8, సెప్టెంబర్ 2020, మంగళవారం

జీవన పోరాటం...(సీరియల్)...PART-10

 

                                                                               జీవన పోరాటం...(సీరియల్)                                                                                                                                                                    (PART-10)

(‘తాను అనే అహంకారంలో తేలుతున్నవారు ఇతరలకు ఇచ్చే దుఃఖాన్ని ఓర్పుతో నిదానంగా భరించే వాళ్ళు ఆ విధినే జయించవచ్చు)

మంచి కుటుంబంలో పుట్టినా, ఉన్నతమైన పరిస్థితితులలో పెరిగినా  కొన్ని సమయాలలో పిల్లల మనసులో తప్పైన భావనలు దూరిపోవటం వలన, అదే పెరిగి వృక్షమై వాళ్ళను తప్పైన దొవలో వెళ్ళేటట్టు చేస్తుంది. దానికి గాయత్రి కూడ ఉదాహరణ కావటంతో, ప్రశాంతగా ఉంటున్న ఆ కుటుంబాన్ని తుఫాన తాకటం మొదలైయ్యింది.

తన కంటే సత్యపాల్ కే ఇంట్లో అధికమైన అనురాగం, చనువు, ప్రాధాన్యం ఇవ్వబడుతోందనే అభిప్రాయం గాయత్రి మనసులో మెదలి అది పెరుగుతున్న కొద్దీ సత్యపాల్ మీద ఈర్ష్య గా మారింది.  

ఆమె మనసులో తుఫాన అంతర్భాగం కేంద్రీ కృతమవుతున్నప్పుడే, ఎప్పుడూ అతి జాగ్రత్తగా ఉండే మంగమ్మ అది గమనించింది. అయినా కానీ, ఆ ఆలొచనను మార్చుకోమని గాయత్రికి సలహా ఇవ్వటానికి భయపడ్డది.

అందువలన సత్యపాల్ తో చెప్పింది, "గాయత్రి నీ చెల్లెలురా. అది తెలిసో తెలియకో ఏదైనా తప్పుచేసినా, నిన్ను ఏదైనా అన్నా ఆ విషయాన్ని నువ్వు పెద్దది చేయకూడదు. ఆమె పైన ఎప్పుడూ అనురాగంతో ఉండాలి. ఏ కారణం చేత నైనా సరే చెల్లిని వేరుగా చూడకూడదు. సరేనా?"

నిజం చెప్పాలంటే చెల్లెలు విషయంలో సత్యపాల్ కు ఎటువంటి సలహాలు అవసరం లేదు. గాయత్రి అన్నయ్యను ఎంత ద్వేషించినా...అతను చెల్లి మీద అధికమైన అనురాగం, ప్రేమ చూపించేవాడు. ఇది మంగమ్మకు బాగా తెలుసు.

కానీ, ఏదో జరగ కూడనిది జరగబోతోందనే హెచ్చరిక భావము మంగమ్మను భయపెడుతూనే ఉన్నది. దాన్ని పోగొట్టుకోవాలనే సత్యపాల్ కు ఈ ఆలొచనను చెప్పింది.

గాయత్రి పెద్దదవుతున్న కొద్దీ ఆమెలో పలు సందేహాలు తలెత్తటం మొదలు అయ్యాయి.

'ఈ మంగమ్మ ఎవరు? ఏ విధంగా ఈమె మనకు బంధువు? ఆమ్మతో తోడ పుట్టిందా? అలా కూడా తెలియటం లేదే! ఎవరో ఒకడ్ని ఎందుకు నేను 'అన్నయ్యాఅని పిలవాలి? వీళ్ళకు మధ్య ఏదో ఒక మర్మం ఉన్నది. ఎందుకనో నాతో చెప్పకుండా దాస్తున్నారు. ఎవర్ని అడిగితే నిజం తెలుసుకో గలను?' - అని పలు ఆలొచనలు ఆమె మనసును గుచ్చుతున్నాయి.

దీనివలన చదువులోనూ, మిగిలిన కార్యకలాపాలలోనూ మనసు పెట్టలేకపోయింది గాయత్రి.

మంగమ్మ గురించి తెలుసుకోకపోతే తలపగిలి పోతుందేమోనని అనిపిస్తోంది గాయత్రికి.

ఒక రోజు ధైర్యం చేసి అడిగేసింది. మొదట్లో షాక్ తిన్న రాజరాజేశ్వరి ఆమెకు అవసరం లేని విషయాలలో తలదూర్చ వద్దని సలహా చెప్పి చూసింది. కానీ, గాయత్రి ఆమె సలహా వినకుండా నస పెడుతుంటే సహనం కోల్పోయి కోపం తలకెక్కటంతో ఆగ్రహం చెందింది.

"ఖచ్చితంగా జవాబు చెప్పే తీరాలా? ఇది నీకు అవసరం లేని విషయం. మాట్లాడకుండా నీ పనిచూసుకుని వెళ్ళిపో" అని అరిచింది........

ఆ రోజు వరకు ఎవరి దగ్గరా ఏర్పడని సందేహం ఈ రోజు గాయత్రి దగ్గర ఏర్పడటం చూసి భయపడింది రాజరాజేశ్వరి. 

'ఏ రోజూ నన్ను కోపగించుకోని తల్లి, ఈ రోజు ఎందుకు ఈ విషయం కోసం ఇలా కోపగించు కుంటోంది? నా కంటే అమ్మకి వాళ్ళే ముఖ్యమా?' అనే కోణంలో ఆలొచించటం వలన గాయత్రికి కొపం నశాలానికి ఎక్కింది.

'నాన్న దగ్గర అడిగితే మంచి సమాధానం దొరకొచ్చు అని ఆయన దగ్గరకు వెళ్ళింది.

తాను అమ్మ దగ్గర అడిగిందీ, దానికి ఆమె చెప్పిన సమాధనం చెప్పి..." మంగమ్మ ఎవరు?" అని ప్రశ్న వేసింది.

"అమ్మ బాగా కోపగించు కుందా?"

"అవును నాన్నా"--కళ్ళు నీళ్లతో నిండింది.  తండ్రైనా తనకు ఆదరణగా  ఉన్నారే అనే ప్రశాంతత ఏర్పడింది. కానీ, ఆ ప్రశాంతత ఎక్కువసేపు ఆమె దగ్గర నిలబడలేక పోయింది.

ఆయన చెప్పాడు: "అమ్మ నీ దగ్గర కోపగించుకుంది. కానీ నేను కోపగించుకోను. కానీ, సమాధానం మాత్రం ఒకటే. మంగమ్మ గురించిన ప్రశ్నలు మరిచిపో. ఇది ఎవరి దగ్గర అడిగినా నీకు సమాధానం దొరకదు. కానీ, తెలియవలసిన సమయంలో...తెలియవలసిన వయసులో ఖచ్చితంగా చెబుతాం. అంతవరకు చదువు మీద శ్రద్ద పెట్టు" -- ఓర్పుగానూ, దృడంగానూ చెప్పారు.

ఇప్పటికి ఎవరి దగ్గర నుండీ తనకు సమాధానం దొరకదు అనేది కవితకు బాగా అర్ధమైయ్యింది. కానీ, దానివలన నెమ్మదించాల్సిన రకం కాదు ఆమె. పెద్దవాళ్ళు దాచి దాచి పెడుతుంటే...నిజం తెలుసుకోవాలనే కచ్చే ఎక్కువై ఆమెను దహించి వేస్తోంది.

సరైన సంధర్భం కోసం కాచుకోనుంది.

ఆ తరువాత అందరి దగ్గరా ఎక్కువగా మాట్లాడటం తగ్గించింది.  వాళ్ళకు మధ్య ఒక చేదైన మౌనం ఏర్పడింది.

మంగమ్మ మాత్రం ఒక మూల కూర్చుని ఏడుస్తూ ఉన్నది. సత్యపాల్ ఎంత సమాధాన పరచినా ఆమె ఏడుపు ఆపలేదు. 'మనో భారాన్ని ఏడ్చే తీర్చుకోనీ' అని వదిలేశాడు.

సత్యపాల్ 'ఇంటర్ మీడియట్' ముగించినప్పుడు గాయత్రి 'పదో క్లాసు ముగించింది. వేసవి సెలవుల్లో వాళ్ళు గ్రామానికి వెళ్ళినప్పుడు, ఎవరి దగ్గర అడిగితే రహస్యం తెలుస్తుంది అని వెతికింది గాయత్రి. వల్లీ దగ్గర అడిగితే తెలుస్తుంది అని అనుకుని ఆమెను వేరుగా పిలిచుకు వెళ్ళి అడిగింది.

ఇంతకు ముందే మంగమ్మ మీద ఈర్ష్యతో కాలుతున్న వల్లీ, తన కడుపు మంటను పూర్తిగా వొలకబోసింది.

"ఒక సారి అయ్యగారు కలకత్తా వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు, ఈమెను రైల్లో బిడ్డతో అనాధగా చూశారట. భర్త ఎక్కువ చిత్రవధలు పెట్టి బయటకు తరిమేసాడట. పనిమనిషిగా ఉంటుందని మంగమ్మని నా దగ్గరకు మొదట్లో పంపించారు. వచ్చిన రెండు నెలలకే ఈ చెండాలు రాలు ఏం మత్తు మందు పెట్టిందో తెలియలేదు...అమ్మగారే మంగమ్మని హటాత్తుగా 'చెల్లెలు అనేశారు. అది మాత్రమే కాదు......అందరూ హైదరాబాద్ కి మకాం మార్చారు. అమ్మగారిని ప్రతి రోజూ చూసే మాకు, ఇప్పుడు సంవత్సరానికి ఒక సారే చూడ గలుగుతున్నాము"

గాయత్రికి పలు సందేహాలు తీరినై. 'మొట్టమొదటిగా నాన్నకూ, మంగమ్మకీ ఎటువంటి సంబంధం లేదు. ఇంటి పనికోసమే పిలుచుకు వచ్చారు.

అమ్మను ఏ విధంగా మోసం చేసి చేతిలో ఉంచుకుందో కనిపెట్టాలి. అందులో నుండి అమ్మను విడిపించి ఆమెను ఇంటి నుండే తరిమేయాలి అని నిర్ణయించుకుంది.

ఆ తరువాత నుండి  కన్నవారితో సహజంగా మాట్లాడటం మొదలుపెట్టింది. కూతురిలో ఏర్పడిన మార్పు వాళ్ళకు కొంత ప్రశాంతతను ఇచ్చింది.

కానీ, మంగమ్మతో మాట్లాడటం మానేసింది. సత్యపాల్ దగ్గర మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు 'రేయ్ అన్నయ్యా" అనే మొదలు పెట్టింది. ఇప్పుడు ఆ 'రేయ్' అనడంలో నిర్లక్ష్యం, అగౌరవం నిండి ఉన్నది. సత్యపాల్ కు అది అర్ధమైనా దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. 

ఈ సమయంలోనే పరంధామయ్య తన వ్యాపారాన్ని తానొక్కడే చేయడం మొదలుపెట్టారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం లేకపోవటం వలన ఆయన తన వ్యాపారంలో ధ్యాస పెట్టలేకపోయాడు. వయసు కూడా అరవై దాటటంతోనూ, సుగర్ వ్యాధి రావడం వలనను గబ గబా పనులు చేయటం ఆయనకు కుదరటం లేదు. ఇది అర్ధం చేసుకున్న సత్యపాల్ తానుగా ముందుకు వచ్చి ఆయనకు సహాయపడ్డాడు. బి.కాం. చదువుకుంటున్న సత్యపాల్....ఖాలీ సమయాలలోనూ, సెలవు రోజుల్లోనూ ఆఫీసుకు వెళ్ళి ఆయన పనులన్నీ తన పనులుగా చేశాడు.  

'ఇంజనీరింగ్' లో చేరిన గాయత్రి, తాను కూడా ఆఫీసుకు వచ్చి పనులు చూసుకుంటానని మొండికేసింది. పరంధామయ్య మొదట్లో వద్దని చెప్పినా సత్యపాల్ కొరినందువలన గాయత్రి కూడా ఆఫీసుకు వచ్చి పనులు గమనించటానికి ఒప్పుకున్నారు. వసతులున్న ఒక గదిలో ఇద్దరూ కూర్చోటానికి రెండు టేబుళ్ళూ, కుర్చీలూ వేయించి అన్ని వసతులూ ఏర్పరచి ఇచ్చాడు.   

మొదటి రోజు గాయత్రి ఆఫీసుకు బయలుదేరుతున్నప్పుడు "ఏమ్మా...నా అపార్ట్ మెంట్ కట్టే పనులలో అన్నయ్య తో కలిసి నువ్వు పనిచేయాలనే నిన్ను 'సివిల్ చదివిస్తున్నాను. కానీ నేను ఎదురుచూడటానికి ముందే నువ్వు సహాయానికి వస్తానంటున్నావు...ఏ ఉద్దేశ్యం కోసం నువ్వు వస్తున్నావో ఇప్పుడు నాకు తెలియటం లేదు. కానీ, నువ్వూ, అన్నయ్య ఒకే  గదినుండి ఆఫీసు పనులను గమనించుకోవాలి. ఏ నిర్ణయాన్నైనా ఇద్దరూ కలిసి తీసుకుంటే నేను సంతోష పడతాను. మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడితే సత్యపాల్ తీసుకునే నిర్ణయాన్నే నేను ఆదరిస్తాను. 

ఇంటి విషయాలలో నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నా ఓర్చుకుని వెళ్ళిపోతాను! ఎందుకంటే...దాని బాధింపు మన ఐదుగురికి మాత్రమే. ఆఫీసులోనూ సత్యపాల్ ను  ఎదిరిస్తే, అది మన వ్యాపారాన్నే భాదిస్తుంది. మీ ఇద్దరూ వేరుబడి నిలబడితే పనివాళ్ళు కూడా వేరుబడి నిలబడతారు. నిర్వాహం రెండుగా చీలిపోతుంది. వ్యాపారం దెబ్బతింటుంది. మనమంతా రోడ్డున పడాల్సిందే. ఇప్పటికే వ్యాపారంలో నాకు పోటీ ఎక్కువగా ఉన్నది. దానితో పాటూ నువ్వు కూడా నాకు సమస్యలు ఏర్పరచకు. అలాంటిది ఏదైనా జరిగితే నిన్ను ఆఫీసులోపలకు వెళ్ళనివ్వను. నువ్వు చదువుకున్న ఆమ్మాయివి. అర్ధం చేసుకుంటావని నమ్ముతున్నాను"

ఆయన ఇంత కఠినంగా గాయత్రి దగ్గర మాట్లాడటం చూసి రాజరాజేశ్వరి మరియు మంగమ్మ అధిరిపడ్డారు. ఆయన మాటల్లో ఉన్న నిబ్బరాన్నీ, న్యాయాన్నీ గాయత్రి కూడా అర్ధం చేసుకుంది.   

తండ్రిని ఎదిరించి గాయత్రి అరవబోతుందని అందరూ ఎదురు చూశారు. కానీ గాయత్రి, "సరే నాన్నా, నేను చూసుకుంటాను"  అని చెప్పి పెద్దవాళ్ల కాళ్ళ మీద పడి నమస్కరించి వెళ్ళిపోయింది. అక్కడున్న వాళ్ళందరూ దీన్ని ఎదురు చూడలేదు. అందువలన అందరూ ఆశ్చర్యంతో... గాయత్రి వెళ్ళిపోవటాన్నే గమనిస్తూ నిలబడ్డారు.  

కానీ, గాయత్రి ఆలొచన వేరుగా ఉన్నది. ఆమె ఆఫీసుకు వెళ్ళటానికి కారణమే సత్యపాల్ ఏదైనా 'గోల్మాల్ చేసి డబ్బు కాజేస్తాడేమోనని రహస్యంగా గమనించటానికే! కాబట్టి...ఒకే గదిలో ఇద్దరూ ఉండటం ఆమెకు ఇబ్బంది అనిపించలేదు!!

ఆ రోజు ఆఫీసుకు వచ్చిన గాయత్రిని అభిమానంతో ఆహ్వానించాడు సత్యపాల్. ఆమె  కూర్చోవలసిన కుర్చీ చూపించి అందులో కూర్చోబెట్టాడు. ఆఫీసులో పని చేస్తున్న అందరినీ పిలిచి పరిచయం చేశాడు. 'ఈ కంపెనీ నిర్వాహంలో ఆమెకూ సరిసమమైన హక్కు ఉన్నది అన్నది అని గుర్తు చేశాడు.

ఇవేమీ పట్టించుకునే మనొస్థితిలో లేదు గాయత్రి. 'అంతా ఒక నాటకం...అది చూసి ఆ  మాయలో పడకూడదు అని మనసులో అనుకున్నది.

ఆ రోజు ఎటువంటి సమస్యలతో గాయత్రి ఇంటికి వస్తుందో అని అందరూ ఎదురుచూశారు. కాని గాయత్రి చాలా ఉత్సాహంగా ఇంటికి వచ్చింది. 

"ఆఫీసులో నీ మొదటి రోజు ఎలా గడిచింది?" అని అడిగింది రాజరాజేశ్వరి.

"బాగానే ఉన్నది. విషేషం ఏమీ లేదు" అన్నది గాయత్రి.  ఆమె మాట్లాడిన ఆంగ్లమూ, స్టైలూ మంగమ్మని పూరింపచేసింది. కానీ, తన కడుపు మంటను శ్రమ పడి అణుచుకుంది గాయత్రి.  

ఆ సమయంలో ఇంటికి వచ్చిన సత్యపాల్ అందరూ హాలులో ఉండటం గమనించి "అలాగే కూర్చోండి! ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి" అన్నాడు.  అందరూ కూర్చుని ఆసక్తిగా గమనించారు.

సత్యపాల్ చెప్పాడు, "మన కంపెనీకి ఒక పేరు రిజిస్టర్ చేయాలి. ఒక మంచి పేరు చెప్పండి"

ఒక్కొక్కరూ ఒక్కొక్క పేరు చెప్పారు. ఏదీ మంచిగా అనిపించలేదు.

గాయత్రి ఏ పేరూ చెప్పలేదు. 'ఇందులో ఎటువంటి మోసం ఉంటుంది?' అనే కోణంలో ఆలోచిస్తూ కూర్చుంది.

చివరిగా పరంధామయ్య అన్నారు, " సత్యపాల్, ఎలాగూ నువ్వు ఒక పేరు మనసులో ఉంచుకోనుంటావు. అది కూడా చెప్పేసేయి"

" గాయత్రి బిల్డర్స్"  చెప్పాడు సత్యపాల్.

అందరూ మిక్కిలి ఉత్సాహంతో ఆ పేరును అంగీకరించారు. గాయత్రి కూడా ఒక్క క్షణం ఉప్పొంగి పోయింది. కానీ మరు క్షణమే ఆమె మనసు ఆమెను హెచ్చరించింది. 'దీనికంతా ఉప్పొంగి పోకు గాయత్రి! సత్యపాల్ కంపనీకి నీ పేరు పెట్టి మిమ్మల్నందరినీ మూర్ఖులుగా చిత్రించటానికి  ప్రయత్నిస్తున్నాడు’.

ఇంట్లో వాళ్ళందరూ ఆ పేరును అంగీకరించటంతో, దాన్ని నిరాకరించటానికి ఎలాంటీ కారణమూ లేదు కాబట్టి గాయత్రి కూడా అంగీకారం తెలిపింది. 'ఇకమీదటే సత్యపాల్ ను తీవ్రంగా వాచ్ చేయాలీ అని నిర్ణయించుకుంది.

త్వరలోనే అమె చదువు పూర్తి అవుతుంది. మొదట్లో పై చదువులకు వీదేశాలకు వెళ్ళాలని అనుకున్న గాయత్రి ఇప్పుడు అది వద్దనుకుని ఫుల్ టైమూ కంపెనీ నిర్వాహంలో పాల్గొనాలని తీర్మానించింది.

బి.కామ్. డిగ్రీతో తన చదువును పూర్తి చేసుకున్న సత్యపాల్, రోజంతా వ్యాపారంలో శ్రద్ద పెట్టి పరంధామయ్యకు సహాయపడుతూ ఉండటం వలన ఆయన కూడా కొంచం కొంచంగా వ్యాపార బాధ్యతను అతనికి అప్పగించాడు.

                                                                                       Continued...PART-11

**************************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి