7, జులై 2021, బుధవారం

అతి పెద్ద హిందూ దేవాలయ రహస్యాలు…(ఆసక్తి)

 

                                                          అతి పెద్ద హిందూ దేవాలయ రహస్యాలు                                                                                                                                            (ఆసక్తి)

చరిత్రను ఓక సారి తిరగేస్తే...హిందూ సంస్కృతి ఆనవాళ్ళు విశ్వవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్నట్టు ఇప్పటికే రుజువులు ఉన్నాయి. వందల వేల ఏళ్ల క్రితమే మన హిందూ సంస్కృతి ప్రపంచం నలుమూలలకు విస్తరించింది. దీనికి నిదర్శనం కంబోడియాలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన విష్ణు దేవుని ఆలయం.  హిందూ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెబుతున్న ఈ దేవాలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలను తెలుసుకుందాం.

ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం కంబోడియాలోని సీమ్‌ రీప్‌ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఈ దేవాలయంలో చూడవచ్చు. ఈ ఆలయానికి కొన్ని శతాబ్ధాల చరిత్ర ఉంది. ఖ్మేర్‌ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగిందని, క్రీశ 12వ శతాబ్దకాలంలో ఆంగ్‌ కోర్‌ వాట్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్‌ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట.

ఈ దేవాలయ నిర్మాణం మన దేశంలోని తమిళనాడు దేవాలయాలను పోలి వుంటాయి. ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి వుంటాయి. టోనెల్‌ సాస్‌ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో అద్భుతమైన ఆర్కి‌టెక్చర్‌తో ఈ దేవాలయాన్ని రూపొందించారు. కులేన్‌ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణు మూర్తి ఆలయంగా వెలుగొందుతోంది. భారతదేశంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదట.

ఆనాటి ఖ్మేర్‌ సామ్రాజ్యంలో నీటిని నిల్వ చేసుకునేందుకు వాడిన టెక్నాలజీని చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. ఇక్కడి నీరు పల్లం నుండి ఎత్తుకు ప్రవహించే విధంగా అద్భుతమైన టెక్నాలజీని వాడారు. ఆ అద్భుత టెక్నాలజీని ఆంగ్‌ కోర్‌ వాట్‌ దేవాలయంలో కూడా వాడటంతో ఆ దేవాలయం ఇప్పటికీ దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఇది అప్పట్లోనే ఎలా సాధ్యమయ్యిందనే విషయం అర్కియాల జస్టులనే కాక అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఐదు మైళ్ల పొడవు, ఒకటిన్నర మైలు వెడల్పు తో విశాలమైన రిజర్వాయర్లు నిర్మించడం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం.

ముందుగా ఆలయంలోని నీటిమట్టాన్ని నియంత్రించేందుకు రిజర్వాయర్ నిర్మించారు. దీని ద్వారా కరువు, వరద వంటి ప్రకృతి విపత్తులను నియంత్రించగలిగారు. ఒకదానికొకటి అనుసంధానమైన 1,500 కిలోమీటర్ల పొడవునా కాలువలు నిర్మించారు. ఇనుము, అల్యూమినియం వంటి నిర్మాణ సామగ్రి రవాణా కోసం ఈ కాలువలను ఉపయోగించుకున్నారు. ఆలయ నిర్మాణానికి నీటిపై తేలియాడే ‘లాటరైట్' రాళ్లను ఎంపిక చేశారట. వాటిపై సియాన్‌రీవ్‌లోని కులేన్ పర్వతాల నుంచి తెచ్చిన ఇసుక శిలలను అతికించి, శిల్పాలు చెక్కారు. వాటిని అంత దూరం నుంచి ఇక్కడకు తరలించేందుకు ఏనుగులను, తేలియాడే బల్లకట్లను వాడారు.

పలు దేశాల శిల్పులు, సుమారు ఐదువేల మంది కార్మికులు రాత్రింబవళ్లు ఈ నిర్మాణం కోసం శ్రమించారట.  

ఈ దేవాలయంలో మరో అద్భుతమైన ప్రదేశం బ్యాస్‌ - రిలీఫ్స్‌ గ్యాలరీ. నాలుగు గోడలతో నిర్మించిన ఈ మండపంలో ఎక్కడ చూసినా హిందూ పురాణ గాథలే కనిపిస్తాయి. ముఖ్యంగా తూర్పున ఉన్న 'మంటన్‌' అనే గ్యాలరీ అందర్నీ ఆకట్టుకుంటుంది. భారత పురాణాలైన రామాయణ, మహా భారత దృశ్యాలు అనేకం ఇక్కడ మనకు సాక్షాత్కరిస్తాయి. దేవతలూ, రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మధన దృశ్యాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. తూర్పు వైపు మండపంలో విష్ణుమూర్తి పుట్టుక, అవతారాలకు సంబంధించిన శిల్పాలు ఉంటే పశ్చిమం వైపు మండపం గోడలపై యుద్ధాలు, మరణాలకు సంబంధించిన ఆకృతులు కనిపిస్తాయి. కురుక్షేత్ర యుద్ధం, రామ రావణ యుద్ధ సంఘటనలు ఎంతో చక్కగా మలచబడ్డాయి. ఇక దక్షిణ మండపంలో ఆలయాన్ని నిర్మించిన రాజు రెండవ సూర్యవర్మన్‌ రాజ్యానికి సంబంధించిన సైనిక పటాల దృశ్యాలు దర్శనమిస్తాయి. ఇవే కాక పురాణ పురుషులు, మునులు, కిన్నెర కింపురుషాధి అప్సరసల నాట్య విన్యాసాలు, యమధర్మరాజు కొలువుదీరిన యమసభ వంటి అనేక కళాఖండాలు ఆంగ్‌కార్ వాట్‌ ఆలయ గోడలపై సాక్షాత్కరిస్తాయి.

భువిలో వైకుంఠాన్ని తలపిస్తుందట ఈ ఆలయం.

Image Credits: To those who took the original photos

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి