7, సెప్టెంబర్ 2019, శనివారం

తొలివలపు(సీరియల్)....PART-6

                                                  తొలివలపు….(సీరియల్)
                                                              ( PART-6)

గోడ గడియారంలోని రెండు ముళ్ళు ఒకదాని మీద ఒకటి తలపెట్టి పడుకోనున్నాయి. తన పరిస్థితిని-డాక్టర్ బాధ్యతను మరచిపోయి తన మనసులో జరుగుతున్న పోరాటం నుండి బయటపడలేక కొట్టుకుంటోంది గాయత్రి.

'ఎలా బయటపడగలను? త్వరగా మరిచిపోగల విషయమా అది? ఆ సంఘటనను ఇప్పుడు తలుచుకున్నా ఒళ్ళు గగుర్పు పుడుతోందే! నా రెక్కలు పీకి పారేసి, నా భవిష్యత్తులో చీకటి నింపిని ఆరోజు, భూదేవి తల్లి ఒడిలో ఆనందంగా విరబూసి పరిమలం విదజల్లుతున్న పువ్వుల మధ్యలో విరబూసిన రాత్రే వాడిపోయిన పువ్వులా నిలబడ్డ ఆ రోజు.

'అయ్యో! వద్దు. మనసా ఆ రోజును జ్ఞాపకం చేయకు! మర్చిపో. దేన్నీ జ్ఞాపకం పెట్టుకోకుండా మర్చిపో! చీకటినిండిపోయిన నా జీవితంలో వెలుతురును వెతుక్కుంటూ వచ్చి నిలబడ్డాడే ఒకడు. ఎవరతను? ఎంతో కొంత నాలో మిగిలున్న ప్రాణాన్ని తీసుకువెళ్ళటానికి వచ్చాడా? దేవుడా! ఎవరైనా అతనికి అర్ధం అయ్యేటట్టు చెప్పండి. ప్రాణం, శరీరం మాత్రమే ఉన్న నేను ఎటువంటి భావాలూ లేని రాయి లాగ తిరుగుతున్నాను. నా జీవితంలో వసంతం పోగొట్టుకుని చాలా సంవత్సరాలు అయ్యింది!

పాపం! ఏమీ అర్ధం చేసుకోలేని వయసులో ఏర్పడింది అతని ప్రేమ. అర్ధమయ్యేట్టట్టు చెబితే అర్ధం చేసుకోగలడు. నా గురించి మర్చిపోతాడు’ లేచి అద్దం ముందు వెళ్ళి నిలబడింది. మనిషంత ఎత్తు అద్దం. అద్దంలోని ఆమె ప్రతిబింబం నిర్భయంగా ఆమెలోని శోకాన్ని కలిపి చెప్పింది. 'నేను ఇంకా అలసిపోలేదు’ అనేలాగా తొంగి చూసిన కన్నీటిని తుడుచుకుని స్నానల గదిలోకి వెళ్ళింది. కళ్ళు మూసుకుని చాలాసేపు నిలబడింది. కళ్ళముందుకు వచ్చి నిలబడింది రమేష్ యొక్క శోకమైన ముఖం.

'అతన్నికొట్టుండ కూడదో?'--అని ఒక్క క్షణం ఆలొచించినప్పుడు మరు క్షణమే ఎదిరించింది ఆమె మనసు. 'నదిలో వరద పొంగుకు వచ్చేటప్పుడు అనకట్టు కట్టి వరదను ఆపటంలేదా? అదేలాగనే ఇది కూడా. నీ మీద అతను పెట్టుకున్న ప్రేమ ఇప్పుడు అతన్ని నిదానంలో ఉంచుతుంది. నువ్వు కొట్టిన చెంప దెబ్బ అతను నీకొసం మరుసటి అడుగు వేయటానికి ముందు అతన్ని ఒకసారి ఆలొచింప చేస్తుంది. కన్ ఫ్యూజ్ అవకు..క్లియర్ గా ఉండు! ప్రేమలో పడ్డ అతన్ని ఒడ్డుకు తీసుకురా! నువ్వు చేయాల్సిన బాధ్యతల కోసం ఒక ప్రపంచమే నీకొసం కాచుకోనుంది.

ఉత్సాహం పొందిన శరీరంతో స్నానాల గదిలో నుండి బయటకు వచ్చింది గాయత్రి. అదే సమయం మొదటి తుమ్ము ఆమెలో తన ప్రారంభోత్సవాన్ని మొదలుపెట్టింది. అప్పటికి ఇరవై సార్లు తొంగి చూశాడు బాలాజి. ఆమె తుమ్మటం తెలుసుకుని పరిగెత్తుకెళ్ళి మాత్ర తీసుకువచ్చి ఇచ్చాడు.

"టిఫెన్ తినడానికి రా అక్కా. ప్రొద్దుట్నుంచి నువ్వు ఏమీ తినలేదు"

"వద్దు బాలాజీ. అకాలిగా లేదు. కొంచంగా తల నొప్పి. నేను కొంచం 'రెస్టు తీసుకుంటాను. రాజేశ్వరి మేడమ్ దగ్గర ఈ విషయాన్ని చెప్పి హాస్పిటల్ను ఒకసారి చూసేసి వెళ్ళమని చెప్పు"

'సరే' అనేలాగా తల ఊపి వెళ్ళిపోయాడు బాలాజి.

ఆమె పరుపు మీద పడి కళ్ళు మూసుకుంది.

హడావిడిపడుతూ వచ్చాడు రమేష్.

అతనికోసం కాచుకున్నవాడిలా తలుపు తెరిచాడు బాలాజి.

"ఏమైంది...నా గాయత్రికి ఏమైంది...చెప్పు?"

తన భుజాలను పట్టుకుని ఊపుతూ అడిగిన రమేష్ ని తీసుకుని గాయత్రి రూముకు వెళ్ళాడు బాలాజీ.

శబ్ధం విని, వాడిపోయిన పువ్వులాగా ఒదిగి దుప్పట్లో ముడుచుకుపోయి పడుకుంది. జ్వరం క్షణ క్షణానికీ పెరుగుతూ ఆమెను తన కంట్రోల్లోకి తెచ్చుకుంది.

"తలనొప్పిగా ఉన్నదని చెప్పి పడుకున్నారు సార్. చాలాసేపటి నుండి పడుకునే ఉన్నారు. ప్రొద్దుట్నుంచి ఏమీ తినలేదని, టిఫిన్ తినడానికి రమ్మని పిలవటానికి వచ్చి చూస్తే ఇలా...” మాట్లాడలేక కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు బాలాజి.

గాయత్రికి దగ్గరగా కూర్చున్నాడు రమేష్. ప్రేమ నిండిన అతని మనసు ప్రేమికురాలి పరిస్థితి చూసి తల్లడిల్లింది. తన కుడి చేతితో ఆమె కుడి చేతిని పట్టుకున్నాడు. ఏడ్చిన కళ్ళతో అమె మొహాన్ని చూశాడు.

'నన్ను ఎందుకు ఇలా ఆందోళనకు గురిచేస్తావు గాయత్రీ? నేను నీ వాడినని ఎప్పుడు అర్ధం చేసుకోబోతావు? నిజంగా చెప్పు. నేనెవరో తెలియటంలేదా నీకు? నీకోసం జీవించటం మొదలుపెట్టి ఎన్నో సంవత్సరాలయ్యిందే? ఇంకా ఎంత కాలం నన్ను కాచుకోమని చెబుతావు? నీ సంకెళ్ళను పగలకొట్టుకుని నువ్వు బయటకు ఎప్పుడు రాబోతావు? చాలు గాయత్రీ, ఇక నాకు ఓపికలేదు! నీ జీవితాన్ని ఎప్పుడో నా దగ్గర అప్పజెప్పారు. జీవితాన్ని పారేసుకున్నాను అని బాధ పడకు. నిన్ను కాపాడలేకపోయినందుకు...నిజానికి బాధ పడాల్సింది నేను...! దానికొసం నన్ను క్షమించు. లేచి నాతో పోట్లాడు. దయచేసి కళ్ళు తెరు గాయత్రీ!’

తల వంచుకుని ఏడుస్తున్న రమేష్ వీపును తడుతూ సముదాయించాడు బాలాజి. అదే సమయం గాయత్రిలో చిన్న కదలిక కనబడింది. వెంటనే నిటారుగా కూర్చున్నాడు రమేష్.

శ్రమ పడుతూ కళ్ళు తెరిచింది గాయత్రి. కనీటితో దగ్గర కూర్చున్న రమేష్ ను చూసి అధిరిపడ్డది. తన చెతిని పట్టుకోనున్న అతని చేతిని విధిలించి విడిపించుకుంది. ఆమె శరీరంలోని వేడి మొత్తం ఆమె కళ్ళల్లోకి వచ్చి చేరినట్టు కళ్ళు ఎర్రగా ఉన్నాయి...ఆమె చూపులోని వెడిని తట్టుకోలేక తల దించుకున్నాడు రమేష్.

కోపంతో లేచి ఏదో చెప్పాలనుకుని నోరు తెరిచిన గాయత్రికి మాటలు రాలేదు. దానికి బదులు ఆమె నోటి నుండి వేగంగా వచ్చిన వాంతి, ఎదురుగా కూర్చున్న రమేష్ ని అభిషేకం చేసింది.

కళ్ళు తిరిగి పడిపోయింది గాయత్రి. రమేష్ ఆందోళనతో లేచాడు. పరిగెత్తుకుని వెళ్ళి నీళ్ళు పట్టుకొచ్చి తన ప్రేయసి మొహం కడిగాడు. బాలాజీ సహాయంతో ఆ చోటును క్లీన్ చేసి, అన్నింటినీ మార్చి 'హమ్మయ్య' అనుకుని వెనక్కి తిరిగాడు. ఎదురుగా డాక్టర్ రాజేశ్వరి.

"రమేష్"

"రండి డాక్టర్, కూర్చోండి" అంటూ సోఫా చూపించాడు.

"నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్?" అడుగుతూ సోఫాలొ కూర్చుంది.

తన మనసు విప్పి చెప్పాడు.

"ఆమె నువ్వు అనుకునే విధంగా లేదు రమేష్. ప్రేమ, పెళ్ళి అనే మాటలు వింటేనే అరవటం మొదలుపెడుతుంది. నేను ఇదివరకే ఈ విషయంగా గాయత్రితో మాట్లాడి, పోరాడి ఓడిపోయాను. మాట్లాడకుండా తిరిగి ఊరు వెళ్ళిపో. వేరే ఒక అమ్మాయిని చూసి పెళ్ళిచేసుకుని లైఫ్ లో సెటిల్ అవటానికి ప్రయత్నం చెయ్యి"

"నేను మా ఊరికి తిరిగ వెళ్ళిపోతాను డాక్టర్...అయితే ఒక్కడ్నీగా కాదు, గాయత్రిని తీసుకుని"

అతన్ని లోతుగా చూసింది. “నేను చెప్పలనుకున్నది చెప్పాను...తరువాత నీ ఈష్టం. నేను బయలుదేరతాను" అంటూ లేచింది డాక్టర్ రాజేశ్వరి.

"ఇంజెక్షన్ చేశాను...తగ్గిపోతుంది" అని చెప్పి గుమ్మం వైపు నడవటం మొదలుపెట్టిన డాక్టర్ రాజేశ్వరి వెనక్కి తిరిగి ఒక్కసారి రమేష్ ను చూసి అతని దగ్గరకు వచ్చింది. "గాడ్ బ్లెస్ యు" అని చెప్పి వెళ్ళిపోయింది.

ఇంకా ఉంది.....Continued in:PART-7

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి