4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

జీవన పోరాటం…(సీరియల్)...PART-8


                                                                           జీవన పోరాటం…(సీరియల్)                                                                                                                                                                  (PART-8)

(అవినీతితో కాకుండా నిజాయితీతో వ్యాపారం చేసి సంపాదించిన డబ్బు మంచిని, సంతోషాన్ని ఇస్తుంది)

బిడ్డతో ఇంటికి వచ్చిన వాళ్ల దగ్గర ఉత్సాహం నదిలాగా ప్రవహించింది. ఆసుపత్రిలో ఇచ్చిన బర్త్ సర్టిఫికేట్ లో బిడ్డ తల్లి-తండ్రులు పరంధామయ్య - రాజరాజేశ్వరి అని ఉన్నది చూసి ఆపుకోలేనంత సంతోషం ఏర్పడింది.

కానీ, బిడ్డ తల్లిపాలు మరిచిపోయి తన దగ్గరకు వచ్చేంతవరకు జాగ్రత్తగా ఉండాలనేదీ జ్ఞాపకం తెచ్చుకుంటోంది.

బిడ్డను కంటికి రెప్పలాగా చూసుకుంటూ పెంచింది. బిడ్డకు గాయత్రీ వెంకటలక్ష్మీ' అని పేరు పెట్టింది. వెంకటలక్ష్మీ అనేది పరంధామయ్య తల్లి. 'గాయత్రీ' అని అందరూ ప్రేమతో పిలిచేరు.

---- గాయత్రీ యొక్క బర్త్ సర్టిఫికేట్ ను చూసిన రాజరాజేశ్వరి, ఆ బిడ్డను ఎత్తుకుని గుండెలకు హత్తుకుని ముద్దుల వర్షం కురిపించిది.

"నువ్వు నా కూతురివి. నేను కన్న బంగారానివి. ఇక ఎవరూ నన్ను గొడ్రాలు అని చెప్పటానికి వీలులేదు" అంటూ కన్నీటితో తనలో తాను మాట్లాడుకుంటోంది.

"ఇదిగో...నీ చెల్లెలు" అని చెప్పి సత్యపాల్ చేతుల్లో గాయత్రిని ఇచ్చింది. వాడు దాన్ని ఎత్తుకోలేక ఎత్తుకుంటుంటే వాళ్ళిద్దర్నీ దగ్గరకు తీసుకుని ముద్దులాడింది. మొదట్లో సత్యపాల్ ను దత్తతు తీసుకోబోతోందని వాడి మీద ప్రేమ వొలకబోసింది. ఇంకా వాడినే తన మొదటి బిడ్డగా అనుకుంటోంది. పిల్లల ప్రేమకొసం ఆమె ఇన్నాళ్ళు ఎదురుచూసింది పరంధామయ్యకు, మంగమ్మకు బాగా తెలుసు.

ఒక రోజు రాజరాజేశ్వరి అడిగింది "మనం హైదరాబాదులోనే ఉండిపోతే ఏమవుతుంది? ఇక్కడ అన్ని వసతులూ ఉన్నాయి కదా"

బయటకు కారణం అలా చెప్పినా, లోలోపల 'బంధువుల మొహాలను ఇక చూడక్కర్లేదు' అనేదే నిజమైన కారణం.

పరంధామయ్య మనసులో కూడా ఈ ఆలొచన ఇంతకు ముందే ఏర్పడింది. గ్రామంలో వ్యవసాయం లేకపోతే అక్కడ ఆయనకు అసలు పనేమీ లేదు. ఏ పని లేకుండా ఖాలీగా ఊరంతా తిరిగుతూ వుండే వారు.

పల తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి, సుఖం ఉన్నా, ఖాలీగా కూర్చుని తినాలనే ఆలొచన, మనసు ఆయనకు లేదు. కాబట్టి, రాజరాజేశ్వరి ఆలొచనను  ఒప్పుకున్న పరంధామయ్య మొదట్లో తన చేతిలో ఉన్న డబ్బును హైదరాబాద్ నగరంలో జెండాలా ఎగురుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడిపెట్టారు.  

ఆ వ్యాపారంలో మంచి లాభాలు రావటంతో అదే వ్యాపారాన్ని కొంచం కొంచంగా విస్తారము చేస్తూ మంచి అనుభవం సంపాదించారు.

వర్షాలు సరిగా పడకపోవటంతో వ్యవసాయ భూముల నుండి రావలసిన పంట పూర్తిగా రానందువలన, భూములను కొంచం కొంచంగా అమ్మి, ఆ డబ్బుతో హైదరాబాద్ చుట్టూ స్థలాలు కొని పడేశారు. తరువాత, ఆ స్థలాలో అపార్ట్ మెంటులు కట్టి అమ్మినందువలన ఆయనకు కోట్లలో లాభాలు వచ్చినై.

కుటుంబ పరిస్తితులు కూడా సంపూర్ణంగా ఆయనకు సహాయంగా ఉండటం ఆయనకు ఎంతో ప్రశాంతతను ఇచ్చింది.

ఇంటి నిర్వహణాన్ని బాగా చూసుకున్నది రాజరాజేశ్వరి. మంగమ్మ ఆమెకు తోడుగా ఉన్నది. పని మనిషి అక్కర్లేదు అని ఇద్దరూ కలిసి తీర్మానించుకుని ఇంటి పనులను సరి సగం పంచుకున్నారు.

తల్లిపాలు తాగటం మరిచిపోయిన తరువాత గాయత్రిని పూర్తిగా రాజరాజేశ్వరి దగ్గర అప్పగించింది మంగమ్మ. ఆ సమయంలో మంగమ్మ కొంచంగా తడబడుతుందని ఎదురుచూసింది రాజరాజేశ్వరి. కానీ, రాజరాజేశ్వరి ఆస్తిని కొన్ని రోజులు తన దగ్గర ఉంచుకుని తిరిగి ఆమె దగ్గరే అప్పగిస్తున్నట్టు ఎటువంటి తడబాటూ లేకుండా గాయత్రిని అప్పగించింది మంగమ్మ.  

అదిమాత్రమే కాదు...తనకు తానే గీసుకున్న లక్ష్మణ రేఖను ఏ రోజూ -- ఎటువంటి పరిస్థితుల లోనూ దాటేది కాదు. రాజరాజేశ్వరియే అడిగినా కూడా ఆమెను 'అక్కా' అని ఏరోజూ పిలిచింది లేదు. రాజరాజేశ్వరిని అమ్మగారూ అని పిలవటమే కాకుండా గాయత్రిని  చిన్నమ్మగారూ అని పిలవటం మొదలుపెట్టింది. ఎంతవరకు  కుదురుతుందో అంతవరకు గాయత్రికి దూరంగానే ఉన్నది. తాను ఏప్పటికీ ఆ ఇంట్లో పనిమనిషిననే కట్టుబాటును దాటేది కాదు. తన కొడుకు సత్యపాల్ కి కూడా కొంచం కొంచంగా ఆ మాటనే ఉగ్గుపాలు పోసినట్లు నేర్పడం మొదలుపెట్టింది.

పరంధామయ్యకు కూడా మంగమ్మ మీద ఎటువంటి ఆశ కలగలేదు. ఆమె, ఆమె కొడుకు సత్యపాల్ తన వలన కాపాడబడిన వాళ్ళూ అనేది మాత్రమే మనసులో గుర్తుపెటుకున్నారు. మంగమ్మ గురించి రాజరాజేశ్వరికి తెలిసిన తరువాత రాజరాజేశ్వరియే మంగమ్మను కంటికి రెప్పలా చూసుకోవటంతో పరంధామయ్యకు ఆ భాద్యత కూడా లేకుండా పోయింది.

గ్రామంలో ఉన్న అమ్మవారి గుడిలో వేసవి సంబరాలు వచ్చినప్పుడు, అందరూ బయలుదేరి గ్రామానికి వెళ్ళారు. ఊరే కలిసొచ్చి రాజరాజేశ్వరి బిడ్డను చూసింది. దాయాదులు, బంధువులు జనంతో పాటూ కలిసొచ్చి బిడ్డను చూసి వెళ్ళారు. కానీ, వాళ్ళ మొహాలలో నిరాశ, నిస్సృహ, కడుపు మంట ఉన్నది పరంధామయ్య గమనించటం మరువలేదు. 

కానీ, రాజరాజేశ్వరి దాన్ని నిర్లక్ష్యం చేసింది. చుట్టాల నిరాశ, నిస్సృహ, కడుపు మంట ఇక వాళ్ళను ఏమీచేయలేదని గర్వంతో ఉండిపోయింది.

తనకు ఇంత పెద్ద గౌరవాన్ని అందించిన మంగమ్మను గర్వంతోనూ,కృతజ్ఞతా భావంతోనూ చూసింది. మంగమ్మ...దీనికీ, తనకీ ఎటువంటి సంబంధం లేనట్లు వల్లితో కలిసి ఇంటి పనులు చేస్తోంది.

పరంధామయ్య ఇవన్నీ గమనించీ గమనించనట్లు ఉండిపోయారు.

కానీ, మంగమ్మకీ...ఆమె కొడుకుకూ వాళ్ళు ఇస్తున్న ముఖ్యత్వాన్ని చూసి పనిమనిషి వల్లీ లోలోపల ఈర్ష్య పడింది. 'ఎన్నో సంవత్సరాలుగా ఈ ఇంట్లో వాళ్ళకు ఏంతో విశ్వాసంగా ఉన్నానునిన్న వచ్చిన ఈమెకు ఇంత ముఖ్యత్వం, మర్యాదానా?' అని గొణుక్కుంది. కానీ, దాన్ని ఎలా బయట పెట్టగలదు?'

గ్రామంలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ అందరూ హైదరాబాదుకు తిరిగి వెళ్ళారు. గాయత్రిని తమ కూతురుగానే గ్రామస్తులందరూ చూడటంతో పరంధామయ్య -- రాజరాజేశ్వరి దంపతులకు మహా సంతోషం. దాయాదులకూ, బంధువులకూ ఎటువంటి సందేహమూ రాకుండా ఉన్నందున మిక్కిలి తృప్తి పడ్డారు.

                                                                                                       Continued--PART-9

**************************************************************************************************************

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి