5, సెప్టెంబర్ 2019, గురువారం

తొలివలపు(సీరియల్)....PART-5


                                                  తొలివలపు….(సీరియల్)
                                                              ( PART-5)        

తెల్లవారు జాము ఐదు గంటలు.

నిద్రకు బై చెప్పి, దుప్పటిని విధిలించి మడతపెట్టిన బాలాజీ, బద్దకాన్ని పోగొట్టుకుని నడుచుకుంటూ వెళ్ళి కిటికీలు తెరిచాడు. రాత్రి మొదలైన వర్షం ఇంకా కురుస్తూనే ఉన్నది.

కిటికీ ద్వారా వర్షం నీళ్ళు జల్లులా లోపలకు పడుతుంటే కిటికీ తలుపులు మూయటానికి వెళ్ళిన అతనికి ఇంటి గేటు ముందు ఒక బైకు వచ్చి ఆగటం కనిపించింది.'ఎవరై ఉంటారు?' అనే ఆలొచనతో వెళ్ళి తలుపు తెరిచాడు.

బైకు నుండి దిగిన రమేష్, బాగా అలవాటైన మనిషిలాగా అ ఇంట్లోకి చొరబడ్డాడు.

'ఎవరితను...? ఇంతకు ముందు మనం ఇతన్ని చూడనేలేదే! ఈ సమయంలో ఇక్కడకొచ్చి నిలబడటానికి కారణం ఏమిటో?'---మనసులో అనిపించిన ప్రశ్నలను అడగాలనుకున్నప్పుడు రమేషే నోరు తెరిచాడు.

"గాయత్రీ ఇంకా నిద్రలో నుంచి లేవలేదా బాలాజీ?"

'ఓ...అక్కను వెతుక్కుంటూ వచ్చాడా ఈయన? ఇలా హక్కుతో ఇళ్లు వెతుక్కుంటూ వచ్చేంత సన్నిహిత మగ స్నేహితులు అక్కకు ఎవరూ లేరే! నా పేరు కూడా తెలిసి పెట్టుకున్నాడే? నేను తప్ప ఇంకో మగ మనిషికి తెలియని ఇళ్లు కదా ఇది...!'

"మీరు ఎవరని...?"

"నా పేరు రమేష్. మన ప్రభుత్వానికి బంధువును. నా గురించి చెప్పటానికి ఇప్పటికి ఇది చాలనుకుంటా . తరువాత...గాయత్రిని ప్రేమిస్తున్నాను..." అని మొదలుపెట్టిన అతను ఏదేదో చెబుతూ వెడుతుంటే ఆశ్చర్యంతో అతన్నే చూస్తూ నిలబడ్డాడు బాలాజీ.

'ఐ లవ్ గాయత్రీ'--రమేష్ యొక్క ఈ మాటలు మాత్రమే ఆ ఇంటి మొత్తం మారు మోగుతున్నట్టు అనిపించింది బాలాజీకి.

'ఈయన చెప్పేది నిజమేనా? గాయత్రి అక్కయ్యను ఇష్టపడుతున్నట్టు చెబుతున్నాడు? అలాగైతే నా అక్కయ్య జీవితంలో ఈరోజుతో ఆకులురాలేకాలం ముగిసిందా? నా తోడపుట్టని సహోదరి జీవితంలో వసంతం వచ్చేసింది. నన్ను జీవింప చేస్తున్న దేవత చేతులు పట్టుకోవాటానికి ఆ దేవుడు పంపిన దేవదూత ఇతనేనా? 'ప్రేమ’ అనే మాటను తిరస్కరించే అక్కయ్య?'---గబుక్కున అతని ఆలొచనా తెర తెగిపోయింది.

'గాయత్రీ అక్కయ్యను వేలమంది ఇష్టపడవచ్చు. ఆమె ఇష్టపడుతోందా అనేదే ముఖ్యం!' అనే ఆలొచన తాకగానే ఆనంద ఆకాశంలో ఎగురుతున్న అతను అధఃపాతాళం వైపు వెళ్ళాడు.

"హలో బాలాజీ...ఏమైంది? అప్పుడప్పుడు మౌనంగా ఉంటున్నారు?"

"సార్, నిజంగానే మీరు అక్కయ్యను ఇష్టపడుతున్నారా?" అడిగాడు.

"ఎందుకు ఆ డౌట్? 'నేను చెప్పేదంతా నిజం. నిజం తప్ప ఇంకేది లేదు అని భగవద్గీత మీద సత్యం చేయమంటావా?"

"ప్లీజ్ సార్"

"ఓ.కే! నా జీవితమే నీ అక్కయ్యే. చాలా...?

గబుక్కున రమేష్ కాళ్ళు పట్టుకున్నాడు బాలాజీ. "చాలా సంతోషం సార్" అన్నాడు కళ్ళల్లో వస్తున్న నీటిని తుడుచుకుని.

"హయ్...బాలాజీ, ఏమిటిది? లే మొదట"

"సార్, అక్కయ్య యొక్క జీవితం ఎండిపోయిన చెట్టులాగా అయిపోతుందని బాధపడుతూ ఉండేవాన్ని. ఇప్పుడే నాలో నమ్మకమనే వేరు ఒకటి మొలిచింది. అనాధగా పుట్టి, అనాధ శరణాలయంలో పెరిగి, ప్రభుత్వ బడిలో చదువుకుని, స్కాలర్ షిప్ తో డిగ్రీ పూర్తి చేసి, చివరగా ఒక హోటల్లో నాకు పని దొరికింది. దానికి కూడా లంచం అడిగారు.తరువాత...లంచం కొంచమా? డబ్బుకు దారిలేనివాడు కల కూడా కనకూడదే! మెడ పుచ్చుకుని బయటకు తోశారు.

కానీ, ఆ రోజు నాకు ఏర్పడ్డ అవమామానానికి దేవుడికే కృతజ్ఞత చెప్పాలి. హోటల్ యజమాని నన్ను మెడు పుచ్చుకుని రోడ్డు మీదకు తోసినప్పుడు ఆ కారు ముందు నేను పడి ఉండకపోతే, నాకు గాయత్రీ అక్కయ్య ఎలా దొరికుంటుంది?

ఒక అనాధకేగా ఇంకొక అనాధ యొక్క మనసు అర్ధమవుతుంది.ఆ విధంగా చూస్తే నేను అదృష్టవంతుడినే సార్. ఆ తరువాత తమ్ముడు అనే బంధుత్వ పోస్టు తానుగా దొరికింది. ఆ హక్కుతో ఒకరోజు అక్కయ్యతో అమె పెళ్ళి గురించి మాట్లాడాను.

'నేను ప్రశాంతంగా జీవించాలని నీకు అనిపిస్తే... దయచేసి నా పెళ్ళి గురించి మళ్ళీ మాట్లాడొద్దు అని చెప్పేశారు. ఇక మీదట పెళ్ళి మాట ఎత్తి అక్కయ్య మనసు కష్టపెట్టకూడదని ఆ విషయాన్ని వదిలేశాను. కానీ...నా మనసులో అక్కయ్య పెళ్ళి గురించిన బెంగ ఉంటూనే ఉన్నది"---రమేష్ చేతులు పుచ్చుకుని మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు బాలాజీ.

"అక్కయ్యకు మొండితనం ఎక్కువ సార్. మాటల్లో కఠినత్వం కనబడుతుందే తప్ప...ఆమెకు పసిపిల్లల మనసు. అందరికీ అది పొగురుబోతు తనంగా కనబడుతుంది. అర్ధం చేసుకున్న వాళ్ళు మాత్రమే అమెతో సన్నిహితంగా ఉండగలరు. ముట్టుకునే స్పర్ష గ్రహించుకుని నత్తగుల్ల పెంకులోపలకు ఎలా ముడుచుకుపోతుందో అక్కయ్య కూడా అలాంటిదే. నత్తగుల్ల మీద ఉన్న ఆ పెంకును పగలకొట్టి ఆమెను బయటకు తీసుకురావటం ఇకపై మీ బాధ్యత. అది కష్టమే...కానీ మీరు చేయగలరని నమ్ముతున్నాను నాకు చేతనైన సహాయం నేను చేస్తాను. నా నమ్మకం వ్యర్ధం కాదుగా?"

కన్నీటితో అడుగుతున్న అతన్ని దగ్గరకు తీసుకుని అక్కన చేర్చుకున్నాడు రమేష్.

"బాధపడకు బాలాజీ, మంచే జరుగుతుంది" అన్నాడు.

"సారీ సార్, మర్చేపోయాను. మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు. ఉండండి కాఫీ తీసుకువస్తాను" అంటూ ఉత్సాహాంగా లోపలకు పరిగెత్తాడు. పదే నిమిషాలలో కాఫీ రెడీచేసి తీసుకు వచ్చి అతని చేతికి ఇచ్చాడు. కాఫీ కప్పును తీసుకున్న రమేష్ కాఫీ తాగడం మొదలుపెట్టాడు...అదే సమయం బెడ్ రూములో నుండి గాయత్రి గొంతు వినబడ్డది.

"బాలా...కాఫీ రెడీనా?"

"ఇదిగో తీసుకొస్తానక్కా" అన్నాడు.

ఫ్లాస్కులో ఉన్న కాఫీని ఒక కప్పులో పోసుకుని "ఇదిగో...ఇప్పుడే వచ్చేస్తాను సార్" అని రమేష్ కు చెప్పి వెళ్ళబోయిన బాలాజీని చెయ్యి పుచ్చుకుని ఆపాడు రమేష్.

"ఈ కాఫీని నేను తీసుకువెళ్ళి ఇచ్చిరానా? సర్ ప్రైజ్ గా ఉంటుంది కదా?"

"అది బాగుంటుందా సార్?" తడబడ్డాడు బాలాజీ.

"సింహాన్ని దాని గుహలోనే కలవాలని నిర్ణయమైపోయింది. దానికి మంచి రోజు, మంచి టైము చూసుకుంటూ కూర్చుంటే ఎలా?" అన్నాడు రమేష్.

నవ్వుతూ కాఫీ కప్పును రమేష్ చేతికి ఇచ్చి బొటనువేలు పైకెత్తి 'బెస్ట్ ఆఫ్ లక్' అన్నాడు బాలాజీ.

గాయత్రీ గది దగ్గరకు వెళ్ళేలోపు, రమేష్ మెదడులో అనేకరకాల ఆలొచనలు వచ్చి వెళ్ళాయి.

'హటాత్తుగా ఇంత ప్రొద్దునే నన్ను కలుసుకుంటే గాయత్రి ఏం చేస్తుంది? అమెతో 'గుడ్ మార్నింగ్ మై స్వీట్ హార్ట్' అని చెబుదామా?'

తనలో ఒకసారి చెప్పుకుని నవ్వుకుంటూ గాయత్రి గది తలుపుపై చెయ్యి పెట్టాడు. అదే సమయం సెల్ ఫోన్ లో మాట్లాడుతూ గాయత్రి హడావిడిగా తలుపులు తెరుచుకుని బయటకు రావటం ఒకేసారి జరగటంతో...ఒకరినొకరు ఢీకొనకూడదని ఇద్దరూ అనుకునేలోపు అది జరిగిపోయింది.

కాఫీ కప్పు క్రింద పడే శబ్ధం విని పరిగెత్తుకొచ్చాడు బాలాజి.

వెంటనే ఏం జరిగిందో గ్రహించిన గాయత్రి తనపై పడున్న రమేష్ ను పక్కకుతోసి లేచి నిలబడింది. పరిస్థితిని అర్ధం చేసుకున్న రమేష్ గబగబ లేచి నిలబడ్డాడు. అప్పుడు తన బలాన్నంతా చేతులుకు తెచ్చుకుని వేగంగా అతని చెంప మీద గట్టిగా కొట్టింది.

ఆ దెబ్బకు రమేష్ తడబడ్డాడు.

"బయటకు పోరా ఊర కుక్కా" అని ఉగ్రంగా అరిచిన గాయత్రిని తలెత్తి ఆశ్చర్యంతో చూశాడు రమేష్. గాయత్రి వొళ్లంతా వణుకుతూ కనబడింది. టెన్షన్ తో తూలి పడబోయిన గాయత్రీని పట్టుకుందామని ముందుకు వచ్చాడు రమేష్. అతని దగ్గర నుండి ఆమె తప్పించుకుంది.

"వదిలేయ్...నన్ను వదిలేయ్...వెళ్ళిపో...దయచేసి ఇక్కడ్నుంచి వెళ్ళిపో....వెళ్ళిపో"

ఆవేశం కనబడిన గొంతుకలో ఇప్పుడు వణుకు చొరబడింది. మెళ్ళ మెళ్ళగా వెనక్కు వెళ్ళి గోడకు అతుక్కుంది. భయంతో అటూ ఇటూ చూసింది.

ఆ నిమిషం ఆమెను ఒంటరిగా విడిచిపెట్టటమే మంచిది అనుకుని ఆమె గదిలో నుండి బయటకు వచ్చాడు రమేష్.

ఇంకా ఉంది.....Continued in:PART-6

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి