13, మే 2020, బుధవారం

గాలితో ఒక యుద్దం (సీరియల్)..PART-3




                                         గాలితో ఒక యుద్దం (సీరియల్)
                                                            (PART-3)

“మా తాతయ్య తిన్నగా గాలిదేవుడి గుడి దగ్గరకు వెళ్ళాడు. “ఓయ్ గాలిదేవుడా! నువ్వు ఉన్నది నిజమైతే...నా మనవుడు చిన్న గాయం కూడా లేకుండా తిరిగి రావాలి. నువ్వేం చేస్తావో...ఎలా చేస్తావో నాకు తెలియదు. లేదంటే, ఈ రాయి రూపంలో ఉన్న నిన్ను, ఈ ఊరిని కాపాడే దైవంగా భావిస్తున్నారే ఈ ఊరి ప్రజలు...అదంతా పెద్ద అబద్దం అని చెప్పి, నీమీద పెట్టుకున్న నమ్మకాన్ని వదులుకుంటరు” అని చెప్పి నిమ్మ పండు అంత సైజు కర్పూరం ను వెలిగించారు. అప్పుడు అక్కడకు వచ్చిన పూజారి...మా తాతయ్యను చూసి, 'వూరికే ఐదు రూపాయలు ఖర్చు చేసి కర్పూరం కొని వెలిగిస్తే సరిపోతుందా...గాలిదేవుడికి మొక్కులాగా ఏదైనా ఇస్తానని చెప్పు. ఏదీ వదులుకోకుండా గాలిదేవుడి దగ్గర నీ కోరిక నెరవేరాలనుకుంటున్నావా' అని అడిగాడు”

వెంటనే తాతయ్య... “నేను ఏం చేయాలి?” అని అడిగారట.. “అది నాకు తెలియదు. కానీ ఒకటి...నువ్వు ఇవ్వాలనుకున్నది నిజంగా పెద్దదిగా ఉండాలి. అప్పుడే గాలిదేవుడు కరుణిస్తాడు. అదే సమయం ఆయన తలుచుకుంటే...నీ మనవుడు మంచిగా తిరిగి రావటమూ ఖచ్చితమే!” అని చెప్పగా, తాతయ్య ఏం చేయాలో తోచలేదు! పూజారేమో నవ్వుతూనే ఉన్నాడు. తాతయ్య మనసులో చటుక్కున ఒక ఆలొచన.

"పూజారీ...నా దగ్గర నాకని ఉన్నది నేను నివాసముంటున్న ఇల్లు ఒకటే. ఇంకేదీ నా చేతిలో లేదు. ఆ ఇల్లూ, వాకిలికి ఒకే వారసడు నా మనవుడే. వాడు ఎటువంటి నష్టమూ లేకుండా తిరిగి వచ్చేడంటే...నా ఇంటినే నేను గాలిదేవుడికి ఇచ్చేస్తాను. కానీ ఒకటి...నా కాలం చెల్లేంతవరకు నేను ఆ ఇంట్లోనే ఉంటాను. ఇదే నా మొక్కు” అని తాతయ్య చెప్పగా.

“సరే...ఆ మాటే గాలిదేవుడి దగ్గర చెప్పి, అలాగే కర్పూరం వెలిగించి వాగ్ధానం చేసి ఇంటికి వెళ్ళండి. మరో రెండు గంటలలో గాలిదేవుడు నీ మనవుడు ఎక్కడున్నా సరే నీ దగ్గరకు తీసుకువచ్చి చేరుస్తాడు!”...అని పూజారీ చెప్పటంతో తాతయ్య అదే విధంగా కర్పూరం వెలిగించి వాగ్ధానం చేసేసి బయలుదేరారు”

“తరువాత...?”

“నువ్వు నమ్మినా సరే...నమ్మకపోయినా సరే. ఈ విషయం మాత్రం నాకు బాగా జ్ఞాపకం ఉంది. నన్ను ఆ దొంగ దాచి పెట్టున్న చోట హఠాత్తుగా ఒక పెను గాలి వీచింది. హోరుమని వీస్తున్న గాలికి నేనూ, ఆ దొంగ ఊగిపోతున్నాం. అప్పుడు ఆ గాలి దుమారంలో నుండి చేతిలో ఒక కత్తితో గుర్రం మీద ఒకాయన వచ్చారు. ఆయన్ని చూసిన వెంటనే...దొంగ ఆయనతో యుద్దం చేయడానికి వెళ్ళాడు. కానీ, దొంగ వల్ల కాలేదు. ఎత్తిన చెయ్యి అలాగే ఉండిపోయింది. అంతే...ఆయన నన్ను ఎత్తి గుర్రం పైన తన ముందు కూర్చోబెట్టకున్నారు. గుర్రం బయలుదేరింది. అంతవరకు ఏడుస్తున్న నాకు ఆ గుర్రపు సవారి ఆనందాన్ని పంచింది”

----కార్తిక్ ఈ సంఘటనను చెప్పేటప్పుడు వీరబద్రం మొహంలో ఒక చిరునవ్వు.

“ఏమిటి బద్రం నవ్వుతున్నావు?”

“ఏమీ లేదు...నువ్వు 'కామిక్స్’ కథలను అప్పుడు ఎక్కువగా చదివేవాడివో?”

“రేయ్...నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. నువ్వు వేళాకోలంగా నవ్వుతున్నావు”

“లేకపోతే ఏమిట్రా...గుర్రంలో ఒకడు వచ్చాడట, ఎత్తుకుని బయలుదేరాడు. సరదాగా ఉన్నది అంటూ సినిమా కథ చెబుతున్నావు! ఈ కాలంలో ఎవరురా గుర్రాలు వాడుతున్నారు.?”

“బద్రం...నేను చెప్పేది నిజం. నీ దగ్గర అబద్ధం చెబితే నాకేమొస్తుంది?”

“సరే...తరువాత ఏం జరిగింది?”

“ఏం జరుగుతుంది? ఊరి సరిహద్దులో నన్ను ఆ మనిషి దింపేసి, 'చూసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు’ అన్నారు. నేనూ ఇంటికి వెళ్ళి చేరాను. నన్ను చూసిన వెంటనే అందరికీ సంతోషం. అప్పుడు చెప్పారు తాతయ్య...‘రెండు గంటల్లో నా మనవడు వచ్చేస్తాడని ఆ పూజారి చెప్పడం ఫలించిందీ...”

“అంటే మీ తాతయ్య మొక్కుకున్నందు వలనే గాలిదేవుడు గుర్రం మీద వచ్చి నిన్ను కాపాడాడు అంటున్నావా?”

“అవును...అప్పట్నుంచి నేనూ గాలిదేవుడ్ని భయ భక్తులతో నమస్కరిస్తున్నాను”

“నువ్వు వేప చెట్టు దగ్గర నుండి రావి చెట్టుదాకా అన్నిటినీ దేవుడిగా నమస్కరిస్తావే! ఇక దీని గురించి నేను వేరుగా చెప్పాలా?”

“ఇదిగో చూడు బద్రం....అది ఏదైనా సరే, అనుభవమనేది నిదర్శనమైన విషయం. నీ జీవితంలో కూడా జరిగితే...నువ్వూ ఖచ్చితంగా నాలాగా అనుకుంటావు!”

“ఒక్క రోజు కూడా అలా అనుకోను...”

“అలాగైతే ఆ రోజు గుర్రంలో వచ్చి నన్ను కాపాడిందెవరు?”

“ఎవరైనా వేటగాడుగా ఉంటాడు. ఎందుకంటే...వాడి దగ్గరే గుర్రం ఉండే ఛాన్స్ ఉంది...”

“ఆ దొంగ అతన్ని కొట్టటానికి చెయ్యి పైకెత్తినప్పుడు ఆ చేయి అలాగే ఆగిపోయిందే? అది ఎలా...?”

“బెనుకు పట్టి ఉంటుంది. ఇదంతా ఒక ప్రశ్ననారా? ఏది ఎలాగో...కాకి కూర్చున్నది కాబట్టి తాటి చెట్టు పడిపోయిన కథలాగా, మీ తాత ఇంటిని ఇస్తానని మొక్కు కున్నప్పుడు, నువ్వు వచ్చి చేరావు! అవునూ...మీ తాతయ్య మొక్కుకున్నట్టు ఆ తరువాత ఆ ఇంటిని గాలి దేవుడికే ఇచ్చాశారా?”

“మరి...మా తాతయ్య బ్రతికున్నంత వరకు ఆ ఇంట్లోనే ఉన్నారు. ఆయన చనిపోయిన తరువాత బామ్మ మాతో పాటూ ఇక్కడికి వచ్చేసింది. ఆ ఇంటికి 'గాలి దేవుడి’ ఇల్లు అనే పేరు పుట్టి అది స్థిరపడిపోయింది”

“అంటే ఆ ఇంటి డాక్యూమెంట్స్ మీ దగ్గరే ఉన్నాయని చెప్పు...”

“అవును...ఎందుకంటే గాలిదేవుడి గుడికని నిర్వాహ ఆఫీసో, నిర్వాహ ట్రస్టో లేనందు వలన ఇంటిని ఎవరి దగ్గర అప్పగించాలో తెలియలేదు. ఒక పూజారి మాత్రం ఉన్నాడు. ఆయన కూడా కొంత కాలానికి చనిపోయాడు”

“అయితే గాలిదేవుడు ఇప్పుడు దిక్కులేకుండా ఉన్నాడని చెప్పు”

“అలాగంతా ఏమీ లేదు. పాత పూజారి కొడుకు వచ్చి చూసుకుంటున్నాడు. అయితే ఒకటి...ఆ పూజారి ఎప్పుడూ గుడి దగ్గరే ఉండేవాడు. ఇతను అలా కాదు. ఒక రోజుకు ఒకసారి వచ్చి దీపం వెలిగించి, పూజ చేసి వెళ్ళిపోతాడు. పండగ రోజుల్లో మాత్రం అక్కడే ఉంటాడు.”

కార్తిక్ చెప్పింది విని మళ్ళీ నవ్వాడు వీరబద్రం.

“వద్దు! అలా నవ్వకు...”

“సరే నువ్విప్పుడు ఏం చెయ్యబోతావు?”

“ఏం చెయ్యబోతాను అని అడిగితే...చెల్లి పెళ్ళికి డబ్బు కావాలి. చేతిలో ఉన్న ఆస్తి ఇదొక్కటే. దానిని వాడుకోవటానికి మనుషులు లేరు. అందువలన...గాలిదేవుడు దగ్గర వేడుకుని ఆ ఇంటిని అమ్మటం తప్ప నాకు వేరే దారి లేదు”

“మంచి నిర్ణయం! ఎవరో సులేమాన్ గారిని ఒకరు ఆ ఇల్లు కొనడానికి రెడిగా ఉన్నారని చెప్పినట్టున్నావే?”

“అవును...! కానీ, ఆయన మా ఇంటి గురించి ఈ ఊర్లో మాట్లాడుకుంటున్నది విని, ఎవరైనా ఆ ఇంట్లో ఒక నెలరోజుల పాటూ నివాసముండి చూపిస్తే అది పాడు బడిపోయిన ఇల్లు కాదు, నివాసముంటున్న ఇల్లే అని మా వాళ్ళతో చెప్పి ఆ ఇల్లు కొనుక్కుంటానని చెప్పారు”

"బాధ పడకు! ఒకవేల ఆయన కొనుక్కోకపోయినా పరవాలేదు...నేను కొనుక్కుంటాను. నీకు సహాయం చేసినట్లూ ఉంటుంది. నేనూ ఇల్లు కొనుక్కున్నట్టు అవుతుంది"

“వద్దు బద్రం...నాకోసం నువ్వు శ్రమ పడొద్దు!”

“శ్రమా...ఇందులో నాకు శ్రమ ఏముంది?”

“లేదు... నేను ఏం చెప్ప దలుచుకున్నా నంటే?”

“ఏం చెప్పదలుచుకున్నావు?”

“మొదటిది, ఆ ఇల్లు అమ్మటమే మాకున్న ఒకే ఒక దారి...ఇంకొకటి, ఆ ఇల్లు అమ్మటానికి నాకు భయంగానూ ఉన్నది”

“అలా మాట్లాడటం మూర్ఖత్వం అని నీకే అనిపించటం లేదూ?”

“లేదురా...మా తాతయ్య నాకోసం మొక్కుకున్నారు. కానీ, ఇప్పుడు నేనే ఆ మొక్కును కాదని ఆ ఇల్లు అమ్ముదామని అంటున్నానే”

"పిచ్చోడా...ఏమిటో గాలిదేవుడు అనే దేవుడు ఒకరు నిజంగానే ఉన్నారని...ఆయన చేతిలో ఆస్తిని అప్పగించినట్టు, ఇప్పుడు ఆయన్ని నువ్వు కొట్టి దాన్ని లాకుంటున్నట్టు మాట్లాడుతున్నావే...! మీ తాతయ్య ఆ రోజు మూఢ నమ్మకంతో అలా నడుచుకుంటే...ఈ రోజు నువ్వూ అదే చేస్తావా?”

“అంటే....మా తాతయ్యది మూఢ నమ్మకం అంటున్నావా?”

“ఇంకేమని చెప్పను...దేవుడికి ఎందుకురా ఇల్లూ వాకిలి? లేదు...ఆయన మీ ఇల్లు కావాలని మీ తాతయ్యను అడిగాడా? ఇప్పుడు ఆయన మీ ఇంట్లో కాపురం ఉంటున్నాడా? వూరికే ఉండక ఒక పూజారి ఎక్కించాడు! మీ తాతయ్య ఎక్కేశారు...అందులో ఉన్న విషయం ఇంతే"----వీరబద్రం విసుక్కోకుండా సమాధానం చెప్పాడు.

అయినా కానీ, కార్తీక్ నుదిటి మీద ఉన్న చలనం పోనేలేదు. ఏదో ఆలొచిస్తున్నట్టు మౌనంగా ఉన్నాడు.

“ఏమిటి ఆలొచిస్తున్నావు?”-- అడిగాడు వీరబద్రం.

“ఏమీ లేదు...”

“మనం ఇప్పుడు ఆ గాలిపేటకు వెడుతున్నాం. ఆ ఇంటిని చూస్తున్నాం”

“వెళ్ళే తీరాలిరా. సులేమాన్ అడిగినట్లు ఆ ఇంట్లో నెలరోజులు నివసించాలనే నిర్ణయానికి అమ్మా, నాన్నా వచ్చేరు! కాబట్టి ఆ ఇంటిని శుభ్రపరచటానికి వెళ్ళాలి”--కార్తీక్ స్వరంలో ఉత్సాహం లేదు.

                                                                                           (ఇంకా ఉంది) ***************************************************************************************************

2 కామెంట్‌లు: