17, సెప్టెంబర్ 2019, మంగళవారం

తొలివలపు (సీరియల్)....PART-11

                                      


                                            తొలివలపు….(సీరియల్)
                                                         (PART-11)


ఆ ఎర్ర రంగు కారు వీధి పక్కగా తన శ్వాసను ఆపుకుంది. బాలాజీ, గాయత్రి అందులోంచి దిగి నడిచి-రోడ్డు దాటి ఎదురుగా ఉన్న కాంపౌండ్ గేటును తెరుచుకుని లోపలకు దూరి, కాలింగ్ బెల్ కొట్టి వైట్ చేశారు.

ఒక తలుపు మాత్రం తెరిచిన ఒక ఆవిడ తొంగి చూసి గాయత్రిని చూడటంతో గబుక్కున నవ్వుతూ హడావిడిగా ఆమె దగ్గరకు వెళ్ళింది.

"రామ్మా గాయత్రీ. ఏదో ఒక రోజు నువ్వు ఇలా వచ్చి నిలబడతావని తెలుసు. భార్యా-భర్తల మధ్య వెయ్యి గొడవలు ఉండొచ్చు. అందుకోసం కోపం తెచ్చుకుని పెట్టె పుచ్చుకుని పుట్టింటికి వెళిపోతే అన్నీ సర్దుకుంటాయా? ఈ నాటి ఆడ పిల్లలకు ఓర్పు అనేది లేనే లేదు. పాపం రమేష్ తమ్ముడు, నువ్వు లేకుండా ఎంత కష్ట పడ్డాడో తెలుసా నీకు?"

"ఈమె ఏం మాట్లాడుతోంది?"--అన్న కన్ ఫ్యూజన్ లో ఇద్దరూ నిలబడిపోయారు. ఆమె మాట్లాడుతూ పోతూంటే....గాయత్రికి వొళ్ళు మండుతోంది.

"నిన్ను నా కూతురు అనుకునే చెబుతున్నా గాయత్రీ. అడ్జెస్టు చేసుకోమ్మా...నీ జీవితం బాగుంటుందమ్మా. రమేష్ తమ్ముడికి మంచి మనసమ్మా. అర్ధం చేసుకుంటావనుకుంటా. ఇక నీ ఇష్టం. మేడమెట్లు ఎక్కి వెళ్ళండి" అని చెప్పి తన పని ముగిసినట్లు చటుక్కున వెనక్కు తిరిగి ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంది.

గాయత్రి ఎక్కడ చూస్తుందోనని వస్తున్న నవ్వును ఆపుకుంటూ మెట్లు ఎక్కటం మొదలుపెట్టాడు బాలాజీ. వస్తున్న కోపాన్ని దిగమింగుకుంటూ బాలాజీ వెనుకే గాయత్రి కూడా మెట్లు ఎక్కటం మొదలు పెట్టింది.

రమేష్ నివసిస్తున్న ఆ చోటును ఇళ్లు అనడం కంటే కొంచం పెద్ద గది అని చెప్పొచ్చు. ఒక అలమరా తప్పా ఇంకేమీలేదు. ఒక మధ్య గోడ కూడా లేదు. రూములోని ఒక చివర్లో ఒక చెక్క బల్ల, బల్ల మీద ఒక స్యూట్ కేసు, స్యూట్ కేసు పక్కన కొన్ని కెమేరాలు, ఫోటోగ్రాఫీకి సంబంధించిన పుస్తకాలు, కొన్ని ఫోటోలు కలిసి పడున్నాయి...వీటన్నిటికంటే గాయత్రి ఫోటోలు చిన్నవి కొన్ని, పెద్దవి కొన్ని అక్కడి గోడలకు అతికించబడి ఉన్నాయి.

వాటిని చూసి ఒక్క నిమిషం స్థభించి తేరుకుంది గాయత్రి.

ఇంటి యజమానురాలు మాటలకు అర్ధమేమిటో అప్పుడు అర్ధమైయ్యింది ఇద్దరికీ. అదే సమయం.

"వెల్ కమ్ గాయత్రీ" అని వెనుక నుండి గొంతు వినబడింది. గడ్డాలు, మీసాలు మధ్య కనబడకుండా పోయిన పెదవులను ఒకసారి చూపిస్తూ నవ్వుతూ కనబడ్డాడు రమేష్

"ఏమిటిదంతా?" అంటూ గోడలకు అతికించిన తన ఫోటోలను చూపిస్తూ అడిగింది.

"నా యొక్క సంతోషం"

"పిచ్చి పట్టిందా నీకు? నా అభిప్రాయాన్ని ఆ రోజే చెప్పేశాను. ఆ తరువాత కూడా...మర్యాదగా ఇవన్నీ తీసి చెత్తలో పడేయ్. అనవసరంగా ప్రాబ్లం చేస్తూ ఉండకు"

"ముగించారా? ఇక్కడకు మీరు ఎందుకు వచ్చారో దానికి కారణం నేను తెలుసుకోవచ్చా?"

"జీవితంలో మళ్ళీ నీ మొహాన్నే చూడకూడదని అనుకున్నాను. కానీ ఏం చేయను? నిన్ను వెతుక్కుంటూ రావలసి వచ్చిందే! అంతా నా కావ్...లేదు లేదు...నా స్టాఫ్ జానకి కోసం?"

"జానకి కోసమా...ఆమెకు ఏమిటి సమస్య?"

"నువ్వే సమస్య"

"నాకు అర్ధం కాలేదు"

"ఆహా...మంచి నటన"

"ప్లీజ్ గాయత్రి. నిజంగానే అర్ధం కాలేదు"

“నీకు అర్ధం అయ్యేటట్టు చెప్పేంత ఓపికి నాకు లేదు. జానకి గురించి మీ ఇంట్లో మాట్లాడావా...లేదా? ఎప్పుడు పెళ్ళి పెట్టుకుందాం? త్వరగా సమాధానం చెప్పు"

"గాయత్రీ మీరు నన్ను తప్పుగా అర్ధం చేసుకుని మాట్లాడుతున్నారు. జానికి నా స్నేహితురాలు...అంతే"

"నీ యొక్క వివాదం నాకు అక్కర్లేదు. నువ్వు జానకిని ఇస్టపడుతున్నావా...లేదా అనేది కూడా నాకు ముఖ్యం కాదు. ఆమెకు నువ్వు నచ్చావు. నిన్ను పెళ్ళిచేసుకోవటానికి ఆశపడుతోంది. ఆమె సంతోషమే నాకు ముఖ్యం"

"అరె...నిన్నటి వరకు పిల్లీ-ఎలుకలాగా ఉన్న మీ ఇద్దరి మధ్య ఇదేమిటి కొత్తగా?"

"అది నీకు అనవసరమైన విషయం. జానకి వ్యవహారానికి మొదట నీ సమాధానం చెప్పు"

"సారీ గాయత్రీ! నేను ఇంతకు ముందు చెప్పిందే. జానకి నా స్నేహితురాలుగా ఉండటం వరకే ఆమెకు హక్కు ఉంది"

"యూ రాస్కేల్. ఆమెతో సన్నిహితంగా ఉండి, ఆమె మనసును పాడు చేసి, ఇప్పుడు ఏమీ తెలియనివాడిలాగా మాట్లాడుతున్నావు? ఏమనుకుంటున్నావ్ నీ మనసులో? మర్యాదగా ఆమె మెడలో తాళి కట్టి కాపురం చేయటానికి దారి చూడు. లేకపోతే..."

"గాయత్రీ...ప్లీజ్. మీరు బయలుదేరండి. నేను జానకి దగ్గర మాట్లాడతాను"

"ఏం మాట్లాడతావు? నీకు యాక్సిడెంట్ జరిగి, హాస్పిటల్ బెడ్డులో పడుకున్నప్పుడు తిండి, నిద్ర మర్చిపోయి నీ పక్కనే ఉండి నిన్ను చూసుకుంది. మనసు నిండా నీమీద ప్రేమను నింపుకున్న ఆమె దగ్గరకు వెళ్ళి...నేను నిన్ను ‘ప్రేమించటం లేదు’ అని చెబితే, జానకి తట్టుకోలేదు. ఆమెకు ఏదైన జరిగితే ఆ తరువాత నిన్ను వూరికే విడిచిపెట్టను...ఇప్పుడే చెబుతున్నాను"

హెచ్చరిస్తున్నట్టు చెప్పేసి వేగంగా బయలుదేరిన గాయత్రి వెనుకే బాలాజీ కూడా వెళ్ళాడు.

"ప్లీజ్ గాయత్రీ, నేను చెప్పేది కొంచం వినండి" అంటూ వెనుకే పరిగెత్తుకు వచ్చాడు రమేష్.

అమె ఆగలేదు. ఆమె వెళ్ళిన వైపే కదలకుండా చూస్తూ ఉండిపోయాడు రమేష్.

ఇంకా ఉంది.....Continued in: PART-12

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి