9, సెప్టెంబర్ 2019, సోమవారం

తొలివలపు(సీరియల్)....PART-7



                                                తొలివలపు….(సీరియల్)
                                                            ( PART-7)

అది అమ్మవారి గుడి.

గాయత్రి పేరు మీద అర్చన చేయంచి బయటకు వచ్చాడు రమేష్. చెప్పులు వెతికి వేసుకుని తల ఎత్తినప్పుడు అదిరిపడ్డాడు.

అంత పక్కనే జానకి నిలబడుంటుందని అతను ఎదురుచూడలేదు.

"గుడికి వచ్చే అలవాటు ఉందా?" అడిగింది.

"ఏం...ఉండకూడదా?" - చిన్నగా నవ్వాడు.

"అయ్యో! నేనేదో సరదాకి అడిగాను" - ఆమె కూడా నవ్వింది.

"అది సరే...ఈ రోజు మీకు పనిలేదా?"

"ప్రొద్దున డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళే వస్తున్నాను. విషయం తెలుసా మీకు? ఈ రోజు మా హాస్పిటల్ స్టాఫ్ అందరూ జాలీగా 'ఎంజాయ్' చేశాము"

"అలాగా...అంత ఎంజాయ్ చేయటానికి కారణమేమిటో?"

"ఆ కారణాన్ని ఇలా రోడ్డు మీద నిలబడి చెప్పదలుచుకోలేదు...నాతో రండి" అంటూ ముందుకు నడిచింది.

వేరే దారి లేక ఆమె వెనుకే నడిచాడు రమేష్.

దగ్గరున్న పార్కులోకి వెళ్ళింది. ఒక బెంచ్ మీద కూర్చుంది. రమేష్ అమె పక్కనే కూర్చున్నాడు. అప్పుడే అక్కడకొచ్చిన అబ్బాయి దగ్గర రెండు బఠానీల పొట్లాలు కొని ఒకటి రమేష్ చేతికి ఇచ్చింది జానకి. మొహమాట పడుతూనే ఆ కాగితం పొట్లంను తీసుకున్నాడు రమేష్.

'చెప్పేయ్. దొరికిన సంధర్బాన్ని జారిపోనివ్వకు. బహిరంగంగా నీ ప్రేమను ఇప్పుడే అతనితో చెప్పేయ్. నిన్ను చూసిన రోజు నుండి 'నో వేకన్ సీ బోర్డ్' బయట వెలాడదీసినట్టు చెప్పేయ్' - మనసు చెప్పే అదేశంకోసం ఆమె వేచి ఉన్నప్పుడు.

"ఏమండి... ఏదో చెప్తానని చెప్పి ఇక్కడకు తీసుకు వచ్చి, కూర్చోని ఇలా నేలనే వేడుకగా చూస్తే అర్ధమేమిటి?" అన్నాడు.

"ఈ రోజు నాకు రెండు సంతోషాలు"

"అదే అడుగుతున్నా. ఏమిటవి?"

"ఒకటి... ఇలా మీతో పార్కులో కూర్చుని మాట్లాడే అవకాశం దొరికినందుకు. ఇంకొకటి...మా ఆడ హిట్లర్ దయ్యం దగ్గర నుంచి మాకు ఒక రోజు విడుదల దొరికినందుకు"

"మీరు ఎవరి గురించి చెబుతున్నారో తెలియటం లేదు!" అన్నాడు అర్ధంకాక.

"ఏమిటి రమేష్ మీరు? నేను ఆ రోజే చెప్పానే...అంతలోనే మర్చిపోయారా? ఆ డాక్టర్...అదే గాయత్రీ. ఆమె గురించే చెబుతున్నాను"

అతని చేతులో ఉన్న కాగితం గాలికి ఎగిరిపోయింది.

"ఏదో ఒంట్లో బాగుండలేదుట. శనేశ్వరం...మా ప్రాణం తీయటానికి మళ్ళీ లేచి రాకుండా, అలాగే పైకి పోయి జేరిపోతే చాలా బాగుంటుంది" అన్నది.

ఆమె కొనిచ్చిన బటానీలు అతని గొంతు దాటటానికి మొరాయించినై. గబగబా లేచాడు.

"ఏమైంది... ఎందుకు హఠాత్తుగా లేచారు?" అన్నది కొంచం ఆందోళనతో.

"ఏమీ లేదు. నేను బయలుదేరతాను" అన్నాడు...ఆమె మొహం చూడకుండా.

"అర్జెంటుగా వెళ్ళాలా?"

"అవును" అంటూ నడవటం మొదలుపెట్టాడు.

తన ప్రేమను బహిరంగంగా అతనితో చెప్పేయాలని అనుకున్న ఆమె, అతని ఒకే మాటతో కొంచం జంకి వెనక్కు తగ్గింది. తన మోటార్ సైకిల్ వైపు వెడుతున్న అతని దగ్గరకు పరిగెత్తింది.

"నన్ను కొంచం 'బస్ స్టాపింగు లో దింపగలరా? ప్లీజ్..."

'నో' అని చెప్పటం కరెక్టు కాదు. అందులోనూ రాత్రి సమయం కాబట్టీ "సరే" అన్నాడు.

బైకులో అతనితో ప్రయాణిస్తున్నప్పుడు గాలిలో ఎగురుతున్నట్లు అనిపించింది జానకికి. నాగరీకంగా అతనికి, తనకూ మధ్య గ్యాపు వదిలి కూర్చోనున్నా మనసులో అతనితో ఆనుకుని హాయిగా మాట్లాడుతూ వెడుతున్నట్లు ఊహించుకున్నది. ముందు కూర్చున్న అతని మొహం కనపడకపోయినా, అతని శ్వాశ గాలి తాకుతుంటే కళ్ళు మూసుకున్న ఆమెకు ఏవేవో కవితలు గుర్తుకు వచ్చాయి.

'ఎప్పుడు బైకు నుండి దిగింది...బస్సు ఎలా ఎక్కింది, ఎలా ఇళ్ళు జేరింది?' - అనేది ఏదీ ఆమెకు జ్ఞాపకం లేదు. భోజనం చెయడానికి పిలిచిన తల్లి పిలుపుకు 'ఆకలిగాలేదు’ అని చెప్పి మంచం మీద పడుకున్న ఆమెను వదలకుండా అల్లరి చేస్తున్నాడు రమేష్.

ఇంకా ఉంది.....Continued in:PART-8

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి