3, సెప్టెంబర్ 2019, మంగళవారం

తొలివలపు(సీరియల్)....PART-4


                                              తొలివలపు….(సీరియల్)
                                                           (PART-4) 

చెప్పినట్లే మరుసటి రోజు కూడా వచ్చి నిలబడ్డాడు రమేష్. ఎరుపెక్కిన కళ్ళతో అతన్ని కోపంగా చూసింది గాయత్రి.

"ఏమిటి మేడమ్, రాత్రంతా నిద్ర పోకుండా నా గురించే ఆలొచిస్తూ ఉండిపోయారా? కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి?"

"నిన్ను ఎవరు లోపలకు పంపించారు? గొంతు పట్టుకుని బయటకు తోసేయండి అని చెప్పేలోపు...మర్యాదగా ఇక్కడ్నుంచి వెళ్ళిపో. లేకపోతే..."

"ఆహ...బయటకు వెళ్ళను అని చెబితే ఏం చేస్తారు...?"

ఆ ప్రశ్నలో నిర్లక్ష్యం కనబడింది.

"పోలీసులకు ఫోన్ చేస్తాను"

"ఎవరు...మీరు పోలీసులకు ఫోన్ చేస్తారా? గుడ్ జోక్"--అని చెప్పి గలగలా నవ్వాడు.

"ఎవరు నువ్వు...సంబంధమే లేకుండా ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు? వెళ్ళిపో. దయచేసి ఇక్కడ్నుంచి వెళ్ళిపో. నా గురించి నీకు తెలియదు"

"తెలుసు" అక్కడ ఇంకెవరూ లేరని గ్రహించి అన్నాడు.

ఆ మాటకు చటుక్కున తలెత్తి అతన్ని చూసింది.

'ఏమిటి వాగుతున్నాడు ఇతను? నా గురించి ఇతనికి ఏం తెలుసు? ఇంకొకరి దయతో ఉరిశిక్ష నుండి తప్పించుకున్నానే…ఆ విషయం తెలుసా? జీవితమనే చదరంగంలో జీవితాన్నే పోగొట్టుకున్నానే అది తెలుసా? కాలిపోయిన తరువాత బూడిదను విధిలించుకుని పైకిలేచి నిలబడుతుందే ఫీనిక్స్ పక్షి...అదేలాగా నేనూ కూడా లేచి నిలబడి తిరిగి వచ్చిన దానినని తెలుసా? మూర్ఖుడా! నీకు ఏమీ తెలియదురా. జీవితమనే నాటక వేదికపై ముఖానికి రంగు పూసుకుని నిలబడున్నానని తెలుసా నీకు! వెతుకుతున్న గుప్తనిధి దొరికినట్టు మురిసిపోయి గంతులేయకు! నేను నా పవిత్రతను కోల్పోయిన దానినని తెలిస్తే కళ్ళు తిరిగి క్రింద పడిపోతావు. చెప్పులు వదిలిపెడుతున్నాము అనుకుని నీ ప్రేమను కూడా వదిలి విసిరేయ్. నా శ్వాశ గాలి నీమీద పడేలోపు కనిపించకుండా పో'---ఆలొచనలతో సతమతమవుతున్న గాయత్రిని ఆమె బల్ల గుద్ది శబ్ధం చేసి ఈలోకానికి తీసుకు వచ్చాడు రమేష్.

"హలో! ఎమిటి మేడమ్...మేలుకునే నిద్రపోతున్నారు?" కొంటెగా అడిగాడు రమేష్.

ఆమె ఏమీ మాట్లాడలేదు. 'స్టెతస్కోప్' ను తీసుకుని లేచింది.

అతనూ లేచాడు.

ఆమె ముఖంలో కనబడ్డ విసుగు 'ఇక నీతో మాట్లాడటానికి తయారుగా లేను’ అన్నది అతనికి అర్ధమైయ్యింది.

"ఒక్క నిమిషం గాయత్రీ...ఇదికూడా విని వెళ్ళండి. మిమ్మల్ని కనిపెట్టటానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? గత ఇరవై సంవత్సరాలుగా మీ ఊరే కాదు, దేశమంతా జల్లడవేసి నీకొసం గాలించాను. పోయిన వారం జరిగిన మెడికల్ సదస్సు లో మొదటిసారిగా మిమ్మల్ని నేరుగా చూశాను. ఆ క్షణంలోనే నేను ఇరవై సంవత్సరాలుగా పోగొట్టుకున్న నా ప్రాణం మళ్ళీ దొరికినట్లు అనిపించింది నాకు. ఆ క్షణం నాలో కలిగిన భావాలను నా జీవితం చివరి క్షణాలవరకూ మరిచిపోలేను. నేను మిమ్మల్ని మనస్పూర్తిగా ప్రేమిస్తున్నాను...ఐ.లవ్.యు"

చివరగా అతను చెప్పిన మాటలు చెవిలో పడటం ఇష్టంలేక 'ఛీ' అని ఛీదరించుకుని నిలబడ్డ చోటు నుండి వేగంగా బయలుదేరింది.

"ఆగండి గాయత్రీ...మనసు నిండా ప్రేమను నింపుకుని మిమ్మల్ని వెతుక్కుని వచ్చాను. నాకు మీ సమాధానం చెప్పి వెళ్ళండి..."--అతను అరిచి చెప్పింది చెవులో పడనట్లు...తలుపు తెరుచుకుని బయటకు వెళ్ళిపోయింది గాయత్రి.

ఇది అతనికి రెండో ఓటమి. అతని హృదయం బరువెక్కింది. నడవలేక నడిచాడు.

'పో గాయత్రీ...పో. ఎక్కడికి పోతావు? ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనుకే వస్తాను. చాలు....నిన్ను ఒకసారి పోగొట్టుకున్నది చాలు. 'పోగొట్టుకున్న నిన్ను వెతుకుతున్నాను’ అనుకుంటూ నా జీవితాన్ని పోగొట్టుకున్నది ఇక చాలు. మిగిలిన జీవితాన్నైనా నీతో గడవనీ. నా ఈ ఓటములను నిచ్చెన అనుకుని, దానిని విడువకుండా ఎక్కుతూ ఏదైనా ఒకరోజు నీ హృదయ సింహాసనం మీద కూర్చుంటాను’----ఆలొచనలతో వెడుతున్న అతన్ని…"హలో రమేష్" అనే పిలుపు అడ్డుకుంది.

ఆలొచనలను చుట్ట చుట్టి బుర్ర లోపలకు తోసి, ప్రస్థుత పరిస్థితికి వచ్చిన అతని ముందు తామర పువ్వులాగా నిలబడున్నది జానకి.

"ఆశ్చర్యంగా ఉన్నది. మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని కొంచం కూడా అనుకోలేదు. అవును....ఏమిటి ఇలా వచ్చారు?" అని అడిగి సమాధానం కోసం అతని మొహంలో వెతికింది జానకి.

"ఓ...అదా.ఏమీ లేదు. అదొచ్చి...నా స్నేహితుడి భార్య ఇక్కడే 'అడ్మిట్' అయ్యుంది. అందుకే...."---అన్న అబద్దం అతని నోట తడబడుతూ వచ్చింది.

"సరే రండి...క్యాంటీన్ వరకు రండి. ఒక కాఫీ తాగి వెల్దాం" అన్నది, అతని మనసు అర్ధంకాక.

"వద్దు జానకీ. నేను కొంచం అవసరంగా వెళ్ళాలి"

అతను కాదనేటప్పటికి ఆమె మనసు బాధపడింది.

నీరశంగా "ఓ.కే" అన్నది.

అతను వెళ్ళిన చాలాసేపటి వరకు అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడ్డది.

ఇంకా ఉంది.....Continued in:PART-5

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి