5, ఫిబ్రవరి 2020, బుధవారం

ఆలయం(సీరియల్)...PART-14




                                                    ఆలయం(సీరియల్)
                                                             (PART-14)


సాయంత్రం! ఆఫీసు టైము ముగిసిన తరువాత వెంకట్ ప్రసాద్ ఇంటికి బయలుదేరాడు. అప్పుడు దూరంగా నిలబడి వెంకట్ ప్రసాద్ నే గమనిస్తున్న ఆ మనిషి తిన్నగా 'పి.ఆర్.ఓ.' విఠల్ రావ్ గదికి వెళ్ళి నిలబడ్డాడు.

"సార్..."

"ఏమిటయ్యా..."

"నోరు తెరవలేదు సార్. మీరన్న మాటలను అలాగా నొక్కేసి జీర్ణించుకున్నాడు"

"నిజంగానా?"

"అవును! రాజేష్ కుమార్ మాత్రం ఏదో ఒకటి అడిగి చూసాడు. కానీ, పట్టు ఇవ్వలేదు. మామూలు కంటే ఎక్కువ శ్రద్దతో పనిచేసి మంచి 'అవుట్ పుట్' కూడా ఇచ్చాడు"

"ఏమిటయ్యా...పెద్ద కొండను మింగిన 'పరమేశ్వరుడి' లా ఉంటాడు లాగుందే?"

"అవును సార్....అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేయటం కష్టం సార్"

"ఇదే విషయాన్ని ఎన్ని సార్లు చెబుతావు? ఇతన్ని తరిమేసి ఆ చోటుకు నీ తమ్ముడ్ని తీసుకువచ్చి చూపిస్తాను చూడు"

"ఏమిటో సార్...మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను. ఈ ఉద్యోగం దొరకకపోతే నా బందువులకు సమాధానం చెప్పలేను. దొరికితే మీకే చాలా మంచిది! కారణం, అతని తండ్రి...వైన్ షాపులోనే పనిచేస్తున్నాడు. రోజూ ఒక మంచి మందు సీసా కచ్చితంగా దొరుకుతుంది"

"సరే...నువ్వు బయలుదేరు! ప్రసాద్ కు తరువాతి రౌండ్ ఎలా పెట్టాలో ఆలొచిస్తాను"

“వాడి కధను చాలా సింపుల్ గా ముగించ వచ్చు సార్. కానీ, ఉద్యోగం పోవటంతో పాటూ జైలు ఊచలు లెక్కపెటాల్సి వచ్చినా వస్తుంది"

"అతను ఊచలు లెక్కపెడితే ఏమిటి....పుల్లలు లెక్కపెడితే మనకేమిటి. దాని గురించి మనం ఎందుకు ఆలొచించాలి? ఏం చేయాలో మాత్రం చెప్పు"

ఆ కూజా పార్టీ, విఠల్ రావ్ చెవిలో ఏదో చెప్పాడు. ఆయన కళ్ళు జిగేలు మని మెరిసాయి.

ఇంటికి తిరిగి వచ్చిన వెంకట్ ప్రసాద్ కు కాఫీ ఇస్తూ అతని మొహం వైపు చూసింది మాలతీ. అతని మొహం వాడిపోయుండటం గమనించి ఆఫీసులో ఏదో వ్యవహారం జరిగింది అనేది ఊహించగలిగింది. వెంకట్ ప్రసాద్ కూడా ఏదీ మరిచిపోలేదు. జరిగిందంతా భార్యకు వినిపించాడు. "నీకోసమే పళ్ళు కొరుక్కుంటూ కూర్చున్నాను మాలతీ. నిజానికి నా రక్తం ఎంత ఉడికిపోయిందో తెలుసా?"--అన్నాడు వెంకట్ ప్రసాద్.

వెంకట్ ప్రసాద్ మాట్లాడింది అతని కొడుకు కూడా విన్నాడు.

ఇంట్లో 'నిక్కరు,'టీ షర్ట్' అని వేసుకుని 'హోమ్లీ'గా ఉన్న అతను, తండ్రి దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు.

"నాన్నా...ఒక ఆఫీసులో ఇలా కూడా జరుగుతుందా?" అని సన్నని గొంతుతో అడిగాడు.

"జరిగింది కదరా...అదే కదా నువ్వు వింటున్నది!"

"ఇలా ఉంటే ప్రశాంతంగా పనిచేయటం కష్టం కదా?"

“ప్రశాంతంగా పనిచేయకూడదు...ఉద్యోగం మానేసి వెళ్ళిపోవాలనే కదా ఇలా జరుగుతోంది"

“ఉద్యోగం మానేస్తే ఎవరు నాన్నా పని చేసేది...ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? మీ యజమాని ఎలా లాభం సంపాదిస్తారు?"

"ప్రొడక్షన్ జరుగుతుంది...ఒకడు లేకపోతే ఇంకొకడు. ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళ సంఖ్య కోట్లలో ఉన్నదే!"

వెంకట్ ప్రసాద్ కొడుకుకు వివరిస్తున్నప్పుడు అడ్వకేట్ మామయ్య అనే గోపీనాధ్, ఇంట్లోకి వస్తున్నాడు. అతనొక లీడింగ్ అడ్వకేట్. చట్టంలోని లొట్టు లోసుగులు బాగా తెలిసినాయన. సమాజ సేవ చేయాలనుకునే గొప్ప వ్యక్తి.

ఆయన్ని చూడగానే వెంకట్ ప్రసాద్ కు కొంత ఉత్సాహం వచ్చింది.

"రండి మామయ్యా" అంటూ ఆయన్ని ఉత్సాహంగా ఆహ్వానించాడు. వెంకట్ ప్రసాద్ మామయ్య కూడా వెంకట్ ప్రసాద్ మొహాన్ని చూసి సమస్యను ఊహించాశాడు.

“ఏమిటి ప్రసాద్...ఎలా ఉన్నది మీ 'కంపనీ’?"

"ఏమిటి మామయ్యా...వచ్చీ రాగానే దాని గురించి అడుగుతున్నారు?"

"మీ ఆఫీసులో కొత్తగా ఒకతను 'పి.ఆర్. ఓ.' గా చేరినట్టు విన్నానే?"

"అవును మామయ్యా! ఆ వ్యక్తి వలనే ఇప్పుడు మనశ్శాంతి లేకుండా పోయింది"

"అతనొక మనొవ్యాధి గలవాడురా. మనసులో తానొక రాజు, మంత్రి అనుకుంటున్నాడు. ఇంతకు ముందు అతను పని చేసిన కంపెనీలో అతన్ని మెడ పట్టుకుని గెంటేశారు"

"అలాంటి మనిషిని మా కంపెనీ ఎలా ఉద్యోగంలోకి తీసుకుంది?"

"ఆ విషయాన్ని నువ్వే మీ పై అధికారులను అడిగి తెలుసుకోవాలి"

"నేనడిగితే నా పై అధికారులు సమాధానం చెబుతారా...ఏమిటి మామయ్యా నువ్వు?"

"అదీ కరెక్టే! క్లుప్తంగా చెప్తా...ఎవరికైతే టైము బాగుండలేదో...అక్కడ వీడుంటాడు. నోరు తెరిస్తే అబద్దం. ఈ దేశంలో ఎవరూ హరిశ్చంద్రులు కాదు. కానీ, ఈ మనిషి కారణమే లేకుండా అబద్దం చెప్పే వ్యక్తి. ఇప్పుడు నువ్వెళ్ళి చూశావనుకో, నీ ఎదురు కుండా ఎవరితోనో 'ఫోన్లో' మాట్లాడి, ఎం.ఎల్.ఏ తో మాట్లాడాను. ఎం.పి తో మాట్లాడాను అని చెబుతాడు.

మనసులో విపరీత భయము, దానితోపాటూ ఈర్ష్య, అసూయ, ద్వేషం, స్వార్ధం లాంటి గుణాలు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయో...వాళ్ళంతా ఇతనిలాగానే నడుచుకుంటారు"

                                                                      ఇంకా ఉంది.....Continued in PART-15 ****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి