుకో. పనికి వచ్చామా...పని చూసామా...ఇంటికి వెళ్ళామా అని ఉండాలి. ఎవరు, ఎక్కడ, ఏం చేస్తున్నారని గమనించటం, వాళ్ళ గురించి పై అధికారులకు పుకారు చేయడం లాంటివి చేయకూడదు. నీ కొడుక్కు 'చైర్మాన్’ పేరు పెట్టినందువలన ఆయనకు నువ్వు దగ్గర వాడివని మేమెవరం అనుకోవటం లేదు. నేను చాలా 'కంపనీ' లను చూసి ఇక్కడకు వచ్చాను. కూర్చున్న చోటులో నుంచే లోపల ఏం జరుగుతుందో తెలుసుకో గలడు ఈ 'పి.ఆర్.ఓ' జ్ఞాపకం ఉంచుకో...నువెళ్ళచ్చు"

విఠల్ రావ్ తాలింపు వేసిన తరువాత, వెంకట్ ప్రసాద్ కళ్ళు చెమర్చినై.

"నాకేమిటి?" అని అనుకుంటూ వీధిలో వెడుతున్న ఒక గుడ్డివాడ్ని పిలిచి, 'నా భార్య స్నానం చేస్తుంటే తొంగి చూసావుటుగా?' అని అడిగితే అది ఎంత అన్యాయమో అంత అన్యాయంగా అనిపించింది ప్రసాద్ కు.

కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ బయలుదేరిన ప్రసాద్, తన 'డిపార్ట్ మెంటు’ లోకి వెళ్ళినప్పుడు పని మొదలుపెట్టాల్సిన సమయం మొదలైపోయింది. కానీ, ఎవరూ పెద్దగా పని చేయటం మొదలుపెట్టలేదు. కబుర్లు చెప్పుకుంటున్నారు. సెలెబ్రిటీ నటుల సినిమాలు ఉగాదికి రిలీజ్ అవుతాయా...అవవా? అనే దేశ సమస్య గురించే వాళ్ళ బాధ.

వాడిపోయిన మొహంతో 'కంప్యూటర్’ ముందు కూర్చున్న ప్రసాద్ కు స్క్రీన్ కనబడలేదు. అంత ఎక్కువగా వెలువడిన కన్నీరు అతని కంటి చూపుకు మసక వేసింది.

"ప్రసాద్..." అంటూ పిలుస్తూ వచ్చాడు రాజేష్ కుమార్.

ప్రసాద్ తల ఎత్తలేదు.

"ఏమిటయ్యా...కళ్ళు చెమర్చున్నాయి?"

"ఏమీ లేదు రాజేష్"

"అబద్దం చెప్పకు! 'పి.ఆర్.ఓ.' గదిలో నుండి నువ్వు రావటం నేను చూసాను. ఆ మందు బండి ప్రొద్దున్నే తాగిన మత్తులో ఉన్నాడు. ఏదైనా అన్నాడా?"

"అనలేదు...మాటలతో నన్ను నిలబెట్టి తగలబెట్టాడు"

"నిన్నెందుకు ఆ మనిషి మాటలతో తగలబెట్టటం..."

"తెలియదు...! కానీ దాన్ని నేను జీర్ణించుకోలేక పోతున్నాను రాజేష్"

"నువ్వు కూడా తిరిగి బాగా అడగలేకపోయావా?"

"ఏమడగను...అతను తాగున్నాడు. చేతిలో అధికారం కూడా ఉంది"

"ఇప్పుడైనా అర్ధమవుతోందా...ఈ కంపెనీలో మన స్థాయి ఏంటో"

ఇదే సాకుగా రాజేష్ కుమార్ ప్రసాదును తనవైపుకు తిప్పుకోవటానికి ప్రయత్నించాడు.

"ప్రసాద్...ఏప్పుడూ కొన్ని కంపెనీలు అధికారుల కంపెనీలుగానే ఉన్నాయి. వాళ్ళు పెట్టిందే చట్టం. వాళ్ళకు ప్రియంగానే ఉండాలి. కాదూ కూడదని నిలబడితే ఆపద మనకే. సరే, ఇక దాని గురించి వదిలేయ్. నువ్వు 'యూనియన్’ లో ఫిర్యాదు ఇస్తావా?”

"వద్దు రాజేష్. వదిలేయ్...ఇంకోసారి ఆ మనిషి నా మనసును గాయపరచనీ. అప్పుడు చూసుకుందాం"

---- ప్రసాద్ తనని తాను సమాధనపరచుకుని తను చేయాల్సిన పని మీద శ్రద్ద పెట్టాడు. మొదట్లో కొంచం కష్టపడ్డాడు. కానీ, పోను పోను సర్ధుకుంది. అతను పెద్దగా బాధ పడకుండా పనిలో శ్రద్ద పెట్టి పనిచేయటాన్ని చాలా దూరం నుండి ఒక మనిషి గమనిస్తూనే ఉన్నాడు.

                                                                         ఇంకా ఉంది.....Continued in PART-14 ***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి