11, సెప్టెంబర్ 2019, బుధవారం

తొలివలపు(సీరియల్)....PART-8




                                                తొలివలపు….(సీరియల్)
                                                             (PART-8)

ఇరవై సంవత్సరాలు కనబడకుండాపోయిన గాయత్రిని, ఇంకా ఎన్నిరోజులకు చూస్తామో నన్న ఆవేదనలో ఉండే రమేష్, గాయత్రి కనబడిన తరువాత నాలుగైదు రోజులు గాయత్రిని చూడకపోవటం వలన పిచ్చి పట్టినవాడిలాగా అయ్యాడు. తన ఊరి నుండి తిరిగి వచ్చీ రాగానే గాయత్రిని చూడటానికి బయలుదేరాడు. గుమ్మం దాటుతున్నప్పుడు 'సెల్ ఫోన్ మోగింది. తీసి "హలో" అన్నాడు.

"హలో రమేష్. నేను జానకి మాట్లాడుతున్నాను" అన్నది అవతలి గొంతు.

"చెప్పండి" అన్నాడు ఆ రోజు ఆమె మీద ఏర్పడ్డ కోపాన్ని మర్చిపోయి.

"హమ్మయ్య....అవును ఎక్కడికి వెళ్ళిపోయారు రమేష్? ఫోన్ చేస్తే 'నాట్ రీచబుల్’ అని వస్తూనే ఉంది"

"మా ఊరు వెళ్ళాను...అందుకే! సరే. ఏమిటి విషయం...చెప్పండి?"

"ఏమీలేదు...నేను మీతో కొంచం మాట్లాడాలి"

"నేను కూడా నీతో మీతో కొంచం మాట్లాడాలి. ఎక్కడ...ఎప్పుడు 'మీట్' చేద్దాం?"....రమేష్ అలా అడగటంతో ఏం మాట్లాడాలో తెలియక మౌనం వహించింది జానకి

".................."

"హలో జానకీ, 'లైన్ లో ఉన్నారా?"

"ఆ, చె...చెప్పండి"

"ఎందుకు తడబడతున్నారు?"

"ఏమీ లేదు"

"సరే, నేనే చెబుతాను. సాయంత్రం ఐదు గంటలకు గుడి పక్కనున్న పార్కులో వైట్ చేస్తాను...వచ్చేయండి"

అవతలి వైపు జానకి స్థంభించి నిలబడున్నది తెలియక బయలుదేరాడు రమేష్.

'చెప్పేయాలి. నా గాయత్రిని గురించి ఆడ హిట్లర్/దయ్యం అంటూ మళ్ళీ ఇంకోసారి అలా మాట్లాడ వద్దని చెప్పేయాలి. లేకపోతే ఇక్కడితో మన స్నేహం ముగించుకుందాం అని చెప్పేద్దాం'--మనసులో అనుకున్నాడు.

బైకులో ప్రయాణం చేస్తున్నప్పుడు తన తల్లి అడిగింది జ్ఞాపకమొచ్చింది అతనికి.

"నా కోడల్ని ఎప్పుడ్రా తీసుకు వస్తావు?" --ఇప్పుడు కూడా తన తల్లి అతని ఎదురుగా నిలబడి అడుగుతున్నట్లు ఉన్నది అతనికి.

'అతి త్వరలోనే అమ్మా' తనలో అనుకున్నాడు. కళ్ళెదుట గాయత్రి కనిపించి నవ్వింది. గబుక్కున ఉత్సాహం వచ్చి బైకు వేగాన్ని పెంచాడు.

హాస్పిటల్ ను చేరుకున్నప్పుడు అక్కడ పెద్దగా జనం లేరు.

'గుడ్ మార్నింగ్' అన్న కఠం విని ఒక 'స్కాన్ రిపోర్ట్' చూస్తున్న గాయత్రి 'ఎవరా?' అని తలెత్తి చూసింది. రమేష్ నిలబడున్నాడు.

'మళ్ళీ ఇతను ఎందుకు వచ్చాడు?'-అనిపించింది. లోపల చెలరేగిన కోపం మొహానికి చేరేటప్పటికి, ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు రమేష్.

"ప్రొద్దున పూట మీరు చాలా అందంగా ఉన్నారు" అన్నాడు.

తన కోపాన్ని అనుచుకోవటానికి చాలా శ్రమ పడింది గాయత్రి. అతను దాని గురించి పట్టించుకోలేదు.

"ఇప్పుడు ఆరొగ్యం బాగుందా గాయత్రీ? ఆ రోజు మీరున్న పరిస్థితి చూసి చాలా భయపడిపోయాను తెలుసా?" అన్నాడు గబుక్కున శోఖంగా ముఖం పెట్టుకుని.

“కానీ, ఆ రోజు ఎందుకురా బ్రతికేము అని ఇప్పుడు అనిపిస్తోంది. ఇలా నీ మొహాన్ని చూసే అవకాశమే ఉండకుండా పోయేది చూడు"

నిదానంగా చెప్పిన గాయత్రిని ఆశ్చర్యంతో చూశాడు.

"ఎందుకు గాయత్రీ అలా మాట్లాడుతున్నారు?"

"ఇంకెలా మాట్లాడమంటావు? చెప్పు! ఒకటి...నన్ను ప్రశాంతంగా ఉండనీ.లేదా...నా కళ్ళకు కనబడకుండా ఎక్కడికైనా వెళ్ళిపో"-- తలమీద చేతులు పెట్టుకుని తల వంచుకున్న ఆమెను బాధతో చూశాడు.

"ఓ.కే. గాయత్రీ. నేను వెళ్ళిపోతాను. కానీ, ఒక విషయం మాత్రం చెప్పండి. మీ మనసులో నేను ఉన్నానా....లేనా? దయచేసి నిజం చెప్పండి"

"లేరు...చాలా! అసలు ఎవరు నువ్వు? నువ్వుగా వచ్చావు...ఏదేదో వాగావు. ఇప్పుడు నిజం చెప్పండి అంటే ఏమిటి అర్ధం? నాకు అర్ధం కాలేదు?"

"నాతో ఆడుకోకండి గాయత్రీ. మీరు మాత్రం నాకు దొరకకపోతే నేను...." అతను ముగించేలోపు....

"చచ్చిపొండి" అని గట్టిగా అరిచిన ఆమె "నువ్వు చచ్చిపోయినందు వలన ఈ లోకమేమీ పనిచేయకుండా ఆగిపోదు. ఇక్కడకొచ్చి నా ప్రాణం తీయకుండా ఎక్కడికైనా వెళ్ళి తగలడు. నీ వళ్ల నా ప్రశాంతతే పోయింది. నీ మొహం చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతోంది. ఇక్కడ్నుంచి వెళ్ళిపో"

మాటలతో తన మనసును విరిచేసిన ఆమెను బాధగా చూస్తున్న రమేష్ ఇక మాట్లాడటం ఇష్టంలేక లేచి నడవటం మొదలుపెట్టాడు.

"ఒక్క నిమిషం" - తెరవటానికి తలుపును ముట్టుకున్న అతన్ని గాయత్రి గొంతు ఆపింది.

"నువ్వు నన్ను కలవటానికి రావటం ఇదే చివరి సారిగా ఉండాలి"- అని చెప్పి తన పని చేసుకోవటం మొదలుపెట్టింది.

అదేసమయం బస్సు దిగిన జానకి, బైకును తోసుకుంటూ వస్తున్న రమేష్ ను చూసి నడకలో వేగం పెంచింది.

'ఈ టైములో ఈయన ఎందుకు హాస్పిటల్ కు వచ్చి వెల్తున్నాడు? నన్ను వెతుక్కుంటూ వచ్చాడో? సాయంత్రం వరకు వైట్ చేయలేడా? ఏమిటంత అర్జెంటు? ఒకవేల నాలాగానే నువ్వు కూడా ప్రేమను చెప్పటానికి ఇబ్బంది పడుతున్నావా? కానీ ఇదేమిటి...రమేష్ ఏం చేస్తున్నారు? త్వరగా రోడ్డు క్రాస్ చెయ్యండి. అయ్యో...' ఆమె అరుపు గాలిలో కలిసిన సమయం 'ఢాం' అని ఆ శబ్ధం వినబడింది.

నిమిషంలో గుమికూడిన గుంపును తోసుకుంటూ ముందుకు వచ్చింది జానకి. చొక్కా అంతా రక్తంతో, బోర్ల పడున్న రమేష్ ని చూసిన ఆమెకు హృదయం పనిచేయటం మానేసింది.

తర్వాతి పది నిమిషాలలో...రమేష్ ప్రమాదానికి గురి అయ్యి తన హాస్పిటల్లో 'అడ్మిట్' అయిన న్యూస్ గాయత్రికి తెలుపబడింది. బలమైన దెబ్బలు తగలటం వలన స్పృహ కోల్పోయున్నాడు. దగ్గరే ఉండి అతన్ని చూసుకుంటోంది జానకి.

అయ్యింది. నాలుగైదు రోజుల గడిచిన అతరువాత ఆ రోజు అతను స్పృహలోకి వచ్చాడు. కళ్ళు తెరవటానికి అతను శ్రమ పడుతున్నప్పుడు దగ్గరలో మాటలు వినబడి కదలకుండా అలాగే పడుకున్నాడు.

"చూడు జానకీ. నువ్విలా మొండి పట్టు పడితే ఎలా? దయచేసి బయలుదేరు. నేను చూసుకుంటాను"

"లేదు పద్మా...ఈ పరిస్థితిలో ఈయన్ను వదిలిపెట్టి"

"అరే భగవంతుడా! నేను చూసుకుంటానని చెబుతున్నాను కదా? నన్ను కూడా ఆ హిట్లర్ గాయత్రీ లాగా రాతి గుండె దాన్ని అని అనుకుంటున్నావా? ఒక ప్రాణం యముడితో పోరాడుతోందని తెలిసిన తరువాత కూడా పరిగెత్తుకు వస్తుందని అనుకుంటే...వేరే డాక్టరుకు ఫోన్ చేస్తోంది. ఇన్ని రోజులలో ఒకసారైనా ఈ గదివైపు వచ్చిందా చూశావా? ఆక్సిడెంటు కేసులను 'హిట్లర్ గారు అటెండ్ చేయరట. ఏం మనిషి?...మనస్సాక్షి లేని మృగం"

"వదిలేయ్ పద్మా. ఇప్పుడు నా బాధంతా రమేష్ గురించే. ఇలా కళ్ళు తెరవకుండా పడున్నారే! అది తలచుకుంటేనే భయంగా ఉంది"

"ఇలా చూడు జానకీ. రాజేశ్వరి డాక్టర్ చెప్పింది నువ్వు నమ్మటం లేదా? నీ రమేష్ కి ఏమీ అవదు. చాలా? అనవసరమైన ఆలొచనలు పెట్టుకుని మనసు పాడుచేసుకోకుండా ఇంటికెళ్ళి 'రెస్టు’ తీసుకో. ఈ నాలుగైదు రోజులుగా నువ్వు సరిగ్గా తినను కూడా లేదు. దయచేసి బయలుదేరు. నేను చూసుకుంటా" అని స్నేహితురాలు బలవంతం చేయటంతో మనసులేకపోయినా బయలుదేరి వెళ్ళింది జానకి.

తన గదిలోనే ఉండి అక్కడ జరిగినదంతా 'సెక్యూరిటీ కెమేరా' రికార్డింగ్ ద్వారా చూస్తున్న గాయత్రి, కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది.

అదే సమయం కళ్ళు తెరిచి మెల్లగా లేచిన రమేష్- తూలుకుంటూ నడిచి, ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్ళాడు.

ఇంకా ఉంది.....Continued in: PART-9

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి