6, సెప్టెంబర్ 2020, ఆదివారం

జీవన పోరాటం...(సీరియల్)...PART-9

 

                                                                         జీవన పోరాటం...(సీరియల్)                                                                                                                                                                    (PART-9)

(తాము కన్న బిడ్డల ముద్దు ముద్దు మాటల భాషను తియ్యగా అనుభవించలేని వారే కోకిల గానమూ, గజ్జెల చప్పుడూ తియ్యగా ఉంటాయని చెబుతారు)

పిల్లలు మంచిగా పెరుగుతూ వస్తున్నారు. సత్యపాల్ కు మూడేళ్ళ వయసు ముగిసినప్పుడు దగ్గరున్న స్కూల్లో చేర్చారు. అది చూసిన తరువాత తన కొడుకూ ఇలాంటి స్కూల్లో చదువుకునే అవకాశం దొరికిందే నని ఆనందపడింది మంగమ్మ.

కలకత్తాలోనే ఉండుంటే ఈ వయసులో వాడిని నేను ఏ స్కూల్లోనైనా చేర్పించగలిగేదానినా? ఒక వేల చేర్చున్నా ఇలాంటి పెద్ద స్కూల్లో చేర్పించగలిగేదానినా?’ అంటూ ఆలొచించి రాజరాజేశ్వరికి తన మనసులోనే ధన్యవాధాలు తెలిపింది. ఎందుకంటే ఆమే తన కొడుకును ఈ స్కూల్లో చేర్పించాలని భర్తకు సలహా ఇచ్చింది.

కొడుకుకు కట్టిన స్కూల్ ఫీజు డబ్బు ఎంతో తెలుసుకున్నప్పుడు మంగమ్మకి కళ్ళు తిరిగినై. దాని గురించి రాజరాజేశ్వరిని అడిగినప్పుడు "నా పెద్ద కొడుకు కోసం నేను ఖర్చు పెడుతున్నాను. నువ్వు నీ పని చూసుకో" అని చెప్పి మంగమ్మను అనిచివేసింది రాజరాజేశ్వరి. 

'కొన్ని సమయాలలో దేవుడు మనుషులకు కష్టాలు ఇచ్చినా అందులో నుండి వాళ్ళను ఆయనే తప్పించి, ఆయనే మంచి చేస్తారు అనేది ఇప్పుడు అనుభవించి తెలుసుకుంది మంగమ్మ. 

సత్యపాల్ కూడా "పెద్దమ్మా...పెద్దమ్మా" అంటూ రాజరాజేశ్వరిని అతుక్కుపోయాడు.

గాయత్రి మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు మంగమ్మని 'అమ్మా' అని, సత్యపాల్ ని 'అన్నయ్యా' అని పిలవటం నేర్పింది రాజరాజేశ్వరి. కానీ మంగమ్మో, తనని 'పిన్ని అని పిలవాలని బలవంతం చేయటంతో... గాయత్రి అలాగే పిలవటం ప్రారంభించింది.  

రాజరాజేశ్వరి అది త్యాగం అని అనుకోగా, మంగమ్మో పాప పరిహారం అని అనుకున్నది.

పిల్లల ముద్దు ముద్దు మాటలతో ఇద్దరూ మైమరచిపోయారు.  ఇంట్లో ఉన్నప్పుడు పరంధామయ్య కూడా ఆ ఆనందంలో పాలు పంచుకుంటాడు.

గాయత్రికి మూడేళ్ల వయసు దాటినప్పుడు అదే స్కూల్లో చేర్పించింది రాజరాజేశ్వరి. పిల్లలిద్దరి మధ్యా ఎటువంటి వ్యత్యాసం చూపకుండా పెంచింది.

పిల్లలు పెరుగుతున్న కొద్దీ -- పరంధామయ్య వ్యాపరమూ చాలా బాగా పెరిగింది.  న్యాయమైన లాభం వస్తే చాలనే లక్ష్యంతో నాణ్యమైన ఉత్పత్తులతో అపార్ట్ మెంటులను కట్టివ్వడం వలన ఆయన కట్టిన అపార్ట్ మెంటులకు మంచి గిరాకీ ఏర్పడింది.

స్కూల్ ఫంక్షన్లలో, స్కూల్ జరిపే పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నప్పుడు ఆనందించి వాళ్ళను పొగడి ఉత్సాహపరచి తృప్తిపడ్డారు. చదువు మాత్రమే కాకుండా ఆటలలోనూ పాల్గొనాలని ప్రోత్సహించేది రాజరాజేశ్వరి. వీటన్నిటి గురించి ఏమీ తెలియని మంగమ్మో... రాజరాజేశ్వరి తన మీద చూస్పిస్తున్న దయ ఇది అని మాత్రం అనుకుని సంతోషపడింది.

ఆటల్లో, ముఖ్యంగా క్రికెట్ ఆటలో ఎక్కువ ఇష్టం చూపించాడు సత్యపాల్. గాయత్రి కూడా తనకు ఇష్టమైన రంగాలలో ఇష్టం చూపించింది. నృత్యం,ఆర్ట్,మాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకు వచ్చింది.

ఇంట్లోనైనా సరే, స్కూల్లోనైనా సరే... గాయత్రి మీద అనురాగం కురిపిస్తాడు సత్యపాల్.  

ఒకరోజు స్కూల్లో చెల్లెలు ఏడుస్తూ ఉండటం చూసి, సమాధానపరచి వివరం అడిగి తెలుసుకున్నాడు. చెల్లిని ఆమె క్లాసులో చదువుతున్న స్నేహితుడోకడు కొట్టాడని తెలుసుకుని, పరుగెత్తుకు వెళ్ళి అతన్ని కొట్టాడు. సమస్య స్కూల్ హెడ్ మాస్టర్ వరకు వెళ్ళటంతో, పేరంట్స్ ను రమ్మన్నారు.

రాజరాజేశ్వరి, మంగమ్మ వేగంగా అక్కడికి వెళ్ళారు. ఇంకొసారి సత్యపాల్ గనుక సహ విధ్యార్ధులను ఎవరినైనా కొడితే వెంటనే స్కూల్లో నుండి డిస్ మిస్ చేస్తానని చెప్పి హెచ్చరించి పంపాడు హెడ్ మాస్టర్.

సత్యపాల్ తన నేరాన్ని ఒప్పుకోనేలేదు. చెల్లిని వాడు కొట్టాడు కాబట్టే వాడ్ని నేను కొట్టాను అని వాదించాడు. అందులో తప్పేమీ లేదని మొరాయించాడు.

అన్నా, చెల్లెల్ల మధ్య చిన్న చిన్న గొడవులు రావటం, అందులో వాళ్ళిద్దరూ గొడవపడటం కూడా అలవాటైపోయింది. కానీ, పిల్లలకు మధ్య ఇదంతా సహజం అని ఇద్దరు తల్లులూ పట్టించుకునేవారు కాదు. గొడవ పెద్దదైతే, చెల్లి కొసం సత్యపాల్ తగ్గుతూ గొడవ ముగిస్తాడు.  

గాయత్రి ఒక పట్టుదల మనిషిగా, తాను అనుకున్నది సాధించి  తీరాలనే గుణం కలిగిన పిల్లగా పెరగటం గమనించిన మంగమ్మ కొంచం ఆందోళన చెందింది. కానీ, అది రోజులు గడిచిన కొద్దీ మారుతుందని, ఆ భాద్యతనూ రాజరాజేశ్వరి తీసుకుంటుందని అని ఆలొచించి ప్రశాంతత చెందింది మంగమ్మ.

హటాత్తుగా గాయత్రి "రేయ్...అన్నయ్యా" అని సత్యపాల్ ను పిలవటం మొదలుపెట్టింది. అది విన్న రాజరాజేశ్వరి గాయత్రిని ఖండించింది. "పెద్దవాడిని మర్యాదతో మాట్లాడాలి" అని పాఠం నేర్పింది. కానీ మంగమ్మో, "రేయ్ అన్నయ్యా" అని పిలవటంలో హక్కు కలిగిన అనురాగం ఉన్నదని వాదించింది.  

"దానిపై బాగా గారాబం పెట్టి చెడుపుతున్నారు" అని చెప్పి వెళ్ళింది రాజరాజేశ్వరి.

అప్పట్నుంచి...'రేయ్ అన్నయ్యా" అనే పిలవటం మొదలుపెట్టింది.  

కానీ చిన్న వయసులోనే గాయత్రి మనసులో లోతుగా కూరుకుపోయిన విష విత్తనం అది అనేది మంగమ్మ గానీ, మిగిలిన వాళ్ళు గానీ అప్పుడు అర్ధం చేసుకోలేకపోయారు.

అలా అర్ధమయ్యుంటే అది మరింత పెరగటాన్ని అడ్డుకోనుంటారు. కానీ, విధి వాళ్ళకోసం వేరే పధకం వేసున్నది.

విధి ఆడుకోవాలని అనుకుంటే దాన్ని ఎవరు అడ్డుకోగలరు?

                                                                                                         Continued....PART-10

**************************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి