23, మే 2020, శనివారం

గాలితో ఒక యుద్దం (సీరియల్)..PART-8




                                             గాలితో ఒక యుద్దం (సీరియల్)
                                                                 (PART-8)


"వైద్యులుగారూ...మీరు ఏమీ చెప్పనే లేదే?"

"తమ్ముడూ...నేను ఏం చెప్పాలని మీరు ఎదురు చూస్తున్నారు"

"లేదూ...మీకు ఈ గాలిదేవుడి మీద భక్తి లేదా? బైకు మీద వచ్చిన ఆయన చెప్పింది కరెక్టేనా?"

"నమ్మితే అదొక దేవుడు. అంతెందుకు... ‘నమ్మకం’ అని ఒకటుందే! నా వరకు అదే ఒక దేవుడు"

"ఇది బాగుందే...! దీన్ని నేను అంగీకరిస్తాను. నమ్మకంతో ఉండాలి. నమ్మకాన్ని వదిలిపెట్టకూడదు. నమ్మకమే మనిషి యొక్క బలం. దాన్ని దేవుడి దగ్గర చెప్పక్కరలేదు. చెప్పినా తప్పులేదు"

"అదే సమయం మాట శుభ్రత కూడా ముఖ్యం"

"ఒప్పుకుంటాను...! మనిషికి మాట చాలా ముఖ్యం. అప్పుడొకమాట, ఇప్పుడొకమాట మాట్లాడకూడదు"

"అలాంటప్పుడు ఎందుకు తమ్ముడూ గాలిదేవుడి ఇంట్లోకి మాత్రం వెళ్ళారు?"

-----వైద్యుడు సడన్ గా అలాంటి ప్రశ్న వేస్తాడని వీరబద్రం ఎదురు చూడలేదు.

"వైద్యులు గారూ! మీరు నా నమ్మకం గురించి మాట్లాడేసి, అలాగే ఆ ఇంటి విషయానికి వచ్చారే?"

"నేను రాలేదు. మీ అభిప్రాయమే నన్ను రప్పించింది!"

"నా అభిప్రాయమా?"

"అవును! మాట మరకూడదు, అప్పుడొకమాట, ఇప్పుడొకమాట మాట్లాడకూడదు అని చెప్పేరే?"

"అవును...అదే నా నీతి కూడా!"

"మరి ఆ నీతి...ఇదిగో ఇక్కడ నిలబడ్డ పంతుల కొడుక్కి లేదా?"

"ఓ...మీరు అలా చెబుతున్నారా?"

"నేరుగానే మాట్లాడతాను...! గాలిదేవుడికి ఆ ఇల్లు ఇస్తానని మొక్కుకుని...ఇంటిని అప్పగించి వెళ్ళిన పరిస్థితుల్లో, ఇప్పుడొచ్చి ఆ ఇంటిని తీసుకోవడం కరెక్టేనా?"

"వైద్యులు గారూ...మిమ్మల్ని ఏమిటో అనుకున్నాను. మీ కంటే ఆ 'మోటార్ సైకిల్’ అతనే బెటర్ గా ఉన్నాడే. అతను తన భయాన్ని మాత్రమే చూపాడు. కానీ, మీరు భయపెట్టకుండా...లోతుగా కొడుతున్నారు…..సరే...మీ ప్రశ్నకే వస్తాను!... కార్తిక్ యొక్క తాతయ్య ఉద్రేకంలో దేవుడి దగ్గర మొక్కుకోనుంటారు. కానీ, అదొక మాయ...ఆంగ్లంలో ఇంట్యూషన్ అని చెబుతారు. లేని ఒక గాలిదేవుడ్ని ఉన్నట్టుగానే నమ్మి ఉద్రేకపడుతూ మాట్లాడిన మాటలు...నిజంగా మాట్లాడిన మాటలు అవవు. లేదు...అది నేను ఒప్పుకోనూ అని మీరు చెబితే, నేను ఇప్పుడు అడిగే ప్రశ్నకు జవాబు చెప్పండి. అంత భక్తితో ఇచ్చిన ఇంటిని గాలిదేవుడే వచ్చి ఎందుకు తీసుకోలేదు?"

"ఏమిటీ...తీసుకోలేదా? ఇవేం మాటలు తమ్ముడూ?"

“ఆయనుంటే...ఆయన తీసుకునే ఉంటాడు. ఆ ఇంటిని శుభ్రంగా ఉంచుకోనుంటాడు! ఇలాగా పాములూ, తేళ్ళూ అక్కడ తిరుగుతూ ఉంటాయా?”

“దేవుడు తిరిగే చోటు అలాగే ఉంటుంది తమ్ముడూ. పాము ఆయనకు పూల దండలాగా. తేలు ఆయనకు చీమలాగా?"

"అదే నిజమైతే అవి మన్యుష్యులను ఏమీ చేయవు. కాటు వేయవు. ఏ దేవుడైనా ఎప్పుడూ మంచివాళ్ళను దండించడు. అవినీతి పరులనూ, పాపాత్ములను దండిస్తాడు.మీరు నా ప్రశ్నకు కరెక్టు సమాధానం ఇవ్వలేకపోతున్నారు. అందుకే ఏవో కబుర్లు చెప్పటం మొదలు పెట్టారు. పరవలేదు. నా స్నేహితుడ్ని కాపాడారు. మీకు చాలా థ్యాంక్స్. మీ ఫీజు ఎంత?"

"ఎవరై ఉన్నా, ఏ వ్యాధి అయినా ఇప్పుడు యాభై ఒక్క రూపాయలు తీసుకుంటున్నాను. ఇంతకు ముందు పద్దెనిమిది రూపాయలు తీసుకునేవాడిని. ఇప్పుడు ధరలన్నీ పెరిగినై కదా...జరుగుబాటు కావాలి కదా?"

"పరవాలేదు! ఏదో ఫీజు విషయంలోనైనా ఈ కాలం మనిషిలాగా ఉన్నారే...చాలా సంతోషం" --- అన్నాడు.

వాళ్ళ మాటలు వింటున్న కార్తిక్ లేచి కూర్చోనున్నాడు.

"తమ్ముడూ...నందిగామ వెళ్ళేటప్పుడు పెద్దాసుపత్రి వస్తుంది. ఎందుకైనా మంచిది. అక్కడికి వెళ్ళి పాము కాటు మందు వేసుకోండి. రేపే లేచి పరిగెత్తొచ్చు..." అంటున్న వైద్యుడ్ని చూసి నవ్వుతూ కార్తిక్ ను లేపి చేతులు పుచ్చుకుని నిదానంగా తీసుకెళ్ళి కారులో ఎక్కించాడు వీరబద్రం.

కార్తిక్ ముఖంలో నీరసం. సీటులో వెనుకకి వాలి పెద్ద నిట్టూర్పు విడిచాడు.

"ఏమీ లేదు కార్తిక్...వైద్యుడు చెప్పినట్టు జి.హెచ్ కు వెళ్ళి ఒక ఇంజెక్షన్ వేసుకుందాం...ఏం...?"

"ఊ..."

"సరే...బయలుదేరుదామా?"

"వెల్దాం..."

"తిరిగి రేపో, ఎల్లుండో వచ్చి ఇంటిని పూర్తిగా శుభ్ర పరిచేద్దాం. అప్పుడుంది ఈ పాముకు పాఠం"

---మాట్లాడుతూ కారులోకి ఎక్కాడు!

ఊరి జనం అక్కడక్కడ నిలబడి వీళ్ళను ఆశ్చర్యంగా చూస్తున్నారు.

"మంచికాలం...ఎవరూ వచ్చి గాలిదేవుడి పురాణం పెద్దగా మాట్లాడలేదు. వైద్యుడు మాత్రం కొంచం తెలివిగా మొదలుపెట్టాడు, కానీ మూర్ఖత్వంగా ముగించాడు" అంటూ కారును స్టార్ట్ చేసి పోనిచ్చాడు.

కారు వేగం పుంజుకుంది!

కార్తిక్ మౌనంగా ఉండిపోయాడు.

"ఏమిట్రా కార్తిక్...బాగా నీరసంగా ఉన్నదా?"

"అవును బద్రం! నేను చచ్చిపోతానేమో అనుకున్నాను. ఇప్పుడు ప్రాణాలతో ఉండటం చూస్తే కలలాగా ఉంది"

"వైద్యుడు కొంచం విషయం తెలిసినతను. అందుకే నిన్ను కాపాడగలిగాడు. నేను కూడా కొంచం భయపడ్డాను. కానీ, జీవితంలో ఇలాంటి ఆపదలు ఏర్పడుతూనే ఉంటాయి. దాన్ని తెలివితేటలతో దాటి వెళ్ళిపోవాలి. అలాంటి ఒక ఆపదనే నువ్వు ఇప్పుడు దాటాసావు..."

“నాకు ఏం చెప్పాలో తెలియటం లేదు బద్రం. కానీ, ఒక విషయం..."

"ఏమిట్రా...?"

"ఇక ఈ ఇంటి విషయంలో నేను రిస్కు తీసుకో దలచుకోలేదు"

కార్తిక్ అలా చెప్పటంతో 'కీచ్' మన్న శబ్ధంతో కారు ఆగింది. ఎందుకంటే సడన్ బ్రేకు వేశాడు వీరబద్రం.

"ఏమిట్రా ఇది...కార్తిక్ తన భయాందోళనలను ఇంకా వ్యక్తం చేయలేదే అనుకున్నా...నోరు తెరిచావా!"

"లేదు బద్రం...నాకు ఇలా జరిగిందని నాన్నా-అమ్మకు ఈపాటికి ఈ విషయం తెలిసుంటుంది. వాళ్ళింక నన్ను...ఈ ఊరి గురించే తలుచుకోకూడదని చెబుతారు చూడు..."

"అదెలారా నేనూ-నువ్వూ చెప్పకుండా మీ అమ్మా-నాన్నలకు ఈ విషయం ఎలా తెలుస్తుంది?"

“ఆ వీధి మొత్తం చూస్తుండగానే కదా నువ్వు నన్ను వైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్ళావు? ఆ వీధిలోనే సర్పంచ్ ఉన్నాడు. అతను ఫోను చేసి చెప్పేసుంటాడు"

కార్తిక్ ఊహించినది కరక్టే అన్నట్టు కార్తిక్ ఫోనుకు పిలుపు వచ్చింది.

"నాన్నే అనుకుంటా...! వైద్యుడి ఇంటి దగ్గర టవర్ సరిగ్గా లేదు. అందుకే అక్కడ సిగ్నల్ వర్క్ చేయలేదు. ఇలా వచ్చామో లేదో వర్క్ చేస్తోంది!" అంటూ జేబులో నుండి సెల్ ఫోన్ తీశాడు కార్తిక్.

అతని తండ్రే……

ఆయన పేరు కనబడింది!

కానీ, మాట్లాడింది వేరే ఎవరో?

"హలో...ఎవరు మాట్లాడుతున్నారు?"

"ఎవరా?...నేను కార్తిక్ ను. మీరెవరు?"

"నేను ఎవరనేది చెబితే మీకు తెలియదు తమ్ముడూ. ఇక్కడ ఒక కారు యాక్సిడెంట్ అయ్యింది. అందులో ఉన్న ఇద్దరూ ప్రమాదానికి గురై స్పృహ కోల్పోయి పడున్నారు. ఈ సెల్ ఫోన్ పక్కన పడుంది. ఎత్తి చూసి, అందులోని చివరి నెంబర్ ను చూసి ఆ నెంబర్ కు ఫోన్ చేశాను. మీరు వీళ్ళకు బంధువా?"

"నేను వాళ్ళ అబ్బాయిని! అవును యాక్సిడెంటా...ఎక్కడ జరిగింది?"

"ఇక్కడే నందిగామ కూడలి రోడ్డులో, గాలిపేట మట్టి రోడ్డులో..."

"మై గాడ్! ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చారా?"

"మీరు ఎక్కడున్నా వేగంగా...ధైర్యంగా రండి. ప్రాణానికి ఎటువంటి ముప్పూ లేదు"

“సరే నండి...మేము పక్కనే ఉన్నాము. ఒక పది నిమిషాలలో వచ్చేస్తాము"---అని చెప్పి సెల్ ఫోన్ కట్ చేసిన కార్తిక్. వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టాడు!

                                                                                                   (ఇంకా ఉంది) *************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి